సినిమా ఆలస్యంగా విడుదలైతే....
చెన్నై: ఏ సినిమా అయినా ముందుగా ప్రకటించిన తేదీకీ విడుదల కాకపోతే కలెక్షన్లపై ఆ ప్రభావం బాగా పడుతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత కమల్హాసన్ నిర్మించిన 'ఉత్తమ విలన్' చిత్రం విషయంలో అది స్పష్టమైంది. ప్రకటించిన తేదీకి విడుల కాకపోవడం వల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిందని సినిమా వ్యాపార వర్గాల అభిప్రాయం. ఉత్తమ విలన్ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉండేవి. కలెక్షన్ల వసూలులో రికార్డు సృష్టిస్తుందని భావించారు. మొదటి రోజు కలెక్షన్ పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనావేశారు.
అయితే సినిమా నిర్మాతలకు, ఫైనాన్సర్లకు మధ్య తలెత్తిన కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం మే 1న విడుదల కాలేదు. మే 2న విడుదలైంది. ఒక రోజు ఆలస్యంగా విడుదలవడం వల్ల పెద్ద దెబ్బే తగిలింది. అనుకున్న కలెక్షన్లు రాలేదు. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలు మొదటి వారంలోనే కలెక్షన్లు అధికంగా రాబడతాయి. ఉత్తమ విలన్ విడుదలై రెండు వారాలైనా పెద్దగా టాక్ రాలేదు. మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. బీ, సీ సెంటర్లలో ఓ మోస్తరు స్పందన మాత్రమే కనిపిస్తోంది. సినిమా విడుదల ఆలస్యం అయితే ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేది స్పష్టమవుతోంది.