ఇవాళ్టికీ అదే తపన... అతనికి అదే శ్రీరామరక్ష!
ఒకరు అద్భుతమైన నటుడు... మరొకరు అంకితభావం ఉన్న నటి... వేరొకరు తెలుగు సినిమా దారేది అని చాలామంది వాపోతున్న తరుణంలో తళుక్కుమన్న రచయిత - దర్శకుడు. ముగ్గురివీ మూడు వేర్వేరు మార్గాలు... మూడు వేర్వేరు మనస్తత్వాలు... కానీ, ఇవాళ సినీ రంగం సగర్వంగా చెప్పుకొనే స్థాయి కృషి ఈ ముగ్గురి సొంతం. కమలహాసన్, అనుష్క, త్రివిక్రమ్ - ఈ ముగ్గురి పుట్టినరోజూ చిత్రంగా ఒకటే... నవంబర్ 7. సినిమాల్లోనే కాదు... బయటా జనం తలెత్తి చూసే ఈ ముగ్గురి గురించి... వారిని సన్నిహితంగా చూసిన మరో ముగ్గురు దిగ్గజాలు మనసు కిటికీ తెరిచి ‘సాక్షి’తో పంచు కుంటున్న అను భవాలు, అను భూతులు ఇవాళ్టి ఫ్యామిలీ గిఫ్ట్.
- ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్
అప్పుడే కమలహాసన్‌కు అరవై ఏళ్ళు నిండాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇవాళ్టికీ అతనిలోని ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే, అతనికి అంత వయసుందని అనిపించదు. దర్శకుడిగా కమలహాసన్‌తో నేను తీసిన చిత్రాలు మూడే! మా మొదటి సినిమా ‘సాగర సంగమం’. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి వద్ద కమల్ డేట్లున్నాయి కాబట్టి, అతణ్ణి దృష్టిలో పెట్టుకొనే ‘సాగరసంగమం’ కథ అల్లుకొన్నా. బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన కమల్ పెద్దయ్యాక కొన్నాళ్ళు డ్యాన్స్‌మాస్టర్ తంగప్పన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘సాగర సంగమం’లోని బాలు పాత్రను రాసుకున్నాను.
కొన్ని ఘట్టాల్లో అతను చూపిన నటన ఇవాళ్టికీ చూస్తుంటే, ‘తీసింది నేనేనా, చేసింది అతనేనా’ అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళ తన కెరీర్‌లో అత్యుత్తమమైన 10 చిత్రాల జాబితా వేస్తే, అందులో ‘సాగర సంగమం’ ఒకటని కమల్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్ని భావోద్వేగాలూ ఉన్న ఆ చిత్ర రూపకల్పన ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. ఏది చేసినా అందులో ప్రత్యేకత, పర్‌ఫెక్షన్ ఉండాలని కమల్ భావిస్తాడు. దాని కోసం ప్రతి సన్నివేశంలో, సందర్భంలో ప్రయత్నిస్తాడు.
సరిగ్గా అలాంటి తపనతో సినిమాలు తీసే మా లాంటి దర్శకులకు అతను బాగా ఉపయోగపడతాడు. అతను ఎంత ప్రొఫెషనల్ అంటే, దర్శకుడు ఆశించినది ఇచ్చే వరకు, చాలాసార్లు అంతకు మించి ఇచ్చేవరకు రాజీ పడడు. షాట్ తీస్తున్నప్పుడు మన రియాక్షన్‌లో ఏదైనా తేడా ఉన్నా, మనం సరేనని కట్ చెప్పడం ఒక్క సెకన్ ఆలస్యమైనా చటుక్కున గ్రహించేస్తాడు. ఆశించినంత తృప్తిగా రాలేదని గ్రహించి, మళ్ళీ చేయడానికి సిద్ధపడతాడు. అంత సునిశితమైన గ్రహణశక్తి అతనిది. మనం ఎదైనా చెబితే సహృదయంతో తీసుకుంటాడు. చాలామంది లాగా అహంభావానికి పోడు.
అతనిలో కళాతృష్ణ ఇవాళ్టికీ తీరలేదు.తీరని దాహంతో ఆయన నిరంతరం కొత్త పాత్రలు, కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అందుకే, అప్పటి ‘పుష్పక విమానం’ మొదలు ఇటీవలి ‘దశావతారం’ దాకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కథలు, పాత్రలతో ఎవరు వచ్చినా ధైర్యంగా ముందుకు వస్తాడు. ‘నీ పాత్ర గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడి పాత్ర. కానీ, దురదృష్టవశాత్తూ రెండు కాళ్ళూ లేవు’ అని ఒక లైన్ చెప్పామనుకోండి. వెంటనే, సవాలుగా నిలిచే ఆ పాత్ర పోషించడానికి సిద్ధమైపోతాడు. పెపైచ్చు, చాలామందిలా అతనిది ఆరంభ శూరత్వం కాదు. సవాలుగా నిలిచే చిత్ర నిర్మాణాన్నో, పాత్రనో తీసుకున్న తరువాత చివరిదాకా అదే తపనను నిలుపుకొంటూ, పూర్తి చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు.
ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకుల నటుడు - కమల్. ఒక పాత్రను ఎలా మలుచుకోవాలనుకున్నా సరే, నటుడిగా అతణ్ణి ఎంచుకోవచ్చు. దర్శకుడు నిశ్చింతగా కళ్ళు మూసుకొని పాత్రను అతని చేతుల్లో పెట్టవచ్చు. తీసుకున్న పాత్రలోకి ఇమిడిపోవడానికి ఏవేం కావాలో అవన్నీ కమల్ సమకూర్చుకుంటాడు. ఆ పాత్రను పండించడం కోసం హోమ్‌వర్క్ చేస్తాడు. మొదటి రోజుల నుంచి ఇప్పటికీ అతని పద్ధతి అదే!
అలాగే, షూటింగ్ జరుగుతుండగా అక్కడికక్కడ, అప్పటికప్పుడు బుర్రలో తళుక్కున మెరిసిన ఆలోచనను అమలు చేసేసి, సన్నివేశం అద్భుతంగా రావడానికి సహకరించే అరుదైన లక్షణం కమల్‌కు ఉంది. ఉదాహరణకు, ‘సాగర సంగమం’లో జయప్రదతో కలసి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రిక చూసే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షాట్ చివరలో నాకేదో అనిపించి, ‘కమల్! ఒక్కసారిగా నవ్వేసెయ్’ అని పక్క నుంచి అరిచా. చాలామంది ఆర్టిస్టులు అలాంటి సందర్భాల్లో గందరగోళపడతారు.
‘కట్’ చెప్పారనుకుంటారు. కానీ, క్షణంలో వెయ్యోవంతులో కమల్ నా మాట గ్రహించి, అప్పడికప్పుడు నవ్వును జత చేర్చి, తన నట ప్రతిభతో ఆ సీన్‌ను పండించాడు. ‘దర్శకుడి భావం ఇదై ఉంటుంది, ఇలా చేయాలన్న’ సిక్స్త్‌సెన్స్ అతనికి బాగా పనిచేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే అతనికి శ్రీరామరక్ష.
‘శుభసంకల్పం’ చిత్రం అయిపోయిన తరువాత తమిళులకు పెద్ద పండుగ దీపావళికి అతను స్వయంగా మా ఇంటికి వచ్చి, మా దంపతులిద్దరికీ కొత్త బట్టలు పెట్టి, నమస్కారం చేసి వెళ్ళిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఇవాళ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, అదే భక్తి, గౌరవంతో ఉండడం అతని సంస్కారం. ఇక, సినీ జీవిత గురువు కె. బాలచందర్ అంటే భక్తి గౌరవాలే కాక, చనువు కూడా! ఇప్పటికీ తన కష్టసుఖాలన్నీ ఆయనతో మనసు విప్పి చెప్పుకుంటాడు.
నన్ను బలవంతాన ఒప్పించి, నటుణ్ణి చేసింది కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాలే. వాళ్ళిద్దరూ పట్టుబట్టి, ‘శుభసంకల్పం’లో తొలిసారిగా నన్ను నటింపజేశారు. ఆ సినిమా అయిపోయాక కూడా, ‘ఇక్కడితో ఆపవద్దు. నటన కొనసాగించండి’ అని నాకు సలహా ఇచ్చింది కూడా కమలే! అలా నా రెండో ఇన్నింగ్స్ నటుడిగా మొదలై తాజా ‘ఉత్తమ విలన్’, రజనీకాంత్ ‘లింగా’ వరకు కొనసాగుతోంది.
కమల్‌లో వెర్సటాలిటీ ఉంది. వినోదింపజేయగలడు. అంతే గొప్పగా విషాదమూ పలికించగలడు. ఇవాళ, దక్షిణభారతావని నుంచి వచ్చిన అత్యుత్తమ సినీ ప్రతిభాసంపన్నుల్లో అతను ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతను పుస్తకాలు బాగా చదువుతాడు. బాగా రాస్తాడు కూడా! తమిళంలో కొన్ని పాటలు అతనే రాశాడు. ఇక, సినిమాల్లో డైలాగులైతే, పేరుకు వేరొక డైలాగ్ రైటర్ ఉన్నా, కమల్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందట! విభిన్నమైన కథాంశాలతో స్వయంగా చిత్రాలు నిర్మిస్తుంటాడు.
ఇన్ని లక్షణాలున్న అతను దర్శకుడిగా కూడా వ్యవహరించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే, నేరుగా అతని దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. టీవీ, చలనచిత్రోత్సవాలు, ప్రపంచ సినిమా గురించి అతనికి ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే, ఎప్పుడైనా వాటి ప్రస్తావన వచ్చి, మాట్లాడితే - అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. అలాంటి వ్యక్తికి తాజా సినీ సాంకేతిక పరిజ్ఞానం క్షుణ్ణంగా తెలిసుండడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కమాటలో, ఇటు సృజనాత్మక అంశాల్లోనూ, అటు సాంకేతికంగానూ అతను దిట్ట. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ గొప్పగా మాట్లాడతాడు.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా - ఇంత సాధించిన వ్యక్తికి ఇవాళ మా లాంటి వాళ్ళం కొత్త కథ, పాత్ర రూపకల్పన చేయడం కూడా కష్టమే. నిజం చెప్పాలంటే, అతని ఇమేజ్ ఇవాళ మాబోటి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోయింది. ‘దశావతారం’, ‘విశ్వరూపం’ లాంటి స్థాయి ప్రయోగాలు తాజాగా చేసిన నటుడికి ఎలాంటి పాత్ర రాయాలన్నది పెద్ద సవాలే. అందుకే, ‘ఇప్పుడు నీకు తగ్గ కథ రాయడం కష్టం’ అని నవ్వుతూ అంటూ ఉంటా.
అయితే, ‘నందనార్’, ‘రామానుజాచారి’ లాంటి చారిత్రక ప్రసిద్ధమైన పాత్రలకు అతను చక్కగా సరిపోతాడు. అలాంటి పాత్రలు చేయడం అతనికిష్టం కూడా! ఆ ప్రయోగాలు కూడా అతను చేస్తే, ఒక సినీ ప్రియుడిగా చూడాలని ఉంది. ఎప్పుడూ బద్ధకించకుండా, మనసులో ఏదో ఆలోచిస్తూ, కొత్తదనం కోసం అన్వేషించే కమల్‌ది మన సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అతని కన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి, అతనికి ఈ షష్టిపూర్తి క్షణంలో చెప్పేదొక్కటే - ‘‘శతమానం భవతి.’’