ఎస్పీ శైలజ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. దాదాపు నాలున్నర దశాబ్దాలుగా ఆమె తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఆమె పాట ఎంత మధురంగా ఉంటుందో.. మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది. కేవలం పాటల్లోనే కాకుండా.. డబ్బింగ్ ఆరిస్ట్‌గా, నటిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శైలజ.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘నేను ఇంత పెద్ద సింగర్ అవుతానని అనుకోలేదు. బహుషా ఒక్క పాట పాడతానేమో అనుకున్నా. మా ఇంట్లో నేను, అన్నయ్య(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తప్ప అందరూ సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. మా అమ్మకు ఒక్క ఆడపిల్ల అయినా స్జేజ్‌మీద పాడాలని కోరిక ఉండేది. కానీ మా నాన్నకు అది నచ్చేది కాదు. మొదట్లో నన్ను బయటకు పంపడానికి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఓకే చెప్పారు. వారి ప్రోత్సాహంతో మొదటి సారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట విన్నాక అన్నయ్యకు నాపై నమ్మకం కలిగింది. దీంతో ప్రతి ప్రోగ్రామ్స్‌కు నన్ను తీసుకెళ్లాడు. ఆ తర్వాత చక్రవర్తి గారు వరుసగా అవకాశాలు ఇచ్చాడు. నేను పాడిన పాటలు విజయవంతం కావడంతో అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి.
ఇక సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది. నేను భరత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫోటోలు విశ్వనాథ్‌గారు చూశారు. అలా ‘సాగరసంగమం’లో చాన్స్ వచ్చింది. మొదట నటించడానికి నేను అంగీకరించలేదు. ఇంట్లో అందరూ చేయమని చెప్పిన.. నేను నో చెప్పాను. కానీ విశ్వనాథ్ గారు మా నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారు. షూటింగ్ సమయంలో విశ్వనాథ్‌గారితో చాలా విషయాలు పంచుకున్నాను. ఒక అన్నయ్యలా నాకు క్లోజ్ అయ్యాడు. ‘సాగరసంగమం’ సినిమాలో కమల్ హాసన్ గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా.. నా కాలు వెనక్కి వచ్చేసిది. అప్పుడు విశ్వనాథ్‌గారు పిలిచి ఇవి పాత్రలు మాత్రమే.. నిజంగా కమల్ హాసన్‌ని తన్నడం లేదు.. ఆయన పోషించిన పాత్రను మాత్రమే నువ్వు కాలితో తన్నుతున్నావు అని చెప్పి చేయించాడు. అలా ఇష్టం లేకున్నా.. ఆ హీరోని తన్నాల్సి వచ్చింది అని శైలజ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment