శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ | The popularity of classical music from renewable sources | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ

Published Sat, Sep 10 2016 9:35 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ - Sakshi

శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ

  •  ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌
  • అనంతపురం కల్చరల్‌ :  శాస్త్రీయ సంగీతానికి, నాట్యానికీ ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. మారుతున్న కాలానికనుగుణంగా సినిమా వస్తువులోనూ మార్పు వస్తోందని కళాతపస్వి కె. విశ్వనాథ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో ఓ సంగీతోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ‘సాక్షి’తో శాస్త్రీయ సంగీతం, నేటి సినిమాలు తదితర విషయాలపై ప్రత్యేకంగా ముచ్చటించారు.


    సాక్షి : శంకరాభరణం లాంటి సినిమాలను మళ్లీ మీ నుంచి ఆశించొచ్చా?
    విశ్వనాథ్‌ : ఎప్పుడేమవుతుందో చెప్పలేం. శంకరాభరణమే కాదు సాగర సంగమం, సిరివెన్నెల ప్రతీది దేని ప్రత్యేకత దానిది. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు.


    సాక్షి : ఇప్పుడొస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికేమిటి పరిష్కారం ?
    విశ్వనాథ్‌ : సినిమాలే కాదు..నిత్యం వస్తున్న టీవీ సీరియళ్లు ఆడవారిని విలన్లుగా చూపుతున్నాయి. మంచి విషయాన్ని చూడాలంటేనే కనిపించడం లేదు. టీవీకి ఇంటిల్లిపాది బానిసగా మారిపోతున్నారు. చాలా వరకు నేటి యువతలో బాగా అసహనం పెరిగిపోయింది.  


    సాక్షి : యువతను మంచి సినిమాలు మార్చలేవా ?
    విశ్వనాథ్‌ : పూర్వం చాలా సినిమాలు చూసి మారిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ సందేశాత్మకంగా తీయాలంటే నిర్మాతలు భయపడాల్సివస్తోంది. తల్లిదండ్రుల అతి ప్రేమ పిల్లల్లో మార్పుకు ప్రధాన కారణంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి విషయాలపట్ల వారి మనసు మళ్లించాలి.  


    సాక్షి : నేటి సినిమాలు పూర్తీగా కమర్షియల్‌గా మారిపోతున్నాయన్న విమర్శకు మీరేమంటారు?
    విశ్వనాథ్‌ : సినిమా అంటేనే వ్యాపారం. అయితే దురదృష్టవశాత్తు వ్యాపారమే సినిమాగా మారిపోతోంది. అందుకు అనేక కారణాలుండొచ్చు. మంచి విషయాలను చెప్పే నిర్మాతలు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించాలి.


    సాక్షి :  పూర్వం శతదినోత్సవాలు, సిల్వర్‌ జూబ్లీలు ఆడేవి. ఈనాడు గట్టిగా నెలరోజులు ఆడడం లేదు. మళ్లీ అలాంటి రోజులెలా వస్తాయి ?
    విశ్వనాథ్‌ : మా రోజుల్లో సినిమాను తపస్సుగా భావించేవాళ్లం. ఇప్పుడంతా వ్యాపార దృక్పథమే. మొదటిరోజే రెండు వందల నుండి నాల్గు వందల థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ ధోరణి సినిమాను ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా చేయడం లేదు. దానికి తోడు పైరసీ భూతం మంచి సినిమాను తినేస్తోంది.


    సాక్షి : సినిమాల్లో మంచి మార్పునకు దోహదపడిన మీరు.. టీవీల ద్వారా కూడా మార్పు తెచ్చే అవకాశముందా ?
    విశ్వనాథ్‌ : మన చేతుల్లో లేదు. మంచి జరగాలనుకుంటే భగవంతుడు నా ద్వారా చేయిస్తాడేమో. అయినా నేటి టీవీ సీరియళ్లకు రేటింగే ముఖ్యం. నేను చేస్తే రేటింగ్‌ ఉండదేమో.


    సాక్షి : వృద్ధాప్యం హాయిగా సాగాలంటే మీరిచ్చే సలహాలేంటి ?
    విశ్వనాథ్‌ : వార్థక్యం భయంకరమైనదేమీ కాదు. కాకపోతే అతిగా ఉండే అటాచ్‌మెంట్‌ వల్ల టెన్షన్స్‌ ఎక్కువవుతున్నాయి. వయసుపెరిగే కొద్దీ కొంతైనా అటాచ్‌మెంట్‌ తగ్గించుకుని ఆధ్యాత్మిక భావనలు పెరిగితే ఏ స్థితైనా హాయిగానే ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement