K Vishwanath
-
ఓటీటీలోకి ‘విశ్వదర్శనం’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
కళా తపస్వి కె.విశ్వనాథ్(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్‌ని ఖరారు చేశారు.తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
నా జీవితం..ఆ హీరోయిన్ వైపు చూడకుండా చేసింది..
-
చిరు ఫైట్ సీన్ కోసం 6000 కుండలు.. అప్పట్లోనే 50 వేల ఖర్చు!
మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆపద్బాంధవుడు ఒకటి. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ చిరంజీవికి మాత్రం మంచి గుర్తింపుతో పాటు నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం ఓ ఫైట్ సీన్‌ని పెట్టారు విశ్వనాథ్. అది ఎద్దుతో జరిగేది. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్ అప్పట్లోనే రూ. 50 వేలు ఖర్చు చేసిందట. ఫైట్ సీన్ కోసం ఆరు వేల కుండలను తెప్పించారట. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారట. పగిలిపోయిన కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారట. ఇక ఈ ఫైట్ సీన్ ముగింపు దశకు వచ్చేసరికి కుండల కొరత ఏర్పడిందట. (చదవండి: అభిమానులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా: చిరంజీవి) అప్పటికే మద్రాస్‌లో తయారు చేసిన కుండలన్నీ కొనుగోలు చేశారట. మరిన్ని కుండల కోసం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కొనుక్కోచ్చారట. ఎంతో కష్టపడి తీసిన ఈ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్ 9న అపద్బాంధవుడు చిత్రం విడుదలైంది. చిరంజీవితో పాటు ఉత్తమ డైలాగ్స్ రచయితగా జంధ్యాల, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా భూషన్ లకంద్రి, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా బి. చలం, అరుణ్ బి.గోడ్వంకర్‌లకు నంది అవార్డులు లభించాయి. -
అలా ఆ స్టార్ హీరోని నా కాలితో తన్నాల్సి వచ్చింది: ఎస్పీ శైలజ
ఎస్పీ శైలజ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. దాదాపు నాలున్నర దశాబ్దాలుగా ఆమె తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఆమె పాట ఎంత మధురంగా ఉంటుందో.. మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది. కేవలం పాటల్లోనే కాకుండా.. డబ్బింగ్ ఆరిస్ట్‌గా, నటిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శైలజ.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను ఇంత పెద్ద సింగర్ అవుతానని అనుకోలేదు. బహుషా ఒక్క పాట పాడతానేమో అనుకున్నా. మా ఇంట్లో నేను, అన్నయ్య(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తప్ప అందరూ సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. మా అమ్మకు ఒక్క ఆడపిల్ల అయినా స్జేజ్మీద పాడాలని కోరిక ఉండేది. కానీ మా నాన్నకు అది నచ్చేది కాదు. మొదట్లో నన్ను బయటకు పంపడానికి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఓకే చెప్పారు. వారి ప్రోత్సాహంతో మొదటి సారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట విన్నాక అన్నయ్యకు నాపై నమ్మకం కలిగింది. దీంతో ప్రతి ప్రోగ్రామ్స్‌కు నన్ను తీసుకెళ్లాడు. ఆ తర్వాత చక్రవర్తి గారు వరుసగా అవకాశాలు ఇచ్చాడు. నేను పాడిన పాటలు విజయవంతం కావడంతో అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఇక సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది. నేను భరత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫోటోలు విశ్వనాథ్‌గారు చూశారు. అలా ‘సాగరసంగమం’లో చాన్స్ వచ్చింది. మొదట నటించడానికి నేను అంగీకరించలేదు. ఇంట్లో అందరూ చేయమని చెప్పిన.. నేను నో చెప్పాను. కానీ విశ్వనాథ్ గారు మా నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారు. షూటింగ్ సమయంలో విశ్వనాథ్‌గారితో చాలా విషయాలు పంచుకున్నాను. ఒక అన్నయ్యలా నాకు క్లోజ్ అయ్యాడు. ‘సాగరసంగమం’ సినిమాలో కమల్ హాసన్ గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా.. నా కాలు వెనక్కి వచ్చేసిది. అప్పుడు విశ్వనాథ్‌గారు పిలిచి ఇవి పాత్రలు మాత్రమే.. నిజంగా కమల్ హాసన్‌ని తన్నడం లేదు.. ఆయన పోషించిన పాత్రను మాత్రమే నువ్వు కాలితో తన్నుతున్నావు అని చెప్పి చేయించాడు. అలా ఇష్టం లేకున్నా.. ఆ హీరోని తన్నాల్సి వచ్చింది అని శైలజ చెప్పుకొచ్చారు. -
కే. విశ్వనాథ్ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు కూడా. -
కళాతపస్వి కన్నుమూసిన వార్డులోనే ఆయన భార్య కూడా..
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త మరువకముందే ఆయన సతీమణి జయలక్ష్మి(86) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆమె అప్పటి నుంచి అస్వస్థతకు లోనయ్యారు. గత కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తండ్రి విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా మరణించడం దురదృష్టకరమని కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఈ నెల 2న కె.విశ్వనాథ్ శివైక్యమయ్యారు. విశ్వనాథ్-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్ ముగ్గురు సంతానం. చదవండి: విశ్వనాథ్ సతీమణి కన్నుమూత -
విశ్వనాథ్‌గారు ఆ నమ్మకాన్ని ఇచ్చారు
‘‘కె.విశ్వనాథ్‌గారు వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా (నటుడిగా) పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆణిముత్యాల్లాంటి సినిమాల ద్వారా శాశ్వితంగా మన మనసుల్లో ఉంటారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. ఫిబ్రవరి 19న(ఆదివారం) కె.విశ్వనాథ్ జయంతి. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల ఆధ్వర్యంలో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారి జయంతిని మనం ఒక సంబరంలా జరుపుకోవాలి. ఆయన వదిలి వెళ్లిన కీర్తి, తీపి జ్ఞాపకాలు మనకు మిగిలిన గొప్ప అనుభవాలు.. జీవితాంతం మనం గుర్తుకు తెచ్చుకుని సంతోషించే ఆయన గుర్తులు. మూడు సినిమాల్లో నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చి, నాకు అవార్డులు తీసుకొచ్చిన నటనను నా నుంచి రాబట్టిన దర్శకుడాయన. నటనలో మెళకువలు చెబుతూ, హావభావాలు ఎలా పలికించాలో గురువులా నేర్పించారు. షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక నటుడిలాగా కాకుండా ఓ బిడ్డలాగా ఆయనతో పాటు కూర్చొబెట్టుకునేవారు. కంచిలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన పెరుగు అన్నం కలిపించి నాకు పంపించినప్పుడు తినకుండా ఎలా కాదనగలను? ఆ సమయంలో ఓ తండ్రిలాగా అనిపించారాయన. యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనతో తొలిసారి ‘శుభలేఖ’ చేసే అవకాశం వచ్చింది. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని తెలియడంతో కొంచె టెన్షన్‌గా ఉండేది. డైలాగులు ఫాస్ట్‌గా కాదు.. అర్థమయ్యేలా కరెక్ట్‌గా పలకాలని చెప్పారాయన. ఆయన ఓ అద్భుతమైన నటుడు.. మన నుంచి ఒరిజినాలిటీని రాబట్టుకుంటారు. నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది విశ్వనాథ్‌గారు. నేను మాస్ హీరోగా దూసుకెళుతున్న సమయంలో ‘స్వయం కృషి’ లాంటి మంచి సందేశాత్మక చిత్రం చేయించారాయన. ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో ఓ సీన్ కోసం ఆయనవద్దకు వెళ్లి రాత్రి రిహార్సల్స్ చేశాను.. మరుసటి రోజు ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఎమోషన్స్‌ని అద్భుతంగా తీయగలరు విశ్వనాథ్‌గారు. ఆయన వద్ద నేను నేర్చుకున్న అంశాలను నాతో పనిచేస్తున్న దర్శకులకు చెబుతుంటాను. విశ్వనాథ్‌గారి వద్ద పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘యువహీరో తారకరత్న పరమదించడం బాధగా ఉంది’’ అన్నారు. ‘కళాతపస్వికి కళాంజలి’ లో కె.విశ్వనాథ్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాలను వారు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్ పెద్దబ్బాయి కె.నాగేంద్ర నాథ్, ఆర్.నారాయణ మూర్తి, కె.రాఘవేంద్ర రావు, రమేశ్ ప్రసాద్, కేఎస్ రామారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ‘కళాబంధు’ టి.సుబ్బరామి రెడ్డి, ‘శంకరాభరణం’ ఝాన్సీ, మంజు భార్గవి, శివలెంక కృష్ణప్రసాద్, మురళీ మోహన్, సి.అశ్వినీదత్, దామోదర్ ప్రసాద్, సుమలత, రాజశేఖర్, అలీ, భానుచందర్, శేఖర్ కమ్ముల తదితరులు పాల్గొన్నారు. -
ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్ నివాళులు
ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. -
కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్.. కానీ ఆ సినిమాతో!
దిగ్గజ దర్శకులు, నటుడు కె.విశ్వనాథ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రేక్షకుల కోసం ఎన్నో అద్భుత కళాఖండాలు అందించిన ఆయన శంకరాభరణం రిలీజైన రోజే శివైక్యమయ్యారు. తన సినిమాలతో వినోదాన్ని పంచడమే కాకుండా అంతర్లీనంగా సందేశాలు కూడా ఇచ్చేవారు. ఆయన తీసిన అద్భుత చిత్రాల్లో స్వర్ణకమలం కూడా ఒకటి. ఈ సినిమా గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వనాథం. ఓసారి ఆ విశేషాలేంటో గుర్తు చేసుకుందాం.. 'శాస్త్రీయ కళలను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదన్న గట్టి అభిప్రాయంతో ఉన్న పాత్ర మీనాక్షి. దానికితోడు హడావుడి,నిర్లక్ష్యం, అవసరానికి చిన్నాపెద్ద అబద్ధాలాడే క్యారెక్టర్ ఆమెది. సినిమా చూసి ఇంటికొచ్చి హాస్పిటల్.. ఫ్రెండ్ పురుడు అని కట్టుకథలల్లి ‘వాళ్లంతిదిగా అడుగుతుంటే ఎలా నాన్నా కాదనేది?’ అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడే స్వీట్లయర్ ఆమె. ఇదిలా ఉండగా ఆమె స్వాతంత్య్రానికి అడుగడుగునా పార్క్ నుంచి మొదలై గజ్జెలు తీసేదాకా వచ్చి, చివరికి హోటల్లో ఇష్టమైన ఉద్యోగం పోయేదాకా ఆమెను విసిగించే క్యారెక్టర్ వెంకటేష్‌ది. ఒకటేమిటి... మిడిల్ క్లాస్ఫ్యామిలీస్లో మనం నిత్యం చూసే స్టేషన్‌మాస్టర్, టీచర్... అలా అందరి క్యారెక్టర్లు వేటికవే నిలిచిపోయాయి. ‘స్వయంకృషి’లో విజయశాంతి ‘అట్టసూడమాకయ్యా’ అన్నట్టు ఈ సినిమాలో కూడా ఏదయినా మెలిక పెడితే బాగుంటుందని అనిపించి అర్థం చేసుకోరూ.. అని డైలాగ్ పెట్టాం'. ‘హారతుల’ ట్రాక్ గురించి మాట్లాడుతూ... దాని జన్మ చాలా గమ్మత్తుగా జరిగింది.ఆ ట్రాక్ ముందే అనుకున్నాం, రాశాం, డిస్కస్చేశాం. అయితే నాకెందుకో అది తృప్తిగా అనిపించలేదు. ఓరోజు మధ్యాహ్నం రెండింటి నుంచి షూటింగ్ అనగా, పదకొండు గంటలకు భగవంతుడు చిన్న ఫ్లాష్ ఇచ్చాడు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ‘పక్కింటి డాబాలో వాళ్ళని వెళ్ళి అడుగు... మొత్తం గోడలకంతాదేవుళ్ళ పటాలు పెడతాం, పొగ పెట్టినట్టు చేస్తాం, షూటింగ్ అయ్యాక మళ్ళీ బాగుచేసి ఇస్తాం... వాళ్ళకి ఓకేనా’ అని చెప్పాను. వాళ్ళు ఓకే అనగానే వెంటనే సిటీకి పంపించి పటాలు తెప్పించి, సీన్లు, డైలాగ్‌లు అప్పటికప్పుడు మార్చి షూట్చేశాం. అతిభక్తితో అస్తమానం హారతులు ఇచ్చే శ్రీలక్ష్మి క్యారెక్టర్ – కుంపటి కమ్ము వంకాయలా కందిపోయిన సాక్షి రంగారావు క్యారెక్టర్.. అలా పుట్టాయి. తన సెంటిమెంట్ గురించి చెప్తూ.. దాదాపు ప్రతి సినిమాలో శివుడి మీద ఏదో ఒకపాట ఉంటుంది. ఈ సినిమాలో కూడా రెండున్నాయి. అది భగవదేచ్ఛ. నేను కావాలని ప్రయత్నించను. ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడిగాను. (సాధారణంగా ఏ కవిత్వమైనా, కావ్యమైనా శ్రీకారంతో మొదలవుతుందని) దానికాయన ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతా గంగమ్మ వాన’ అని రాశారు. నేను ఆయన్ని ‘శ్రీ’తో రాయమని అడిగానే తప్ప శివుడు మీద రాయమని అడగలేదు! ఇంకా చెప్పాలంటే నాకు‘ఎస్’ సెంటిమెంట్ ఉంది. సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా...భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్’తో పెట్టిన 2–3 సినిమాలు వరుసగా హిట్ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఆపద్బాంధవుడుకు మాత్రం అది కుదరలేదు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ సరేనన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్’ సెంటిమెంట్ మైండ్ నుంచి స్లిప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు విశ్వనాథం. చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు, అసలేం జరిగింది -
కళాతపస్వి కె. విశ్వనాథ్.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట
కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అమ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్ పర్సన్స్‌లా ట్రీట్ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్లెట్ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు స్పెండ్ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్స్ట్రాక్ట్తో రా, నేను దాన్ని ఇంటర్పెట్ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని. సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్లో మూన్‌మూన్‌సేన్ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను. అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది. ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది. అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది. షూటింగ్ టైంలో లిరిక్ రైటర్, డైలాగ్‌రైటర్ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్ అవ్వగానే ఈవెనింగ్ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్లో చరణాలు కూడా రాసెయ్. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను’' అన్నాను. -
గుర్తుకొస్తున్నాయి.. ఆనాటి మధుర జ్ఞాపకాలు
కడప:అపురూప చిత్రాల దర్శకులు, సృజన శీలి కె.విశ్వనాథ్‌కు అన్నమయ్య జిల్లా కురబలకోటతో మరుపురాని అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో సీతామాలక్ష్మి సినిమా తీశారు. మండలంలో తొలి సినీ షూటింగ్ కూడా ఇదే. నెల పాటు షూటింగ్ నిర్వహించారు. చంద్రమోహన్, తాళ్లూరి రామేశ్వరి హీరోహీరోయిన్లుగా నటించారు. సినీ షూటింగ్ ఎలా ఉంటుందో చూడటానికి జనం తరలి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఈ చిత్రాలకు ఆద్యమైంది. 1978 జూలై 27న రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్. చిన్న సినిమాగా రిలీజై పెద్ద పేరు తెచ్చుకుంది. మండలంలోని తెట్టు, కురబలకోట రైల్వేస్టేషన్లో పలు సన్నివేశాలు తీశారు. ఈ సినిమా ఆయన కేరీర్‌కు నిచ్చెనలా మారింది. మరో వైపు హీరోగా చంద్రమోహన్ కేరీర్‌కు కూడా దోహదపడింది. తాళ్లూరి రామేశ్వరికి హీరోయిన్గా తొలి చిత్రమిది. ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తమిళం, హిందీలో తీశారు. ఇప్పటికీ కురబలకోట రైల్వే స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా పిలుస్తుంటారు. కె.విశ్వనా«థ్ మృతితో మండల వాసులు సీతామాలక్ష్మి సినిమా షూటింగ్ నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. మదనపల్లె అంటే విశ్వనాథుడికి ఎంతో ఇష్టం మదనపల్లె సిటీ : కళాతపస్వి, సినీ దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌కు మదనపల్లె అంటే ఎంతో ఇష్టం. ఆయన తన సన్నిహితులతో తరచూ చెప్పేవారు. భరతముని ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రొమ్మాల మునికృష్ణారెడ్డికి విశ్వనాథ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో 1990 ఏప్రిల్ 1న మదనపల్లెకు ఓ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చారు. సిరిమువ్వల సింహనాదం సినిమా కథనాయకులు కళాకృష్ణ, మా«ధవిలతో కలిసి విచ్చేశారు. పిల్లలకు సామాజిక విలువల గురించి తెలియజేశారు. రెండు రోజుల పాటు మదనపల్లెలోనే బస చేశారు. విశ్వనాథ్‌తో తనకున్న పరిచయం గురించి చైతన్యభారతి పాఠశాల కరస్పాండెంట్ సంపత్‌కుమార్ తెలియజేశారు. పలు సార్లు విశ్వనాథ్‌ను కలిసినట్లు తెలిపారు. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సీతామలక్ష్మి సినిమా చిత్రీకరణ కోసం దర్శకులు విశ్వనాథ్ కురబలకోట మండలం తెట్టు గ్రామానికి వచ్చినట్లు మదనపల్లెకు చెందిన జ్ఞానోదయ పాఠశాల కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు తెలిపారు. తమ ఇంటిలోనే బస చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. -
సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయారు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గురువారం(ఫిబ్రవరి 2న) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తన సినిమాల గురించి ఈ కళాతపస్వి వివిధ సందర్భాల్లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లోని కొన్ని పదనిసలు ఈ విధంగా... సినిమా టైటిల్స్‌లో ‘ఎస్’ సెంటిమెంట్ ఎందుకు? విశ్వనాథ్: సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా... భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్’తో పెట్టిన రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. మరి ‘ఆపద్బాంధవుడు’ దగ్గర ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నారు? బాగా గుర్తు... ఓరోజు ‘ఏ టైటిల్ అయితే బావుంటుంది ఈ సినిమాకు?’ అనుకుంటుండగా... క్యారెక్టర్‌కి తగ్గట్టుగా అయితే ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ ఓకే అన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్’ సెంటిమెంట్ మైండ్ నుంచీ స్లిప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మీరు పాటలు కూడా రాసేవారట... సందర్భం వచ్చింది కాబట్టి చెబితే తప్పులేదేమో! నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే సిట్యుయేషన్‌కి తగ్గ పాట-లిరిక్ రాసుకుంటాను. దానికి నేను ‘అబద్ధపు సాహిత్యం’ అని పేరుపెట్టాను. అలా ఫ్లోలో రాసి, తర్వాత సినిమాలో ఉంచేసిన పల్లవులెన్నో – ‘స్వాతిముత్యం’లో ‘వటపత్రసాయికి...’, ‘శ్రుతిలయలు’లో ‘తెలవారదేమో స్వామీ...’, ‘స్వాతికిరణం’లో ‘తెలిమంచు కరిగింది...’ – అలా... చాలానే ఉన్నాయి. మరి పాటంతా మీరే రాయొచ్చుగా? కొన్ని రాశాను... ‘స్వరాభిషేకం’లో ‘కుడి కన్ను అదిరెను...’ పాట పూర్తిగా నేనే రాశాను. అయితే పేరు వేసుకోలేదు. రాసింది చెప్పుకోవడంలో తప్పేముందండీ ఏమో, చెప్తే నమ్ముతారో లేదో జనాలు! మిమ్మల్ని నమ్మకపోవడమా! అలా అని కాదు... నాకసలు పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇష్టం ఉండదు. (నవ్వుతూ) ఏదోపెళ్ళిచూపులకెళ్తే ‘ఆయన పెట్టుకున్న ఉంగరం కూడా నాదే!’ అని ఎవరో అన్నట్టు... ‘ఫలానా సినిమాలో ఫలానా పాటకు పల్లవి నేనే రాశాను’ అని ఏం చెప్పుకుంటాను చెప్పండి? మీ కుటుంబం నుంచి ఎవ్వరూ సినిమా ఫీల్డ్కి రాకపోవడానికి కారణం? నేనే ప్రోత్సహించలేదు. వాళ్లు ఇక్కడ రాణిస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ రోజుల్లో పైకి రావడమంటే చాలా కష్టం. మా రోజులు వేరు. ప్రతిభను గుర్తించే మనుషులు అప్పుడు చాలామంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ, పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను. విశ్వనాథ్ వారసులుగానైనా ఓ గుర్తింపు వచ్చేదేమో? నా గౌరవ మర్యాదలన్నీ నా బిడ్డలకు ట్రాన్స్ఫర్ కావాలనే రూలేమీ లేదిక్కడ. ఎవరికి వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. నాలాగా మా పిల్లల్ని కూడా డైరెక్టర్లు చేయాలనుకుని నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా. అంత డబ్బు కూడా నేను సంపాదించలేదు. మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని నేను గర్వంగానే చెప్పుకోగలను. మ్యారేజ్ డే లాంటివి జరుపుకుంటారా? భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పర నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికులదినం, వైవాహిక దినం – అని ఏడాదికి ఒకరోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు. ఒక్కోసారి భోజనం కూడా మరచిపోయేవారట కదా? సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కొక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే – అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందని ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్నివెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది... నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపుజ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టినవారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు. అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్ ఆర్ట్ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు (దాదా ఫాల్కే వచ్చిన సందర్భంగా..) వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా! -
ఒంగోలును తాకిన ‘స్వాతి కిరణం’
పాపం పుణ్యం తెలియని ఓ అమాయకుడు నాటి మూఢ నమ్మకాలకు బలవుతున్న ఓ వితంతువు మెడలో తాళి కడతాడు. అదీ సీతారాముల కల్యాణోత్సవంలో, రాముల వారు కట్టాల్సిన తాళిని. ఈ ఒక్క సీన్ స్వాతిముత్యం కథలోని ఆత్మని ఘాడంగా ఎలివేట్ చేస్తుంది.. తాను సంగీత సామ్రాట్‌ని అని విర్రవీగే గురువు ఆత్మాభిమానాన్ని గౌరవించేందుకు పదేళ్ల బాలుడు ఆత్మత్యాగం చేస్తాడు. ఇది స్వాతికిరణం అనే మహాకావ్యంలో పేద తల్లిదండ్రులు.. గురువు భార్య పడే ఆవేదన ప్రేక్షకుల గుండెల్ని పిండి చేసి.. కన్నీటి ధారలు కారుస్తుంది.. ఒకటా రెండా ఇలాంటి సున్నితమైన అంశాలతో కళాఖండాలు సృష్టించిన కళా తపస్వి భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మెరుస్తూనే ఉంటారు. సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు ఒంగోలుతో ఎనిలేని బంధం ఉంది. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణకంకణ సన్మాన కార్యక్రమంలో.. ( ఫైల్) ఒంగోలు టౌన్: తెలుగు సినీ రుచిని ప్రపంచానికి చూపించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతితో ఒంగోలులోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. అయితే ఆ మహా రుషి ఒంగోలులో పర్యటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నలభై సంత్సరాల క్రితం 1980 ఫిబ్రవరి 2న ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన రోజునే ఆయన నిష్కృమించడం కాకతాళీయం. శ్రీనళిని ప్రియ నృత్య నికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మహా దర్శకుడు ( ఫైల్) కాగా నాడు శంకరాభరణం సినిమా విడుదలైన సందర్భంగా నటీనటులతో కలిసి విశ్వనాథ్ తొలిసారిగా ఒంగోలు వచ్చారు. పాతికేళ్ల తరువాత 2015 జూలై 4న ఒంగోలులోని శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు హోటల్ సరోవర్‌లో వసతి సౌకర్యం కలి్పంచారు. కానీ ఎంతో నిష్టగా ఉండే ఆయన హోటల్ భోజనం తినేందుకు ఇష్టపడలేదు. అన్నవరప్పాడులోని పోతురాజు కాలనీలో నివాసం ఉండే నృత్య కళాశాల నిర్వాహకురాలు యస్వీ శివకుమారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. మరుసటి రోజు గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున రెండో రోజు కూడా ఆయన ఒంగోలులోనే గడిపారు. విశ్వనాథ్ అంతటి విఖ్యాత దర్శకుడు తమ ఇంటికి రావడం అదృష్టం అని, ఆయన మృతిని జీరి్ణంచుకోలేక పోతున్నామని శివకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని కళాపరిషత్ నిర్వాహకులు కల్లంగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలుకు వచ్చారు. ఆ సందర్భంగా నగరంలోని ముంగమూరు రోడ్డులో గూడ రామ్మోహన్ నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరా వేద పాఠశాలను సందర్శించారు. అక్కడి వేద విద్యార్థులతో వేదాలు, బ్రాహ్మణత్వం గురించి చర్చించారు. వేద విద్యార్థులకు వ్రస్తాలను బహూకరించారు. బ్రాహ్మణుడినై పుట్టి వేద విద్యను అభ్యసించలేక పోయాను అంటూ పండితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒంగోలులోని కళాకారులతో, సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. ‘రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న మహాకవి గుర్రం జాషువ వాక్యాలు విశ్వనాథ్ విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. ఒంగోలు ముంగమూరు రోడ్డులోని డాక్టర్ దారా రామయ్య శా్రస్తికి విశ్వనాథ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన కూతురు, చిత్రకారిణి సి.హెచ్.శ్రీలక్ష్మి చెప్పారు. తాను గీసిన కృష్ణం వందే జగద్గురు చిత్రానికి వచ్చిన మిరాకిల్ బుక్ ఆఫ్ ఇండియా అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డులను విశ్వనాథ్ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పారు. సంప్రదాయ సంకెళ్లు తెంచిన విశ్వనాథుడు ఒంగోలు టౌన్: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి రంగభూమి కళాకారుల సంఘం ఘనంగా నివాళి అరి్పంచింది. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళరి్పంచారు. సామాజిక సందేశంతో నిర్మించిన ఆయన సినిమాలు తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని పడమటి గాలి ఫేం పాటిబండ్ల ఆనందరావు అన్నారు. సంప్రదాయ సంకెళ్లను తెంచిన సాంస్కృతిక విప్లవకారుడు విశ్వనాథ్ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన కవులు, కళాకారులు ప్రసాద్, ఏ.ప్రసాద్, వాకా సంజీవరెడ్డి, గుర్రం కృష్ణ, తాళ్లూరి శ్రీదేవి, చల్లా నాగేశ్వరమ్మ, నల్లమల్లి పాండురంగనాథం, ఎస్కే బాబు, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కె.రాఘవులు తదితరులు విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్ఫూర్తినిచ్చిన విశ్వనాథ్ సినిమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశ్వనాథ్ సినిమాలను చూస్తూ పెరిగా. మానవ సంబంధాలు, నైతిక పునాదులపై ఆయన సినిమాలు చర్చించేవి. సమాజం పట్ల బాధ్యతను తెలిపే ఆ సినిమాల ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఒంగోలులో నృత్య కళాశాలను ఏర్పాటు చేశా. ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నా. మా కళాశాల ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ఒంగోలుకు రావడం, తండ్రిలా మా ఇంటికి భోజనం చేయడం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయన మరణం కళాకారులకు తీరని లోటు. – యస్వీ శివకుమారి, శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్, ఒంగోలు మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా సినిమాలు చూస్తే పిల్లలు పాడైపోతారని పెద్దలు మందలించే వారు. అలాంటి పరిస్థితి నుంచి స్వయంగా పెద్దలే తమ పిల్లలను విశ్వనాథ్ సినిమాలు చూడమని ప్రోత్సాహించేలా ఆయన కళాఖండాలు రూపొందించారు. విశ్వనాథ్ మృతి తెలుగు సినిమా రంగానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని లోటు. ఆయన వారసత్యాన్ని కొనసాగించే దర్శకులు నేడు ఒక్కరు కూడా కనిపించకపోవడం విచారకరం. – కల్లకుంట కృష్ణయ్య, అక్కినేని కళాపరిషత్, ఒంగోలు -
దిగ్దర్శకుడు విశ్వనాథ్
‘బలమైన కళ మన ఆత్మగత సుగుణాలను శక్తిమంతంగా, విజయవంతంగా తట్టిలేపుతుంది. ఈ ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం మేధ అయితే... కళ దాని ఆత్మ’ అంటాడు విశ్వవిఖ్యాత రచయిత మక్సీమ్ గోర్కీ. అయిదున్నర దశాబ్దాలపైగా తన సృజనాత్మక శక్తితో వెండితెరపై అనేకానేక విలక్షణ దృశ్య కావ్యాలను సృష్టించి, ప్రేమ కలోకాన్ని మంత్రముగ్థుల్నిచేసి వారిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రేరేపించిన కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ సినిమాను అక్షరాలా సమాజాన్ని ప్రభావితం చేయగల కళారూపంగా భావించారు. కనుకే అన్ని ఉత్తమ చిత్రాలు అందించగలిగారు. ఆ చిత్రాలన్నీ దివికేగిన ఆ మహనీయుణ్ణి అజరామరం చేసేవే. చలనచిత్ర చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని చ్చేవే. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు వాహినీ సంస్థలో పనిచేస్తున్న తన తండ్రి ప్రభావంతో చలనచిత్ర రంగంవైపు దృష్టి సారించకుంటే వెండితెరపై తెలుగువారు ఎప్పటికీ గర్వించదగ్గ ఆణిముత్యాలు ఆవిష్కృతమయ్యేవి కాదు. వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తూనే తన నిశిత పరిశీలనతో స్క్రీన్‌ప్లే రచనలో మెలకువలు గ్రహించి అంచెలంచెలుగా ఎదిగి దర్శకత్వం వహించే స్థాయికి చేరుకున్న సృజనకారుడు విశ్వనాథ్. ‘మాలపిల్ల, మల్లీశ్వరి, మాయాబజార్’ వంటి చిత్రాలు దర్శకులకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చి వారిని ఉన్నత శిఖరాల్లో నిలిపితే మళ్లీ శంకరాభరణం చిత్రంతో విశ్వనాథ్‌కు అంతటి గౌరవం దక్కింది. శంకరాభరణం చిత్రానికి ముందు...ఆ మాటకొస్తే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం మొదలుకొని ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న చిత్రాలన్నీ ప్రశంసలందుకున్నవే. కాక పోతే శంకరాభరణం ఆయన ఆత్మ. తెలుగు చలనచిత్ర చరిత్రంటే శంకరాభరణం చిత్రానికి ముందూ, తర్వాతా అని అందరూ అనుకుంటున్నారంటే దాని వెనకున్న ఆయన కృషి అసామాన్య మైనది. ఒక సంగీత విద్వాంసుణ్ణి ప్రధానపాత్రగా మలిచిన శంకరాభరణం చిత్రం ఆయన నిర్మించుకున్న బలమైన దుర్గం. అనంతరకాలంలో దాన్ని దాటి ఆయన బయటకు రాలేకపోయారన్న విమర్శలు లేకపోలేదు. అయితే అవన్నీ కథాపరంగా వేటికవే విలక్షణమైనవి. వాటిలో అంతర్లీనంగా ఉండేసందేశాలూ భిన్నమైనవి. ఏ కులవృత్తయినా గౌరవప్రదమైనదని, దాని ముందు ఎంతటి సిరి సంపదలైనా వెలవెలబోతాయని చాటే ‘స్వయంకృషి’, ఎంతో ఎత్తు ఎదగటానికి ఆస్కారమున్న నృత్య కళాకారుడు జీవితంలో ఓడిపోయిన వైనాన్ని చూపే ‘సాగరసంగమం’, పెళ్లంటే ప్రేమంటే తెలియని అమాయక యువకుడికి నిస్సహాయ యువతితో ముడివేసిన ‘స్వాతిముత్యం’, కులాల అంతరాలను పెంచిపోషించే ఆచారాలను ప్రశ్నించే గుణమే అన్నిటికన్నా ప్రధానమైనదని చాటి చెప్పే ‘సప్తపది’, ఎంత ఎత్తుకు ఎదిగినా శిష్యుణ్ణి చూసి అసూయపడి, అతని ప్రాణాన్నే బలిగొన్న గురువు వైనాన్ని చూపిన ‘స్వాతికిరణం’... ఇలా ఎన్నెన్నో విలక్షణ చిత్రాలు ఆయనవి. ఏ తరాన్నయినా ప్రభావితం చేయగల, స్ఫూర్తినింపగల కథనాలతో విశ్వనాథ్ చిత్రాలు నిర్మించటం యాదృచ్ఛికం కాదు. సినిమా ఎంత పదునైన ఆయుధమో గ్రహించి, దాన్ని చాలా బాధ్యతా యుతంగా ఉపయోగించాలని తొలినాళ్లలోనే గ్రహించాడాయన. ‘సమాజానికి మంచి చేయక పోయినా ఫర్వాలేదు...చెడు చేయకుండా జాగ్రత్త వహించటం నా కర్తవ్యమని భావిస్తాను’ అని ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ చెప్పిన వైనాన్ని గుర్తించుకుంటే ఆయన ఔన్నత్యం అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోసహా ఎన్నో పురస్కారాలు లభించాయి. ఎన్టీఆర్, అక్కినేని మొదలుకొని కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ వరకూ ఎందరో హీరోలతో ఆయన సినిమాలు రూపుదిద్దుకున్నాయి. వీరిలో అత్యధికులకు అప్పటికే ఉన్న ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలిచ్చి, వారి అభిమానులతో సైతం ప్రశంసలు పొందటం సామాన్యమైన విషయం కాదు. అదే సమయంలో అంతక్రితం ఎవరికీ పరిచయం లేని సోమయాజులు వంటివారిని సైతం ప్రధాన పాత్రల్లో నటింపజేసి వారికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. ఆరోజుల్లో ఎక్కడికెళ్లినా సోమయాజులుకు పాదాభివందనాలు ఎదురయ్యేవంటే శంకరశాస్త్రి పాత్ర ప్రజల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందో తెలుస్తుంది. ఆయన నిర్మించిన చిత్రాలకు పనిచేసిన నటీనటులైనా, గీత రచయిత లైనా ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారంటే... తదనంతరం ఆ చిత్రాల పేర్లే వారి ఇంటిపేర్లుగా మారి పోయాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి, శుభలేఖ సుధాకర్, శంకరాభరణం రాజ్యలక్ష్మి తదితరులు ఇందుకు ఉదాహరణలు. ఇక నటుడు సోమయాజులకైతే శంకరాభరణంలోని శంకరశాస్త్రి పాత్ర పేరే అసలు పేరుగా స్థిరపడిపోయింది. సంగీత, సాహిత్యాలకు పెద్ద పీట వేసే నైజం కనుకే విశ్వనాథ్ చిత్రాల ద్వారా వేటూరి, సీతారామశాస్త్రి వంటి అపురూపమైన గీత రచయితలు పరిచయ మయ్యారు. సుదీర్ఘకాలంపాటు చిత్ర పరిశ్రమలో దిగ్గజాలుగా వెలుగులీనారు. జాతీయ స్థాయిలో తెలుగువారికి తొలిసారి ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలంతోపాటు మరో 3 అవార్డులు కట్టబెట్టిన చిత్రం శంకరాభరణం. ఇక ఆస్కార్‌కు భారత అధికారిక నామినేషన్‌గా వెళ్లిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం. 93 ఏళ్ల వయసులో కన్నుమూసే ముందురోజు కూడా ఆయన ఓ పాటను కుటుంబ సభ్యులకు చెప్పి రాయించారని విన్నప్పుడు విశ్వనాథ్ గొప్పతనం అర్థమవుతుంది. నిరంతర అధ్య యనం, నిశిత పరిశీలన ఉన్నవారి మెదడు ఎప్పటికీ సారవంతమైనదే. వారు ఎప్పటికీ సృజన కారులే. నిత్య యవ్వనులే. చిరంజీవులే. ఆయన స్మృతికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది. -
సినిమాకు ఆభరణం: శ్రుతి లయలే జననీ జనకులు కాగా
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయాడు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించాడు. తెలుగు ముగ్గు తెలుగు సిగ్గు తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలిసిన తెలుగింటి వనితలు అతను లేక మరి తెరపైకి రారు. ఒక కీర్తన, తిల్లాన, జావళి, జానపదం గుండె ఝల్లుమనేలా గజ్జె ఘల్లుమనిపించడం మళ్లీ చూడగలమా అతడు చూపినట్టుగా! ఆకలేసినవాడు అమ్మా అని ఎలా అంటాడో దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఎలా అంటాడో తెలియడం చేతనే భావాల లోతును మనసుకు తాకించాడు. నరుడి బతుకు నటనే కావచ్చు. కాని అతణ్ణి తీసుకెళ్లిపోవాలనే ఈశ్వరుడి ఘటన మాత్రం రస హృదయుడైన తెలుగు ప్రేక్షకుడికి బాధాకరం. క్లేశమయం. ► టికెట్లకూ సంతకానికీ లింకు మద్రాసులో ఒక గవర్నమెంట్ ఆఫీసు. ఎవరిదో ఫైల్‌ను ఎవరో ఆఫీసరు సంతకం పెట్టాలి. ఎంతకీ పెట్టడు. ‘ఎంత కావాలో చెప్పమనండీ’ అన్నాడు బాధితుడు. ప్యూన్ పక్కకు తీసుకెళ్లి చెప్పాడు ‘ఆయన డబ్బు తీసుకోడు. స్ట్రిక్టు. శంకరాభరణం టికెట్లు సంపాదించి ఇవ్వగలిగితే ఇవ్వు. పనైపోతుంది’ అప్పటికి నాలుగు వారాలుగా శంకరాభరణం మద్రాసులో తండోపతండాల జనంతో కిటకిటలాడుతోంది. ఆ టికెట్లు దొరికేవి కావు. ఆ ఫైల్ సంతకం జరిగేదీ లేదు. ► చంద్రమోహన్‌కు ఆ ప్రాప్తం లేదు ప్రాప్తం కూడా ఒక మంచిమాటే. శంకరాభరణంలో నటించినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు నటుడు చంద్రమోహన్ కు 50 వేలు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమా బిజినెస్ అయితే ఇస్తాడు. బిజినెస్ కాదు. షోల మీద షోలు పడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు. బాగుంది అంటున్నారు. ఎవరూ కొనడం లేదు. ఈ సినిమా రిలీజైతే తప్ప గడ్డం తీయను అని కె.విశ్వనాథ్ గడ్డం పెంచుతున్నాడు. గడ్డం పెరుగుతున్నది తప్ప సినిమా రిలీజ్ కావడం లేదు. ఈలోపు ఏడిదకు ఒక ఆలోచన వచ్చింది. చంద్రమోహన్ ను పిలిచి ‘నీ రెమ్యూనరేషన్ బదులు తమిళనాడు రైట్స్ ఇస్తాను తీసుకో’ అన్నాడు. చంద్రమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘రిలీజ్ కాని సినిమా నాకు అంటగడతావా. నా డబ్బు నాకు ఇవ్వు’ అన్నాడు. కొన్ని రోజులకు తమిళ నటి మనోరమ, తమిళనటుడు సౌందరరాజన్ తో శంకరాభరణం ప్రివ్యూ చూసింది. సినిమా అయ్యాక ఉద్వేగంతో విశ్వనాథ్ కాళ్ల మీద పడబోయింది. ‘ఈ సినిమా ఒక్కరు చూడకపోయినా పర్వాలేదు. నేను కొంటాను’ అంది. కొన్నది. చంద్రమోహన్ కు ప్రాప్తం లేదు. ► తపస్సు అలా మొదలైంది 1955లో సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ తీశాడు. భారతదేశంలో పార్లల్ సినిమాకు అంకురార్పణ చేశాడు. సత్యజిత్ రేకు గొప్ప పేరు, ఖ్యాతి దక్కాయి. కాని అది బెంగాలి వాళ్లకు చెల్లింది. హిందీలో కాని, సౌత్‌లో కాని సినిమా వ్యాపార కళ. వ్యాపారం ఎక్కువ, కళ తక్కువ అనుకునే సినిమాలు తీశారు. వినోదం చూపి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఆలోచన, అనుభూతి కృత్రిమ స్థాయి వరకే అంగీకారం. వాస్తవిక వాదంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల సత్యజిత్ రే వేసిన అడుగు పదేళ్ల పాటు బెంగాల్ దాటలేదు. కాని 1973లో ఎం.ఎస్.సత్యు తీసిన ‘గరం హవా’ వచ్చింది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాకు జేజేలు పలికారు. శ్యాం బెనగళ్ ఆ మరుసటి సంవత్సరమే ‘అంకుర్’ తీశాడు. ఇంకోవైపు తమిళంలో కె.బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు మిడిల్ క్లాస్ డ్రామాను గట్టిగా పట్టుకున్నారు. 1976లో బాలచందర్ ‘అంతులేని కథ’ వచ్చింది. అదే సంవత్సరం దాసరి ‘ఓ మనిషి తిరిగి చూడు’ లాంటి ప్రయోగాత్మక సినిమా తీశారు. అంత వరకు ‘శారద’, ‘జీవన జ్యోతి’ వంటి స్త్రీ కథాంశాలపై దృష్టి పెట్టిన కె.విశ్వనాథ్ అంతకు కాస్త అటు ఇటుగా దారి వెతుక్కునే క్రమంలో పడ్డారు. అదే సమయంలో దేశ సంస్కృతిలో వస్తున్న మార్పును చూసి మొత్తుకునే దర్శకులు కూడా వచ్చారు. 1971 లో దేవ్ ఆనంద్ హిప్పీల వేలంవెర్రిని ‘హరే రామా హరే కృష్ణ’గా తీశాడు. తెలుగునాట చూస్తే వర్తమానంలో సాంస్కృతిక అకాడెమీలు నామ్ కే వాస్తేగా మారాయి. తెలుగువాడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ మద్రాసులో అస్థిత్వం పొందాల్సి వచ్చింది. వీటన్నింటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం కె.విశ్వనాథ్ మీద ఉంది. 1976 నాటికి తీసిన ‘సిరి సిరి మువ్వ’ ఆయనకు దారి చూపింది. 1980లో తీసిన ‘శంకరాభరణం’ ఏ పునాది మీద తాను సినిమా తీయాలో, ఏ సంస్కృతి పట్ల తనకు అనురక్తి ఉందో, ఏ ప్రాభవాల కోసం తన గుండె కొట్టుకులాడుతుందో ఆయన తెలుసుకున్నారు. ఇంతవరకూ చేసింది సినిమా రూపకల్పన. ఇక మీదట చేయాల్సింది తపస్సు. ► ఆ ముగ్గుర్ని నమ్ముకునే... ‘శంకరాభరణం’ ముహూర్తం రోజున కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తిలను పిలిచి కొత్త బట్టలు పెట్టి ‘మిమ్మల్ని నమ్ముకునే ఈ సినిమా తీస్తున్నాను’ అన్నాడు విశ్వనాథ్. నిజమే. అంతకు మించి నమ్ముకోవడానికి సినిమాలో హీరో లేడు. హీరోయినూ లేదు. శంకరశాస్త్రి పాత్రను వేస్తున్నది నాటకాలు వేసుకునే గవర్నమెంట్ ఆఫీసరు జె.వి.సోమయాజులు. తులసి పాత్రను వేస్తున్నది వేంప్‌గా ముద్రపడిన మంజుభార్గవి. చంద్రమోహన్ ది సపోర్టింగ్ రోల్. ఎవరిని చూసి ఈ సినిమా కొనాలి? ఎవరిని చూసి ఈ సినిమా ఆడాలి? పై ముగ్గురినే. కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తి... వీరు విశ్వనాథ్ అంచనాని వమ్ము చేయలేదు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని వేటూరి రాస్తే రిక్షా లాగే కార్మికుడు కూడా శాస్త్రీయ సంగీతం ఆస్వాదించేలా కె.వి.మహదేవన్, పుహళేంది పాటలు చేశారు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే శాస్త్రీయ సంగీతం తెలిసిన ఏ మంగళంపల్లో కావాలి. కాని స..ప..స..లు నేర్వలేదని చెప్పుకునే బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. భారతీయ కళలు మరపున పడవచ్చు, మసి బారవచ్చు కాని వాటి తేజస్సు జాజ్వల్యమైనది... వాటి ఆధారంగా ఏర్పడిన పరంపరలు, వ్యక్తిత్వాలు, అహంభావాలు ఎవరికీ తల వంచనివి.. ఎవరు ఏం చేసినా అవి ఒక తరం నుంచి మరో తరానికి ఏదో ఒక మూల కొనసాగుతూనే ఉంటాయి... అని ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్ చెప్పారు. మరి జనం చూస్తారా? ► మొదట ఖాళీ... ఆ తర్వాత కిటకిట 1980 ఫిబ్రవరి 2. అతి కష్టమ్మీద అతి కొద్ది థియేటర్లలో ‘శంకరాభరణం’ రిలీజ్ అయ్యింది. నేల, బెంచి, కుర్చీ... ఖాళీ. ఒక దిక్కూ మొక్కూ లేని అమ్మాయి కోసం ఒక మహా విద్వాంసుడు నిలబడ్డాడు. అయినవారు అతణ్ణి వెలి వేశారు. ఈ కథేదో కొత్తగా ఉందే అనుకున్నారు కొందరు. కాలగమనంలో చితికిపోయిన ఒక గొప్ప కళాకారుడు తన అభిజాత్యం కోల్పోకుండా పోరాడుతున్నాడే... ఇదీ బాగుందనుకున్నారు మరి కొందరు. ‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’ శివుని ఎదుట నర్తిస్తున్న ఈ నిష్కళంకుడు ఇంతకు ముందు ఏ కథలోనూ కనిపించలేదే. మొదట కుర్చీ నిండింది. తర్వాత బెంచీ నిండింది. తర్వాత నేల కిటకిటలాడింది. ఆ తర్వాతదంతా చరిత్ర. ‘ఎంటర్ ది డ్రాగన్ ’ వచ్చి దేశంలో కరాటే స్కూల్స్ తెరిచింది. ‘శంకరాభరణం’ వచ్చి తెలుగునాట సంగీత పాఠాలను, నృత్యపాఠశాలలను పునరుద్ధరించింది. ► దొరకునా ఇటువంటి సేవ! ‘శంకరాభరణం’లో శంకరాభరణ రాగమే లేదు అని విమర్శించాడు మంగళంపల్లి. కె.విశ్వనాథ్ భావధార పట్ల ఇలాంటివే కొన్ని అభ్యంతరాలు కొందరికి ఉండవచ్చు. కాని సినిమాను ఒక కళగా, దృశ్య శ్రవణ మాధ్యమంగా, రసస్పందన కలిగించే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు చూపినవాడు కె.విశ్వనాథ్. సినిమాను తపస్సుగా భావించాడు. నిర్వాణ సోపానంగా కూడా. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రాల్లో కొన్ని టైటిల్స్‌తో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఈ విధంగా... శంకరాభరణం శంకరుడు అంటే శివుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వనాథ్ సినిమాల్లో దాదాపు శివుడి మీద ఏదో ఒక పాట ఉంటుంది. మరి.. విశ్వ నాథుడు శివభక్తుడా? అంటే... ఆయనకు దైవభక్తి ఎక్కువే. ఏదో ఒక పవర్ ఉంటుందనే నమ్మకం ఆయనది. విశ్వనాథ్ సినిమాల్లోకి వచ్చాక శివుడి పాట ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగినదే. అనుకోకుండా ఆ సినిమాలో శివుడికి సంబంధించిన పదమో, సందర్భమో రావడం అనేది భగవదేచ్ఛ అని, కావాలని ప్రయత్నించినది కాదని విశ్వనాథ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అంతెందుకు ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రిని విశ్వనాథ్ అడిగారు. దేవులపల్లి ఏమో ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతాగంగమ్మ వాన’ అని రాశారు. విశ్వనాథ్ ‘శ్రీ’తో రాయమని అడిగారే తప్ప శివుడి మీద రాయమని అడగలేదు. అయినా శివుడి మీద పాట వచ్చేసింది. ఇక చిన్నప్పుడు శివాలయానికి వెళ్లేవారు విశ్వనాథ్. ఆ సమయంలో ఒక వ్యక్తి మాస్కు వేసుకుని జడిపిస్తే, మూడు రోజులు జ్వరంతో పడుకున్నారు. అలా తెలిసీ తెలియని వయసు నుంచీ సినిమాల్లోకి వచ్చాక, ఆ తర్వాత కూడా విశ్వనాథ్ జీవితంలో శివుడు ఉన్నాడని అర్థమవుతోంది. అమ్మ మనసు తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. విశ్వనాథ్‌ది కూడా సేమ్ ఫీలింగ్. ఇష్ట దైవం ఎవరంటే తన తల్లిదండ్రుల గురించి చెప్పేవారు. అమ్మానాన్నలు చేసిన పుణ్యం, పూజలే ఫలించాయని, కాపాడాయన్నది విశ్వనాథ్ నమ్మకం. కళాతపస్వి తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకు జ్యోతిష్యం బాగా వచ్చు. అయితే కొడుకు తీసిన ఏ సినిమాకీ ముహూర్తం పెట్టలేదాయన. సినిమా అనేది ఊహకందని వ్యాపారం కాబట్టి తానో ముహూర్తం పెట్టించి, సినిమా ఆడకపోతే ‘ఆయన అనవసరంగా చెప్పారు’ అంటారనే మాట అనిపించుకోవడం ఇష్టంలేక కొడుకు సినిమాలకు ముహూర్తం పెట్టలేదు. స్వతహాగా మితభాషి అయిన సుబ్రహ్మణ్యం తనయుడి విజయాలకు లోలోపల ఆనందించేవారు. తన పుస్తకాల్లో ‘శంకరాభరణం ఈరోజున ఈ నక్షత్రం, ఈ ఘడియల్లో రష్ చూశాను. దీనికి ఈ యోగం ఉంది’ అని రాసుకున్నారు. ఇలా తనయుడి సినిమాల గురించి రాసుకున్నారు. ఇక విశ్వనాథ్ తల్లి సరస్వతి అయితే తనయుడి విజయాలను ఆస్వాదించేవారు. సాధారణంగా కోడలు ఇంటికొచ్చాక ఇంటి పరిస్థితి కాస్త మారుతుంది. అయితే కొడుకు మనసు ఎరిగిన తల్లిగా సరస్వతి కోడలిని బాగా చూసుకున్నారు. చెల్లెలి కాపురం విశ్వనాథ్‌కి ఇద్దరు చెల్లెళ్లు. పెళ్లయి, చెన్నై వడపళనికి మకాం మార్చినప్పుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను కూడా తీసుకెళ్లారు విశ్వనాథ్. ఆ చెల్లెళ్లు తమకు పెళ్లయ్యేంతవరకూ అన్నా వదిన దగ్గరే ఉన్నారు. తోడబుట్టినవాళ్లను అత్తగారింటికి పంపించాక కూడా వారి బాగోగులను చూసుకున్నారు. వాళ్ల శ్రీమంతాలు, కాన్పులు కూడా చెన్నైలోనే. సోదరుడు తండ్రితో సమానం అంటారు. విశ్వనాథ్ తన చెల్లెళ్లకు ఒక తండ్రిలానే ఉన్నారు. అయితే ఆయన సతీమణి జయలక్ష్మి సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. విశ్వనాథ్ తన సినిమాలతో తీరిక లేకుండా ఉంటే.. ఆడపడుచులను చూసుకున్నారు జయలక్ష్మి. అలాగే చెల్లెళ్లనే కాదు.. తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను కూడా బాగా చూసుకున్నారు విశ్వనాథ్. చివరికి వాళ్ల పిల్లలు కూడా వీళ్ల ఇంట్లోనే ఉండి, చదువుకోవడం విశేషం. స్వాతిముత్యం ‘స్వాతిముత్యం’లో శివయ్య (కమల్‌హాసన్ పాత్ర పేరు) అమాయకుడు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడు. మరి.. చిన్నప్పుడు విశ్వనాథ్ ఎలా ఉండేవారు అంటే.. మహా అల్లరి. విజయవాడలో చదువుతుండగా కాలువ దాటి స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చేది. వీళ్ల ఇంటి ఎదురుగానే కాలువ ఉండేది. వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం నీళ్లే ఉండటంతో బ్రిడ్జి మీద నుంచి కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి, కాలువలోంచే నడుచుకుంటూ వెళ్లేవారు. అయితే ఇంట్లోవాళ్లకి చెబితే తిడతారని భయం. నిక్కర్లు పైకి మడుచుకుని కాలువలో దిగిన విశ్వనాథ్‌ని చూసిన ఆయన మేనమామ కూతురు ఇంట్లో విషయం చెప్పేసింది. అంతే.. విశ్వనాథ్ తండ్రి అక్కడికి వెళ్లి ‘రేయ్’ అని అరిచారు. ఆ భయానికి విశ్వనాథ్ చేసిన పనులన్నీ నీళ్లలోనే కలిసిపోయాయి (ఓ సందర్భంలో విశ్వనాథ్ నవ్వుతూ చెప్పిన విషయం). అంతే.. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిన కొడుకుని ‘రాస్కెల్’ అని, బట్టలు మార్చుకోమన్నారు విశ్వనాథ్ తండ్రి. ఇక ఆ తర్వాత ఆ కాలువ వైపు వెళ్లలేదు. అలాగే చిన్నప్పుడు తండ్రి మూడు చక్రాల సైకిలు కొనిపెడితే, దాన్నే మెర్సిడెస్ బెంజ్‌గా ఫీలయి, టింగుటింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ వెళ్లేవారు విశ్వనాథ్. స్వయంకృషి కె. విశ్వనాథ్‌ను ఇంజినీర్ చేయాలనుకున్నారు ఆయన తల్లిదండ్రులు. ఆయనకు మాత్రం సంగీతం పై మక్కువ ఎక్కువ. బీఎస్సీ పూర్తి చేశాక తండ్రి అనుమతితో చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరారు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువగా డబ్బింగ్ స్టూడియోలు ఉండేవి కావు. దీంతో లొకేషన్లోనే ఆర్టిస్టుల మాటలను రికార్డ్ చేయవలసి వచ్చేది. సంభాషణలు సరిగ్గా పలకడం తెలియని నటీనటులకు దగ్గరుండి డైలాగులు నేర్పించారు విశ్వనాథ్. ‘సౌండ్ రికార్డిస్ట్’గా నిజాయతీగా చేసిన పని ఆయన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఎదిగేలా చేసింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో చేసినప్పుడు విశ్వనాథ్ పని తీరు చాలామంది దృష్టిలో పడింది. అలా అక్కినేని నాగేశ్వరరావు ‘ఆత్మగౌరవం’తో దర్శకుణ్ణి చేశారు. అప్పట్నుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ వరకూ రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేసిన రోజులే ఎక్కువ. ఆయన స్వయంకృషియే విశ్వనాథ్‌ని తెలుగు పరిశ్రమ శిఖరాగ్రాన నిలిచేలా చేసింది. శుభప్రదం దాదాపు 75 సంవత్సరాలు సినిమాలే లోకంగా జీవించారు విశ్వనాథ్. ఇక కుటుంబానికి సమయం కేటాయించాలని దర్శకుడిగా సినిమాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ నటుడిగా మాత్రం చేశారు. సినిమాలు తగ్గించాక ఆయన లైఫ్‌స్టయిల్ ఎలా సాగిందంటే.. ఉదయాన్నే నిద్ర లేవడం.. అల్పాహారం, భార్యతో కబుర్లు చెప్పుకోవడం, గడిచిన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఓసారి స్ఫురణకు తెచ్చుకుని హ్యాపీగా ఫీలవ్వడం... ఇలానే విశ్వనాథ్ దినచర్య సాగుతుండేది. టీవీల్లో వచ్చే వంటల కార్యక్రమాలను చూసేందుకు ఇష్టపడేవారు విశ్వనాథ్. జయలక్ష్మికి ఏమో ప్రవచనాలు వినడం ఇష్టం. ఉదయం పదకొండు గంటలవరకూ ఆవిడ ఆ కార్యక్రమాలు చూసేవారు. ఆ తర్వాత రిమోట్ విశ్వనాథ్ చేతికి దక్కేది. ఇక అప్పుడు ఆయన వంటల ప్రోగ్రామ్స్ చూసేవారు. ఇలా కాలక్షేపం చేశారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు కాగా, చిన్న కుమారుడికి ఇద్దరు అమ్మాయిలు. ఆయన అల్లుడు, కుమార్తె చెన్నైలో ఉంటారు. వీరికి ఓ పాప. మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపారు విశ్వనాథ్. వయోభారం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఆయన పెద్దగా ఇబ్బంది పడిందిలేదు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘శుభప్రదం’. ఆయన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం కూడా సంపూర్ణం.. శుభప్రదమే. ప్రశాంతంగా వెళ్లిపోయారు కళాతపస్వి. శుభలేఖ పందొమ్మిదేళ్లకే విశ్వనాథ్‌కి పెళ్లయింది. రెండు పెళ్లి చూపులకు వెళ్లారు. ఒకటి ఆయన మేనమామ తెచ్చిన పెళ్లి సంబంధం. అప్పటికే చెన్నైలో ఉంటున్న విశ్వనాథ్ ఆ సంబంధం కోసం తెనాలి వెళ్లారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత రెండో పెళ్లి సంబంధం కోసం చెన్నై వెళ్లి, అక్కడ జయలక్ష్మిని చూశారాయన. ఆ సంబంధం ఖాయం అయింది. అప్పటికి జయలక్ష్మికి 14 సంవత్సరాలు. చిన్న వయసులో అత్తింట్లో అడుగుపెట్టిన జయలక్ష్మి ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఇద్దరు ఆడపడుచులు, అత్తమామలు, వచ్చే పోయే బంధువులతో జయలక్ష్మికి క్షణం తీరిక ఉండేది కాదు. పైగా విశ్వనాథ్ చేసినవి ఎక్కువగా రిస్కీ ప్రాజెక్ట్స్ కాబట్టి నిర్మాతల దగ్గర పారితోషికం ఇంత కావాలని డిమాండ్ చేయలేకపోయారు. పెద్ద స్థాయిలో పారితోషికం కూడా వచ్చేది కాదు. దీంతో దర్శకుడిగా మారిన పదేళ్ల తర్వాతే కారు కొనగలిగారు. అలాగే ఫలానా నగ బాగుందని భర్తతో జస్ట్ అనేవారు కానీ ఏనాడూ నాకిది కావాలని జయలక్ష్మి అడిగింది లేదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటుటారు. నా విజయం వెనక నా భార్య జయలక్ష్మి ఉంది. సినిమా పనులతో నేను బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నా తరఫు బంధువులందరూ నాకన్నా ఎక్కువగా తననే అభిమానిస్తుంటారు. అంత ఆప్యాయంగా జయలక్ష్మి వారిని చూసుకుంటుంది’ అని భార్య గొప్పతనం గురించి పలు సందర్భాల్లో చెప్పారు విశ్వనాథ్. భర్తని అర్థం చేసుకున్న జయలక్ష్మి, భార్యని అర్థం చేసుకున్న భర్తగా ఈ దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా సాగింది. బాలూ అలిగితే నటుడయ్యాడు కె.విశ్వనాథ్ ప్రాథమికంగా నటుడు. కాని దాసరిలాగా విశ్వనాథ్ తన సినిమాల్లో పాత్రలు చేయలేదు. బాలూ వల్ల చేయాల్సి వచ్చింది. ‘శుభ సంకల్పం’ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మాత. గొల్లపూడి, విశ్వనాథ్ కలిసి స్క్రిప్ట్ తయారు చేశారు. కమల హాసన్ హీరో. హీరోయిన్గా ఆమని. స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫలానా పాత్రకు ఫలానా అని రఫ్‌గా భావిస్తూ రాసుకున్నారు– ఒక్క రాయుడు పాత్రకు తప్ప. అది సినిమాలో కమలహాసన్‌కు యజమాని పాత్ర. సరే... స్క్రిప్ట్‌ను బాలూకు చదివి వినిపించే రోజు వచ్చింది. విశ్వనాథ్ స్వయంగా చదివి వినిపిస్తూ ఒక సన్నివేశంలో రాయుడు ఎలా ఆవేదన చెందుతాడో గాద్గదికంగా చదివి వినిపించారు. బాలూకు ఆ పాత్రలో విశ్వనాథే కనిపించారు. గొల్లపూడికి చెప్తే ఆయన కూడా వత్తాసు పలికాడు. అదే ప్రస్తావన విశ్వనాథ్ దగ్గర తెస్తే ‘నేనేమిటి... నటించడం ఏమిటి’ అని తిరస్కరించారు. నటించాల్సిందే అని బాలు పట్టుపట్టాడు. నటించను అని విశ్వనాథ్ గట్టిగా చెప్పేశారు. బాలు అలిగి స్క్రిప్ట్ ఫైల్ విసిరి కొట్టి అలా అయితే సినిమానే చేయను అని వెళ్లిపోయాడు. చివరకు విశ్వనాథ్ బాలు కోరికను మన్నించారు. ‘శుభ సంకల్పం’ విడుదల తర్వాత హఠాత్తుగా తెలుగు వెండితెరకు మరో కేరెక్టర్ ఆర్టిస్టు దొరికినట్టయ్యింది. -
Top News Headlines: ఇవ్వాళ్టి టాప్ హెడ్‌లైన్స్
► రైల్వే ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి రూ.12800 కోట్లు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ► ముగిసిన కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు, ఏపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ► జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ► రెండేళ్ల తరువాత అసెంబ్లీకి గవర్నర్ తమిళి సై, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం, వెంటే ఉన్న సీఎం కెసిఆర్ ► ఆదానీ గ్రూప్‌కు మరో షాక్, ఫిబ్రవరి 7 నుంచి న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ డోజోన్స్ నుంచి ఆదానీ ఎంటర్ప్రైస్ స్టాక్ ఔట్ ► ఆదానీ ఇష్యూతో అట్టుడికిన రాజ్యసభ, చర్చించాలని పట్టుబట్టిన విపక్షాలు ► గుజరాత్ అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీని ఎందుకు నిషేధించారో ఆధారాలతో సహా తెలపండి : కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ► కొలిజీయం ఇచ్చిన ఐదు పేర్లను త్వరలోనే పూర్తి చేసి సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తామని తెలిపిన కేంద్రం ► శారద కుంభకోణం: కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళినికి చెందిన రూ.6 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ ► మహారాష్ట్రలో బీజేపీకి షాక్, అమరావతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ అభ్యర్థి విజయం ► బీహార్: ప్రాచీన నలందా యూనివర్సిటీకి చెందిన 1200 ఏళ్ల నాటి విగ్రహాలను వెలికి తీసిన పురావస్తుశాఖ అధికారులు ► అమెరికాలో అనుమానస్పద బెలూన్ స్వాధీనం, నిఘా కోసం చైనా ప్రయోగించిందని అనుమానాలు ► పాక్‌లో 18 రోజులకే సరిపడా విదేశీ మారకపు నిల్వలు, రుణాల పునరుద్ధరణపై IMF మరీ కఠినంగా వ్యవహరిస్తోంది: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ► 2007 టీ20 వరల్డ్ కప్ టీంలో సభ్యుడు జోగిందర్ శర్మ క్రికెట్‌కు గుడ్‌బై, ప్రస్తుతం హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీగా బాధ్యతలు -
అర్ధరాత్రి లేచి మా గురించి ఆరా తీసేవారు: విశ్వనాథ్ పర్సనల్ బాయ్
కళాతపస్వి కె విశ్వనాథ్ గురువారం రాత్రి శివైక్యమయ్యారు. అభిమానులను పుట్టెడు దుఃఖంలో వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ పలువురు సెలబ్రిటీలు ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా విశ్వనాథ్ పర్సనల్ బాయ్ కిరణ్ కుమార్ దర్శకుడి గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'రెండు సంవత్సరాలుగా విశ్వనాథ్ సార్ దగ్గర పని చేస్తున్నా. ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. మాకు ఒంట్లో బాగోలేకపోయినా వెంటనే మెడికల్ షాప్ నుంచి మెడిసిన్ తెప్పిస్తారు. అర్ధరాత్రిళ్లు లేచి మరీ ఎలా ఉందని అడుగుతారు. అందరితో చాలా చనువుగా ఉంటారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడానికే ప్రాముఖ్యతనిస్తారు. పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తే తనకు కనిపించి వెళ్లమనేవారు. ఆయన భార్య జయ లక్ష్మి మేడమ్‌కు గుడ్‌నైట్ చెప్పందే విశ్వనాథ్ సర్ నిద్రపోరు. నిన్న ఉదయం నుంచే ఆయన నీరసంగా ఉన్నాడు. రాత్రిపూట చివరగా నాగేంద్ర సార్‌తో మాట్లాడారు. సార్ మన మధ్య లేడంటే చాలా బాధగా ఉంది' అని విచారం వ్యక్తం చేశాడు కిరణ్. చదవండి: శంకరాభరణం గురించి ఈ విశేషాలు తెలుసా? -
ఆ విధానం తప్పని ఈ సినిమాతో చెప్పారు విశ్వనాథ్, ఈ చిత్రమేదంటే
నిజమైన కళ అంటే.. కనులకు, చెవులకు ఆనందాన్నిచ్చేది కాదు. మనుసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనాలను రంజింపజేసిన కళాకారుడు చరితార్థుడువుతాడు. కె. విశ్వనాథ్ ఆ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడల పెను తుఫాను తాకిడికి రెప రెపలాడుతున్న భారతీయ కళాజ్యోతిని తన సినిమాలతో ప్రజ్వలింపజేసిన మహోన్నతుడు కె. విశ్వనాథ్. ఆయన సృజించిన ప్రతి చిత్రం.. నటరాజ పాదపద్మాలను స్మృశించిన స్వర్ణకమలమే. ఆయన కెరీర్లో వచ్చిన మరపురాని చిత్రాల్లో స్వర్ణకమలం ఒకటి. ఈ సినిమా పాతికేళ్ల సందర్భంగా గతంలో కె విశ్వనాథ్ ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు పాశ్యాత్య పోకడలకు నేటితరం చూపిస్తున్న ఆసక్తిపై ఆయన స్పందించారు. మరి ‘స్వర్ణకమలం’ మూవీ ఎలా పుట్టింది, ఈ చిత్రం గురించి ఆయన ఏమన్నారో మరోసారి గుర్తు చేసుకుందామా! కళ దైవదత్తం. జన్మ జన్మల పుణ్యం వల్లే అది ప్రాప్థిస్తుంది. ఆ నిజాన్ని గ్రహించలేదని వేదాంతం వారి అమ్మాయి కథ ఇది. ‘సమాజం జెట్ వేగంతో వెళుతోంది. దాంతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకాని సంప్రదాయ కళలనే శ్వాసిస్తూ అదే మోక్షంగా భావిస్తూ కూపస్త మండూకాల్లా బతకడం ఎంత వరకు సమంజసం’ అని వాదిస్తుందీ పాత్ర. పాతికేళ్ల క్రితం విశ్వనాథ్ సృష్టించిన ఈ మీనాక్షి పాత్ర.. నాటి అమ్మాయిలకే కాదు.. నేటి అమ్మాయిలకు రేపటి అమ్మాయిలకు అద్దమే. ఆ పాత్రలో భానుప్రియ ఒదిగిన తీరు అనితరసాధ్యం. చిత్తశుద్దీ ఏకాగ్రత తోడైతే.. ఏ కళైనా అజరామరం అవుతుందని ఆ పాత్ర తెలుసుకోవడమే స్వర్ణకమలం. ఇప్పటికీ ‘స్వర్ణకమలం’ చిత్రాన్ని స్మరించుకుంటున్నారంటే కారణం? ‘సంప్రదాయ కళలపై ఇష్టంతో జనహృదయాలపై వాటిని ఉన్నతంగా నిలపాలనే ఉన్నతమైన ధ్యేయంతో సినిమాలు తీశాను. వాటిల్లో ఒకటే స్వర్ణకమలం. సంప్రదాయ కళలపై వృత్తి విద్యలపై ప్రస్తుతం యువతరానికి నమ్మకం పోయింది. మనది కానిది వాటిపైనే వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధానం తప్పని ఈ సినిమాలో చెప్పాను. ఇళయరాజా సింగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి రెండు కళ్లు. ఇందులో భానుప్రియ నటనకు నాట్యాలకు మంచి పేరొచ్చింది. చివరి పాట తప్ప అనిన పాటలకు శేషు, ముక్కురాజు కొరియోగ్రఫి ఇచ్చారు. చివరి పాట అందెల రవమిది పదములదా పాటలకు మాత్రం సుప్రసిద్ద హిందీ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ చేశారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో ఒక్క నాట్యం గురించే కాదు. మన సంస్కృతి సంప్రదాయం భక్తి, ప్రేమ, తిరుగుబాటు.. ఇలా ఎన్నో అంశాలను స్మృశించారు కె. విశ్వనాథ్. హృదయాలను బరువెక్కించే భావోద్వేగం, ఆహ్లాదపరిచే హాస్యం ఈ ఆసినిమాకు అలంకారాలు. వెంకటేశ్. భానుప్రియ సాక్షి రంగరావు, శ్రీలక్ష్మి, షణ్ముఖ శ్రీనివాస్, కేఎస్టీ సాయి.. ఇలా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు. -
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
థియేటర్ బయట చెప్పులు విడిచి చూసిన చిత్రమిది!
మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుపులు సరిసరి నటనలు సిరిసిరి మువ్వలు కాబోలు.. అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరుకు ప్రేక్షకులు పరవంశించిపోయారు. శంకరాభరణంలో ప్రతి ఫ్రేమూ, ప్రతి మాటా, ప్రతి పాటా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఒకసారి చూస్తే తనివి తీరదన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్లలోనే ఐదారుసార్లు చూశారు. పైగా చాలాచోట్ల థియేటర్ బయటే చెప్పులు విడిచిపెట్టి శంకరాభరణం చూడటం విశేషం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు(1980, ఫిబ్రవరి 3న) శంకరాభరణం రిలీజైంది. తన సినిమా రిలీజైన రోజే తనువు చాలించారు కె.విశ్వనాథ్. ఈ సందర్భంగా శంకరాభరణం కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం.. గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసి మొక్క అంత పవిత్రమైనది. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి. ఎలాంటి ఆర్తి అది? ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కన్న తల్లే తనను అమ్మేయాలనుకున్న సమయంలో తులసిని ఆదుకుంటాడు శంకరశాస్త్రి. కానీ ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. ఇది తట్టుకోలేని తులసి ఆయన కోసం ఆయనను దూరంగా వదిలిపోతుంది. శంకర శాస్త్రి– తులసి.. ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము, విషపురుగు. అదే శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం.. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం. మాసిపోయిన వైభవం.. ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచేరి అంటే విరగబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్థోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు. తిరిగొచ్చిన తులసి.. ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది. దొరకునా ఇటువంటి సేవా... తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు.ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు కిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది. శంకరాభరణంకు ఊహించని రెస్పాన్స్ 1980లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందభాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది. నాటు సారా తాగినా అవే పాటలు.. శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరశాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి. చదవండి: సిరివెన్నెల సినిమా కోసం చిత్రవధ పడ్డ విశ్వనాథ్ -
కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే
కళాతపస్వి కె. విశ్వనాథ్..కళామతల్లి ముద్దుబిడ్డ అనే పేరుకు అసలైన రూపం. తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. సౌండ్ రికార్డిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా ఎన్నో అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. సినిమా అంటే కేవలం కమర్షియల్ హంగులు,డ్యాన్సులు మాత్రమే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కళలకు ప్రతిరూపం అని తన ప్రతి సినిమాల్లో నిరూపించిన మహారిషి కె. విశ్వనాథ్. స్టార్ హీరోలు లేకపోయినా, సినిమా మొత్తం పాటలు ఉన్నా సామాజిక అంశాలను కథలుగా మార్చుకొని సినిమా హిట్స్ కొట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు వారికి అందించారు. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ఆలోచింపజేశాయి. ఇలా ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. సంగీతం, సంస్కృతి, సంప్రదాయలకు అత్యంత విలువనిచ్చే కె. విశ్వనాథ్ కమర్షియల్ హంగులు లేకపోయినా కేవలం కళలతో హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన డైరెక్టర్. తన సినీ ప్రస్థానంలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గానే కాకుండా, నటుడిగానూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఎన్నో సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు. -
‘సాక్షి’మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు: కే. విశ్వనాథ్
అగ్ర దర్శకుడు, కళా తపస్వీ కే. విశ్వనాథ్ (92) ఇక లేరనే విషయం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన విశ్వానాథ్.. ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు. 2015లో ఆయనకు ‘సాక్షి’ మీడియా సంస్థ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినే ‘సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును ప్రధానం చేసింది. (చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కళాతపస్వికి నివాళులు.. షూటింగ్స్ బంద్ చేస్తూ నిర్ణయం
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది. -
కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే..
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ శంకరాభరణం రిలీజ్ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా కె.విశ్వనాథ్.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇక లేరు -
తెలుగు సినిమా గొప్పదనం మీరు.. కె.విశ్వనాథ్‌కు ప్రముఖుల నివాళులు
మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. Deeply grieved to hear of the demise of renowned film director, Sri K. Viswanath. As a film-maker he brought depth & dignity to the medium earning global recognition for his movies with a message. May his atma attain sadgati! Om shanti! pic.twitter.com/snX4RVsIVJ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023 Shocked beyond words! Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻 — rajamouli ss (@ssrajamouli) February 3, 2023 Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx — Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023 Sad to hear about the passing of India’s 1st auteur director #KVishwanath ..He is gone , but his films will live forever 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2023 Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly... #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd — Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023 Disheartening to know about the tragic news of #KVishwanath garu. Words may not suffice to express his loss. His contribution to Telugu Cinema will live on in our memories forever. My sincere condolences to his entire family & dear ones. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2023 We have lost another gem! What a legend! #KVishwanath gaaru will be remembered forever for his art, his passion and understanding of films. Never got an opportunity to work with him, but been a great admirer of his work. Will be missed. RIP #KVishwanathgaru Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/HNxvrELJnt — KhushbuSundar (@khushsundar) February 3, 2023 Rest in peace the legendary #KVishwanath sir .. You will remembered forever in our hearts , you always live through ur great films 🙏 Om shanti#RipLegend #RIPVishwanathGaru pic.twitter.com/XZE6aYUvP8 — Director Maruthi (@DirectorMaruthi) February 3, 2023 Ulaganayagan @ikamalhaasan posted a hand-written letter bidding goodbye to the Legendary director #KVishwanath garu. 💔#KViswanathGaru pic.twitter.com/5IMs70O8Hu — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2023 తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88 — Jr NTR (@tarak9999) February 2, 2023 Cinema is above Boxoffice. Cinema is above Stars. Cinema is above any individual. Who taught us this ? The greatest of greatest #KViswanathGaaru మీ రుణం …వీడుకోలు 🙏🏼🙏🏼🙏🏼 — Nani (@NameisNani) February 3, 2023 నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! — mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023 -
కె. విశ్వనాథ్ కడసారి చూపు కోసం తరలి వచ్చిన సినీ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకొని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కె. విశ్వనాథ్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయికుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ►విశ్వనాథ్ గారు లేరనే వార్త నన్ను బాధకు గురిచేసింది నాకు పితృసమానులు. విశ్వనాథ్ చిత్రాలు పండితుల నుంచి పామరుల వరకు అలరించాయి జనరంజకం చేస్తూ బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఆయన కృషికి నిదర్శనం.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆయన దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం. మా లాంటి నటులకు విశ్వనాథ్ ఓ గ్రంథాలయం. ఆయన చేత్తో అన్నం తినిపించిన గొప్ప వ్యక్తి. 'ఇంద్ర' సమయంలో వారణాసికి పిలవడంతో వచ్చారు ఆయన ప్రేమ వాత్సల్యం పొందిన నేను తండ్రిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది- చిరంజీవి ► కె. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం.ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయన తెలుగు సినిమాకు మూలస్తంభం. తన సినిమాల ద్వారా సంస్కృతిని తెలియజేశారు. విశ్వనాథ్ గారి మరణం సినిమా రంగానికి తీరని లోటు అంటూ పపన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ► విశ్వనాథ్ గారు ఈరోజు లేరనే వార్త చాలా షాకింగ్‌గా, బాధగా అనిపిస్తుంది. దేశంలోని అత్యత్తుమ డైరెక్టర్లలో ఆయన ఒకరు. పాత తరమే కాదు, ఈనాటి జనరేషన్ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటాయి - విక్టరీ వెంకటేశ్ ► పుట్టినప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది. - ఆయాన సినిమాల్లో నేను నటించాను. - ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. - ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. - ఆయన లేడు అనేది చాలా బాధాకరం. - భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన - బ్రహ్మానందం ► కళా తపస్వి అన్న పేరుకు ఆయనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మనిషి ఈరోజు లేరన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన్ను చూస్తుంటే యోగ నిద్రలో ఉన్నట్లున్నారు. ఒక భీష్మాచార్యుడిలాగా కనిపించారు. ఆయన ఆశీస్సులు మన అందరికి ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సినిమాలు తీయాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి - సాయికుమార్ ► దర్శకత్వపు ప్రాథమిక సూత్రాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాలు మాలాంటి వాళ్లు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కాబట్టి ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. పాతతరమే కాదు యువతరం కూడా ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి - గుణశేఖర్ ►కె. విశ్వనాథ్ గారు గొప్ప మనిషి. ఆయనతో పనిచేసిన రోజుల్ని మర్చిపోలేను. ఈమధ్యే ఆయన్ను కలిశాను. ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. కానీ దానికి పునాదులు వేసింది మాత్రం కె. విశ్వనాథ్ గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - సినీ నటి రాధిక ► ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించిన గొప్పవాళ్లలో కె. విశ్వనాథ్‌ది అగ్రతాంబూలం - పరచూరి గోపాలకృష్ణ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కె. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ, సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. - నందమూరి బాలకృష్ణ కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి(1984). కానీ, ఆ చిత్రం ఆడలేదు. అయితే.. నరసింహానాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, పాండు రంగడు చిత్రాల్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో అలరించారు కళాతపస్వి. -
కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు. నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి, ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోయాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (Director K Viswanath Death: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) -
కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతి ముత్యం, ఓ శుభసంకల్పం.. తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గా ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్య కాలంలో పలుమార్లు ఆస్పత్రిలో చేరినా కోలుకుని తిరిగి వచ్చారు. అయితే రెండురోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆశించారు. కానీ ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో విశ్వనాథ్ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ కన్ను మూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వాహినీ పిక్చర్స్ జీఎంగా మొదలుపెట్టి.. కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె. విశ్వనాథ్ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్ళు’ సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ (1965) సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ (2016) వరకూ విశ్వనాథ్ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్ పర్ఫెక్ట్ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించేవరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్ అలవాటు. తనను తాను కారి్మకుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వాటిలో సరగమ్ (సిరిసిరిమువ్వ), సుర్‌సంగమ్ (శంకరాభరణం), కామ్‌చోర్ (శుభోదయం), శుభ్కామ్నా (శుభలేఖ), సమ్‌జోగ్ (జీవనజ్యోతి) ఉన్నాయి. ఐదు జాతీయ అవార్డులు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్‌ను కలిసిన కమల్ హాసన్.. ఎందుకంటే?
కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ కలిశారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్‌ను కలిసిన కమల్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతిని పట్టుకుని ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు కమల్. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం స్వాతిముత్యంలో కమల్ నటించారు. రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి. View this post on Instagram A post shared by Kamal Haasan (@ikamalhaasan) -
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఆత్మీయ సత్కారం..
K Viswanath Honoured For Swati Mutyam Movie Completing 36 Years: కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదలై నేటికి (ఆదివారం) 36 ఏళ్లు. కమల్‌హాసన్, రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అమాయకుడు శివయ్య పాత్రలో కమల్, లలిత పాత్రలో రాధిక కనబర్చిన అభినయాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ చిత్రానికి తోటపల్లి సాయినాథ్ అందించిన మాటలు, ఇళయరాజా సంగీతం, ఆత్రేయ, సినారె, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిల సాహిత్యం అదనపు ఆకర్షణలు. అంతేకాకుండా ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి 36 ఏళ్లవుతున్న సందర్భంగా కె. విశ్వనాథ్ నివాసంలో శుభోదయం మీడియా శనివారం ఆత్మీయ వేడుకను నిర్వహించి, ఆయన్ను సత్కరించింది. తోటపల్లి సాయినాథ్, శుభోదయం గ్రూప్ అధినేత కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, నృత్యకళాకారిణి స్వర్ణ శ్రీ పాల్గొన్నారు. -
సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..
Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరాలు అందించారు. 2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్ స్వరాలు సమకూర్చారు. 3. మూడోసారి హైట్రిక్గా కే. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 4. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది. 5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది. 6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది. 8. సుమంత్ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది. 9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు) 11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా) వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు -
కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం
కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్‌ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి? సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్ -
బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడు
జూన్ 4న దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా తెలుగు చిత్రసీమ ‘స్వర నీరాజన ం’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని 12 గంటల పాటు లైవ్‌లో చూపించారు. ఈ సందర్భంగా జూమ్‌లో పలువురు ప్రముఖులు ఎస్పీబీ గురించి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. నేను మళ్లీ సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు? అనిపించే లోటును సృష్టించిన మహావ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు’’ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘బాలుగారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం ‘నేనంటే నేనే’కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. 16 భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలు మన తెలుగువాడు అవడం మన అదృష్టం’’ అన్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘బాలు ఎంత గొప్పవాడు అంటే దేశమంతా ఆయన పాటలు విని సంతృప్తిపడినవారు ఉన్నారు’’ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ‘‘అన్నయ్య బాలుతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. బాలూగారు అని నేను ఆయన్ని పిలిస్తే, అన్నయ్యా అని పిలవమన్నారు. సంగీతం ఉన్నంతవరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు’’ అన్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలూగారి గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు ఆయన’’ అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. నాన్నగారు పై నుంచి మనకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్, సాయికుమార్, జీవితారాజశేఖర్, ఆర్పీ పట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్. శంకర్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, జేకే భారవి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీరం పాటలు బాలూకి అంకితం ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు మా ‘తీరం’ చిత్రంలో ‘అసలేంటీ ప్రేమ..’ పాట పాడారు. ఆయన పాడిన చివరి పాట మా సినిమానే కావడంతో చిత్రంలోని మిగిలిన 8 పాటలను ఆయనకు అంకితం ఇస్తున్నాం. ఈ పాటలను బాలూగారి ఫ్యాన్స్ కోసం ఉచితంగా ‘ఫ్రీ టు ఎయిర్’గా రిలీజ్ చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత అనిల్ ఇనమడుగు. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నటించిన చిత్రం ‘తీరం’. ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, చిత్రసంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె, పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘురాం పాల్గొన్నారు. -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్‌కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
తెలుగు సినిమాకు దక్కిన ఆత్మగౌరవం కె.విశ్వనాథ్
ఎంతటి నిర్ఝర గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైనదే! సౌండ్ రికార్డిస్టుగా మొదలై, దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ సరిగ్గా 55 ఏళ్ళ క్రితం ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ అయిదున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, హిందీల్లో అర్ధశతం దాకా వెండితెర అద్భుతాలు అందించారు. తొలితరం గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, మలితరం ఆదుర్తి సుబ్బారావు తదితరుల తరువాత మూడో తరంలో తెలుగు సినిమాకు ఆత్మగౌరవం తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. ఆయన నిర్దేశకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, కాలేజీ అమ్మాయిలుగా కాంచన, రాజశ్రీ, జీవిత సత్యాలు పలికే పిచ్చి అమ్మాయిగా అతిథి పాత్రలో వాసంతి నటించగా, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’కి ఈ మార్చి 11తో అయిదున్నర దశాబ్దాలు నిండాయి. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. ఎదుటివారిలోని ఆ ప్రతిభను గుర్తించి, తగిన రీతిలో ప్రోత్సహించి, సరైన సమయంలో అవకాశం ఇవ్వడమే ఎప్పుడైనా గొప్పతనం. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్ ను ప్రారంభించి, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును సన్నిహితం గా పరిశీలిస్తూ వచ్చిన కె. విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఆయనకిచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను ఆదుర్తి దగ్గర గుర్తించి, ఆయన ను వాహినీ వదిలేసి, తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలోకి, పూర్తిగా దర్శకత్వశాఖలోకి రమ్మని ప్రోత్సహించింది – హీరో అక్కినేని నాగేశ్వరరావే. మొదట తటపటాయించినా, చివరకు గురుతుల్యులు ఆదుర్తి వద్ద అక్కినేని – దుక్కిపాటి మధుసూదనరావుల అన్నపూర్ణా పిక్చర్స్‌లో దర్శకత్వ శాఖలోకి వచ్చారు విశ్వనాథ్. అలా ఆయన సినీ జీవితం ఓ ఊహించని మలుపు తిరిగింది. ఆలస్యమైన అవకాశం... స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్ ఆదుర్తి శిష్యరికంలో సానబెట్టిన వజ్రంలా మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే రచన, ఆదుర్తి ప్రోత్సాహంతో సెకండ్ యూనిట్ డైరెక్షన్ – ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేశాక, నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని మాట ఇచ్చారు. తీరా నాలుగు చిత్రాలకు (‘వెలుగు నీడలు’, ‘ఇద్దరు మిత్రులు’–1961, ‘చదువుకున్న అమ్మాయిలు’– ’63, ‘డాక్టర్ చక్రవర్తి’– ’64) వర్క్ చేశాకనే అయిదో సినిమాకు ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’కూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నా పేరే చెప్పారు. నాతో వర్క్ చేయించారు. అయితే, స్క్రిప్టు వర్కు వగైరా చేశాక, అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం, ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె. విశ్వనాథ్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మద్రాసులో అన్నపూర్ణా ఆఫీసు – భగీరథ అమ్మాళ్ స్ట్రీట్‌లో! ఆ పక్కనే కృష్ణారావు నాయుడు స్ట్రీట్‌లో దుక్కిపాటి గారిల్లు. ఇది కాక హైదరాబాద్‌లో లక్డీకాపూల్ దగ్గర శాంతి నగర్ లో దుక్కిపాటి గారికి గెస్ట్ హౌస్ ఉండేది. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే ముందే దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కొన్నేళ్ళుగా మద్రాసులో స్థిరపడ్డ విశ్వనాథ్ సైతం కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో ఒకటి రెండేళ్ళు చిన్న అద్దె ఇంట్లో గడిపిన ఆ రోజులు, ఉత్తమ కథా చిత్రాలను అందించడం కోసం రాత్రీ పగలూ, పండగ పబ్బం తేడా లేకుండా పనిలో నిమగ్నమైన క్షణాలు విశ్వనాథ్ దంపతులకు ఇప్పటికీ గుర్తే. దర్శకుడిగా విశ్వనాథ్ పేరు వేయడం ‘ఆత్మగౌరవం’తోనే తొలిసారి అయినా, అప్పటికే ఆదుర్తి గారి బాబూ మూవీస్ ‘మూగమనసులు’ (1964) సహా అనేక చిత్రాల్లో స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనది. పచ్చికలో రచన! అప్పటి దాకా ఫ్యామిలీ డ్రామా నిండిన సెంటిమెంట్, సీరియస్ సినిమాలు ఎక్కువ తీసింది అన్నపూర్ణా పిక్చర్స్. ఈసారి యువకులను ఆకర్షించేలా, కొత్తదనంతో కాలేజీ స్టూడెంట్స్ పాత్రలు ఉండేలా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ విత్ సెంటిమెంట్ తీస్తే బాగుంటుందని అనుకున్నారు. ‘పూలరంగడు’ ఇతివృత్తం ఆదుర్తి చేస్తే బాగుంటుందనీ, యువతరాన్ని ఆకర్షించే కొత్త ఇతివృత్తాన్ని విశ్వనాథ్ చేస్తే బాగుంటుందని నిర్మాతల భావన. అదే ‘ఆత్మగౌరవం’ సినిమా. అన్నపూర్ణా వారి అన్ని సినిమాల లానే ఈ సినిమా కథకూ పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధామథనం జరిపారు. అలా ఈ ‘ఆత్మగౌరవం’ రచనకు ఒకరికి ముగ్గురి పేర్లు తెరపై కనిపిస్తాయి. విశ్వనాథ్, దుక్కిపాటి సహా అందరి భాగస్వామ్యం ఉన్నా – టైటిల్స్‌లో ప్రముఖ నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కలసి ఈ కథను అల్లారు. ఇక, సినిమా అనుసరణ నిర్మాత దుక్కిపాటి చేశారు. సంభాషణలేమో మరో ప్రముఖ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణతో కలసి గొల్లపూడి రాశారు. అప్పటికి గొల్లపూడి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారు. ఆయనలోని ప్రతిభను గుర్తించి, ‘డాక్టర్ చక్రవర్తి’ (1964) ద్వారా దుక్కిపాటి సినిమాల్లోకి లాగారు. దానికి ఆత్రేయతో కలసి మాటలు రాశారు గొల్లపూడి. అయితే, గొల్లపూడి సినిమా కథంటూ రాసింది విశ్వనాథ్ దర్శకత్వంలోని తొలి చిత్రమైన ‘ఆత్మగౌరవం’కి! అలా విశ్వనాథ్ దర్శకత్వంలోని తొలి చిత్రం... గొల్లపూడి కథారచన చేసిన తొలి చిత్రమైంది. అప్పట్లో గొల్లపూడి సహా అన్నపూర్ణా బృందం ఆకాశవాణి కేంద్రానికి ఎదురుగా ఉన్న పబ్లిక్ గార్డెన్స్ చెట్లనీడల్లో, పచ్చికబయళ్ళలో కూర్చొని, కథాచర్చలు, ఆలోచనలు సాగిస్తూ, ఈ సినీ రచన చేశారు. డైలాగుల్లో కామెడీ పార్ట్ భమిడిపాటి, మిగతాది గొల్లపూడి రాశారు. ఆస్తుల కన్నా అనుబంధాలే మిన్న! రక్తసంబంధం ఎన్నటికీ విడదీయరానిది అనేది ఈ చిత్ర కథాంశం. అందులోనూ కథానాయిక (కాంచన) ఆత్మగౌరవం ప్రధానాంశం. అటు కన్నవారికీ, ఇటు పెంచినవారికీ మధ్య నలిగిపోయే హీరో మీదుగా కథ నడుస్తుంది. సొంత అన్నయ్య, వదినలకు దూరమై, పిల్లలు లేని జమీందారు దంపతుల (రేలంగి, సూర్యకాంతం) ఇంటికి దత్తత వెళ్ళి, పట్నంలో హాస్టలులో పెరుగుతాడు కౌలు రైతు రామయ్య (గుమ్మడి) తమ్ముడైన హీరో (అక్కినేని). అయితే, హీరోకు చిన్నప్పుడే నిశ్చయమైన కన్నవారింటి మేనరికం సంబంధం కాకుండా, గొప్పింటి జడ్జి (రమణారెడ్డి) గారి కూతురి (రాజశ్రీ) బయటి సంబంధం చేయాలని చూస్తుంది జమీందారీ పెంపుడు తల్లి. పెంచినవాళ్ళను ఎదిరించి, ఆస్తి వదులుకొనైనా సరే మేనరికం చేసుకోవాలనుకుంటాడు హీరో. ఈ సమస్యలన్నిటినీ హీరో ఎంత ఆహ్లాదంగా పరిష్కరించాడన్నది సుఖాంతం అయ్యే ఈ కుటుంబకథా చిత్రంలో చూడవచ్చు. అద్దం మీద తొలి షాట్ తమాషా... సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. పాటల రికార్డింగ్ ముహూర్తం మాత్రం మద్రాసు భరణీ స్టూడియో లో ఘంటసాల, సుశీల తదితరుల నడుమ చేశారు. ఇక, హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి ఏమో బహిరంగ నాస్తికులు. తొలిషాట్ దేవుడి పటాల మీద తీసే సావకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం గనక, విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి, అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి, డ్రెస్ సర్దుకుంటారు. అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమేరామ్యాన్ సెల్వరాజ్ తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. శ్రీశ్రీతో సాలూరి తమాషా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుతో విశ్వనాథ్‌కు మంచి అనుబంధం. సాలూరి ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు, గాయకులో, అంత పసి మనస్తత్త్వం. ఆయనలో భలే చిలిపితనం ఉండేది! అది అర్థం చేసుకోకపోతే గొడవ. ఒక్కోసారి ఆయన కావాలని ఆటపట్టించేందుకు గమ్మత్తు చేసేవారు. ఈ సినిమా లో ఓ పాట కోసం శ్రీశ్రీ గారికి అన్నీ లఘువులతో (హ్రస్వాక్షరాలు వచ్చేలా) ఓ క్లిష్టమైన బాణీ ఇచ్చారు. శ్రీశ్రీ కూడా విషయం గ్రహించి, చిరునవ్వుతో దాన్ని ఓ సవాలుగా తీసుకొని, ‘వలపులు విరిసిన పూవులే...’ అంటూ పాట రాసిచ్చారు. ఇదే సినిమా కోసం సి. నారాయణరెడ్డి రాసిన ‘మా రాజులొచ్చారు...’ పాట అంటే కె. విశ్వనాథ్‌కు ఇప్పటికీ భలే ఇష్టం. దాశరథి రాసిన ‘అందెను నేడే అందని జాబిల్లి..’, డ్యూయట్ ‘ఒక పూలబాణం..’, ఆరుద్ర రచన ‘రానని రాలేనని..’ పాటలు ఇప్పటికీ పాపులర్. ఆ నంది బొమ్మతోనే అవార్డులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964 నుంచే ఉత్తమ తెలుగు చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టిన ఆ నందీ అవార్డుల చిహ్నం కూడా మరేదో కాదు – రామప్ప గుడిలోని నంది ఏకశిలా విగ్రహం. ఇంకా విచిత్రం ఏమిటంటే, అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టిన ఏడాదే ప్రభుత్వం నుంచి 1964లో అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ ఉత్తమ కథాచిత్రంగా బంగారు నందిని గెలిస్తే, 1965లో అన్నపూర్ణా వారిదే ‘ఆత్మగౌరవం’ చిత్రం నంది ఉత్తమ తతీయ చిత్రంగా కాస్యనందిని గెలిచింది. ఆ రెండు చిత్రాల రచన, రూపకల్పన, దర్శకత్వాల్లో విశ్వనాథ్ గణనీయమైన భాగస్వామ్యం ఉండడం విశేషం. అలా ‘ఆత్మగౌరవం’ చిత్రం తమ షూటింగ్ జరిగిన అదే రామప్ప గుడి ఏకశిలా విగ్రహం తాలూకు చిహ్నమైన నంది అవార్డును అందుకుంది. ఇక, ఉత్తమ కథారచయితలకు నంది అవార్డులివ్వడం 1965 నుంచి మొదలుపెట్టారు. ఆ తొలి నంది అవార్డు కూడా ‘ఆత్మగౌరవం’దే! అలా గొల్లపూడి, యద్దనపూడి – ఇద్దరూ ఆ ఏటి ఉత్తమ కథా రచయితలుగా నంది అందుకున్నారు. గాంధీభవన్ ఎగ్జిబిషన్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. అక్కినేని, కాంచన, రేలంగి, దుక్కిపాటి, విశ్వనాథ్ లాంటి సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర గవర్నర్ పట్టం థానూ పిళ్ళై దంపతులు, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దంపతులు – ఇలా వేదికపై అతిరథ మహారథులతో హైదరాబాద్‌లో గొప్ప గ్లామరస్ సభగా ఆ నంది ఉత్సవం సాగింది. అలాగే, ‘మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ నుంచి అక్కినేని ఉత్తమ నటుడిగా, గొల్లపూడి ఉత్తమ రచయితగా అవార్డులు పొందారు. తొలి చిత్రంతోనే కె. విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. న్టీఆర్ తో నాలుగు... ఏయన్నార్ తో రెండు... ‘ఆత్మగౌరవం’ తరువాత దర్శకుడిగా రెండో సినిమా కూడా అన్నపూర్ణా పిక్చర్స్‌లోనే కె. విశ్వనాథ్ చేయాల్సింది. ఆయన కూడా అలాగే అనుకొని, తనను సంప్రతించిన బయట నిర్మాతలతో ఆ కమిట్మెంటే చెబుతూ వచ్చారు. కానీ, ఎందుకనో ఆ తరువాత అన్నపూర్ణా అధినేత దుక్కిపాటి తన మాట నిలబెట్టుకోలేదు. ‘ఆత్మగౌరవం’ తర్వాత విశ్వనాథ్ మళ్ళీ సకుటుంబంగా మద్రాసుకు షిఫ్టయి, మరో నిర్మాత డి.బి. నారాయణ ఇంట్లో అద్దెకు చేరారు. చివరకు రెండో సినిమాగా తాను తీర్చిదిద్దిన హీరోలు రామ్మోహన్, కృష్ణలతోనే బయట నిర్మాతలకు ‘ప్రైవేటు మాష్టారు’ (1967 సెప్టెంబర్ 14) తీశారు. అయితేనేం, దర్శకుడిగా ఆయన ప్రస్థానం క్రమక్రమంగా పైపైకి దూసుకుపోయింది. చివరకు ‘శంకరాభరణం’ లాంటి కళాఖండాలతో దర్శకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నాక తొమ్మిదేళ్ళకు మళ్ళీ అక్కినేనితో రెండోచిత్రం ‘సూత్రధారులు’ (’89) రూపొందించారు విశ్వనాథ్. అప్పటి మరో స్టార్హీరో ఎన్టీఆర్ తో తన కెరీర్ లో ఏకంగా 4 సినిమాలు చేసిన ఆయన, ఏయన్నార్‌తో 2 చిత్రాలే తీయడం ఓ విచిత్రం. ఫస్ట్ లేడీ కొరియోగ్రాఫర్‌కు ఛాన్స్! ప్రఖ్యాత కూచిపూడి నృత్యగురువు సుమతీ కౌశల్ (ప్రముఖ నాట్యాచారిణి ఉమా కె. రామారావుకు సోదరి) అప్పట్లో హైదరాబాద్ లోని విశ్వనాథ్ ఇంటికి దగ్గరలోనే బషీర్‌బాగ్‌లో డ్యాన్స్ స్కూల్ ‘నృత్యశిఖర’ నడుపుతుండేవారు. రవీంద్రభారతిలో ఆమె నృత్యప్రతిభ చూసి, ఈ చిత్రంలో ఆమెకు నృత్య దర్శకురాలిగా అవకాశమిచ్చారు. ‘ముందటి వలె నాపై నెనరున్నదా సామి...’ అనే క్షేత్రయ్య పదానికి, హీరోయిన్లు రాజశ్రీ, కాంచనలతో శ్రీకృష్ణుడు, రాధ పాత్రలు వేయించి, కూచిపూడి నృత్యగీతాన్ని చిత్రీకరించారు. అలా సుమతి తెలుగుతెరపై తొలి మహిళా కొరియోగ్రాఫరయ్యారు. ‘ఆత్మగౌరవం’ కు మరో కొరియోగ్రాఫర్‌గా హీరాలాల్ పనిచేశారు. సినిమా ఔట్‌డోర్ దృశ్యాల్ని రామప్ప గుడి, సరస్సు పరిసరాల్లో, డిండి ప్రాజెక్ట్ ప్రాంతంలో తీశారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే! విశ్వనాథ్ లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీతరచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్నరోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తనదైన ఇన్ పుట్స్‌తో పాటల పల్లవులు అందించడం విశ్వనాథ్‌కు అలవాటు. డమ్మీ లిరిక్స్... ‘‘అబద్ధపు సాహిత్యం’’ అని ముద్దుగా పిలుస్తూ అలా ఆయన ఇచ్చిన పల్లవులే ఇవాళ తలమానికమైన ఎన్నో సినీగీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లోనూ ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు అలా విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది, రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. ‘ఆత్మగౌరవం’ నుంచి లేటెస్ట్ ‘శుభప్రదం’ దాకా తన సినిమాలన్నిటిలో విశ్వనాథ్ ఇలా అందించిన పల్లవులు ఎన్నెన్నో! అవార్డులకు కేరాఫ్ అడ్రస్! మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ ఆ సంగతులు చెప్పారు. అంతకు మునుపెవ్వరూ షూటింగ్ చేసిన రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. – రెంటాల జయదేవ -
లెజెండరీ దర్శకుడి బర్త్‌డే: అభిమానుల సర్ప్రైజ్
టాలీవుడ్‌కు అమూల్యమైన చిత్ర కళాఖండాలను అందించిన దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. కమర్షియల్ చిత్రాలే కాకుండా తెలుగు సాహిత్య సంపదను ద్విగుణీకృతం చేసే 'శంకరాభరణం' వంటి సినిమాలను కూడా రూపొందించారాయన. ఫిబ్రవరి 19న విశ్వనాథ్ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకుని అభిమానులు ఆయనకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాను తయారు చేసి, దాన్ని బర్త్‌డే కేక్ లోపల ఉంచారు. దాన్ని నేరుగా ఆయన ముందుకు తీసుకెళ్లి పెళ్లారు. తర్వాత విశ్వనాథ్ చేతితోనే కేకు మధ్యలో నుంచి ఆ సినిమా జాబితాను పైకి లాగేలా చేశారు. తన సినిమాలను మరోసారి కళ్లారా చూసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నా కోసం ఇంత కష్టపడ్డారా? అంటూ వారిపై ఆప్యాయతను కనబర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశ్వనాథ్ సర్గం, శుభ్ కామ్నా, సంగీత్, సనోజ్, ధన్వాన్ వంటి పలు బాలీవుడ్ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా 1995లో శుభ సంకల్పం సినిమాతో తొలిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ‘శంకరాభరణం’కు వచ్చిన జాతీయ అవార్డులు ఎన్ని? విశ్వనాథ గారు గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు: రాధిక -
విశ్వనాథ వనితలు
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. కె.విశ్వనాథ్ 92వ జన్మదినం సందర్భంగా.... ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారుణ్ణి తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతణ్ణి ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతణ్ణి సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చి అవతారం – సాక్షి ఫ్యామిలీ -
హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం
‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్ ఫిలిమ్స్‌పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి. కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ – ఈ ఇద్దరి కాంబినేషన్ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది. అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా... కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది. నాయికగా సావిత్రి ఆఖరి సినిమా! ‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్ మొదలైన ఏయన్నార్ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్ సరసన సావిత్రి హీరోయిన్. తర్వాత మళ్ళీ ఏయన్నార్ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్ ఇయర్స్ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ తెరపై వెలిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్ బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్‌లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్‌గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్’ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్కు మిగిలిన కొత్త తీపిగుర్తు). దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్! ‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్ అన్నారు. సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా... బ్లాక్ అండ్ వైట్ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్సిన్మాల హవాలో కమర్షియల్‌గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్ కుమార్, వెంకట రమణ కుమార్) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్ బ్యానర్ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్.వి.యస్ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే! నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్ దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్‌ల కాంబినేషన్ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏయన్నార్ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్‌తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్‌తో విశ్వనాథ్ మరే సినిమా చేయలేదు. కానీ, ఏయన్నార్‌కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్‌తో కె. విశ్వనాథ్ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్‌ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లయిన యస్.వి.యస్. ఫిలిమ్స్ వారే’’ అన్నారు విశ్వనాథ్. అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు. ఆ సినిమాలన్నీ... ఆయనతోనే! ఎన్టీఆర్‌తో నిర్మాత మిద్దె జగన్నాథరావు స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్‌ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి, ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు. జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్.వి.యస్’ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్ లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్లో 5 సినిమాలు (ఎస్.డి.లాల్ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్.వి.యస్. ఫిలిమ్స్ – ఎన్టీఆర్‌ల కాంబినే షన్‌కు ఊహించని బ్రేక్ పడింది. చిరంజీవి సినిమాకు మూలం! చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్మెంట్ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్ ‘సాక్షి’కి వివరించారు. హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ (చిన్ని) తెలిపారు. అరుదైన రికార్డ్ ఆ జంట సొంతం! ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ మెప్పించింది. ఒక టాప్ హీరో, టాప్ హీరోయిన్ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం. - రెంటాల జయదేవ -
విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి
కళాతపస్వి కె. విశ్వనాథ్ ని చిరంజీవి గురువులా భావిస్తారు. దీపావళి పండగ సందర్భంగా సతీమణి సురేఖతో కలసి గురువు ఇంటికి వెళ్లారు చిరంజీవి. విశ్వనాథ్ దంపతులు చిరు దంపతులను ఆశీర్వదించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచాయి. గురు–శిష్యులిద్దరూ తమ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విశేషాలను, ఆ సినిమాల సమయంలో ఏర్పడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశ్వనాథ్‌గారిని కలవాలనిపించి ఆయన ఇంటికి వచ్చాను. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారాయన. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి. -
‘కళాతపస్వి’ని కలిసిన మెగాస్టార్
-
అందుకే పెద్దాయనను కలిశా: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మాస్ హీరోగా ఉన్న తనను క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన కళాతపస్వి, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ఆయన ఇంటికి చేరుకుని గురువుగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి పాదాభిందనం చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.(చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) చిరంజీవి అంటే మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించగలరని, ఎలాంటి పాత్రకైనా వన్నె తీసుకురాగల ప్రతిభ ఆయన సొంతమని ఈ సినిమాలు నిరూపించాయికాగా దీపావళి పండుగను పురస్కరించుకుని గురువుగారిని కలిసిన చిరంజీవి, ఆపాత మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ గారిని కలవాలనిపించింది. అందుకే ఈ రోజు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. దీపావళి వేళ ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అన్నారు. ఇక ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అందరికి దీపావళి శుభాకాంక్షలు! పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను.వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
జీ సినీ అవార్డుల విజేతలు వీరే..
హైదరాబాద్ : జీ సినీ తెలుగు అవార్డుల వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గాను ఈ అవార్డుల ప్రధానం జరిగింది. సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా చిరంజీవి, మజిలీ, ఓ బేబీ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సమంత అవార్డులు దక్కించుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ట్విటర్ స్టార్ అవార్డు దక్కింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. మెగాస్టార్ కుమార్తె సుష్మిత సైరా చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు అందుకున్నారు. అలాగే కళాతపస్వీ కె విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి, కె విశ్వనాథ్, సమంత, భూమిక, శ్రద్దా శ్రీనాథ్, నిధి అగర్వాల్, రత్నవేలు పూజా హెగ్డే, రామ్, పూరి జగన్నాథ్, ఛార్మి, కార్తికేయ, నందినిరెడ్డి, ఖుష్బూ, జయప్రద, రెజీనా, నవీన్ పొలిశెట్టి, అనసూయ తదితరులు హాజరయ్యారు. జీ సినీ అవార్డుల విజేతలు.. ఉత్తమ నటుడు : చిరంజీవి(సైరా నరసింహారెడ్డి) ఉత్తమ నటి : సమంత(మజిలీ, ఓ బేబీ) బెస్ట్ ఫైన్డ్ ఆఫ్ ది ఇయర్ : శ్రద్ధా శ్రీనాథ్(జెర్సీ) ఉత్తమ సహాయ నటుడు : అల్లరి నరేష్(మహర్షి) ఉత్తమ హాస్యనటుడు : రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి(బ్రోచేవారెవరురా) ఫెవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ : నాని(జెర్సీ) ఫెవరెట్ నటి : పూజా హెగ్డే (మహర్షి) ఉత్తమ నిర్మాత : ఛార్మి(ఇస్మార్ట్ శంకర్) సన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ : రామ్ (ఇస్మార్ట్ శంకర్) బెస్ట్ సన్సేషన్ డైరక్టర్ : పూరి జగన్నాథ్(ఇస్మార్ట్ శంకర్) ఉత్తమ సంగీత దర్శకుడు : మణిశర్మ (ఇస్మార్ట్ శంకర్) ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్ (కడలల్లే.. డియర్ కామ్రేడ్ ) ఫేవరెట్ అల్బమ్ ఆఫ్ ది ఇయర్ : జస్టిన్ ప్రభాకరన్(డియర్ కామ్రేడ్) ఉత్తమ విలన్ : తిరువీ(జార్జిరెడ్డి) ఉత్తమ స్ర్కీన్‌ప్లే : వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా) ఉత్తమ నూతన నటి : శివాత్మిక రాజశేఖర్( దొరసాని) ఉత్తమ నూతన నటుడు : ఆనంద్ దేవరకొండ(దొరసాని) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు(సైరా) న్యూ సన్సేషన్ ఆఫ్ ది ఇయర్ : తరుణ్ భాస్కర్ (మీకు మాత్రమే చెప్తా) ఉత్తమ గాయని : చిన్నయి (ప్రియతమా.. మజిలీ) ఫేవరెట్ డెబ్యూ డైరక్టర్ : స్వరూప్ ఆర్ఎస్జే(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ) ఫేవరెట్ సపోర్టింగ్ యాక్టర్ : నీల్ నితీశ్ ముఖేష్(సాహో) -
విశ్వనాథ్ దంపతుల సప్తపది
కొత్త జంటకు అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లొచ్చాక.. ఇదిగో.. ఈ ఇంటర్వ్యూను నూతన వధూవరుల చేత చదివించినా సరిపోతుందని అనిపించింది! డెబ్బయ్ ఏళ్ల అన్యోన్య దాంపత్యం. కలహాలూ.. కంప్లయింట్లూ లేని అనురాగబంధం. భక్తితో ఆయన సినిమాలు తీశారు. శ్రద్ధతో ఆమె ఇంటిని నడిపించింది. అందుకే ఆ సినిమాలు.. సప్తపదులు. అందుకే ఈ దంపతులు.. ఆదర్శమూర్తులు. జయలక్ష్మి గారితో పెళ్లికి ముందు మీరు ఎన్ని సంబంధాలు చూశారు? విశ్వనాథ్: మాకు అప్పుడు సొంత ఆలోచనలు, ప్రేమలు తెలియవు. పెద్దవాళ్లే చూశారు. మేం చూసింది రెండే సంబంధాలు. ఫస్ట్ సంబంధం మా మామయ్య ద్వారా వచ్చింది. ఆయన పని చేసే యజమాని కూతురే తను. అది భలే సరదా అయిన విషయం. అప్పటికే నేను ఆడియోగ్రాఫర్‌గా మద్రాసులో పని చేస్తున్నాను. పిల్లని చూడ్డానికి తెనాలి వెళ్లాను. పెళ్లి చూపులయ్యాక వచ్చి ట్రైన్ ఎక్కాం. మా మామయ్య ట్రైన్ ఎక్కీ ఎక్కగానే పిల్ల నచ్చిందా? అని అడిగారు. ‘ఆ అమ్మాయి చెల్లి బాగుంది’ అన్నాను. ఇక చూడండీ! తిట్టాడు పట్టుకుని (నవ్వుతూ). ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోటీ రెండు కోట్ల రూపాయలు ఆస్తి వచ్చేది. అందుకే మా మామయ్య నన్ను తీసుకెళ్లారు. ఏదేతై ఏం ఆ సంబంధం తప్పిపోయింది. రెండో సంబంధం ఖాయం అయింది. చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నారట... ఆ వయసులో పెళ్లి మీకు ఎలా అనిపించింది? విశ్వనాథ్: అవును. ‘‘14 ఏళ్ల పిల్లకి, 19 ఏళ్ల పిల్లవాడికి వ్యక్తిత్వం అంటూ ఏర్పడదు. అదే పాతికేళ్లు అయితే ఇద్దరికీ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అప్పుడు క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఇద్దరూ ఒకేరకమైన మనస్తత్వంతో ప్రయాణం మొదలుపెడతారు. అదే వ్యక్తిత్వం ఏర్పడ్డాక పెళ్లయితే... ఒకటీ క్లాష్ వచ్చే చాన్స్ ఉంది.. లేకపోతే కాంప్రమైజ్ అయి కలసి బతికే చాన్స్ అయినా ఉంటుంది. అదే ఇప్పుడనుకోండి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది’’ అని మా సీనియర్ అన్నారు. సరే అన్నాను. ఆయన అన్నట్లుగా గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగుతోందా? విశ్వనాథ్: గొడవలు ఏమీ లేవు. మా చిన్నప్పటి మాట దేవుడు ఎరుగు.. ఆ తర్వాతా ఎలాంటి గొడవలు లేవు. అంటే.. ‘వ్యక్తిత్వం’ ఏర్పడ్డాక చేసుకునే పెళ్లిలో రిస్క్ ఉందంటారా? ఇప్పుడు చాలా పెళ్లిళ్లు ఫెయిల్ కావడానికి అదొక కారణం అంటారా? విశ్వనాథ్: నా ఉద్దేశంలో అదొక కారణం. ఆ వ్యక్తిత్వమే వైపరీత్యంగా వచ్చిన వ్యక్తిత్వంగా తయారవుతోంది. పెళ్లి కాగానే ‘మీ తల్లిదండ్రులు మనతో కలిసి ఉండాలనుకుంటారేమో.. అదేం కుదరదు. వాళ్ల బతుకు వాళ్లదే. మన బతుకు మనదే’ అని అమ్మాయి చెప్పడం వంటివన్నీ వింటున్నాను. ఒకప్పుడు వీళ్ల బంధువులను వాళ్లు.. వాళ్ల బంధువులను వీళ్లు ప్రేమించేవాళ్లు. విశ్వనాథ్‌గారు పెళ్లి చూపులకు వచ్చిన రోజును గుర్తు చేసుకోండి? జయలక్ష్మి: ఇప్పటిలా అప్పట్లో మాట్లాడుకోవడాలు అవీ ఉండవు కదా. ఏం మాట్లాడలేదు. నాకు పధ్నాలుగు ఏళ్లు ఉన్నాయని మాత్రం గుర్తు. చెన్నైలో ఎక్కడ ఉండేవాళ్లు? జయలక్ష్మి: కోడమ్బాకమ్లోని వడపళనిలో ఉండేవాళ్లం. అది చిన్న పేటలా ఉండేది. స్టూడియోలు అన్నీ ఎక్కువ శాతం అక్కడే ఉండేవి. అలానే చాలా మామిడి తోటలు ఉండేవి. జయలక్ష్మిగారు అత్తింట్లోకి అడుగుపెట్టాక మీ అమ్మానాన్న మీతోనే ఉన్నారా? విశ్వనాథ్: మా అమ్మానాన్నలకు నేనొక్కడే కొడుకుని. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మావాళ్లు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. మా కోడలి దగ్గర ఉంటేనే నాకు హాయిగా ఉంటుందని మా నాన్నగారు అనేవారు. నా పెళ్లయ్యాకే నా సిస్టర్స్ పెళ్లయింది. ఆ తర్వాత వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మా నాన్నవాళ్లు, సిస్టర్సే కాదు.. మా మేనల్లుళ్లు, మా మేనకోడళ్ల పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉండి, చదువుకున్నారు. అందరికీ చక్కగా వండిపెట్టి బాగా చూసుకునేది. ఇంటి బాధ్యతలు చూసుకునే విషయంలో మీకు ఏమైనా కష్టంగా ఉండేదా? జయలక్ష్మి: అలాంటిదేం లేదు. మా అత్తగారు, మామగారు మా దగ్గరే ఉండేవారు. ఒక్కడే కొడుకు కదా. వాళ్లు ఉన్నన్నాళ్లు వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మా మామగారు డబ్బు కవర్ని వాళ్ల కొడుకుకి, భార్యకి ఇవ్వకుండా నా చేతికిచ్చేవారు. అందులో ఎంతుందో కూడా చూడకుండా జాగ్రత్తగా లోపల పెట్టేదాన్ని. ఆడపడుచులతో మీరెలా ఉండేవారు? జయలక్ష్మి: వాళ్లకు పెళ్లయినప్పుడు మేం మద్రాసులోనే ఉన్నాం. దాంతో వాళ్ల శ్రీమంతాలకు, కాన్పులకు ఇక్కడికి వచ్చి వెళుతుండేదాన్ని. ఏం చేసినా ఇష్టంగానే చేశాను. మేమంతా అంత బాగుంటాం. ఇంటెడు చాకిరీ చేసిన ఆమె మీద జాలి? విశ్వనాథ్: లేదు. సరైన కారణాలకే కష్టపడతోంది కాబట్టి జాలి అనిపించినా.. బయటకు చెప్పుకోదగ్గది కాదు. కష్టపడే ఏ స్త్రీని చూసినా నాకు బాధగానే ఉంటుంది. అందులోనూ అత్తామామలను చూసుకునే కోడలికి అయితే చాలా బాధ్యత ఉంటుంది. అత్తామామలను బాగా చూసుకోవడం, పిల్లలను చదివించడం అన్నీ తనే చూసుకునేది. నా తరఫున వచ్చే బంధువులు ఎవరికీ ఏ లోటూ రానివ్వలేదు. నేను మాత్రం నా వృత్తే పెద్ద బాధ్యత అనుకునేవాడిని. రాత్రీ పగలూ సినిమాలు తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అందుకని ఇంటి బాధ్యతలు పట్టించుకోలేదు. వాస్తవానికి పట్టించుకోవాల్సిన అవసరం తను కల్పించలేదు. అదొక గొప్ప విషయం. అలా ఇంటి బాధ్యత తీసుకోనందుకు ఇప్పుడు ఏమైనా బాధగా ఉంటుందా? విశ్వనాథ్: లేదు. అటునుంచి కంప్లైంట్ వస్తే కదా బాధ ఉంటుంది. ఆమె నన్ను ఏనాడూ ఏమీ అనలేదు. ఇంటికి ఇంత చేస్తున్నాను అనే ఫీలింగ్‌ని కూడా ఎప్పుడూ వ్యక్తపరచలేదు. పని ఒత్తిడిని వ్యక్తపరచని ఆమె హ్యాపీగా ఉన్నారా? లేదా... అని తెలుసుకునేవారా? ఆమె తన ఆనందాన్నయినా వ్యక్తపరిచేవారా? విశ్వనాథ్: నేను ఎప్పుడూ అడిగింది లేదు. ఆమె తన ఆనందాన్ని కూడా బయటకు చెప్పింది లేదు. తను దేవుడిని నమ్ముతుంది. ఇవాళ మనం ఇది చేస్తున్నాం అంటే అది మనం చేస్తున్నది కాదు.. దేవుడు చేయిస్తున్నది అంటుంది. నేనూ అదే నమ్ముతాను. నేను ‘శంకరాభరణం’ సినిమా తీశానంటే అది నా ప్రతిభ కాదు.. దేవుడు చేయించినదే అనుకుంటాను. ఆ ఒక్క సినిమా అనే కాదు.. ఏ సినిమా అయినా అది నేను ఉద్ధరించినది, ఎవరినో ఉద్ధరించడానికి చేశాననీ అనుకోను. దేవుడికి ప్రసాదం వండేటప్పుడు భక్తితో చేస్తాం. పనిని కూడా నేను అంతే శ్రద్ధగా చేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు పాత విషయాల గురించి ఆలోచిస్తుంటారా? ఏమీ ఆలోచించను. తిండి గురించే ఆలోచిస్తాను (నవ్వుతూ). అంటే.. మీరు భోజనప్రియులా? ఆ భోజన ప్రియత్వం లేకపోతే మంచి సినిమాలు తీయలేం. భోజనం వెరైటీగా, ఆస్వాదించేలా ఉండాలని ఎలా అయితే అనుకుంటామో అలానే తీసే సినిమాలు కూడా వెరైటీగా ఉండాలనుకుంటాం. సాధారణంగా వ్యక్తిగత జీవితం సినిమాల్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ నేను ఉమనైజర్ అయ్యుండి, మద్యం తాగే వ్యక్తిని అనుకోండి.. అది ఎంతో కొంత నేను తీసే సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుందని నా ఉద్దేశం. మా ఇంటి వాతావరణం బాగుండేది. అందుకే పనిని బాగా చేయగలిగాను. ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ ఉంటుందంటారు.. మీ విజయాలకు కారణం మీ శ్రీమతి? ‘బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేరీజ్ ఎ ఉమన్ ఆల్వేస్’ అంటారు. కాదు.. అసలు మనిషి మనుగడే స్త్రీ మీద ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి.. ఇంట్లో అతడిని నసపెట్టి పంపిస్తే ఇక ఆపరేషన్ ఏం సరిగ్గా చేయగలుగుతాడు. ఇంటి ప్రభావం అతనిమీద పడుతుంది. నేను స్త్రీ పక్షపాతిని. ఒక సామ్రాజ్యాన్ని ఏలినంత పని ఉంటుంది గృహిణికి. పొద్దున ఐదు గంటలకు నిద్రలేస్తే రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకూ పని చేస్తుంటారు. మీ బెటరాఫ్కి వంట బాగా వచ్చా? (నవ్వుతూ) బ్రహ్మాండంగా చేస్తుంది. మా నాన్నగారికి కూతుళ్ల వంటకన్నా కోడలి వంటే ఇష్టంగా ఉండేది. 14 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వంట నేర్చుకున్నారా? జయలక్ష్మి: అమ్మవాళ్ల ఇంట్లో అసలు వండేదాన్ని కాదు. అయితే పెళ్లి నాటికి వంట ఎలా చేయాలో కొంచెం అవగాహన ఉంది. పెళ్లి చేసే ముందు అమ్మలు వంట నేర్చుకోమని చెబుతారు కదా. అలా అవగాహన వచ్చింది. మా అన్నయ్యగారికి నేనంటే చాలా ప్రేమ. మా అమ్మ నాకు పని చెబితే అన్నయ్య వచ్చి చేసేవాడు. ‘దానికి చెప్పిన పనులు నువ్వు చేస్తావేరా?’ అనేవారు. అత్తగారింట్లో మా అత్తగారు, మా ఆడపడుచులు అందరూ ఉండేవారు. మా అత్తగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మడి కట్టుకుని పెద్దవాళ్లే ఎక్కువగా వంట చేసేవారు. ఇప్పుడు మేడమ్ వంట చేయడం మానేశారు కదా.. అదేమైనా వెలితిగా ఉంటుందా? విశ్వనాథ్: లేదు. ఎందుకంటే మా కోడళ్లు కూడా అంత బాగా వంట చేస్తారు. మాదేమీ పెద్ద హై సొసైటీ కాదు కదా. మా కోడళ్లు మధ్యతరగతి నుంచి వచ్చినవాళ్లే. పుట్టింట్లో కొంత నేర్చుకుని అత్తింటికి వచ్చారు. అత్తకి అనుభవం ఉంది కాబట్టి కొన్ని సూచనలు చెబుతారు. దాంతో బ్రహ్మాండంగా వంట చేయడం అలవాటయింది. ‘మాది హై సొసైటీ కాదు’ అన్నారు. కళాతపస్వి విశ్వనాథ్‌గారు ‘మిడిల్ క్లాస్’ ఎలా అవుతారు? విశ్వనాథ్: మేం ఎప్పుడూ మధ్యతరగతి వ్యక్తుల్లానే ఫీలవుతాం. నిజం చెప్పాల్సి వస్తే.. నేను డైరెక్టర్ అయిన పదేళ్లకు కారు కొన్నాను. మేడమ్ కూడా అడగలేదా? విశ్వనాథ్: వాళ్లకి కారు ఉంది.. మనకు లేదేంటి? వాళ్లకు కలర్ టీవీ ఉంది.. మనకు లేదేంటి? వాళ్లకు వాషింగ్ మిషన్ ఉంది.. మనకు లేదేంటి? ఇలాంటివన్నీ ఎప్పుడూ అడగలేదు. నగలు అడిగేవారా? విశ్వనాథ్: లేదు. పత్రికల్లో నచ్చిన నగ కనిపిస్తే.. అది చూపించేది. ఆ నగ బాగుందనేది కానీ కొనివ్వమని మాత్రం అడిగేది కాదు. నేను కూడా చూపించిన ప్రతి నగా కొనేవాణ్ణి కాదు. ఒకటీ రెండూ కొనిపెట్టేవాణ్ణి (నవ్వులు). ఆ పదేళ్లల్లో సొంత కారు ఉండాలని మీకూ అనిపించలేదా? జయలక్ష్మి: మన బడ్జెట్లు మనకు తెలిసినప్పుడు ఏమడుగుతాం? అయినా నాకు పెద్దగా ఆశలు లేవు. అవి కావాలి.. ఇవి కావాలని కూడా తెలియదు. మాది సామాన్యమైన కుటుంబం. ఉన్నవాటిలో మంచివి దాచుకోవడం.. అవసరానికి వాడుకోవడం.. అలా పెరిగాం. అది లేదనే గోల... ఇది ఉందనే గర్వం కూడా లేదు. ఆర్థిక వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు? విశ్వనాథ్: మా పెళ్లయ్యాక కూడా చాన్నాళ్లు మా నాన్నగారే ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు. పొదుపు విషయానికి వస్తే.. ఏది అవసరమో అది లోటు లేకుండా చేసుకుంటాం. అప్పట్లో నేను తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. ఎందుకంటే నేను తీసినవన్నీ దాదాపు రిస్కీ సబ్జెక్టులే. అలాంటి కథలతో నిర్మాత సినిమా తీయడమే గొప్ప అని నా ఫీలింగ్. ‘సిరివెన్నెల’, ‘మాంగల్యానికి మరో ముడి’ వంటి సినిమాలన్నీ రిస్కే. ఆ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ ఎంత ఇస్తే అంత తీసుకునేవాణ్ణి తప్ప ఇంత కావాలని అడిగేవాణ్ణి కాదు. తీసుకునేదే తక్కువంటే.. అందులోనే కొంతమంది ఎగ్గొట్టేవారు. ఆర్థిక బాధ్యతలు మామగారికి అప్పజెప్పినందుకు జయలక్ష్మిగారు ఏమీ అనలేదా? విశ్వనాథ్: అబ్బే లేదు. మనీ విషయమే కాదు.. దేనికీ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు మీరేమైనా చెబితే నేర్చుకుంటుందేమో (నవ్వుతూ). మీ ఇద్దరి అబ్బాయిలను సినిమాలకు దూరంగా ఉంచారు. అది ఎవరి నిర్ణయం? జయలక్ష్మి: ఆయన ఎన్నో సినిమాలు చేశారు. కొందరు డబ్బులు ఎగ్గొట్టారు. ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్లు ఉన్నప్పుడు మనం అడగలేం కూడా. అదే ఉద్యోగం అనుకోండి.. నెలకింత అని కరెక్ట్‌గా వచ్చేస్తుందనుకున్నాం. ఒకవేళ మా అబ్బాయిలకు ఆసక్తి ఉంటే ఆలోచించేవాళ్లమేమో. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం ఎలా ఉంటోంది? జయలక్ష్మి: బాగానే ఉంది. నేను ఎవరైనా మనిషి సహాయంతో నడుస్తాను. విశ్వనాథ్: నేను మనుషుల సహాయంతో నడుస్తాను. (నవ్వుతూ). ఫైనల్లీ... ‘సెవన్ ఇయర్స్ ఇచింగ్’ అంటారు.. అంటే పెళ్లయిన ఏడేళ్లకే ఒకరంటే ఒకరికి విసుగు వస్తుందంటారు. మీది ‘సప్తపది’.. 70 ఏళ్ల వైవాహిక జీవితం. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ గురించి కొన్ని టిప్స్? విశ్వనాథ్: సెవన్ ఇయర్స్ ఇచింగ్ అనేది యూనివర్సల్‌గా కరెక్ట్ కాదు. పిచ్చి ఆలోచనలు ఉన్నవాళ్లకు ఏడేళ్లు అక్కర్లేదు, మూడేళ్లకే విసుగు రావచ్చు. సినిమాల్లో పని చేసేటప్పుడు ఇంకా త్వరగా రావచ్చు. మేం ఇమాజినేషన్లో వర్క్ చేస్తాం. గ్లామర్ ఫీల్డ్ కూడా. ‘విల్ పవర్’ ముఖ్యం. బంధం పటిష్టంగా ఉండాలంటే మనం కరెక్ట్‌గా ఉండాలి. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ల బంధం ఎప్పటికీ బాగుంటుంది జయలక్ష్మి: ఇద్దరి మధ్య ప్రేమ, అవగాహన ముఖ్యం. – డి.జి. భవాని ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో వారి చిన్నకోడలు గౌరీమోహిని అక్కడే ఉన్నారు. పెద్ద కోడలు లక్ష్మి, చిన్న కోడలు గౌరీమోహిని ఇద్దరూ మనస్పర్థలు లేకుండా ఉంటారని విశ్వనాథ్ దంపతులు అన్నారు. గౌరీ మోహిని ఏమంటారంటే.. ఈ ఇంటికి కోడలు అయినందుకు మీ ఫీలింగ్ ఏంటి? గౌరీ మోహిని: ఆ క్రెడిట్ మా పెద్దనాన్నగారికి వెళ్తుంది. ఆయన ద్వారానే సంబంధం వచ్చింది. మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం. మీ అత్తగారు తన అత్తామామలతో ఉన్నట్లే... ఇప్పుడు మీరు మీ అత్తమామలు, తోడికోడలితో ఉంటున్నారు కదా... ప్రైవసీ లేదు అనిపిస్తుందా? ఆ ఫీలింగ్ ఏం లేదు. మా అమ్మవాళ్లది కూడా ఉమ్మడి కుటుంబమే. అత్తను ప్రతిదీ అడిగి చేయాలా... అని ప్రస్తుత జనరేషన్‌కి అనిపిస్తుంటుంది కదా... సంపాదిస్తున్నారు కాబట్టి అనిపించొచ్చేమో? అయితే సంపాదించినా సంపాదించకపోయినా పెద్దవాళ్ల సలహా అడిగి చేస్తే తప్పు కాదని నా అభిప్రాయం. మీ అత్తగారు చెప్పేవాటిలో ది బెస్ట్ అనదగ్గది? అత్తగారు ఎప్పుడూ ‘మనం నది ఒడ్డున ఉన్న చెట్టులా ఉండాలి’ అంటారు. నీళ్లు ఎంత వేగంగా వచ్చినా కూడా స్థిరంగా నిలబడి ఉండాలంటారు. మావయ్యగారు క్రియేటివ్ ఫ్లోలోకి వెళ్తే అందుకోలేం. ఎప్పుడూ తీరిక లేకుండా సినిమాలతోగడిపేవారు. ఈయన ఫ్రీ అయితే నాతో టైమ్ స్పెండ్ చేస్తారు అనుకున్న సందర్భాలేమైనా? జయలక్ష్మి: అమ్మో ఫ్రీ అయిపోతే ఎలా? సినిమాలు తీయడమే ఆయన ఉద్యోగం కదా. ఆ ఉద్యోగం నుంచి ఫ్రీ అయితే ఇల్లు గడిచేదెలా? విశ్వనాథ్‌గారు పని చేసిన హీరోయిన్లందరూ గొప్ప గొప్ప హీరోయిన్లు.. అందగత్తెలు కూడా. ఆ విషయంలో ఏదైనా భయంగా ఉండేదా? జయలక్ష్మి: అసలు ఆ ఆలోచనా విధానమే లేదు. ఏ వ్యక్తికైనా ఆలోచనలు బాగుండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడు అనుమానాలు, భయాలు ఉండవు. టైమ్‌పాస్ కోసం ఏం చేస్తారు? కె. విశ్వనాథ్: మా ఇంట్లో చాలా త్వరగా నిద్ర లేస్తాం. అందుకని పదకొండు గంటలకల్లా ఫ్రీ అయిపోతాం. ఇదిగో ఇలా హాలులో కూర్చుని టీవీ చూస్తాం. తను చాగంటి, గరికపాటి, తమిళంలో స్కంద కవచం.. వంటివన్నీ చూస్తుంది. పదకొండు గంటలకల్లా తన గదిలోకి వెళ్లిపోతుంది. హమ్మయ్య అనుకుంటాను. ఎందుకంటే నాకు వంటల కార్యక్రమాలు ఇష్టం. తను అలా గదిలోకి వెళ్లగానే నేను వంటల ప్రోగ్రామ్ పెట్టుకుంటా (నవ్వుతూ). -
దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసిన సినీ నటి జయప్రద
-
పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?
‘‘నా పల్లె గొప్పది. నా పల్లె పాట ఇంకా గొప్పది. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. అందరూ పట్టణాలకొస్తే పల్లెల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? అని ప్రశ్నించే కథ, కథనాలతో మా సినిమా రూపొందనుంది’’ అని జె.ఎల్. శ్రీనివాస్ అన్నారు. ‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన జె.ఎల్. శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించనున్నారు. సుగుణమ్మ రామిరెడ్డి సమర్పణలో లక్ష్మి శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఝాన్సీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జె.ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పల్లె సంస్కృతి గొప్పదనం చాటి చెప్పే చిత్రమిది. కోనసీమ, అరకుతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు. -
మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందిం చే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడైతే, నిర్మాణపరమైన విషయాలు తాను చూసుకుంటా నన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌తోపాటు ఆయన భార్య జయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్, కోడలు గౌరి, దర్శ కుడు ఎన్.శంకర్ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. విశ్వనాథ్ దంపతులను సీఎం పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యు లు కూడా సీఎంను సత్కరించారు. కేసీ ఆర్, విశ్వనాథ్ మధ్య సినిమాలు, సాహిత్యం, భాష తదితర అంశాలపై గంటకుపైగా చర్చ జరిగింది. కె. విశ్వనాథ్ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకరాభరణం 25 సార్లు చూశా.. ‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓసారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడంలేదు. మీరు మళ్లీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’అని కళాతపస్విని సీఎం కోరారు. గొంతు మార్చి మాట్లాడారని అనుకున్నా.. ‘మీరు అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైంది. మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి నాతో ఫోన్లో మాట్లాడి ఇంటికి వస్తున్నానని చెబితే.. ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరు గా చూడటం ఇదే తొలిసారి. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు ఎంజీఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటివారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది’అని విశ్వనాథ్ సీఎంతో చెప్పారు. ఆపరేషన్ అంటే భయం విశ్వనాథ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్‌కు వివరిస్తూ.. ‘ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. ఇక ఆపరేషన్ ఏమి చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా’అని కేసీఆర్‌కు తెలిపారు. తెలుగు మహాసభలు చక్కగా నిర్వహించారు తెలుగు భాష, సాహిత్యంపై కేసీఆర్‌కు చాలా పట్టు ఉందని, ప్రపంచ తెలుగు మహాసభలను చక్కగా నిర్వహించారని విశ్వనాథ్ కితాబిచ్చారు. ‘తెలుగు మాట్లాడడమే కాదు.. మంచి కళాభిమానిగా గుర్తింపు పొందారు. అసలు మీకు సాహిత్యాభిలాష ఎలా పుట్టింది’అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇందుకు సీఎం బదులిస్తూ.. తన గురువుల సాంగత్యం గురించి విశ్వనాథ్‌కు వివరించారు. కేసీఆర్‌కు అజ్ఞాత అభిమానిని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగానే తన ఇంటికి వచ్చారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని విశ్వనాథ్ స్పష్టంచేశారు. కేసీఆర్ కలిసి వెళ్లిన తర్వాత విశ్వనాథ్ మాట్లాడుతూ.. తనను ఓ అభిమానిగా ఆయన కలిశారని చెప్పారు. కేసీఆర్‌కు తాను అజ్ఞా త అభిమానినని చెప్పడాన్ని గర్వం గా భావిస్తున్నానన్నారు. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా కేసీఆర్ తన ఇంటికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య సాహిత్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కేసీఆర్‌లో ఇన్ని కోణాలు ఉన్నాయని తాను అనుకోలేదన్నారు. తన ఆరోగ్యం బాగుందని, ఇకపై తాను సినిమాలు తీయబోనని విశ్వనాథ్ స్పష్టం చేశారు. మీ తపన విజయవంతమవుతుంది విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కేసీఆర్‌కు తన అభిప్రాయాలు చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టారు. రైతుల కష్టాలు తీరతాయి. కాళేశ్వరం నీళ్లు వస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఎంతో ఆనందం చూశాను. నిజంగా చాలా గొప్ప ప్రాజెక్టు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే మీ తపన విజయవంతమవుతుంది’అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలమైన నీళ్లున్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులకు మేలు కలుగుతుందని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదే పనిలో ఉన్నాయని కేసీఆర్ ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కలుగజేసుకుని.. చాలా కష్టపడి ప్రాజెక్టులు కడుతున్నా మీకు విమర్శలు తప్పడంలేదు కదా.. ఎలా భరిస్తున్నారని సీఎంను ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నీ అలవాటైపోయాయని, ప్రజల కోసం వాటిని పెద్దగా పట్టించుకోకుండానే పనిచేసుకుని వెళ్లిపోతున్నానని ఆయన బదులిచ్చారు. ప్రజల కోసం చేసే పనికి దైవకృప ఉంటుందని, అది మీకు కూడా ఉంటుందని ఈ సందర్భంగా విశ్వనాథ్ సీఎం కేసీఆర్‌ను దీవించారు. హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుందని కేసీఆర్ ఆయనకు తెలిపారు. అనంతరం విశ్వనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ గ్రూప్ ఫోటో దిగారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. -
ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్
సాక్షి, హైదరాబాద్ : ఇకపై తాను సినిమాలు తీయనని ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న పుకార్లను ఆయన తోసిపుచ్చారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత పనిమీద మధ్యాహ్నం విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. అనంతరం కే విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మర్యాద పూర్వకంగానే సీఎం కేసీఆర్ నా వద్దకు వచ్చారు. నేను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదు. సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తా అని కేసీఆర్ రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్ నా ఇంటికి రావడం అంటే శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లు. నా అభిమానిగానే ఆయన మా ఇంటికి వచ్చార’’ని వెల్లడించారు. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ 2010లో చివరిసారిగా శుభప్రదం సినిమాను తెరకెక్కించారు. తరువాత పలు చిత్రాల్లో నటుడిగా కనిపించినా ఇటీవల వయోభారం కారణంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు. -
కె.విశ్వనాథ్ ఆరోగ్యంగా ఉన్నారు!
కళాతపస్వి కే విశ్వనాథ్ ఆరోగ్యం సరిగాలేదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆయన్ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళుతున్నారన్న వార్త ఆదివారం మీడియా సర్కిల్స్‌లో వినిపించింది. ఈ విషయం విశ్వనాథ్ వరకు వెళ్లటంతో ఆయన స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ వ్యక్తిగత పనిమీదే విశ్వనాథ్ గారిని కలిసినట్టుగా తెలుస్తోంది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ 2010లో చివరిసారిగా శుభప్రదం సినిమాను తెరకెక్కించారు. తరువాత పలు చిత్రాల్లో నటుడిగా కనిపించినా ఇటీవల వయోభారం కారణంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు. -
‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్ పురస్కారం
‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. దాదాసాహెబ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక జ్యూరీ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడంతో నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’ అని తెలిపారు. -
‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్ పురస్కారం
విశిష్ట దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే.. దాదాసాహెబ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక కథ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. డిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది ఎంతో మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడం నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’’ అని చెప్పారు. -
ఇలకొచ్చె జాబిల్లి
జాన్, అంగనా రాయ్, గాయని కల్పన, ప్రియ, తేజ రెడ్డి, హర్షద, జయవాణి, ‘జబర్దస్త్’ ఆర్పీ, వినోదిని, అప్పారావ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అదృశ్యం’. వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్పై రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆల్డ్రిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కళాతపస్వి కె.విశ్వనాథ్ రిలీజ్ చేశారు. రవిప్రకాష్ క్రిష్ణంశెట్టి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని ‘ఇలకొచ్చె జాబిల్లి...’ అనే మెలోడీ సాంగ్‌ని, ‘అందానికి అడ్రస్సే...’ అనే బీట్ సాంగ్‌ని వెన్నెలకంటిగారు రాశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి. ∙అంగనా రాయ్, జాన్ -
గొప్ప సంగీతభరిత చిత్రాన్ని చూశా
‘శంకరాభరణం, సాగరసంగమం’ వంటి అద్భుత సంగీతభరిత చిత్రాలను అందించారు కళా తపస్వి కె.విశ్వనాథ్. సంగీతం నేపథ్యంలో రాజీవ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ‘సర్వం తాళమయం’. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సర్వం తాళమయం’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించారు. పైగా ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’’ అన్నారు. రాజీవ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, నాగ్ అశ్విన్, మహి వి. రాఘవ్ తదితరులు మా చిత్రాన్ని చూసి అభినందించడం సంతోషంగా ఉంది. ఏఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, నిర్మాత: లత. -
'సర్వం తాళమయం'కు కళాతపస్వి ప్రశంసలు
శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు’ అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ సినిమా మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత లత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. -
అంతర్జాతీయ విశ్వదర్శనం
యాభై ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం... ఎన్నో అద్భుతమైన చిత్రాలు. మరెన్నో అవార్డులు.. కళాతపస్వి కె. విశ్వనాథ్ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఆయన అందించిన కృషి ప్రశంసనీయం, భావితరాలకు స్ఫూర్తిదాయం. అటువంటి గొప్ప దర్శకుని జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుని కథ అన్నది ఉపశీర్షిక. ‘దేవస్థానం’ తర్వాత విశ్వనాథ్, జనార్థన మహర్షి కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. కె. విశ్వనాథ్ లీడ్ రోల్లో ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలక్ట్ అయ్యింది. 2019 సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ విభాగం) ఈ చిత్రం ఎంపికైంది. ‘‘అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు మా సినిమా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప దర్శకుని జీవితం ఆధారంగా ఈ సినిమాను ఎంతో నిజాయతీగా తీశాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ను పది లక్షల మందికి పైగా చూడటం ఆనందంగా ఉంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేయాలనుకుంటున్నాం. ‘విశ్వదర్శనం’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రదర్శకుడు జనార్థన మహర్షి తెలిపారు. -
‘విశ్వదర్శనం’ టీజర్ లాంచ్
శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను విశ్వ దర్శనం పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మంగళవారం కె. విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, జనార్ధన మహర్షి, వివేక్ కూచిబొట్ల, తనికెళ్లభరణి, సింగర్ మాళవిక తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే విశ్వదర్శనం. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ‘మా అమ్మగారు విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆమె చిన్నప్పటి నుంచీ ఆయన తీసిన సినిమాల్లోని కథలను చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’ అనే చిత్రంలో ఆయన్ను డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ విశ్వదర్శనం సినిమా ద్వారా వచ్చింది. వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నా’ మన్నారు. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘అందరు దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్ గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్ధనమహర్షి ఒకరు. వారి ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు. -
నా గురించి అందరికీ తెలియాలనుకోను
‘‘నాకు నేను చాలా గొప్పవాడ్ని కావచ్చు కానీ నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్థన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రముఖ రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్లభరణి, గాయని మాళవిక తదితులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘అందరి దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్‌గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్థన మహర్షి ఒకరు. ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది’’ అన్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆయన తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెబుతుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటినుండి విశ్వనాథ్‌గారు డైరెక్టర్ కాదు, హీరో. నాకు గురువు, దైవం అయిన తనికెళ్ల భరణి గారి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్‌గా పని చేసి తర్వాత 100 సినిమాలకు పైగా మాటల రచయితగా పనిచేశాను. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’లో విశ్వనాథ్‌గారిని డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ ‘విశ్వదర్శనం’ సినిమా ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాలవల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు. ‘‘విశ్వనాథ్ గారి పక్కన కూర్చుని మాట్లాడటమే అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కథను నా గొంతుతో డబ్బింగ్ చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మాళవిక. -
పద్మశ్రీ’ నాది కాదు.. వారందరిదీ!
‘‘చెంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారు, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్లు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబ సభ్యులు. అందుకే తెలుగులో సినీ గేయకవితా రచన విభాగానికి తొలిసారి వచ్చిన ఈ ‘పద్మశ్రీ’ అవార్డు నాది కాదు.. వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు ఆశీర్వాద సభగా భావిస్తున్నా’’ అని సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. భారత ప్రభుత్వం సిరివెన్నెలకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్ స్వగృహంలో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట ఆత్మీయ అభినందన సభ జరిగింది. సీతారామశాస్త్రి దంపతులను, ఆయన మాతృమూర్తిని విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజులలానే ఇప్పటికీ నిగర్వంగా ఉండటం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు. విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని పాటలను గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్ గానం చేశారు. వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి, నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ ఫేమ్ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, నటుడు గుండు సుదర్శన్ పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, దశరథ్, వీఎన్ ఆదిత్య, ఇంద్రగంటి, కాశీ విశ్వనాథ్, బీవీఎస్ రవి, రచయితలు జనార్దన మహర్షి, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు ‘సిరివెన్నెల’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ∙సిరివెన్నెల, పద్మ, విశ్వనాథ్ -
సీనియర్ ఫిలిం ఎడిటర్ కన్నుమూత..
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ ఫిలిం ఎడిటర్ కె బాబురావు అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. అందులో అనేక విజయవంతమైన చిత్రాలతో పాటు చక్కటి కథాంశంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు అధికంగా ఉన్నాయి. కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాలకు బాబురావు ఎడిటర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం సాగింది. బాబురావు ఎడిటర్‌గా పనిచేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. బాబురావు మృతి పట్ల దక్షిణాది ఇండస్ట్రీ సంతాపం తెలియజేసింది. -
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్‌గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్‌గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్‌టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్‌స్టార్‌గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్‌గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్‌కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్‌లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్‌రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్‌ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్‌కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్‌బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్‌గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్‌కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్‌లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్‌లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్‌తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్‌కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్‌కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్‌బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్‌రెడ్డి (అర్జున్‌రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్‌బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్‌బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
కళా తపస్వి పాత్రలో ఎవరు..?
శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, చిరంజీవి, మమ్ముట్టి లాంటి టాప్ స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన విశ్వనాథ్ పాత్రలో ఎవరు నటిస్తారా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండంతో త్వరలోనే విశ్వనాథ్ పాత్రలో కనిపించే నటుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
బంగారు దర్శకుని కథ
దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె.విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి రానుంది. రచయిత, డైరెక్టర్ జనార్ధన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. కె. విశ్వనాథ్ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు. ‘‘విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంగీతం: స్వరవీణాపాణి. -
విశ్వదర్శనం ; కళాతపస్వి బయోపిక్
టాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ల బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో సీనియర్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ చేరారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. విశ్వనాథ్ బయోపిక్కు ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. నేడు జరిగిన పూజ కార్యక్రమంలో విశ్వనాథ్, తనికెళ్ల భరణి, జనార్ధన మహర్షితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో విశ్వనాథ్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన విశ్వనాథ్ జీవితంపై సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో పలువురు సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కె విశ్వనాథ్
-
కళాతపస్వికి పురస్కారం
ప్రముఖ సినీ దర్శకులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఈ ఏడాది ‘పద్మమోహన స్వర్ణకంకణం’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పద్మమోహన ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దేపల్లె యాదగిరి గౌడ్ తెలిపారు. సంస్థ 27వ వార్షికోత్సవాలు ఈ నెల 29న రవీంద్రభారతిలో జరగునున్న సందర్భంగా ఈ ప్రదానం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ హాజరు కానున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. అవార్డు ప్రదానానికి ముందు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోని పాటలతో ప్రత్యేక సినీ సంగీత విభావరి ఉంటుందని ఆయన తెలిపారు. -
కళా తపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
ఎన్నో కళాత్మక చిత్రాలతో తెలుగు వెండితెరను సుసంపన్నం చేసిన సీనియర్ దర్శకులు కళాతపస్పి కె.విశ్వనాథ్ గారిని విజయవాడ నగరంలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ లతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో కె.విశ్వనాథ్ చిత్రాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శిస్తారని తెలిపారు. -
విశ్వనాథే నాకన్నీ నేర్పించారు: కృష్ణ
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ప్రముఖ నటుడు కృష్ణ అభినందనలు తెలిపారు. ఆయన శనివారం విశ్వనాథ్ నివాసానికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ థ్రిల్లర్, యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విశ్వనాథ్‌తో తాను ఎక్కువ సినిమాలు చేయలేకపోయినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు నటన వచ్చేది కాదని, ఆరు నెలలు పాటు శ్రమించి విశ్వనాథ్ తనకు అన్నీ నేర్పించారని అన్నారు. (దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘ తేనె మనసులు’ చిత్రానికి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చేయ్యడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనెమనసులు' కృష్ణని హీరో చేసి నిలబెట్టింది) మరోవైపు కృష్ణ స్వయంగా తన ఇంటికి రావడంపై విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘కృష్ణ మా ఇంటికి రావడం కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: చిరు
-
ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: చిరు
కళాతపస్వీ కె. విశ్వనాథ్ గారికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడని కాకుండా కుటంబ పరంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నా. అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సింది. కానీ కాస్త ఆలస్యమైన అవార్డు ఆయన్ను వరించడం సంతోషంగా ఉంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావడంతో ఆ అవార్డుకు నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాబివందనాలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషినే..ఆయన చిరంజీవినే` అని అన్నారు. -
ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు
► సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన వేడుకలో జీవిత సాఫల్య పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ► కనులపండువగా అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన అతిరథులు ► తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి.. బెస్ట్ లిరిసిస్ట్‌గా సిరివెన్నెల ► తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి.. మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా మహేశ్‌బాబు సాక్షి, హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులు, సంస్థలను ‘సాక్షి’ సమున్నతంగా గౌరవించింది. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. సినీ దర్శకుడు దాసరి నారాయణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే..’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఇక మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నటుడు మహేశ్‌బాబు(శ్రీమంతుడు), తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(ఫిమేల్) జ్యోతి సురేఖ, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(మేల్) శ్రీకాంత్ , మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిలను అవార్డులు వరించాయి. అత్యంత వైభవంగా సాగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అభినందనీయం: కె.విశ్వనాథ్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. సాక్షి ఎంపికలో వైవిధ్యం ఉందని కొనియాడారు. సియాచిన్ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన ఓ సైనికుడి సేవలను గుర్తిస్తూ ఆయన భార్య, బిడ్డలకు ‘సాక్షి’ అవార్డు ఇవ్వడం తన హృదయాన్ని కదలించిందన్నారు. అలాంటి వీరులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి సాక్షి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాంటివారి మధ్య పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. విశ్వనాథ్‌కు సాక్షి చేస్తున్న ఈ సత్కారం సినీపరిశ్రమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.అవార్డులు వీరికే మెడ్‌ప్లస్ మెడికల్ షాప్‌లను వేలల్లో విస్తరించిన వ్యాపారవేత్త డాక్టర్ మధుకర్ గంగడికి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(లార్జ్)’ దక్కింది. అంధుడైన చక్కని చిట్కాలతో డిస్పోజబుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో దూసుకెళుతున్న బొల్లా శ్రీకాంత్ (బొల్లాంట్ ఇండస్ట్రీస్)ను ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(స్మాల్/మీడియం) అవార్డు వరించింది. విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. లక్షల్లో కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేసిన డాక్టర్ మదసి వెంకయ్యకు ఎక్సలెన్సీ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు దక్కింది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు లభించింది. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్ అందుకున్నారు. తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు గెల్చుకున్న బాల థెరిస్సా సింగరెడ్డి తరఫున శౌరిరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. సేంద్రియ సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా రైతు ఎం.వినోదకు ఎక్సలెన్సీ ఇన్ ఫామింగ్ అవార్డు దక్కింది. ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు ఎక్సలెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు, యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డు సోనీవుడ్‌ను వరించాయి. ఫోర్మ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డి.. ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ శాంతా సిన్హా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.పాపులర్ విభాగంలో వీరికే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా ‘శ్రీమంతుడు’ నిలిచింది. దర్శకుడు కొరటాల శివ, రవిశంకర్, సినీ నటుడు మహేశ్‌బాబు... రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేశ్‌బాబు సినీ నటి జయప్రద, వైఎస్ భారతి చేతుల మీదుగా అందుకున్నారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ (పండుగ చేస్కో), మోస్ట్ పాపులర్ డెరైక్టర్‌గా గుణశేఖర్(రుద్రమదేవి), మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్‌గా దేశీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి, కుమార్ 21ఎఫ్), పాపులర్ సింగర్‌గా సత్య యామిని, పాపులర్ సింగర్(మేల్)గా కారుణ్య అవార్డులు అందుకున్నారు. జ్యూరీ స్పెషల్ అవార్డు-బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్‌గా కంచె సినిమా అవార్డు దక్కించుకుంది. మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దేవీ శ్రీ ప్రసాద్ తరఫున సుకుమార్ అందుకున్నారు. వీరికి రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ, జయప్రద, ఆర్పీ పట్నాయక్, గుణశేఖర్, క్రిష్ తదితరులు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సెల్కాన్ కంపెనీ ఎండీ గురుస్వామి నాయుడు, సీఐఐ ప్రెసిడెంట్ వనిత దాట్ల, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గొప్పగా గౌరవిస్తోంది: రాజ్‌దీప్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి అవార్డులు ఇచ్చి ఎంతో గొప్పగా గౌరవిస్తోందని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చాలా చాలా ఆనందం... శ్రీమంతుడు సినిమా నా జీవితంలోనే బెస్ట్ టర్నింగ్ పాయింట్. సాక్షి మీడియా గ్రూప్ ద్వారా వరుసగా రెండోసారి మోస్ట్ పాపులర్ మేల్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా చాలా ఆనందం కలిగిస్తోంది. - హీరో మహేశ్‌బాబు ఈ అవార్డు తిరుపతి లడ్డూ లాంటిది... న్యాయస్థానాల్లో నిజం చెప్పమని అడుగుతూ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ ఆ అవసరం లేకపోయినా, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను... ఇక్కడకు వచ్చి, ఇక్కడ అవార్డులు అందుకున్న కొందరి ప్రొఫైల్స్ చూశాక... నేను సాధించింది చాలా తక్కువ అని నేను చాలా చిన్నవాడ్ని అని భావిస్తున్నాను. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే. - కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రభుత్వ అవార్డుల కన్నా మిన్న విభిన్న రంగాల నుంచి సేవ చేసిన వారిని ఎంపిక చేసి సాక్షి మీడియా అవార్డులు ఇచ్చి సత్కరించడం గొప్ప విషయం. మీడియా అవార్డులు ప్రభుత్వ అవార్డుల కన్నా గొప్పవి అంటాన్నేను. కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాధ్‌కి లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డ్ అందించడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఆయన సినిమాలు వేటికవే ఆణిముత్యాలు. ఆయన తీసిన సిరిమువ్వల సింహనాదం అనే ఒక్క సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అది చాలా గొప్ప సినిమా. బహుశా దాన్ని నేనే విడుదల చేస్తానేమో - సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుడు సినీరంగం అంటే కొందరికి చిన్న చూపు. అయితే అలాంటివారు కూడా గౌరవం ప్రకటించక తప్పని గొప్ప సినిమాలను తీసిన దర్శకుడు కె.విశ్వనాధ్. అలాంటి కళాతపస్విని సాక్షి మీడియా సత్కరించడం ఎంతైనా సముచితం. ఆయన సినిమా ద్వారా పుట్టిన రచయితగా ఈ వేడుకలో పాలు పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇదే కార్యక్రమంలో నాకు కూడా అత్యధిక ప్రజాదరణ పొందిన సినీ రచయిత పురస్కారం అందించినందుకు సాక్షికి, కంచె సినిమాలో ఆ పాట రాసే అవకాశం ఇచ్చిన సినిమా రూపకర్తలకు కృతజ్ఞతలు. - సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు వారి ఆదరణకు చిహ్నం సన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నేను సాధించింది చాలా తక్కువే అయినా... ఇలాంటి అరుదైన పురస్కారాలతో నన్ను అభిమానిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు ప్రేక్షకుల నన్ను ఆదరిస్తున్న తీరుకు మరో నిదర్శనం.- సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నత ప్రమాణాల సాక్షి... మీడియా గ్రూప్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించే సాక్షి నుంచి అవార్డు అందుకోవడం సంతృప్తిని అందించింది. - సినీ దర్శకుడు గుణశేఖర్ స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి వ్యక్తిగతంగా మంచి సక్సెస్‌ని అందించిన సినిమా శ్రీమంతుడు. దానికే సాక్షి ద్వారా మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి. - సినీ దర్శకుడు కొరటాల శివ వెరీ హ్యాపీ మంచి పాట పాడే అవకాశాన్ని అందించిన బాహుబలి సినిమా దర్శకులు, సంగీత దర్శకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు వచ్చినందుకు వెరీ హ్యాపీ. - గాయని సత్య యామిని ఈ వేదిక ఎంతో గొప్పది.. అవార్డు వస్తే జనం వై అనకూడదు. వైనాట్ అనాలి. గమ్యం నుంచి అలాంటి సినిమాలే తీస్తూ వస్తున్నాను. ఇక్కడ అవార్డు అందుకుంటున్న వారిని చూశాక... ఈ వేదిక నాకు చాలా గొప్పదిగా అనిపిస్తోంది. ఇలాంటి వేదిక మీద నేను కూడా అవార్డు తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది. - సినీ దర్శకుడు క్రిష్ అమ్మ పాట తెచ్చిన అవార్డు... నాకు మనసుకు బాగా నచ్చిన పాట ద్వారా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు జన్మనిచ్చి, తద్వారా ఈ పాటకి జన్మనిచ్చిన అమ్మకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. - సినీ గాయకుడు కారుణ్య ఆయన ఫొటో పక్కనే పెట్టుకుంటా... నా భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన లేకపోయినా, ఆయన త్యాగాన్ని గుర్తించి సాక్షి గ్రూప్ ఈ అవార్డు అందించడం ద్వారా నా భర్తను మరోసారి గౌరవించింది. ఇంటికి వెళ్లాక సాక్షి పురస్కారాన్ని నా భర్త ఫొటో పక్కనే పెట్టుకుంటా. - నసీమున్, అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య మీడియా చేసిన తొలి సత్కారమిది క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే ప్రతిభావంతురాలైన విద్యార్ధినిగా, అదీ ఒక ప్రతిష్టాత్మక మీడియా గ్రూప్ నుంచి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం చాలా తృప్తినిచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా ఇది నాకెంతో ప్రత్యేకం. -నైనా జైస్వాల్ వైఫల్యాలపై పోరాడే శక్తిని ఇచ్చింది జీవితంలో సామాజిక సేవ పరంగా ఎన్నో ఆశయాలున్నా, ఏమీ సాధించలేదని, నిస్పృహ చెందుతూ, అన్నింటా ఫెయిల్యూర్ అని బాధపడుతున్న నాకు సాక్షి అవార్డు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సాక్షి దినపత్రిక అభిమాని అయిన నా భార్య ఈ పోటీకి దరఖాస్తు చేయమని ప్రోత్సహించింది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చిన ఈ గుర్తింపు స్ఫూర్తిగా ముందడుగు వేస్తాను. - సోనీ వుడ్, సామాజికవేత్త మీడియా సంస్థ నుంచి తొలి అవార్డు ఇది ఒక మీడియా సంస్థ నుంచి నేను స్వీకరిస్తున్న తొలి అవార్డ్. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత మెడల్ సాధించాలనేదే లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు ఇలాంటి పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయి. - జ్యోతి సురేఖ, క్రీడాకారిణి సేవా హృదయాల కోసం డబ్బుండటం కాదు, సేవా హృదయం ఉండడం ముఖ్యం. అనంతపురంలో ప్రారంభించిన మా సేవాకార్యక్రమాలకు మరింత మంది ఊతంగా నిలవాలి. అందుకు ఇలాంటి పురస్కారాలు ఉపకరిస్తాయి. - మాచో ఫై, సామాజికవేత్త మంచికి ప్రోత్సాహమిది బాల థెరిసా కొన్నేళ్లుగా 6 వేల గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఆమె తరపున ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సమాజంలో మంచి అనేదే కొద్దిగా ఉంది. ఉన్న కొంచెం మంచిని ప్రోత్సహించడం మరీ కొరతగా ఉంది. అలాంటి ప్రోత్సాహం అందిస్తున్న సాక్షికి కృతజ్ఞతలు. -శౌరి రెడ్డి శాస్త్రవేత్తలందరికీ... అత్యాధునిక క్షిపణి సామర్థ్యం కలిగిన టాప్ 7 దేశాల్లో మన భారత్ ఒకటి. అందుకు హైదరాబాద్‌లోని తయారీ సంస్థలే ప్రధాన కారణం. నాకు లభించిన ఈ అవార్డ్‌ను ఈ రక్షణ రంగంలో పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్టుగా భావిస్తున్నా. - సతీశ్‌రెడ్డి, ప్రధాని రక్షణ సలహాదారు లక్ష్యసాధనలో స్ఫూర్తి... రాజకీయాల్లోకి నీతివంతులు, నేరచరిత్ర లేనివారు, మంచి వారు రావాలని, ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పనిచేయాలని మా సంస్థ కృషి చేస్తోంది. దీని కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇంకా ఎన్నో చేయాలి. లక్ష్యసాధనలో మాకు ఈ అవార్డు స్ఫూర్తి. -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆనందంగా అనిపిస్తోంది నాణ్యమైన ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనేది మా నినాదం. మన దేశ జనాభాలో ఇప్పటికీ 70శాతం గ్రామాల్లోనే ఉంది. వీరికి మంచి వైద్యం అందేందుకు కృషి చేస్తున్నాం. మా కృషిని సాక్షి గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరింత పట్టుదలగా పనిచేస్తాం.- డాక్టర్ మాదాసి వెంకయ్య మహిళా రైతులకు గుర్తింపు వ్యవసాయం చేసే మహిళలకు ప్రోత్సాహం కావాలి. అందరి ఆరోగ్యానికి మేలు చేసేలా, ప్రకృతి సహజమైన, సేంద్రియ సాగుకు కట్టుబడి ఉన్న మాకు సాక్షి ఇచ్చిన ఈ అవార్డు ఎంతో శక్తిని అందించింది. -వినోద, ఆదర్శ రైతు థ్యాంక్స్ టు సాక్షి గత పదేళ్లుగా మెడికల్ స్టోర్స్ నిర్వహణలో ఉన్నాం. నకిలీ మందుల విజృంభణకు విరుగుడుగా, మంచి, నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందిస్తున్నాం. ప్రస్తుతం 12 రాష్ట్రాలకు విస్తరించిన మా సంస్థను గుర్తించి అవార్డ్‌ని అందించినందుకు థ్యాంక్స్ టు సాక్షి -గంగాడి మధుకర్, వ్యాపారవేత్త వినూత్నంగా ఉండాలనుకున్నా ఒక వయసు రాగానే ప్రభుత్వోగం, పెళి...్ల మన దేశంలో పేరెంట్స్ ఐడియాలజీ అలా ఉంటుంది. అయితే నాకంటూ ఒక ప్రత్యేకత సాధించాలనుకున్నాను. ఎంచుకున్న రంగంలో నాదైన ముద్ర వేయాలనుకున్నాను. నా సక్సెస్‌కు సాక్షి ఇచ్చిన గుర్తింపు ఆనందాన్నిచ్చింది. -శ్రీకాంత్, అంధ వ్యాపారవేత్త -
అమ్ముడుపోయే వస్తువుకే ఆదరణ
రాజమండ్రి :‘అమ్ముడు పోయే వస్తువుకే ఆదరణ. నేడు విడుదలవుతున్న సినిమాలు కొన్ని రూ.70 కోట్లు, రూ.వంద కోట్లు వసూలు చేస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు ప్రేక్షకుల అభిరుచి మేరకే సినిమాలు తయారవుతాయి’ అని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. శనివారం కొంతమూరులో సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయాన్ని విశ్వనాథ్ సందర్శించారు. గత ఐదు దశాబ్దాలుగా సినిమా రంగంలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు విశ్వనాథ్‌పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకథ రాసే ఉద్దేశం లేదని, ఇతరులు ఎవరైనా ఆ పనికి పూనుకుంటే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది సినిమాల్లోనే చెప్పానని వివరించారు. శంకరాభరణం సినిమా విడుదలయ్యాక, సంగీత కళాశాలలో అడ్మిషన్లు పెరిగాయని, సాగరసంగమం తరువాత మగవారిలో నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగిందని, స్వర్ణకమలం తరువాత అడవారిలో నాట్యంపై ఆసక్తి పెరిందని వార్తలు వచ్చాయి.. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అనంతరం సామవేదం షణ్ముఖ శర్మ విశ్వనాథ్‌ను పూలమాలతో సత్కరించారు. శ్రీవల్లభగణపతి ట్రస్టు సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కె. విశ్వనాథ్
-
మా ఇద్దర్నీ కలిపింది తనే!
ఓ దర్శక దిగ్గజం మరో దర్శక ప్రముఖుని గురించి మాట్లాడితే... వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఒకరు కె. విశ్వనాథ్ అయితే, మరొకరు కె. బాలచందర్. ఇద్దరి ఇంటి పేర్లు కేతో ఆరంభమైనట్లుగానే, సినిమాల విషయంలోనూ ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒకటే. కళాత్మక చిత్రాల నుంచి విభిన్న వాణిజ్య చిత్రాల వరకూ ఇద్దరూ సృష్టించిన సంచలనాలు ఎన్నెన్నో. ఈ ఇద్దరు దర్శకులూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే ‘ఉత్తమ విలన్’. కమల్‌హాసన్ హీరోగా నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కమల్‌తో ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’లాంటి ఆణిముత్యాలను విశ్వనాథ్ రూపొందిస్తే, బాలచందర్ ‘అవళ్ ఒరు తొడర్ కథై’, ‘అపూర్వ రాగంగళ్’ వంటి అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దర్నీ తన గురువులుగా భావిస్తారు కమల్. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఉత్తమ విలన్’లో ఉన్న రెండు కీలక పాత్రలను ఈ ఇద్దరూ చేస్తే బాగుంటుందని కమల్ భావించారు. స్వయంగా ఈ ఇద్దర్నీ సంప్రదించి, ఒప్పించారట. ఈ విషయాన్ని కె. విశ్వనాథ్ స్వయంగా చెప్పారు. ‘‘బాలచందర్, నేను బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఎక్కువసేపు కలిసి మాట్లాడుకోవాలనుకునేవాళ్లం. కానీ, కుదిరేది కాదు. ఒకరికొకరం సినిమా మేకింగ్ గురించి తెలిసిన విషయాలు పంచుకోవాలనుకునేవాళ్లం. కానీ, తీరిక లేక అది జరగ లేదు. ఇప్పుడు బాలచందర్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేటి తరం నటీనటులతో సినిమా చేయడంకూడా మంచి అనుభూతినిస్తోంది’’ అని విశ్వనాథ్ చెప్పారు. -
మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్...
తెర వెనుక కె.విశ్వనాథ్, తెరపైన కమల్‌హాసన్.. ఇక చెప్పేదేముంది! తన్మయానందభరితం. అలా కాకుండా ఇద్దరూ కలిసి నటిస్తే! నయనానందభరితం. అసలు ఈ కాంబినేషన్‌ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తే కాదు. కమల్, విశ్వనాథ్ కలిసి నటించిన తొలి సినిమా ‘శుభసంకల్పం’. ఎస్పీ బాలు అభ్యర్థనను తోసిపుచ్చలేక తొలిసారి ఆ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు విశ్వనాథ్. ఆ తర్వాత పి.సి. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన‘ద్రోహి’ సినిమా కోసం విశ్వనాథ్, కమల్ కలిసి నటించారు. ‘ద్రోహి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ రెండు దిగ్గజాలు తెరను పంచుకోబోతున్నాయి. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ మామయ్యగా విశ్వనాథ్ నటిస్తున్నారు. కథలో ఇది కీలకమైన పాత్ర కావడంతో స్వయంగా కమల్‌హాసనే... ఈ పాత్ర నటించాలని విశ్వనాథ్‌ని కోరారట. దాంతో కాదనలేక ఆ పాత్ర చేయడానికి అంగీకారం తెలిపారు విశ్వనాథ్. కథానుగుణంగా ఇందులో 8వ శతాబ్దం నాటి సన్నివేశాలు కొన్ని ఉంటాయట. ఆ సన్నివేశాల్లో విశ్వనాథ్ కనిపిస్తారట. ఊర్వశి, పార్వతీ మీనన్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.