
బ్రహ్మానందంతో మాటా మంతీ...
బ్రహ్మాండమైన హాస్యనటుడు బ్రహ్మానందం. కానీ తనని మించిన హాస్య నటులు చాలామంది ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే..? ‘చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ... ఆనందపరుస్తూ... నవ్విస్తూ ఉండగలిగితే నీ అంతటి హాస్య నటుడు ఇంకొకడు లేడు’ అన్నారు బ్రహ్మానందం. సంతృప్తే సంతోషం అనే ఈ సదానందం ‘వరల్డ్ హ్యాసీనెస్ డే’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.
→ ఆనందానికి మీరిచ్చే నిర్వచనం?
ఆనందం అనేది ఓ అనుభూతి... ఓ భావోద్వేగం. నవ్వు కూడా ఓ అనుభూతి. కేవలం శబ్దం కాదు. ఇక ఆనందం ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వు చేసే పని ద్వారా నువ్వు ΄పొందే అనుభూతే ఆనందం. మన మనసుకి ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే ఆనందానికి నిర్వచనం.
→ ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆనందంగా ఉన్నట్టేనా?
ఉన్నట్టు కాదు. నవ్వు నిస్సహాయతలోనూ వస్తుంది. అలానే ఏడుస్తున్నాడంటే విపరీతమైన బాధలోనూ ఉన్నట్టు కాదు. మనం ఒక ట్రాజెడీ నాటకం చూస్తున్నప్పుడు ఏడుస్తుంటాం. కానీ అది మన వ్యక్తిగత బాధ కాదు. మనం చూస్తున్న దాని ద్వారా ΄పొందిన అనుభూతి. ‘వియ్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ట్రాజెడీనెస్ ఆల్సో’. ఇక మనిషి భావాలను బట్టి అతను బయటకు కనిపించేది... అతని లోపల జరిగేది ఒకటే అనుకోలేం.
→ చిన్నప్పుడు మీరు ఆర్థికపరమైన, ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సో... మీకు పరిపూర్ణమైన ఆనందం పరిచయమైనది ఎప్పుడు?
నే¯ð ప్పుడూ ఆనందం ఇలా ఉంటుంది... దుఃఖం ఇలా ఉంటుందీ అనుకోలేదు. రెండింటినీ వేరువేరుగా చూడలేదు... తెలియదు కూడా. ఆర్థిక సమస్యలుంటే దుఃఖం, అవి లేకుంటే ఆనందం అనుకోలేదు. ఒక మహర్షిలా తలకిందులుగా తపస్సు చేసి, నేర్చుకున్నటువంటి జ్ఞానం కాదిది. స్వతహాగానే ఏర్పడింది. ఈ పూట భోజనం ఉండదే అని బాధపడిపోలేదు. బట్టలు సరిగ్గా లేవా... ఓకే అనుకునేవాణ్ణి. అమ్మ పెట్టిందే బాగుందనుకోవడం.... నాన్న ఇచ్చినవే బాగున్నాయనుకోవడం. ఆనందాన్ని, దుఃఖాన్ని విభజించడం రాకపోవడం నాకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. బావుంది. అలాగని బ్రహ్మానందపడిపోలేదు. అప్పటి ఆ దుఃఖం తెలియకపోవడంవల్లే ఇప్పటి ఈ ఆనందం కూడా మనసుకి ఎక్కలేదు అనుకుంటుంటా. అయినా ప్రతిదీ లోతుగా విశ్లేషించి చూడక్కర్లేదు. సౌకర్యం ఇచ్చేది ఆనందం అంటా. అలాగే అసౌకర్యం ఆనందం ఇవ్వనిది కాదు కానీ విషాదం అని మాత్రం అనను.
→ స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది మీకు చిన్నప్పుడే అలవాటైందనుకోవచ్చా?
ఏమో... ఏది ఏమైనా జీవితం నేర్పినపాఠాలు కొన్ని ఉంటాయి. పేదరికమంటే నాకు విపరీతమైన ఇష్టం. అందుకే నేను పేదవాళ్లకి సహాయం చేసినా బయటకు చెప్పను... కానీ చేస్తూనే ఉంటా. ఇక పేదరికం అనేది మన దగ్గర ఏది లేదో దాన్ని సంపాదించడానికి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నీ దగ్గర తిండి, డబ్బు, గౌరవం లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తావు. అలా నీకు లేనిదాన్ని ΄పొందడానికి దారి చూపించే ఓ మంచి మార్గం పేదరికం. అందులో నుంచి ఎలా బయటకు రావాలనే తపన ఉండాలి తప్ప మనకు లేదు... వాడికి ఉంది అని పోల్చి చూసుకోవడాలు ఉండకూడదు. ఈ లేదూ... ఉంది అనే ఆలోచనల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు.
→ పేరుకు తగ్గట్టు మీరు బ్రహ్మానందాన్ని పంచుతున్నారు... ‘నాకీ పేరు ఎందుకు పెట్టాలనిపించింది’ అని మీ తల్లిదండ్రులను ఎప్పుడైరా అడిగారా?
