కళాతపస్వి కె. విశ్వనాథ్‌.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట | K Viswanath Shares How Sirivennela Movie hurts him mentally In An Old Interview | Sakshi
Sakshi News home page

K Viswanath : కె. విశ్వనాథ్‌ను మానసిక సంఘర్షణకు గురిచేసిన సినిమా అదే.. ముఖ్యంగా ఆ సీన్‌ కోసం!

Published Sat, Feb 4 2023 3:33 PM | Last Updated on Sat, Feb 4 2023 3:40 PM

K Viswanath Shares How Sirivennela Movie hurts him mentally In An Old Interview - Sakshi

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్‌ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్‌ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అ‍మ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్‌ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్‌ వాళ్ళకి సంబంధించిన ఇయర్‌ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్‌ పర్సన్స్‌లా ట్రీట్‌ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్‌ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్‌ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు.

ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్‌లెట్‌ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్‌ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్‌ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్‌ చేసుకున్న సీన్లు ఎన్నో!

తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్‌ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎన్ని రోజులు స్పెండ్‌ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్‌!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్‌స్ట్రాక్ట్‌తో రా, నేను దాన్ని ఇంటర్పెట్‌ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని.

సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్‌ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్‌ప్లెయిన్‌ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్‌ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్‌ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్‌ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్‌లో మూన్‌మూన్‌సేన్‌ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను.

అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్‌ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్‌ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది.  ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్‌ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్‌ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్‌ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను.

ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది.

అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం  ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది.  షూటింగ్‌ టైంలో లిరిక్‌ రైటర్, డైలాగ్‌రైటర్‌ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్‌ ఫిల్మ్‌ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్‌ అవ్వగానే ఈవెనింగ్‌ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్‌బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్‌లో చరణాలు కూడా రాసెయ్‌. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్‌ నేను క్రియేట్‌ చేస్తాను’' అన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement