
రాబోయే రోజుల్లో... నిర్మాతలు ఉండరు!
‘‘హీరోలకు ఓ నిర్మాత పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే, మరో నిర్మాత పదిహేను కోట్లు ఇస్తానంటూ డేట్స్ దక్కించుకుంటున్నాడు. ఇలాగే చేస్తూ పోతే... రాబోయే రోజుల్లో నిర్మాతలుండరు. హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులే సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. కమల్‌హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉత్తమ విలన్’ చిత్రాన్ని సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఆయన తెలుగులో మే 1న విడుదల చేస్తున్నారు.
చిత్రవిశేషాలు తెలియజేయడానికి సమావేశమైనప్పుడు కల్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చరనీ, ఇంటి నుంచి కదలడానికి, క్యారవాన్ నుంచి కాలు బయటపెట్టడానికి ఫీలైపోతారనీ వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తమ విలన్‌లో వివాదాస్పద సన్నివేశాలున్నాయంటూ తమిళనాట కొందరు వివాదం రేపారు. అలా ఉంటే సెన్సార్ బోర్డ్ అడ్డుకునేది కదా’’ అని కల్యాణ్ పేర్కొన్నారు.