ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే! | best villain in tollywood | Sakshi
Sakshi News home page

ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే!

Published Sat, Mar 11 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే!

ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే!

పోలీసుల మీద బావూజీ గుర్రుగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. కసిగా ఉన్నాడు.తన అసహనాన్ని, కసిని, కోపాన్ని చాటుకోవాలనుకున్నాడు.‘షురూ కరో బేటా’ అన్నాడు. ఆ బేటా (కొడుకు) ఎలాంటోడు అనుకున్నారు? నాలుక మడతపెట్టి ఉరిమి చూస్తే చాలు... ఎదుటి వారికి చుక్కలు కనపడతాయి.మున్నానా మజాకా?పోలీసులతో ఈ మున్నా ఎంతలా ఆడుకున్నాడు!‘ఓడిపోయిన పోలీసోడి బెల్టుమా ఇంట్లో గేదె మెడలో వేస్తాను’ అంటూ...కాసేపు రైలు ఆట.కాసేపు విమానం ఆట.కాసేపు ఛల్‌ ఛల్‌ గుర్రం ఆట!  ఎన్నెన్నో ఆటలు ఆడుకున్నాడు!!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘మున్నా’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు అమిత్‌ కుమార్‌ తివారీ.

సినిమాలు చూస్తూ పెరిగిన అమిత్‌కు ‘సినిమా యాక్టర్‌’ కావాలనుకోవడం తప్ప పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవు. డిగ్రీ పూర్తికాగానే ‘యాక్టింగ్‌ ఫీల్డ్‌’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. నాన్న మాత్రం ‘అది తక్క’ అన్నట్లుగా మాట్లాడి బిజినెస్‌ చేయమన్నాడు.‘బిజినెస్‌ చేయడం నా వల్ల కాదు’ అంటూ తండ్రి దగ్గర మొరపెట్టుకొని,  ఆయనను ఒప్పించి రంగంలోకి దిగాడు అమిత్‌. తెలుగులో ‘కళ’ సినిమాలో నటించే ఆఫర్‌ రావడంతో ముంబై నుంచి 2003లో హైదరాబాద్‌ వచ్చాడు అమిత్‌. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలు, దర్శకులు, రచయితలను రెగ్యులర్‌గా కలిసేవాడు. అలా ‘కళ’ తరువాత ‘యువసేన’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచి అవకాశాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ‘యువసేన’లో అమిత్‌ చేసిన డ్యాన్స్‌కు మంచి పేరు వచ్చింది. విలన్‌కు డ్యాన్స్‌ ఉండడం అనేది కొత్తగా అనిపించింది.

‘విక్రమార్కుడు’ సినిమా అమిత్‌ తివారీకి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమాలో బావూజీ కుమారుడు ‘మున్నా’గా క్రూరత్వాన్ని పండించాడు అమిత్‌. ‘మున్నా’ పాత్ర ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో చెప్పడానికి చిన్న ఉదాహరణ...‘విక్రమార్కుడు’ సినిమా రిలీజ్‌ రోజు అందరితో కలసి సుదర్శన్‌ థియేటర్‌ (హైదరాబాద్‌)కు వెళ్లాడు అమిత్‌. తెర మీద మున్నా కనిపిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు పైకి లేచి కాగితాలు, నాణేలు విసురుతూ బండబూతులు తిడుతున్నారు.‘ఓరి నాయనో... నా పని ఇవాల్టితో ఖతం. బయట కనిపిస్తే ఎముకల్లోకి సున్నం లేకుండా తంతారు’ అనుకున్నాడు. ఎలాగైనా సరే, అక్కడి నుంచి సేఫ్‌గా ఎస్కేప్‌ కావాలనుకున్నాడు. డైరెక్టర్‌ రాజమౌళి దగ్గరికి వెళ్లి మనసులో మాట చెప్పాడు.

‘‘మరేం ఫరవాలేదు. నీ పాత్ర పెద్ద హిట్‌ అనడానికి ఇదే సాక్ష్యం. ఇక్కడ తిట్టిన వాళ్లే నువ్వు బయట ఎక్కడైనా కనిపిస్తే పొగుడుతారు చూడు’’ అన్నాడు రాజమౌళి. ఆయన చెప్పినట్లే జరిగింది. సినిమా నుంచి బయటికి వచ్చిన తరువాత అమిత్‌ను గుర్తు పట్టిన ఆ కుర్రాళ్లు...‘‘సార్‌... ఎంత బాగా చేశారు’’ అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.‘హమ్మయ్య’ అనుకున్నాడు అమిత్‌. మున్నా పాత్ర ఎంత హిట్‌ అయిందంటే...‘విక్రమార్కుడు’ సినిమాకు ముందు ఏడెనిమిది సినిమాలు చేసిన అమిత్‌ ఆ తరువాత డెబ్బై సినిమాల వరకు  చేశాడు. కెరీర్‌ యమస్పీడ్‌ అందుకుంది!

‘ఈ క్యారెక్టర్‌  ఎలా చేయాలి? సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఎలా చేయాలి? ఎలాంటి గెటప్‌ వేయాలి’ అని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు అమిత్‌. పాత్రకు తగ్గట్టు బాడీని పెంచడం, తగ్గించడం చేస్తుంటాడు. ఇది మాత్రమే కాదు...సెట్‌లో సీనియర్‌ విలన్ల నటనను జాగ్రత్తగా గమనిస్తూ పాఠాలు నేర్చుకుంటాడు.‘యువసేన’ ‘విక్రమార్కుడు’ ‘లక్ష్యం’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ‘అత్తారింటికి దారేది’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమిత్‌ కుమార్‌ తివారీ కన్నింగ్, సైకో, క్రుయల్‌ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు.‘కీప్‌ ట్రైయింగ్‌’ ‘కీప్‌ ఫైటింగ్‌’ అనేవి అమిత్‌ నమ్ముకున్న సూత్రాలు. ఈ సూత్రాలే అతనిలో  ఆశావహ దృక్పథాన్ని పెంచి ‘ఉత్తమ విలన్‌’గా ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement