Kamalahasan
-
ఓవియకు బిగ్‌బాస్ క్రేజ్
తమిళసినిమా: బిగ్‌బాస్‌తో నటి ఓవియకు పిచ్చ క్రేజ్ వచ్చేసింది. విశ్వనటుడు కమలహాసన్ తొలిసారిగా బుల్లితెరపై రంగప్రవేశం చేసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియలిటీ షో బిగ్‌బాస్. ఈ షోలో 14 మంది సినీ కళాకారులు పోటీకి దిగిన విషయం తెలిసిందే. అందులో నటి ఓవియకు మాత్రం క్రేజ్ విపరీతంగా వచ్చేసింది. ఆమె ప్రవర్తనను చాలా మంది లైక్ చేస్తున్నారు. శింబు లాంటి నటులు కూడా ఓవియకు మద్దతు తెలుపుతున్నారంటే ఆమె ఎంతగా పేరు సంపాదించుకుంటుందో చూడండి. దీంతో ఇప్పటి వరకూ పెద్దగా అవకాశాలు లేని ఓవియకిప్పుడు అవి వరుస కడుతున్నాయి. ఇప్పటికే మెట్రో చిత్రం ఫేమ్ శిరీష్ తన తాజా చిత్రంలో ఓవియకు కథానాయకి అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా యామిరుక్క భయమే చిత్ర పార్టు–2లోనూ ఓవియను ఎంపిక చేసుకున్నారు. యామిరుక్క భయమే చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఓవియకు దాని సీక్వెల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశాన్ని ఓవియ కొట్టేసింది. విజయ్‌సేతుపతితో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రాన్ని తెరకెక్కించిన బాలాజీ దరణీధరన్ తాజాగా ఆయనతో ఒక చిత్రం చేయనున్నారు. ఇందులో నటి ఓవియను నాయకిగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే తను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈ అవకాశం చేజారినట్లు తాజా సమాచారం. అయితే ఈ భామ షో నుంచి బయటకు రాగానే మరి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇదంతా బిగ్‌బాస్ క్రేజేనని చెప్పక తప్పదు. -
దీపావళికి రాని ‘స్టార్స్’
నిరాశలో అభిమానులు దీపావళి పండుగ సందడిలో సినిమాలు కూడా ఒక భాగం. సాధారణంగా పండుగ సందర్భాల్లో ప్రముఖ హీరోల చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంటాయి. అలాంటిది ఈ దీపావళికి విడుదల అవుతాయని ఊహించిన ప్రముఖ హీరోల చిత్రాలు పలు కారణాల వల్ల విడుదల కాకపోవడం వారి అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్, ఇళయదళపతి విజయ్, అజిత్ ల చిత్రాలు విడుదలవుతాయని భావించిన అభిమానులకు ఈ దీపావళి నిరాశే మిగిల్చింది. చెన్నై: గత 2013 దీపావళికి నటుడు విజయ్ నటించిన తలైవా చిత్రం విడుదలౌతుందని ఆశించినా పలు సమస్యల కారణంగా ఆ చిత్రం దీపావళి తరువాత తెరపైకి వచ్చింది. ఇక 2014లో అదే నటుడు నటించిన కత్తి చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు దీపావళికి తెరపైకి వచ్చి ఆయన అభిమానుల్ని ఖుషీ చేసింది. ఈ సారి విజయాప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న భైరవా చిత్రం దీపావళికి విడుదలవుతుందని ఎదురు చూశారు. అయితే ఇంకా చిత్రీకరణ కార్యక్రమాల్లోనే ఉండడంతో భైరవా చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే గుడ్డిలో మెల్ల మాదిరి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇకపోతే గత ఏడాది అజిత్ నటించిన వేదాళం విడుదలై ఆయన అభిమానుల్ని సంతృప్తి పరచింది. ఆ చిత్ర షూటింగ్లో గాయాల పాలైన అజిత్ కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని మూడు నెలలకు పైగా విశ్రాంతి తీసుకుని తాజా తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వస్తుందని ఆయన అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే ఇదీ ఇంకా నిర్మాణంలోనే ఉండడంతో అజిత్ చిత్రం ఈ దీపావళి బరిలోకి దిగలేకపోయింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపినా తాజాగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 2.ఓ చిత్రం దీపావళి రేసుకు రెడీ అవుతుందని ఆశించారు. చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాంటి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే 2. ఓ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే విధంగా విశ్వనటుడు కమలహాసన్ నటించి చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న విశ్వరూపం 2 చిత్రం ఈ దీపావళికి విడుదలవుతుందని భావించారు. అయితే ఈ చిత్రానికి ఇంకా మోక్షం కలగలేదు. 4 చిత్రాల దీపావళి కాగా ఈ దీపావళికి నాలుగు చిత్రాలు తెరపైకి వచ్చాయి.అందులో ఒకటి కార్తీ నటించిన కాష్మోరా. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, శ్రీదివ్య నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభులు నిర్మించారు. రెండవది కోడి. నటుడు ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. రాజకీయనేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాలతార త్రిష ప్రతినాయకిగా రాజకీయనాయకురాలు నటించడం విశేషం. మరో నాయకిగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఎస్.ఆర్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ పతాకంపై నిర్మించారు. వీటితో పాటు తిరైక్కు వరాద కథై, మాకాపా. ఆనంద్ హీరోగా నటించిన కడలై చిత్రాలు తెరపైకి వచ్చాయి. -
శ్రీమంతుడిపై విశ్వనాయకుడు ప్రశంసలు
తమిళసినిమా : ఒక నటుడి నటనను మరో నటుడు అభినందించడానికి చాలా పెద్ద మనసు కావాలి. అలా ప్రశంసించే ఉన్నత వ్యక్తిత్వం విశ్వనాయకుడు కమలహాసన్‌కు, ఆ అర్హత ప్రిన్స్ మహేశ్‌బాబుకు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకెళితే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయ విహారం చేస్తున్న విషయం తెలిసిందే. మంచి కథ, కథనం, దర్శకత్వం, విలువలతో కూడిన నిర్మాణం, నటీనటుల ఉత్తమ నటన, చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన చిత్రం శ్రీమంతుడు అంటూ సర్వత్రా అభినందనలు అందుకుంటున్న నేపథ్యంలో నటుడు కమలహాసన్ ప్రశంసలు చిత్ర యూనిట్ రెట్టింపు సంతోషానికి గురి చేశాయి. ఇందులో కథానాయికిగా శ్రుతీహాసన్ నటించారన్నది తెలిసిన విషయమే. శ్రీమంతుడు చిత్రాన్ని ఆమె ఇటీవల తన తండ్రి కమల్‌కు చూపించారు. చిత్రం చూసిన కమలహాసన్ మహేశ్‌బాబు నటన, డాన్స్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రుతి డాన్స్‌ను అభినందిం చారు. సామాజిక సృహ ఉన్న కథాంశంతో రూపొందించిన దర్శకుడిని, నిర్మాతను అభినందించారు. ఇది తెలిసిన మహేశ్‌బాబు ఇంకా ఖుషీ అవుతున్నారట. కాగా, శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారానికి 101.25 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్లో చేరినట్లు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వెల్లడించారు. -
సినిమా బంపర్...మా నాన్న సూపర్!
‘‘ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఒకవేళ నా సినిమా విడుదలైన రోజున నాన్న నటించిన సినిమా విడుదలైతే, ముందు నా సినిమా చూస్తా.. ఆ తర్వాత నాన్న సినిమా చూస్తా’’ అని ఆ మధ్య ఓ సందర్భంలో శ్రుతీహాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కమల్ కూడా అలానే అంటారు. ఈ తండ్రీ కూతుళ్లు అంత ప్రొఫెషనల్‌గా ఉంటారు. కానీ, ఒకరి సినిమాను ఇంకొకరు చూసి, బాగుంటే అభినందించుకుంటారు. ఇప్పుడు శ్రుతి అదే చేశారు. మలయాళ ‘దృశ్యమ్’ తమిళ రీమేక్ ‘పాపనాశమ్’లో కమలహాసన్, గౌతమి భార్యాభర్తలుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రుతి చూశారు. ‘‘అద్భుతమైన సినిమా. మొత్తం టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మా నాన్నని చూస్తే గర్వంగా ఉంది’’ అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాదు.. ముంబయ్‌లో తన స్నేహితులకి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారామె. ఎంతైనా నాన్నంటే అమ్మడికి ఎంత ప్రేమో! -
స్నేహకు సీమంతం
నటి స్నేహ సీమంతం వేడుకను ఇటీవల తన భర్త ప్రసన్న సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. బహుభాషా నటి స్నేహ నాయకిగా అన్ని రకాల పాత్రలు ధరించిన హోమ్లీ ఇమేజ్ను సొంతం చేసుకున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు అని చెప్పక తప్పదు. తమిళంలో విరుంబుగిరేన్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయిన స్నేహ చక్కని అందంతో అంతకుమించిన అభినయంతో చిత్ర ప్రముఖులను ఆకర్షించారు. ఆ తరువాత కమలహాసన్, విజయ్, అజిత్ మొదలగు ప్రముఖ హీరోలందరితోనూ నటించారు. అలాగే తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్ ఇలా సీనియర్ నటుల నుంచి యువ నటులందరితోను నటించి పేరు తెచ్చుకున్నారు. అచ్చముండు అచ్చముండు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరో ప్రసన్నతో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీయడంతో 2012లో ప్రేమికుడితో పెళ్లి పీటలెక్కారు. ఆ తరువాత కూడా అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. కాగా గర్భం ధరించిన స్నేహ నవమాసాలు మోస్తున్నారు. త్వరలో అమ్మ కాబోతున్న స్నేహ ఇటీవల నగరంలోని ఒక స్టార్ హోటల్లో సీమంతం వేడుకలను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి బంధుమిత్రులకు, అత్యంత సన్నిహిత సినీ ప్రముఖలను ఆహ్వానించినట్లు నటుడు ప్రసన్న పేర్కొన్నారు. -
భారతీయుడు-2 చేయాలనుకుంటున్నాం!
కమలహాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం నిర్మాత ఏఎమ్ రత్నాన్ని దేశమంతా తెలిసేలా చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఇటీవలే శంకర్, ఏఎమ్ రత్నం అనుకున్నారట. ఈ విశేషాలను రత్నం తెలియజేస్తూ - ‘‘శంకర్ నాకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల మేమిద్దరం కలిసినపుడు ‘భారతీయుడు-2’ గురించి చర్చ వచ్చింది. ఎలా చేయాలో ఇద్దరం ఆలోచించుకున్నాం. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియమ్‌కి వెళ్లినప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఇదే చర్చ. కానీ అకస్మాత్తుగా శంకర్ ‘రోబో-2’ చేయాల్సి వస్తోంది. ‘రోబో-2’ తెలుగులో నేనే విడుదల చేస్తా, అలాగే ‘భారతీయుడు-2’ ఎప్పటికైనా నిర్మిస్తా’’ అన్నారు. తమిళంలో అజిత్‌తో చేసిన ‘ఎన్నై ఎరిందాల్’ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో ఇటీవలే రత్నం విడుదల చేశారు. ఈ సినిమా ఘనవిజయంతో సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి ఊతం దొరికిందని రత్నం సంతోషం వెలిబుచ్చారు. చిరంజీవి తదితర అగ్రహీరోలంతా తాను మంచి కథతో వెళితే డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రత్నం అన్నారు. -
వివాదాల... విలన్
సినిమా వివాదాలకూ, నటుడు కమలహాసన్కూ మధ్య విడదీయరాని బంధం ఉన్నట్లుంది. ఆయన నటించిన పెద్ద సినిమా ఏది రిలీజవుతున్నా, తమిళనాట ఎవరో ఒకరు కోర్టుకెక్కడం రివాజైంది. గతంలో ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’) చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ ‘సండియర్’ మీద వివాదం రేగింది. రెండేళ్ళ క్రితం ‘విశ్వరూపం’ సినిమాపై మైనారిటీ వర్గాల గొడవతో కొన్ని వారాల పాటు రిలీజ్ వాయిదా పడింది. తాజాగా, రానున్న ఆయన సినిమా ‘ఉత్తమ విలన్’కు హిందూ సంస్థల నుంచి ఇబ్బంది తలెత్తింది. సినిమాలో వచ్చే ‘ఇరణ్యన్ నాడగమ్...’ అనే పాటలో భక్త ప్రహ్లాదుడికీ, అతని తండ్రి హిరణ్యకశిపుడికీ మధ్య జరిగే సంభాషణ విష్ణుభక్తులను కించపరిచేదిగా ఉందంటూ ‘విశ్వహిందూ పరిషత్’ తమిళనాడు శాఖ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఆ పాటలో విష్ణుమూర్తిని చిత్రించిన తీరు అభ్యంతరకరంగా ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందనీ ఫిర్యాదు చేసింది. సినిమాపై నిషేధం విధించాలని కోరింది. పోలీసుల నుంచి ఇప్పటి దాకా ఎలాంటి స్పందనా లేదు. ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు కానీ, మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఉత్తమ విలన్’కు ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప, ఈ చిత్రం విడుదలకు అడ్డంకులేమీ ఉండవని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్ సైతం, ‘‘సమాజంలోని ఏ వర్గం మనోభావాలనైనా కించపరిచేవేవీ మా సినిమాలో లేవు. చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన పురాణేతిహాసాల కథల గురించి ప్రస్తావనే ఇందులోనూ ఉంది. మా పాత్రల మేకప్పే తప్ప, విషయంలో ఎలాంటి మార్పూ లేదు. కాబట్టి, ఈ ఫిర్యాదులకు అర్థం లేదు’’అని వ్యాఖ్యానించారు. అసలు అలాంటివి ఏవైనా ఉంటే, సినిమా సెన్సారే ఇవ్వరు కదా అన్న రమేశ్ అరవింద్ మాటల్లో ఎంతో నిజం ఉంది కదూ! మరి, మే 1 లోగా ఇంకెన్ని ఫిర్యాదులు ఈ సినిమాకు విలన్‌గా పరిణమిస్తాయో చూడాలి. -
మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది! - అక్షరా హాసన్
పట్టుమని పాతికేళ్లు లేవు.. కానీ, ‘బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే గొప్పది’ అని చెప్పగలిగేంత మానసిక పరిణతి అక్షరా హాసన్‌కి ఉంది. ఈ యువ నటి నాన్న కమలహాసన్ దేశమంతటా పేరున్న ‘తిరుగులేని’ నటుడు. అమ్మ సారిక ‘అందాల అభినేత్రి’. ఇక.. అక్క శ్రుతీహాసన్ తల్లితండ్రులకు తగ్గ కుమార్తె అనిపించుకుంటూ, ముందుకు సాగుతున్నారు. సరిగ్గా వారందరి బాటలోనే ముందుకెళ్ళడంలో ఇప్పుడు అక్షరా హాసన్ వంతు వచ్చింది. అందం విషయంలో ఈ అమ్మాయి అదుర్స్. మరి.. అభినయం సంగతేంటి? అనుకున్నవాళ్లకు తొలి చిత్రం ‘షమితాబ్’ ద్వారా సమాధానం ఇచ్చింది అక్షర. తెరంగేట్రం చేసిన తొలి చిత్రంలోనే తానేమీ అమ్మానాన్నలకూ, అక్కకూ తీసిపోనని నిరూపించుకుంది. ఈ బ్యూటీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ’చిట్ చాట్’... మొత్తానికి మీ అమ్మా, నాన్న, అక్కలా మీరు కూడా ఆర్టిస్ట్ అయిపోయారు. వాస్తవానికి మీరు డెరైక్టర్ కావాలనుకున్నారు కదా? అవును... అది నిజమే. సహాయ దర్శకురాలిగా కూడా చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తున్న సమయంలోనే నాకో నాటకంలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు నేను పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ‘ఓసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?’ అని ఆ డెరైక్టర్ అంటే, ‘సరే’ అన్నాను. అందులో నటించేకొద్దీ నాకు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మంచి అవకాశాలొస్తే చేయాలనుకున్నాను. హిందీ రంగంలో మీకు చాలామంది దర్శకులతో పరిచయం ఉండే ఉంటుంది కాబట్టి, ఎవరి దగ్గరైనా అవకాశాలు అడిగారా? లేదు. నా తొలి నాటకం ప్రదర్శన అయిన ఆరేడు నెలలకు ఓ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు బాల్కీ సార్ కూడా వచ్చారు. అప్పుడాయన ‘నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అన్నారు. ఆశ్చర్యంగా చూశాను. ‘నేనో కథ రాసుకున్నాను. అందులో ఉన్న పాత్రకు నువ్వయితే బాగుంటుంది’ అన్నారు. ఆయన అలా అంటారని నేనూహించలేదు. సహాయ దర్శకురాలిగా చేర్చుకుంటారేమో అనుకున్నాను. కానీ, ఒక క్యారెక్టర్ చేయమన్నారు. అప్పటికే నేను ఆర్టిస్ట్‌గా కొనసాగాలను కుంటున్నా కాబట్టి, ఓకే చెప్పేశాను. కథ వినగానే, ‘సార్.. మీరు మనసు మార్చుకోకూడదు. ఈ అవకాశం నాకే ఇవ్వాలి’ అన్నాను. అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్‌తో నటించాలన్నప్పుడు భయం వేయలేదా? ఈ సినిమా షూటింగ్ ప్రారంభించక ముందు అమితాబ్ సార్‌ను ఓ షూటింగ్ లొకేషన్లో కలిశాను. ఆయనకు ముందు నమస్తే పెట్టాలా? పాదాలకు నమస్కరించాలా? అని తికమకపడిపోయాను. తీరా ఆయన దగ్గరికెళ్లగానే, ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి, కూర్చోమన్నారు. చాలా బాగా మాట్లాడారు. దాంతో కొంచెం భయం పోయింది. ‘షమితాబ్’ లొకేషన్లో నా నటనను ఆయన మెచ్చుకుంటే, ఏడుపొచ్చేసింది. నా జీవితంలో నేనెప్పుడూ గురికానంత ఉద్వేగానికి గురయ్యాను. మీ మాతృభాష తమిళం కన్నా హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారే?! నేను తమిళం పట్టి పట్టి మాట్లాడుతున్నట్లనిపిస్తోంది కదూ! 2009 నుంచి ముంబయ్‌లో ఉంటున్నాను. అక్కడ తమిళం మాట్లాడేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. హిందీ, ఇంగ్లిష్ మాట్లాడడం వల్ల తమిళ భాషతో సాన్నిహిత్యం పోయింది. మీ చెన్నయ్ జీవితం గురించి చెబుతారా? ఎంతైనా.... చెన్నై నా హోమ్ టౌన్ కదా.. అక్కడి జీవితాన్ని మర్చిపోలేను. మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్‌లలో చేసిన అల్లరి ఇంకా జ్ఞాపకం ఉంది. అక్కడి ఇడ్లీ, సాంబార్ రుచి గురించి చెప్పనక్కర్లేదు. ముంబయ్‌లో వడ పావ్లూ, భేల్పురీలు బాగానే ఉన్నా.. చిన్నప్పట్నుంచీ అలవాటుపడిన ప్రాణం కదా... అందుకని అప్పుడప్పుడూ మనసు ఇడ్లీ, సాంబార్ వైపు లాగుతుంటుంది (నవ్వుతూ). ఇంతకీ, మీరు ఎంతవరకూ చదువుకున్నారు? ప్లస్ 1తో సరిపెట్టేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చేద్దామని ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. దాంతో వదిలేశాను. అదేంటీ... చదువు మీద ఆసక్తి ఉండేది కాదా? అదేంటో కానీ, ఆట పాటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు. నేను మంచి డ్యాన్సర్‌ని. అది నేర్చుకోవడంలో ఉన్నంత ఆసక్తి చదువులో లేకపోవడంతో మార్కులు తక్కువ వచ్చేవి. ఏదో ఒక డిగ్రీ ఉండాలంటారు! మరి, అమ్మానాన్న ఏమీ అనలేదా? ఎంత ప్రయత్నించినా నాకు ఏకాగ్రత కుదరడం లేదని వాళ్ళూ అర్థం చేసుకున్నారు. దాంతో నన్ను ఒత్తిడి చేయలేదు. కానీ, ఖాళీగా మాత్రం ఉండొద్దన్నారు. నిజమే కదా! అసలేమీ చేయకుండా జీవితం మొత్తం ఎలా ఉండగలుగుతాం? అందుకే, డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. ముంబయ్‌లో శ్రుతి విడిగా ఇల్లు తీసుకుని, ఒంటరిగా ఉంటున్నారు! మీరు? నేను అమ్మతో కలిసి ఉంటున్నాను. ఒంటరిగా ఉండేంత పరిణతి నాకు లేదు. పెద్దవాళ్ల గెడైన్స్ ఉండాల్సిందే! కమలహాసన్ అందగాడు. సారిక, శ్రుతీహాసన్ అందగత్తెలు. మీరూ అంతే! అసలు బాహ్య సౌందర్యానికి మీరెంతవరకు ప్రాధాన్యం ఇస్తారు? అస్సలు ఇవ్వను. నేను అందంగా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు. నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడిది. అందుకే మన చేతుల్లో లేని బాహ్యసౌందర్యం కన్నా మానసికంగా అందంగా ఉండాలి. మీ అంతః సౌందర్యం గురించి చెప్పడానికి చిన్న ఉదాహరణ? చిన్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఆకలేస్తోంది అని అడిగితే, నా బ్యాగులో ఎంత డబ్బుంటే అంత ఇచ్చేసేదాన్ని. అఫ్కోర్స్ వేలకు వేలు ఉండేవి కాదనుకోండి. ప్యాకెట్ మనీ ఉండేది. క్యాంటీన్లో శ్నాక్స్ కొనుక్కోవడం కోసం ఉంచుకునేదాన్ని. ఆ డబ్బు ఇస్తున్నప్పుడు... ‘ఇంటికెళ్లగానే మనకు కోరుకున్న తిండి ఉంటుంది. ఇప్పుడీ క్యాంటీన్లో తినకపోతే ఏం’ అనుకునేదాన్ని. ఇప్పటికీ అదే మనస్తత్వం ఉంది. ఈ గుణం మీ తల్లితండ్రుల్లో ఎవరి నుంచి వచ్చింది? ఇద్దరికీ సేవాగుణం ఉంది. అదే నాకూ వచ్చింది. నాన్నగారికి దేవుడంటే నమ్మకం లేదు. శ్రుతీహాసన్ నమ్ముతారు. మీరు...? ఏదో శక్తి ఉందని నమ్ముతాను. కానీ, విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అక్క మాత్రం విగ్రహ పూజ చేస్తుంది. అలాగని, నా ఇష్టాన్ని వ్యతిరేకించదు. మా ఇంట్లో ఉండే బ్యూటీయే అది. ఒకరి మనోభావాలను మరొకరం గౌరవించుకుంటాం. ఒకవేళ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చేసే అవకాశం వస్తే...? ఇప్పుడైతే నేను వెనక్కి తగ్గుతాను. నాన్నగారు మంచి నటుడు. అమ్మ కూడా అంతే. అక్క కూడా సూపర్. నేను చేసింది ఒక్క సినిమానే. మరో ఆరేడు సినిమాలు చేసిన తర్వాత అయితే ఒప్పుకుంటా. ఇక... మీ ప్రయాణం ఎటువైపు? నటనా.. దర్శకత్వమా? నటిగా కొనసాగాలనుంది. మంచి చిత్రాలను ఎన్నుకునే పని మీద ఉన్నా. అయితే, దర్శకత్వం వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా అదీ చేస్తా! -
అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ
ఉత్తమ విలన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రంతో పాటు కమల్ విశ్వరూపం-2, పాపనాశం చిత్రాల్లోనూ నటించారు. ఈ రెండు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కాగా ఉత్తమ విలన్ చిత్రం మాత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఆండ్రియా, పూజాకుమార్, పార్వతీమీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ నటిస్తున్న మూడు చిత్రాలలో ఉత్తమ విలన్ ముందుగా తెరపైకి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉత్తమ విలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాత తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేతలలో ఒకరైన సుభాష్ చంద్రబోస్‌ను అడగ్గా ఉత్తమవిలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కమలహాసన్ ఈ చిత్ర సౌండ్ మిక్సింగ్ కార్యక్రమం కోసం అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఆయన చెన్నై తిరిగి రాగానే చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే చిత్ర ఆడియోను జనవరి రెండో వారంలోనూ చిత్రాన్ని ఫిబ్రవరిలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. -
ఆస్పత్రిలో కమలహాసన్
చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అన్నాసాలై థౌజండ్‌లైట్స్ సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. కమల్ విషాహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు తెలిపారు.