తన చిరకాల కోరిక నెరవేరిందన్న ఆనందంలో తేలిపోతున్నారు నటి శ్రుతీహాసన్. సినిమాల్లోకి రాక ముందు నుంచే శ్రుతి సంగీత కళాకారిణి అన్న విషయం తెలిసిందే. తన తండ్రి కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘ఉన్నైపోల్ ఒరువన్’ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలిగా పని చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచే సంగీత సాధన చేస్తోన్న శ్రుతి ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, సంగీత కళాకారిణిగా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నా.. మళ్లీ నటనపై దృష్టి సారించారు శ్రుతి.
ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్న శ్రుతీహాసన్ మరో వైపు సంగీతంపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా సంగీత ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటుకున్న శ్రుతి.. ఇటీవలే లండన్‌లో సంగీత కచేరి చేయాలన్న తన కలను నిజం చేసుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘ట్రవ్‌బడూర్’ అనే ప్రాంగణంలో సంగీత కచేరిని నిర్వహించారు శ్రుతి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల కావాల్సిన తన చిత్రాల్లోని పాటలను పాడి లండన్‌వాసులను అలరించారు.
1954లో కాఫీ హౌస్‌గా ప్రారంభమైన ట్రవ్‌బడూర్ ప్రస్తుతం ప్రపంచ ఖ్యాతి గాంచిన సంగీత ప్రాంగణంగా అవతరించింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంగీతదర్శకులైన బాబ్ డిలన్, ఎల్టన్ జాన్, అదేలి, ఎడ్ షీరన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై సంగీత ప్రదర్శనలను ఇచ్చారు. ఈ వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వాలని కలలు కన్న శ్రుతి.. దాన్ని నిజం చేసుకున్నారు.
అదే విధంగా గత ఏడాది ఆగస్ట్ 15న న్యూయార్క్‌లోని మెడిషన్ అవెన్యూలో ‘ది ఇండియన్ డే పేరడే’ పేరుతో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో శ్రుతీహాసన్ వందేమాతరం ప్రదర్శనను ఇచ్చి ఆ దేశ పత్రిక హెడ్‌లైన్స్‌లో నిలవడమే కాక.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇదేకాక సెప్టెంబర్‌లో లండన్‌లోని ‘ది నెడ్’ ప్రాంతంలో నిర్వహించిన మరో సంగీత కచేరి కూడా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సంగీత కార్యక్రమాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతూ సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment