
ఒక సూపర్ స్టార్ కథ.. ఉత్తమ విలన్
తన తాజా చిత్రం ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు,దర్శకుడు కమల్ హాసన్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా ఒక నటుడి కథ అని ఆయన చెప్పారు. ఒక సూపర్ స్టార్గా ఎదిగిన ఒక నటుడిలోని రెండు విభిన్నమైన కోణాలను పట్టిచూపించే మంచి సినిమా అన్నారు. అందరూ ఊహిస్తున్నట్టుగా ఉత్తమ విలన్ సినిమా సినీ పరిశ్రమ మీద సంధించిన వ్యంగ్యాస్త్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది మీ కథేనా అని అడుగుతున్నారని... కానీ తాను నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తన జీవితానికి సంబంధించిన కొంత భాగం ఉంటుందని పేర్కొన్నారు. తన గురువు, దైవంతో సమానమైన కె. బాలచందర్ మార్గదర్శి పాత్రలో నటించిన ఉత్తమ విలన్ సినిమా తన జీవితంలో మర్చిపోలేని, అతి ముఖ్యమైందన్నారు కమల్. అలాంటి లెజెండరీ దర్శకుడు బాలచందర్ శిష్యరికంలో ఎదిగిన రమేష్ అరవింద్ మీద అపారమైన నమ్మకముందని, అందుకే ఈ సినిమాకు దర్శకుడిగా ఆయన్ను ఎంచుకున్నానని కమల్ తెలిపారు.
ఈ సందర్భంగా తెయ్యం కళను ఫ్రెంచి నుంచి కాపీ చేశారనే విమర్శలు ఆయన తిప్పి కొట్టారు. ఫ్రాన్స్లో ఫ్రెంచి భాష మాట్లాడకముందే తెయ్యం కళ ఉనికిలో ఉందని చెప్పుకొచ్చారు. ఊర్వశి, నాజర్, జయరామ్ , భాస్కర్ లాంటి ప్రముఖులు నటించిన ఉత్తమ విలన్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.