ఇలా మన గురించి ఒకరు అనుకుంటే హ్యాపీగా ఉంటుందేమో. నేనెప్పుడూ వాళ్లని అడగలేదు. అడుగుదామనే స్థాయికి చేరుకునే సరికి వాళ్లు పెద్దవాళ్లై పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. నేను ఏడోవాడిని. ఏదో పేరు పెట్టారు... అనుకున్నానంతే. ఇప్పుడీ స్థితికి వచ్చాక నా తల్లిదండ్రులు పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ జరిగిందని అనుకుంటుంటాను.
→ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కొందరు మీ కామెడీ సీన్లు చూసి, రిలీఫ్ అవుతుంటారు. మరి... మీ స్ట్రెస్ బస్టర్?
నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నా ఫిలాసఫీ చె΄్పాను కదా. బాధ, ఆనందం వేరు వేరు అనుకోను. కెరటం ఎగిసినప్పుడు విజయం అని, కిందపడినప్పుడు అపజయం అనీ అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకటే. అలాగే ఆనందం, బాధ కూడా. గతంలో ఇదే ప్రశ్న అడిగి ఉండుంటే, మంచి భోజనం తింటే ఆనందం అనేవాణ్ణేమో. కానీ ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో తినే ఓపిక, తిన్నా అరిగించుకునే ఓపిక రెండూ లేవు. ‘ఏంటోనండీ ఓ ముద్ద తినలేకపోతున్నాం’ అనుకోవాలి. దీన్ని మళ్లీ బాధ అంటున్నాం. ఇది కూడా బాధ కాదు. ఆనందం, బాధ... ఈ రెండూ మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటాయి.
→ మీ లైఫ్‌లో డల్ మూమెంట్స్ ఉంటాయా?
సూర్యుడే డల్ అయిపోతాడు సాయంత్రానికి. మనమెంత? ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ. అయితే కోరి డల్‌నెస్ తెచ్చుకోవడం వేరు... రావడం వేరు. సాగుతున్నప్పుడు డల్‌నెస్ అదే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు నాలుగు గంటలకల్లా కాఫీ ఇవ్వాలనుకోండి... ఓ రెండు నిమిషాలు లేట్ అయిందంటే... ఏంటో ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని డల్ అయిపోవచ్చు... ఏముందీ కాస్త లేట్ అయిందని కూల్‌గానూ ఉండొచ్చు. సో... డల్‌నెస్ అనేది సాగనప్పుడు రాదు. జీవితం అనేది మన చేతిలో స్టీరింగ్ లాంటిది. ఎటు తిప్పుతున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది.
→ ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే విపరీతంగా బాధపడిపోతున్న ధోరణి కనబడుతోంది... వాళ్లకి ఏం చెబుతారు?
ఇప్పుడు యువత ఆనందంగా లేరని చెప్పలేం. అయితే ఇప్పుడు యూత్‌లో ఎక్కువమంది కష్టపడకుండా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. అలా కాకుండా కష్టపడి పని చేసి, సక్సెస్ సాధించాలి. వేరే ఇతర మార్గాల వైపు... అంటే సులువైన మార్గాల్లో వెళ్లి సంపాదించుకుంటే, కష్టపడి సాధించేదాంట్లో దొరికే తృప్తి దొరకదు. ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకూ చెప్పే ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం గొప్పదనం ఏంటంటే... ఎదుటివారిని బాధించకుండా ఉండటం. ఎవరి అభిప్రాయం వారిది అని గౌరవించడం.
→ ప్రస్తుతం దాదాపు అందరి జీవితం ఒత్తిడి అయిపోయిన ఫీలింగ్...
ఒత్తిడి లేకుండా ఎప్పుడుంది? పూర్వం కూడా ఒత్తిడి జీవితమే. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటున్నాం. మరి... జనాభా పెరిగిపోయారు కదా. సమస్యలు పెరిగాయి. భక్తి పెరిగింది. అన్ని రకాలుగా పెరుగుదలలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా వస్తుంది. అలాగే ఒత్తిడి సహజంగా రావడం... లేదా మనం తెచ్చుకుంటే రావడం... రెండు రకాలుగానూ వస్తుంది.
ప్రస్తుతం నెగటివిటీ వైపే చాలామంది ఆకర్షితులవుతున్నారు... ఈ పరిస్థితి గురించి?
ప్రస్తుతం ఏ మనిషికైనా రెండే పద్ధతులు పని చేస్తాయి. నచ్చింది తీసుకోవడం.... నచ్చనిది పట్టించుకోకపోవడం.పాజిటివ్‌గా ఉండాలంటే నెగటివ్‌వైపు వెళ్లకుండా ఉండటమే. పోనీ వెళ్లడంలోనే ఆనందం ఉందీ అనుకుంటే... అది వారి ఆలోచనా విధానం. ఎక్కడైనా ఫలానాది జరిగింది అంటూ ఓ నెగటివ్ హెడ్‌లైన్ చదివితే... ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం. తీరా అసలు విషయంలో ఏమీ ఉండదు. సో... నెగటివిటీకి ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు కూడా కారణం మనమే. అందుకే పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం మంచిది.
– డి.జి. భవాని
ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment