మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది! - అక్షరా హాసన్ | akshrahasan special chit chat | Sakshi
Sakshi News home page

మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది! - అక్షరా హాసన్

Published Sun, Feb 22 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది!    - అక్షరా హాసన్

మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది! - అక్షరా హాసన్

పట్టుమని పాతికేళ్లు లేవు.. కానీ, ‘బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే గొప్పది’ అని చెప్పగలిగేంత మానసిక పరిణతి అక్షరా హాసన్‌కి ఉంది. ఈ యువ నటి నాన్న కమలహాసన్ దేశమంతటా పేరున్న ‘తిరుగులేని’ నటుడు. అమ్మ సారిక ‘అందాల అభినేత్రి’. ఇక.. అక్క శ్రుతీహాసన్ తల్లితండ్రులకు తగ్గ కుమార్తె అనిపించుకుంటూ, ముందుకు సాగుతున్నారు. సరిగ్గా వారందరి బాటలోనే ముందుకెళ్ళడంలో ఇప్పుడు అక్షరా హాసన్ వంతు వచ్చింది. అందం విషయంలో ఈ అమ్మాయి అదుర్స్.  మరి.. అభినయం సంగతేంటి? అనుకున్నవాళ్లకు తొలి చిత్రం ‘షమితాబ్’ ద్వారా సమాధానం ఇచ్చింది అక్షర.  తెరంగేట్రం చేసిన తొలి చిత్రంలోనే తానేమీ అమ్మానాన్నలకూ, అక్కకూ తీసిపోనని నిరూపించుకుంది.  ఈ బ్యూటీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ’చిట్ చాట్’...
 
 
మొత్తానికి మీ అమ్మా, నాన్న, అక్కలా మీరు కూడా ఆర్టిస్ట్ అయిపోయారు. వాస్తవానికి మీరు డెరైక్టర్ కావాలనుకున్నారు కదా?

అవును... అది నిజమే. సహాయ దర్శకురాలిగా కూడా చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తున్న సమయంలోనే నాకో నాటకంలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు నేను పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ‘ఓసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?’ అని ఆ డెరైక్టర్ అంటే, ‘సరే’ అన్నాను. అందులో నటించేకొద్దీ నాకు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మంచి అవకాశాలొస్తే చేయాలనుకున్నాను.

హిందీ రంగంలో మీకు చాలామంది దర్శకులతో పరిచయం ఉండే ఉంటుంది కాబట్టి, ఎవరి దగ్గరైనా అవకాశాలు అడిగారా?

లేదు. నా తొలి నాటకం ప్రదర్శన అయిన ఆరేడు నెలలకు ఓ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు బాల్కీ సార్ కూడా వచ్చారు. అప్పుడాయన ‘నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అన్నారు. ఆశ్చర్యంగా చూశాను. ‘నేనో కథ రాసుకున్నాను. అందులో ఉన్న పాత్రకు నువ్వయితే బాగుంటుంది’ అన్నారు. ఆయన అలా అంటారని నేనూహించలేదు. సహాయ  దర్శకురాలిగా చేర్చుకుంటారేమో అనుకున్నాను. కానీ, ఒక క్యారెక్టర్ చేయమన్నారు. అప్పటికే నేను ఆర్టిస్ట్‌గా కొనసాగాలను కుంటున్నా కాబట్టి, ఓకే చెప్పేశాను. కథ వినగానే, ‘సార్.. మీరు మనసు మార్చుకోకూడదు. ఈ అవకాశం నాకే ఇవ్వాలి’ అన్నాను.

అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్‌తో నటించాలన్నప్పుడు భయం వేయలేదా?
 
ఈ సినిమా షూటింగ్ ప్రారంభించక ముందు అమితాబ్ సార్‌ను ఓ షూటింగ్ లొకేషన్లో కలిశాను. ఆయనకు ముందు నమస్తే పెట్టాలా? పాదాలకు నమస్కరించాలా? అని తికమకపడిపోయాను. తీరా ఆయన దగ్గరికెళ్లగానే, ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి, కూర్చోమన్నారు. చాలా బాగా మాట్లాడారు. దాంతో కొంచెం భయం పోయింది. ‘షమితాబ్’ లొకేషన్లో నా నటనను ఆయన మెచ్చుకుంటే, ఏడుపొచ్చేసింది. నా జీవితంలో నేనెప్పుడూ గురికానంత ఉద్వేగానికి గురయ్యాను.

మీ మాతృభాష తమిళం కన్నా హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారే?!

నేను తమిళం పట్టి పట్టి మాట్లాడుతున్నట్లనిపిస్తోంది కదూ! 2009 నుంచి ముంబయ్‌లో ఉంటున్నాను. అక్కడ తమిళం మాట్లాడేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. హిందీ, ఇంగ్లిష్ మాట్లాడడం వల్ల తమిళ భాషతో సాన్నిహిత్యం పోయింది.
   
మీ చెన్నయ్ జీవితం గురించి చెబుతారా?

ఎంతైనా.... చెన్నై నా హోమ్ టౌన్ కదా.. అక్కడి జీవితాన్ని మర్చిపోలేను. మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్‌లలో చేసిన అల్లరి ఇంకా జ్ఞాపకం ఉంది. అక్కడి ఇడ్లీ, సాంబార్ రుచి గురించి చెప్పనక్కర్లేదు. ముంబయ్‌లో వడ పావ్‌లూ, భేల్‌పురీలు బాగానే ఉన్నా.. చిన్నప్పట్నుంచీ అలవాటుపడిన ప్రాణం కదా... అందుకని అప్పుడప్పుడూ మనసు ఇడ్లీ, సాంబార్ వైపు లాగుతుంటుంది (నవ్వుతూ).
     
ఇంతకీ, మీరు ఎంతవరకూ చదువుకున్నారు?

ప్లస్ 1తో సరిపెట్టేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చేద్దామని ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. దాంతో వదిలేశాను.
 
అదేంటీ... చదువు మీద ఆసక్తి ఉండేది కాదా?

 అదేంటో కానీ, ఆట పాటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు. నేను మంచి డ్యాన్సర్‌ని. అది నేర్చుకోవడంలో ఉన్నంత ఆసక్తి చదువులో లేకపోవడంతో మార్కులు తక్కువ వచ్చేవి.

 ఏదో ఒక డిగ్రీ ఉండాలంటారు! మరి, అమ్మానాన్న ఏమీ అనలేదా?

ఎంత ప్రయత్నించినా నాకు ఏకాగ్రత కుదరడం లేదని వాళ్ళూ అర్థం చేసుకున్నారు. దాంతో నన్ను ఒత్తిడి చేయలేదు. కానీ, ఖాళీగా మాత్రం ఉండొద్దన్నారు. నిజమే కదా! అసలేమీ చేయకుండా జీవితం మొత్తం ఎలా ఉండగలుగుతాం? అందుకే, డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను.

ముంబయ్‌లో శ్రుతి విడిగా ఇల్లు తీసుకుని, ఒంటరిగా ఉంటున్నారు! మీరు?

నేను అమ్మతో కలిసి ఉంటున్నాను. ఒంటరిగా ఉండేంత పరిణతి నాకు లేదు. పెద్దవాళ్ల గెడైన్స్ ఉండాల్సిందే!
     
కమలహాసన్ అందగాడు. సారిక, శ్రుతీహాసన్ అందగత్తెలు. మీరూ అంతే! అసలు బాహ్య సౌందర్యానికి మీరెంతవరకు ప్రాధాన్యం ఇస్తారు?

 
అస్సలు ఇవ్వను. నేను అందంగా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు. నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడిది. అందుకే మన చేతుల్లో లేని బాహ్యసౌందర్యం కన్నా మానసికంగా అందంగా ఉండాలి.
     
మీ అంతః సౌందర్యం గురించి చెప్పడానికి చిన్న ఉదాహరణ?
 
చిన్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఆకలేస్తోంది అని అడిగితే, నా బ్యాగులో ఎంత డబ్బుంటే అంత ఇచ్చేసేదాన్ని. అఫ్‌కోర్స్ వేలకు వేలు ఉండేవి కాదనుకోండి. ప్యాకెట్ మనీ ఉండేది. క్యాంటీన్‌లో శ్నాక్స్ కొనుక్కోవడం కోసం ఉంచుకునేదాన్ని. ఆ డబ్బు ఇస్తున్నప్పుడు... ‘ఇంటికెళ్లగానే మనకు కోరుకున్న తిండి ఉంటుంది. ఇప్పుడీ క్యాంటీన్‌లో తినకపోతే ఏం’ అనుకునేదాన్ని. ఇప్పటికీ అదే మనస్తత్వం ఉంది.
     
ఈ గుణం మీ తల్లితండ్రుల్లో ఎవరి నుంచి వచ్చింది?

ఇద్దరికీ సేవాగుణం ఉంది. అదే నాకూ వచ్చింది.
   
నాన్నగారికి దేవుడంటే నమ్మకం లేదు. శ్రుతీహాసన్ నమ్ముతారు. మీరు...?

ఏదో శక్తి ఉందని నమ్ముతాను. కానీ, విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అక్క మాత్రం విగ్రహ పూజ చేస్తుంది. అలాగని, నా ఇష్టాన్ని వ్యతిరేకించదు. మా ఇంట్లో ఉండే బ్యూటీయే అది. ఒకరి మనోభావాలను మరొకరం గౌరవించుకుంటాం.
   
ఒకవేళ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చేసే అవకాశం వస్తే...?


ఇప్పుడైతే నేను వెనక్కి తగ్గుతాను. నాన్నగారు మంచి నటుడు. అమ్మ కూడా అంతే. అక్క కూడా సూపర్. నేను చేసింది ఒక్క సినిమానే. మరో ఆరేడు సినిమాలు చేసిన తర్వాత అయితే ఒప్పుకుంటా.

ఇక... మీ ప్రయాణం ఎటువైపు? నటనా.. దర్శకత్వమా?

నటిగా కొనసాగాలనుంది. మంచి చిత్రాలను ఎన్నుకునే పని మీద ఉన్నా. అయితే, దర్శకత్వం వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా అదీ చేస్తా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement