డైలాగ్ రైటర్‌గా కమల్‌హాసన్
‘సకలకళావల్లభన్’ అనే బిరుదుకు సార్థకతను తెచ్చిన వ్యక్తి కమల్‌హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ లేరన్నది నిజం. అభినయం పరంగానే కాకుండా, దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా... పలు రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్. ప్రస్తుతం ఆయన ‘ఉత్తమవిలన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ సంభాషణలు కూడా అందించడం విశేషం.
తొలుత క్రేజీ మోహన్‌తో సంభాషణలు రాయించాలనుకున్నారాయన. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో కొంత విరామం తర్వాత ఆయన కలం చేతబట్టారట. ఓ సీనియర్ సూపర్‌స్టార్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ అభినయం ప్రేక్షకుల్ని తన్మయత్వానికి లోను చేస్తుందని చెన్నయ్ టాక్. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: గిబ్రన్.