కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్‌.. కానీ ఆ సినిమాతో! | Do You Know About K Viswanath S Sentiment | Sakshi
Sakshi News home page

K Viswanath: కళాతపస్వికున్న సెంటిమెంట్‌ ఏంటో తెలుసా?

Published Sat, Feb 4 2023 5:58 PM | Last Updated on Sat, Feb 4 2023 6:05 PM

Do You Know About K Viswanath S Sentiment - Sakshi

దిగ్గజ దర్శకులు, నటుడు కె.విశ్వనాథ్‌ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రేక్షకుల కోసం ఎన్నో అద్భుత కళాఖండాలు అందించిన ఆయన శంకరాభరణం రిలీజైన రోజే శివైక్యమయ్యారు. తన సినిమాలతో వినోదాన్ని పంచడమే కాకుండా అంతర్లీనంగా సందేశాలు కూడా ఇచ్చేవారు. ఆయన తీసిన అద్భుత చిత్రాల్లో స్వర్ణకమలం కూడా ఒకటి. ఈ సినిమా గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వనాథం. ఓసారి ఆ విశేషాలేంటో గుర్తు చేసుకుందాం..

'శాస్త్రీయ కళలను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదన్న గట్టి అభిప్రాయంతో ఉన్న పాత్ర మీనాక్షి. దానికితోడు హడావుడి,నిర్లక్ష్యం, అవసరానికి చిన్నాపెద్ద అబద్ధాలాడే క్యారెక్టర్‌ ఆమెది. సినిమా చూసి ఇంటికొచ్చి హాస్పిటల్.. ఫ్రెండ్‌ పురుడు అని కట్టుకథలల్లి ‘వాళ్లంతిదిగా అడుగుతుంటే ఎలా నాన్నా కాదనేది?’ అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడే స్వీట్‌లయర్‌ ఆమె. ఇదిలా ఉండగా ఆమె స్వాతంత్య్రానికి అడుగడుగునా పార్క్‌ నుంచి మొదలై గజ్జెలు తీసేదాకా వచ్చి, చివరికి హోటల్‌లో ఇష్టమైన ఉద్యోగం పోయేదాకా ఆమెను విసిగించే క్యారెక్టర్‌ వెంకటేష్‌ది. ఒకటేమిటి... మిడిల్‌ క్లాస్‌ఫ్యామిలీస్‌లో మనం నిత్యం చూసే  స్టేషన్‌మాస్టర్, టీచర్‌... అలా అందరి క్యారెక్టర్లు వేటికవే నిలిచిపోయాయి. ‘స్వయంకృషి’లో విజయశాంతి ‘అట్టసూడమాకయ్యా’ అన్నట్టు ఈ సినిమాలో కూడా ఏదయినా మెలిక పెడితే బాగుంటుందని అనిపించి అర్థం చేసుకోరూ.. అని డైలాగ్‌ పెట్టాం'.

‘హారతుల’ ట్రాక్‌ గురించి మాట్లాడుతూ... దాని జన్మ చాలా గమ్మత్తుగా జరిగింది.ఆ ట్రాక్‌ ముందే అనుకున్నాం, రాశాం, డిస్కస్‌చేశాం. అయితే నాకెందుకో అది తృప్తిగా అనిపించలేదు. ఓరోజు మధ్యాహ్నం రెండింటి నుంచి షూటింగ్‌ అనగా, పదకొండు గంటలకు భగవంతుడు చిన్న ఫ్లాష్‌ ఇచ్చాడు. వెంటనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని పిలిచి ‘పక్కింటి డాబాలో వాళ్ళని వెళ్ళి అడుగు... మొత్తం గోడలకంతాదేవుళ్ళ పటాలు పెడతాం, పొగ పెట్టినట్టు చేస్తాం, షూటింగ్‌ అయ్యాక మళ్ళీ బాగుచేసి ఇస్తాం... వాళ్ళకి ఓకేనా’ అని చెప్పాను. వాళ్ళు ఓకే అనగానే వెంటనే సిటీకి పంపించి పటాలు తెప్పించి, సీన్‌లు, డైలాగ్‌లు అప్పటికప్పుడు మార్చి షూట్‌చేశాం. అతిభక్తితో అస్తమానం హారతులు ఇచ్చే శ్రీలక్ష్మి క్యారెక్టర్‌ – కుంపటి కమ్ము వంకాయలా కందిపోయిన సాక్షి రంగారావు క్యారెక్టర్‌.. అలా పుట్టాయి.

తన సెంటిమెంట్‌ గురించి చెప్తూ.. దాదాపు ప్రతి సినిమాలో శివుడి మీద ఏదో ఒకపాట ఉంటుంది. ఈ సినిమాలో కూడా రెండున్నాయి. అది భగవదేచ్ఛ. నేను కావాలని ప్రయత్నించను. ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడిగాను. (సాధారణంగా ఏ కవిత్వమైనా, కావ్యమైనా శ్రీకారంతో మొదలవుతుందని) దానికాయన ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతా గంగమ్మ వాన’ అని రాశారు. నేను ఆయన్ని ‘శ్రీ’తో రాయమని అడిగానే తప్ప శివుడు మీద రాయమని అడగలేదు! ఇంకా చెప్పాలంటే నాకు‘ఎస్‌’ సెంటిమెంట్‌ ఉంది. సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా...భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్‌’తో పెట్టిన 2–3 సినిమాలు వరుసగా హిట్‌ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఆపద్బాంధవుడుకు మాత్రం అది కుదరలేదు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ సరేనన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్‌’ సెంటిమెంట్‌ మైండ్‌ నుంచి స్లిప్‌ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు విశ్వనాథం.

చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు, అసలేం జరిగింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement