kalatapaswi
-
కళాతపస్వి కె. విశ్వనాథ్.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట
కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అమ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్ పర్సన్స్‌లా ట్రీట్ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్లెట్ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు స్పెండ్ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్స్ట్రాక్ట్తో రా, నేను దాన్ని ఇంటర్పెట్ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని. సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్లో మూన్‌మూన్‌సేన్ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను. అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది. ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది. అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది. షూటింగ్ టైంలో లిరిక్ రైటర్, డైలాగ్‌రైటర్ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్ అవ్వగానే ఈవెనింగ్ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్లో చరణాలు కూడా రాసెయ్. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను’' అన్నాను. -
విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి
కళాతపస్వి కె. విశ్వనాథ్ ని చిరంజీవి గురువులా భావిస్తారు. దీపావళి పండగ సందర్భంగా సతీమణి సురేఖతో కలసి గురువు ఇంటికి వెళ్లారు చిరంజీవి. విశ్వనాథ్ దంపతులు చిరు దంపతులను ఆశీర్వదించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచాయి. గురు–శిష్యులిద్దరూ తమ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విశేషాలను, ఆ సినిమాల సమయంలో ఏర్పడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశ్వనాథ్‌గారిని కలవాలనిపించి ఆయన ఇంటికి వచ్చాను. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారాయన. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి. -
‘ఇచ్చిన మాట కోసమే మహాసభలకు వెళ్లలేదు..’
సాక్షి, తెనాలి : సినిమా దర్శకుడిగా భగవంతుడు నిర్దేశించిన సేవను భక్తిప్రవత్తులతో ఆచరించానని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. భగవంతుడు తననొక దర్శకుడిని చేసి, సినిమా మీడియా అనే బస్సులోని భక్తులను జాగ్రత్తగా సినిమా అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లమని చెప్పగా దానిని పాటించానన్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తెనాలిలోని నాజరుపేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డు స్వీకరించి మాట్లాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విశ్వనాథ్‌కు అవార్డు అందజేశారు. తల్లి బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు విషం పెట్టదని, పాల బువ్వ పెడుతుందన్నారు. తానూ కూడా అదే పని చేస్తున్నానన్నారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కులమత కుడ్యాలను ఛేదించాలని విశ్వనాథ్ తన చిత్రాల్లో చూపించారన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా మాట్లాడారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎల్‌ఆర్‌ఎం క్లబ్ సభ్యులు ఆర్థికసాయం అందజేశారు. ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ట్రస్ట్ కార్యదర్శి మారౌతు సీతారామయ్య, నన్నపనేని భాగ్యలక్ష్మి, సూర్యకుమారి, సుగుణ తదితరులు పర్యవేక్షించారు. ఇచ్చిన మాట కోసమే తెలుగు మహాసభలకు వెళ్లలేదు.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. అందుకే హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయా..’నని ప్రముఖ సినీ దర్శకుడు, కె.విశ్వనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి సోషలిస్టు ఉద్యమనేత నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డును రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడారు. హైదరాబాద్ రావాలంటూ ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని, కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్ట్‌కు మాట ఇచ్చినందున రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు చెప్పానన్నారు. -
నేడు తాడిపత్రికి కళాతపస్వి
తాడిపత్రి టౌన్ : స్థానిక సరస్వతీ విద్యామందిరంలో ఆదివారం జరిగే ఘంటసాల పోటీల్లో విజేతల బహుమతుల పంపిణీకి ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ పాల్గొంటారని స్థానిక శ్రీ అన్నమయ్య సంకీర్తనా సేవా సమితి సభ్యుడు మహేష్‌స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య సంకీర్తనా సేవా సమితి ఆధ్వర్యంలో నవంబర్ 27వ తేదీన ఘంటసాల, జానకి, సుశీల పాడిన పాటలపై పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులను కె.విశ్వనాథ్ పంపిణీ చేస్తారన్నారు. అలాగే ఉదయం ఆర్వీ స్వామి కల్యాణ మండపంలో చర్చావేదికలో కె.విశ్వనాథ్ పాల్గొంటారన్నారు. -
శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అనంతపురం కల్చరల్ : శాస్త్రీయ సంగీతానికి, నాట్యానికీ ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. మారుతున్న కాలానికనుగుణంగా సినిమా వస్తువులోనూ మార్పు వస్తోందని కళాతపస్వి కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో ఓ సంగీతోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శాస్త్రీయ సంగీతం, నేటి సినిమాలు తదితర విషయాలపై ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : శంకరాభరణం లాంటి సినిమాలను మళ్లీ మీ నుంచి ఆశించొచ్చా? విశ్వనాథ్ : ఎప్పుడేమవుతుందో చెప్పలేం. శంకరాభరణమే కాదు సాగర సంగమం, సిరివెన్నెల ప్రతీది దేని ప్రత్యేకత దానిది. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. సాక్షి : ఇప్పుడొస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికేమిటి పరిష్కారం ? విశ్వనాథ్ : సినిమాలే కాదు..నిత్యం వస్తున్న టీవీ సీరియళ్లు ఆడవారిని విలన్లుగా చూపుతున్నాయి. మంచి విషయాన్ని చూడాలంటేనే కనిపించడం లేదు. టీవీకి ఇంటిల్లిపాది బానిసగా మారిపోతున్నారు. చాలా వరకు నేటి యువతలో బాగా అసహనం పెరిగిపోయింది. సాక్షి : యువతను మంచి సినిమాలు మార్చలేవా ? విశ్వనాథ్ : పూర్వం చాలా సినిమాలు చూసి మారిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ సందేశాత్మకంగా తీయాలంటే నిర్మాతలు భయపడాల్సివస్తోంది. తల్లిదండ్రుల అతి ప్రేమ పిల్లల్లో మార్పుకు ప్రధాన కారణంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి విషయాలపట్ల వారి మనసు మళ్లించాలి. సాక్షి : నేటి సినిమాలు పూర్తీగా కమర్షియల్‌గా మారిపోతున్నాయన్న విమర్శకు మీరేమంటారు? విశ్వనాథ్ : సినిమా అంటేనే వ్యాపారం. అయితే దురదృష్టవశాత్తు వ్యాపారమే సినిమాగా మారిపోతోంది. అందుకు అనేక కారణాలుండొచ్చు. మంచి విషయాలను చెప్పే నిర్మాతలు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించాలి. సాక్షి : పూర్వం శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఈనాడు గట్టిగా నెలరోజులు ఆడడం లేదు. మళ్లీ అలాంటి రోజులెలా వస్తాయి ? విశ్వనాథ్ : మా రోజుల్లో సినిమాను తపస్సుగా భావించేవాళ్లం. ఇప్పుడంతా వ్యాపార దృక్పథమే. మొదటిరోజే రెండు వందల నుండి నాల్గు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ ధోరణి సినిమాను ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా చేయడం లేదు. దానికి తోడు పైరసీ భూతం మంచి సినిమాను తినేస్తోంది. సాక్షి : సినిమాల్లో మంచి మార్పునకు దోహదపడిన మీరు.. టీవీల ద్వారా కూడా మార్పు తెచ్చే అవకాశముందా ? విశ్వనాథ్ : మన చేతుల్లో లేదు. మంచి జరగాలనుకుంటే భగవంతుడు నా ద్వారా చేయిస్తాడేమో. అయినా నేటి టీవీ సీరియళ్లకు రేటింగే ముఖ్యం. నేను చేస్తే రేటింగ్ ఉండదేమో. సాక్షి : వృద్ధాప్యం హాయిగా సాగాలంటే మీరిచ్చే సలహాలేంటి ? విశ్వనాథ్ : వార్థక్యం భయంకరమైనదేమీ కాదు. కాకపోతే అతిగా ఉండే అటాచ్మెంట్ వల్ల టెన్షన్స్ ఎక్కువవుతున్నాయి. వయసుపెరిగే కొద్దీ కొంతైనా అటాచ్మెంట్ తగ్గించుకుని ఆధ్యాత్మిక భావనలు పెరిగితే ఏ స్థితైనా హాయిగానే ఉంటుంది.