
తేజ దర్శకత్వంలో కమల్‌హాసన్ త్రిభాషా చిత్రం?
కమల్‌హాసన్‌కి కథ చెప్పి ఒప్పించడం అంత సులభసాధ్యం కాదంటారు. కానీ మన తెలుగు దర్శకుడు తేజ చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్‌లోనే కమల్ ఓకే చెప్పేశారట. తేజ దర్శకత్వంలో మూడు భాషల్లో సినిమా చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపారట. చెన్నై పాండీ బజార్‌లోనూ, హైదరాబాద్ ఫిలిమ్‌నగర్‌లోనూ ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ‘ఉత్తమ విలన్’ షూటింగ్‌లో కమల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ‘దృశ్యం’ తమిళ రీమేక్‌లో నటించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత తేజ ప్రాజెక్ట్ పట్టా లెక్కనుందని సమాచారం. చిత్రం, నువ్వు-నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన తేజకు ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. కమల్ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవం సాధించుకునే దిశగా తేజ కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో భారీ ఎత్తున ఆ చిత్రం తెరకెక్కనుందట.