నాతోనే గేమ్సా?!
నన్నే మోసం చేస్తావారా?
బొమ్మ పడితే వదిలేస్తా
బొరుసు పడితే నరికేస్తా
ఇటీవలి కాలంలో దక్షిణాది చలనచిత్రరంగంలో చెడ్డ ‘విలన్’ పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు ఆదిత్య మీనన్. ‘సింహ’ సినిమాలో గోపి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఆదిత్య. ఆ సినిమాలో అతనికి చాంతాడు పొడుగు, బీభత్సమైన డైలాగులేమీ ఉండవు.
‘ఎవడ్రా కొట్టింది?’
‘వాడి పేరు తెలుసా?’
‘మనం వచ్చిన పనేమిటి? ఈ గొడవేమిటి?’
‘చేతికి దొరికిన వాడ్ని వదిలేశానురా’..... ఇలా పొడి పొడి డైలాగులతోనే వీర లెవెల్లో విలనిజాన్ని పండించాడు ఆదిత్య.
తక్కువ మాటలతో ఎక్కువ నటనను ప్రదర్శించే ఆదిత్య నటనను గమనిస్తే, విలన్ల గురించి ప్రముఖ మాట ఒకటి చప్పున గుర్తుకొస్తుంది.
‘మా దగ్గర ప్లాన్‌లు తప్ప
డైలాగులు లేవు.
మా దగ్గర ప్రాబ్లమ్స్ తప్ప
సొల్యూషన్స్ లేవు’
బాడీ అంతగా లేకపోయిన...డైలాగులు, హావభావాలతోనే భయపెట్టడం ఒక రకం. ఉదాహరణకు... రఘువరన్‌లాంటి వాళ్లు.
నటనలో పస లేకపోయినా...ఒడ్డూ పొడుగుతోనే భయపెట్టడం రెండో రకం.
రెండో రకం విలన్లు పెద్దగా కాలానికి నిలవరు. విలన్‌కు ఒడ్డూ పొడుగు, మంచి శరీరసౌష్ఠవం అవసరమేగానీ అవి మాత్రమే ఉత్తమ విలన్‌కు ప్రామాణికాలు కాలేవు. అందుకే...విలన్ జిమ్‌లోనే కాదు ‘మైండ్ జిమ్’లో కూడా గడపాలి. మానసిక కసరత్తు ఎంత బాగా జరిగితే నటన అంతగా మెరుస్తుంది.
ఆదిత్య మీనన్ మంచి ఒడ్డూ, పొడుగు ఉన్న నటుడు. దీనికి తనలోని నటన కూడా తోడుకావడంతో విలన్ పాత్రలను సునాయాసంగా పోషించగలుగుతున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉత్తమ విలన్’గా రాణించగలుగుతున్నాడు. ముంబాయిలో జన్మించాడు ఆదిత్య మీనన్. కొంత కాలం తరువాత అతడి కుటుంబం దుబాయికి వలస వెళ్లింది. దుబాయిలోని ‘అవర్ ఓన్ ఇంగ్లీష్ హైస్కూల్’లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆదిత్య. పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు దుబాయిలోనే ఉన్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో పాటు బెంగళూరుకు వచ్చాడు.
బెంగళూరులోని ‘యం.ఎస్.రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చేశాడు.
కాలేజీలో ‘రేడియో మిడ్‌డే’లో రేడియో హోస్ట్‌గా మీడియా రంగంలోకి ప్రవేశించాడు.
ప్రాడక్ట్ లాంచ్, ఫ్యాషన్ షోలాంటి లైవ్ ఈవెంట్స్‌కు హోస్టింగ్ చేశాడు.
ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఈవెంట్ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే ఒక థియేటర్ గ్రూపులో చేరి కొన్ని నాటకాల్లో నటించాడు. ఒకసారి ఆదిత్య నటన ప్రకాష్ బేలవాడి కంటపడింది. బెంగళూరుకు చెందిన ప్రకాష్ బేలవాడి జర్నలిస్ట్ మాత్రమే కాదు... నాటకాలు, సినిమా, టీవీలలో నటుడిగా మంచి పేరు ఉంది. సామాజిక, కళారంగాలకు సుపరిచితమైన పేరు ప్రకాష్ బేలవాడి. ఆదిత్య నటనను చూసి ‘‘ఈ కుర్రాడిలో స్పార్క్ ఉంది’’ అనుకున్నారు ప్రకాష్. అలా ప్రకాష్ తీసిన ఒక టీవి సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది ఆదిత్యకు. ఇదే సమయంలో ప్రముఖ కమెడియన్ యస్.కె.చంద్రు దర్శకత్వం వహించిన ‘సూర్య శిఖరీ’ టీవీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది.
నాటకాల్లో నటించాడు.
టీవిలో నటించాడు.
ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2001లో చెన్నైకు వెళ్లాడు ఆదిత్య.
అవకాశాలు రాకో, మరే కారణమో తెలియదుగానీ చెన్నైకి వెళ్లిన తరువాత మళ్లీ బుల్లితెర మీద కనిపించాల్సి వచ్చింది. అలా రాడాన్ మీడియా వర్క్ నిర్మించిన ‘తంతిర భూమి’ సీరియల్‌లో నటించాడు. ఈ సీరియల్ సన్ టీవీలో ప్రసారమైంది. ఆ సమయంలోనే ప్రఖ్యాత దర్శడుకు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ ‘అన్నీ’లో నటించే అవకాశం వచ్చింది.
‘ఆంజనేయ’ ‘జేజే’ సినిమాల్లో నటించే అవకాశం రావడం, ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలుగురి దృష్టిలో పడే ఛాన్స్ దొరికింది. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.‘సింహ’ ‘బిల్లా’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘మిర్చి’ ‘బలుపు’ ‘పవర్’ ‘లయన్’ ‘రుద్రమదేవి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆదిత్యమీనన్ మరిన్ని చెడ్డ పాత్రలతో ‘మంచి’ నటనను ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.