వివాదాల... విలన్
సినిమా వివాదాలకూ, నటుడు కమలహాసన్‌కూ మధ్య విడదీయరాని బంధం ఉన్నట్లుంది. ఆయన నటించిన పెద్ద సినిమా ఏది రిలీజవుతున్నా, తమిళనాట ఎవరో ఒకరు కోర్టుకెక్కడం రివాజైంది. గతంలో ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’) చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ ‘సండియర్’ మీద వివాదం రేగింది. రెండేళ్ళ క్రితం ‘విశ్వరూపం’ సినిమాపై మైనారిటీ వర్గాల గొడవతో కొన్ని వారాల పాటు రిలీజ్ వాయిదా పడింది. తాజాగా, రానున్న ఆయన సినిమా ‘ఉత్తమ విలన్’కు హిందూ సంస్థల నుంచి ఇబ్బంది తలెత్తింది. సినిమాలో వచ్చే ‘ఇరణ్యన్ నాడగమ్...’ అనే పాటలో భక్త ప్రహ్లాదుడికీ, అతని తండ్రి హిరణ్యకశిపుడికీ మధ్య జరిగే సంభాషణ విష్ణుభక్తులను కించపరిచేదిగా ఉందంటూ ‘విశ్వహిందూ పరిషత్’ తమిళనాడు శాఖ నేరుగా పోలీసులను ఆశ్రయించింది.
ఆ పాటలో విష్ణుమూర్తిని చిత్రించిన తీరు అభ్యంతరకరంగా ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందనీ ఫిర్యాదు చేసింది. సినిమాపై నిషేధం విధించాలని కోరింది. పోలీసుల నుంచి ఇప్పటి దాకా ఎలాంటి స్పందనా లేదు. ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు కానీ, మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఉత్తమ విలన్’కు ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప, ఈ చిత్రం విడుదలకు అడ్డంకులేమీ ఉండవని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్ సైతం, ‘‘సమాజంలోని ఏ వర్గం మనోభావాలనైనా కించపరిచేవేవీ మా సినిమాలో లేవు. చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన పురాణేతిహాసాల కథల గురించి ప్రస్తావనే ఇందులోనూ ఉంది. మా పాత్రల మేకప్పే తప్ప, విషయంలో ఎలాంటి మార్పూ లేదు. కాబట్టి, ఈ ఫిర్యాదులకు అర్థం లేదు’’అని వ్యాఖ్యానించారు. అసలు అలాంటివి ఏవైనా ఉంటే, సినిమా సెన్సారే ఇవ్వరు కదా అన్న రమేశ్ అరవింద్ మాటల్లో ఎంతో నిజం ఉంది కదూ! మరి, మే 1 లోగా ఇంకెన్ని ఫిర్యాదులు ఈ సినిమాకు విలన్‌గా పరిణమిస్తాయో చూడాలి.