'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ | Maa Nanna Superhero Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

Maa Nanna Superhero Review: 'మా నాన్న సూపర్ హీరో' రివ్యూ

Oct 10 2024 1:30 PM | Updated on Oct 11 2024 7:52 AM

Maa Nanna Superhero Movie Review And Rating Telugu

ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్‌ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. 

అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.

చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. 

చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.

రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్‌ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‪‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

ఎవరెలా చేశారు?
సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.

దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!

-చందు డొంకాన

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement