కమల్ 'ఉత్తమ విలన్' పోస్టర్ కాపీయా?
విశ్వరూపం లాంటి సీరియస్ చిత్రం తర్వాత కమల్హాసన్ తీస్తున్న కామెడీ చిత్రం ఉత్తమవిలన్ షూటింగ్ ప్రారంభమైంది. కమల్ స్నేహితుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు షెడ్యూళ్లలోనే పూర్తవుతుంది. అయితే, ఉత్తమ విలన్ పోస్టర్ విడుదల కాగానే విమర్శకులు దాన్ని కాపీగా అనుమానిస్తున్నారు. ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ కేరళకు చెందిన తెయ్యం అనే నృత్యరూపాన్ని ఫొటో తీయగా.. అచ్చం అలాగే కమల్ తన మేకప్ చేయించుకున్నారని అంటున్నారు.
''రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో ప్రారంభమైంది. కమల్ సార్ రెండు నాన్ స్టాప్ షెడ్యూళ్లలోనే సినిమా మొత్తం తీసేద్దామంటున్నారు. గత రెండు వారాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో లొకేషన్లు వెతకడంలోనే ఆయన గడిపారు'' అని ఈ సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ చిత్రంలో హీరోయిన్ సహా ప్రధాన పాత్రలు పోషించేది ఎవరన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే.. ప్రముఖ దర్శకుడు, తన గురువు కె.బాలచందర్ను మాత్రం ఓ ముఖ్యపాత్రలో నటింపజేస్తున్నారు. గతంలో పంచతంత్రం, వసూల్రాజా ఎంబీబీఎస్ లాంటి కమల్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత క్రేజీ మోహన్ ఈ చిత్రానికి కూడా డైలాగులు అందిస్తున్నారు.