
నేను ఇప్పటికీ...కమల్ అభిమానినే!
బాలచందర్‌గారంటే నాకెంతో అభిమానం. ఆయన దగ్గర సహాయ దర్శకునిగా చేస్తానంటే వద్దన్నారు.
‘‘బాలచందర్‌గారంటే నాకెంతో అభిమానం. ఆయన దగ్గర సహాయ దర్శకునిగా చేస్తానంటే వద్దన్నారు. ఇక, కమల్‌హాసన్ ఎంతో క్రమశిక్షణ గల నటుడు. గతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఒకే ఒక్క సీన్ కోసం క్రేన్ మీద గంటల కొద్దీ అలానే నిలబడ్డాడు. అప్పట్నుంచి నాకు కమల్ మీద ఇష్టం మొదలైంది’’ అని సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ అన్నారు.
రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్, పూజాకుమార్, ఆండ్రియా, కె.బాలచందర్, కె. విశ్వనాధ్ తదితరుల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ తెలుగులోకి విడుదల చేస్తున్నారు. జిబ్రాన్ స్వరాలందించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ - ‘‘ప్రపంచ సినీ కళాకారులు గర్వించదగ్గ నటుడు కమల్. విశ్వనాథ్‌గారు, కమల్‌హాసన్ ఏ సినిమా చేసినా ‘బాగుంటుంది’ అనే అంటాను. ఎందుకంటే, ఇద్దరూ అద్భుతమైన సినిమాలు చేస్తారు. కమల్ సినిమాల్లో ప్రయోగాత్మక పాటలు పాడే అవకాశం నాకు లభించింది’’ అన్నారు.
కమల్, బాలచందర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన పాటలను వారిద్దరి మధ్య అనుబంధానికి అన్వయిస్తూ బాలు పాడగా, కమల్ కూడా గొంతు కలపడం విశేషం. కమల్‌హాసన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నా గురువు బాలచందర్‌గారి గురించి మాట్లాడాలి. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయడం నా అదృష్టం. విశ్వనాథ్‌గారికీ, నాకూ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పడానికి మా కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘నేను ఇప్పటికీ కమల్ అభిమానినే.
ఆయన నటించిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ లాంటి చిత్రాలు తెలుగులో మళ్లీ ఎప్పుడు వస్తాయా? అని తెలుగు ప్రేక్షకురాలిలా ఎదురు చూస్తున్నా. ఈ ‘ఉత్తమ విలన్’ ఆ చిత్రాల సరసన నిలుస్తుంది’’ అని గౌతమి అన్నారు. ఈ చిత్రం తనకు దొరికిన అక్షయ పాత్ర అని సి. కల్యాణ్ అన్నారు. బాలచందర్ గురించి తమిళంలో కమల్ రాసిన కవితను రామజోగయ్య శాస్త్రి తెలుగులోకి అనువదించగా, కమల్ చదివి వినిపించారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, బెల్లంకొండ సురేశ్, రమేశ్ అరవింద్, తమిళ వెర్షన్ నిర్మాత లింగుస్వామి, జిబ్రాన్, శ్రుతీహాసన్ తదితరులు పాల్గొన్నారు.