ఈ చూపుల్లో శూలాలున్నాయి!
కొన్నిసార్లు అతని మాట పదునుగా ఉంటుంది. కొన్ని సార్లు అతని చూపు పదునుగా ఉంటుంది. వీటన్నిటికంటే కొన్నిసార్లు అతని మౌనం కూడా అత్యంత పదునుగా ఉంటుంది.
సుబ్బరాజు అంటే ‘యువ విలన్’ అనేదానికి నిలువెత్తు సంతకం. ‘‘మనలో సహజమైన ప్రతిభ ఏదో ఉండాలి. అలా లేకుంటే...ఎంత గొప్ప ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నా...మనతో ఉండేది డిప్లొమో తప్ప ప్రతిభ కాదు’’ అంటారు ప్రసిద్ధ విలన్ ప్రాణ్. సుబ్బరాజులో ఇన్‌స్టిట్యూట్ వారి డిప్లొమో పవర్ కంటే, సహజ నటన అనే పవరే ఎక్కువగా ఉంది.
అదే ఆయన్ను కంప్యూటర్ ఫీల్డ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది. భీమవరంలోని డీయన్‌ఆర్ కాలేజీలో చదువుకున్న సుబ్బరాజు, ఆ తరువాత కంప్యూటర్ కోర్సు చేసి ౖహైదరాబాద్‌లోని డెల్ కంప్యూటర్స్‌లో చేరారు. మంచి ఉద్యోగం, మంచి శాలరీ... అయినా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ‘వర్క్ అంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేసేలా ఉండాలి.
కొత్త ప్రదేశాలు తిరగాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచించాలి... జీవితంలోని తాజాదనాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలి’’ అనుకున్నారు సుబ్బరాజు.ఇంతకీ అదేమిటి? టైమ్ కోసం ఎదురుచూడడం తప్ప ఏమో ఇప్పటికైతే తెలియదు. ఆ టైమ్ రానే వచ్చింది. ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ ఇంట్లోని కంప్యూటర్‌కు ఏదో సమస్య వచ్చినప్పుడు, చేయిచేసుకోవడానికి మిత్రుడితో కలిసి వెళ్లాడు సుబ్బరాజు.
ఆ కొద్ది సమయంలోనే సుబ్బరాజుకు నటన అంటే ఇష్టమని తెలుసుకొని తన చిత్రంలో చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు కృష్ణవంశీ. కనిపించీ కనిపించనట్లు ఉండే ఆ టెర్రరిస్ట్ పాత్ర తనకేమీ పెద్దగా గుర్తింపు తేలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో వేసిన ఆనంద్ పాత్రతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో కిక్–బాక్సింగ్ ఛాంపియన్ రఘువీర్ (ప్రకాష్‌రాజ్) ప్రియ శిష్యుడు ఆనంద్‌గా, గురువును మోసం చేసిన శిష్యుడి పాత్రను అద్భుతంగా పోషించారు సుబ్బరాజు.
‘ఆర్య’ ‘పోకిరి’ ‘నేనున్నాను’ ‘దూకుడు’ ‘నమో వెంకటేశ’ ‘పరుగు’... ఇలా చెప్పుకుంటే పోతే సుబ్బరాజుకు పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శత్రువుల తలలు తీసే ఫ్యాక్షనిస్ట్‌కు కుడిభుజంలాంటి సేవకుడి నుంచి, అమ్మాయిలను మోసం చేసే ‘చీటింగ్ లవర్’ వరకు రకరకాల పాత్రలు పోషించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు సుబ్బరాజు.