కళ్ల ముందు కుటుంబాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దారుణం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అలాంటి విషాద, భయానక సంఘటన జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత కమల్ సదనాహ్. పీడకలలాంటి రోజును గుర్తు చేసుకుంటూ.. 'అది నా జీవితంలోనే చీకటి రోజు. మా నాన్న(దర్శకనిర్మాత బ్రిజ్ సదనాహ్) అందరినీ తుపాకీతో కాల్చేశాడు. నన్ను కూడా షూట్ చేశాడు. కానీ అది నా మెడ నరంలో నుంచి చొచ్చుకుని వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత ఆయన కూడా తనను తాను షూట్ చేసుకున్నాడు.
కళ్లముందే ఘోరం..
తీవ్రంగా గాయపడ్డ అమ్మ (నటి సయూదా ఖాన్), సోదరిని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బెడ్స్ లేకపోవడంతో నన్ను మరో ఆస్పత్రిలో చేర్చారు. వాళ్లిద్దరినీ బతికించమని వైద్యులను వేడుకున్నాను. అలాగే నాన్న ఎలా ఉన్నాడని ఆరా తీశాను.. కానీ ఏ సమాధానమూ రాలేదు. నాకు రక్తస్రావం ఎక్కువ అవుతుండటంతో సర్జరీ చేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాను.. అక్కడ నా కుటుంబమంతా శవాలుగా కిందపడి ఉన్నారు. నా కళ్లముందే ఆ ఘోరాన్ని చూడాల్సి వచ్చింది. అందరూ మరణించినా నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాను.
అందుకే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోను
ఈ సంఘటన జరిగినంతమాత్రాన మా నాన్న, ఇంట్లోవాళ్లంతా చెడ్డవారని అర్థం కాదు. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటాను. ఇది నా బర్త్‌డే రోజే జరగడం వల్ల ఎన్నోయేళ్లపాటు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటికీ ఆ సెలబ్రేషన్స్ నాకు నచ్చవు' అని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన జరిగిన రెండేళ్లకు కమల్.. బేఖుడి(1992) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రంగ్, ఫాజ్, రాక్ డ్యాన్సర్, హమ్ సాబ్ చోర్ హై, మొహబ్బత్ ఔర్ జంగ్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. 2007 తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న అతడు దాదాపు 15 ఏళ్ల తర్వాత సలాం వెంకీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. గతేడాది పిప్పా మూవీలో నటించాడు.
చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు..
Comments
Please login to add a commentAdd a comment