Classical Music
-
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
'జానీ జానీ యస్ పాపా" శాస్త్రీయ సంగీతంలో వింటే ఇలా ఉంటుందా?
ఆంగ్లంలో బాగా సుపరిచితమైన రైమ్ ఏదంటే ఎవ్వరైన ఠక్కున్న చెప్పే రైమ్ అది. దీనికి పేరడీగా తెలుగులో ఎన్నో రైమ్‌లు వచ్చాయి కూడా. అయితే ఈ రైమ్‌ని క్లాసికల్ మ్యూజిక్‌లో పాడితే..అస్సలు ఎవ్వరూ అలా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ శాస్త్రీయ సంగీతంలో పాడితే ఎలాం ఉంటుందో పాడి చూపించాడు ఓ వ్యక్తి. ఈ పాట నిమిషాల్లో వైరల్ కావడమే గాక అశేష ప్రజాధరణ పొందింది. నెటిజన్లు కూడా వావ్ అని కితాబిచ్చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే..ఈ వీడియోని భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్(ఐఆర్ఏఎస్) అధికారి అనంత్ రూపనగుడి నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తుండగా మరొక వ్యక్తి తబల వాయిస్తూ కనిపించారు. మధ్యలో కూర్చొన్న వ్యక్తి హిందూస్తానీ సంగీతంలో ఆంగ్ల రైమ్ 'జానీ జానీ యస్ పాపా'ను ఆలపించారు. శాస్త్రీయ సంగీతంలో ఆంగ్ల సాహిత్యాన్ని చాలా శ్రావ్యంగా ఆలపించడం ఆశ్చర్యాన్ని కలిగించడమే గాక అత్యద్భుతంగా ఉంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. అంతేగాదు ఇలా వందేళ్ల క్రితమే ఆలపించి ఉంటే.. దెబ్బకు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కదా! అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా క్లాసికల్ టచ్‌తో కూడిన ఆ రైమ్‌ని వినేయండి.! यह अगर 100 साल पहले आता, तो अंग्रेज़ अपना देश खुद छोडकर चले जाते! 😀😛😂 #English #rhymes #Music pic.twitter.com/uolJqbEwde — Ananth Rupanagudi (@Ananth_IRAS) January 20, 2024 (చదవండి: అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..: మండిపడుతున్న నెటిజన్లు) -
G20 Summit: 78 భిన్న వాయిద్యాలతో సంగీత సౌరభం!
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది. జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్ కాన్సెప్ట్ నోట్లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది. ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు. -
Shruthi Nanduri: నండూరి ఇంటి అమ్మాయి నోట ఎంకిపాట
నండూరి ఎంకిపాటల సొగసుదనం.. ఆ పదాల మాధుర్యం ఈ తెలుగు నేలకు సుపరిచయమే. ముత్తాత రాసిన పాటలను తన నోట ఆలపించడానికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది మునిమనమరాలు శృతి. మెడిసిన్ చదువుకుంటూనే శాస్త్రీయ సంగీత సాధన చేస్తోంది. సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శృతి నండూరిని పలకరిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచింది. ‘‘అమ్మ లక్ష్మి, నాన్న సుధాకర్ నండూరి ఇద్దరూ ముప్పై ఏళ్లుగా న్యూజెర్సీలోనే ఉంటున్నారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కర్ణాటక సంగీతం ఐదేళ్ల వయసు నుంచే నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం కూడా గురువుల దగ్గరే శిక్షణ తీసుకున్నాను. సంగీతానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. న్యూజెర్సీలో చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అమెరికాలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు వెళుతుంటాను. ఆ విధంగా ఇండియా నుంచి వచ్చే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం అయ్యారు. వాళ్లతో కలిసి స్టేజ్ షోలలో పాల్గొన్నాను. అక్కడ నా ఇంటిపేరులో నండూరి ఉండటంతో ‘నండూరి వారి అమ్మాయంట’ అని చెప్పుకునేవారు. నాతో నేరుగా ‘మీ ముత్తాత గారి గురించి తెలుసా!’ అని అడిగేవారు. దీంతో ‘నండూరి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటి’ అని అమ్మనాన్నలను అడిగాను. అప్పుడు తెలిసింది ముత్తాతగారి గురించి, ఆ పేరులోని ప్రత్యేకత గురించి. అప్పటి నుంచి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మా పెదనాన్న, మామయ్య, బంధువులను అడుగుతుంటాను. నాన్నను కూడా ఇంకా సమాచారం తెలుసుకొని చెప్పమని వేధిస్తుంటాను. ► ఒక్కో పదాన్ని పలుకుతూ.. అమ్మ వైపు కళాకారులు ఉన్నారు కాని నాన్నవైపు మా ముత్తాత నండూరి సుబ్బారావుగారి తర్వాత ఆర్ట్స్‌లో ఎవరూ లేరు. ఆయన రైటింగ్ గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ, తాతగారి గురించి తెలిసిన విషయాలు అంతగా చెప్పేవారు లేరు. నాన్న ద్వారా కొద్దిగా విని ఉన్నాను. సంగీతం నేర్చుకుంటూ, చదువుకుంటూ నా ధ్యాసలో నేనుండిపోయాను. ఆయన పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అయితే, నాకు తెలుగు రాయడం, చదవడం రాదు. ఆయన ప్రత్యేకత తెలిశాక నాన్నను కూర్చోబెట్టి ఆ బుక్స్‌లోని ఒక్కో పదాన్ని పలుకుతూ, అర్థం తెలుసుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల పాటు ఇదే పనిలో ఉన్నాను. చాలా అద్భుతం అనిపించింది. ► ఎంకిపాట నా నోట ఎంకి పాటల లిరిక్స్ తీసుకొని, కొత్తగా కంపోజ్ చేసి, నేనే పాడాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం కొందరు మ్యూజిక్ డైరెక్టర్లను కూడా కలిశాను. అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ గారు ఇదే ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఒకేసారి మా ఇద్దరిలో ఇలాంటి ఆలోచన రావడం నాకే వింతగా అనిపించింది. ‘ఎంకిపాటల్లో నుంచి కొన్ని లైన్స్ పాడమని అడిగారు. నేను పాడడంతో ‘నీ వాయిస్ ఈ పాటలకు చాలా బాగా సూటవుతుంది’ అని ఆ ప్రాజెక్ట్‌లో సింగర్‌గా నాకే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఎంకిపాటలు నా నోట పాడించారు. ‘‘నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్నెతిరిగొస్తనన్నాడే...’’ ఎంకిపాట ఆర్పీనోట అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడాను. ఆ పదాలను వింటూ అర్థం చేసుకుంటూ వాటికి తగిన న్యాయం చేయాలనుకున్నాను. ► చదువు.. సంగీతం అమెరికాలో మెడిసిన్ చేస్తున్నాను. ఫిజికల్ మెడిసిన్‌లో రిహాబిలిటేషన్ అనేది నా స్పెషలైజేషన్. బ్రెయిన్ ఇంజ్యూరీ, స్పోర్ట్స్ మెడిసిన్.. వంటి వాటిలో మ్యూజిక్ థెరపీ కొంత ఫిట్ అవుతుంది. అందుకే ఈ రెండింటీని బ్యాలెన్స్ చేస్తున్నాను. నా బ్రాండ్, డ్రీమ్, లైఫ్ గోల్ అదే. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు.. అని కొందరు అడుగుతుంటారు. బెస్ట్ డాక్టర్ని, అలాగే బెస్ట్ సింగర్‌ని కూడా అవ్వాలనేది నా డ్రీమ్. అందుకు ఎంత రిస్క్ అయినా చేస్తానని చెబుతుంటాను. ► మా ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ అంతా తెలుగురానివారే. వాళ్లకు మా ముత్తాతగారి గురించి ఎంతసేపు చెప్పినా చాలా ఆసక్తిగా వింటారు. ఇంకా విషయాలు అడుగుతారు. నేను ఎంకిపాటలు పాడి, ఆడియో క్లిప్పింగ్స్ మా ఫ్రెండ్స్‌కు పంపిస్తుంటాను. ఆప్పటి పాటలన్నీ విలేజీ స్టైల్ అవడంతో ఒక్కసారిగా ఆ టైమ్ పీరియడ్ నుంచి ఈ పీరియడ్‌కు ఏదో కలిసిపోయిన ఫీల్ కలుగుతుంది. ఒక్కోసారి నైన్టీన్త్ సెంచరీ అమ్మాయినేమో అనిపిస్తుంటుంది(నవ్వుతూ). వెస్ట్రన్ మ్యూజిక్ షోస్ కూడా చేస్తుంటాను. నన్ను తెలుగువారు కూడా గుర్తించాలి. అందుకే, ఇంగ్లిషు, తెలుగు రెండూ కవర్ చేస్తూ ఉంటాను. తెలుగు సినిమాల పాటలన్నీ పాడుతుంటాను. నిద్రలేస్తూనే ఏదో పాటతో నా డే మొదలైపోతుంది. వెస్ట్రన్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడే హిందీ, తెలుగు పాటలు పాడటం, స్పష్టంగా పదాలు పలకడం సాధన చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చాను. ► గాయనిగా పేరు.. సింగర్‌గా బాగా గుర్తింపు తెచ్చుకోవాలని, మంచి మంచి పాటలు పాడాలనేది నా డ్రీమ్. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాను. ఆ ప్రయత్నంలో ఎక్కడా ఆగకూడదు. అందుకే, ‘ఆహా వేదికగా జరిగే తెలుగు ఇండియన్ ఐడియల్ 2’ లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎంతోమంది నుంచి నా వర్క్‌ని ఇంకా బెటర్ చేసుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్ధమైంది. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ప్రయాణించడమే’’ అంటూ నవ్వుతూ వివరించింది శృతి నండూరి. – నిర్మలారెడ్డి నండూరి వెంకట సుబ్బారావు రచయితగా తెలుగువారికి సుపరిచితులు. నండూరి రచించిన గేయ సంపుటి ‘ఎంకిపాటలు.’ తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ కొత్త అందాలు అద్దిన ఈ రచనను సాహిత్యకారులు గొప్పగా ప్రస్తావిస్తుంటారు. -
బేగం అఖ్తర్ / 1914–1974 : నిజమైన సూఫీ
భావ ప్రసారానికి సంగీతం ఒక శక్తిమంతమైన మార్గం అయితే, నా అభిప్రాయంలో అత్యంత సమర్థులైన భావ ప్రసారకులలో బేగం అఖ్తర్ ఒకరు. ఆమె స్వరాలను అంటిపెట్టుకుని ఒక అరుదైన ఆర్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె దాన్ని అపురూపంగా కాపాడుకుంటూ, సంగీతంపై తనదైన ముద్ర వేశారు. కవులు పాడే గజల్స్‌ను ఆమె శాస్త్రీయ సంగీత వేదిక మీదకు తెచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని సామాన్యుని చేరువలోకి తీసుకెళ్లిన ఖ్యాతి ఆమెదే. ఆమె గాన శైలిలోని కళాత్మకత ఒక్కటి చాలు ఆమెను అజరామరం చేయడానికి. పాట పరాకాష్టకు చేరే దాకా ఆ పరిపూర్ణత్వం కోసమే ఆమె ప్రాణం పెడతారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో 1914లో జన్మించిన అఖ్తర్ తన సంగీత శిక్షణను పాటియాలాకు చెందిన అత్తా అహ్మద్ ఖాన్ వద్ద ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతమే కాక.. గజల్స్ భజనలు, టుమ్రీలు, దాద్రాలు మొదలైన రూపాలలో కూడా సంగీత సాధన చేశారు. నేను టుమ్రీ రాణి సిద్ధేశ్వరీ దేవి దగ్గర సంగీత శిక్షణ పొందేదాన్ని. ఒక రోజున అమ్మి, (అఖ్తర్ బేగంను నేను ఆప్యాయంగా పిలుచుకునే పేరు) దేవి వద్దకు వచ్చి ‘నాకు శిష్యురాలిగా తనను అప్పగించగలవా?’ అని నావైపు చూపిస్తూ అడిగారు. దేవి అందుకు అంగీకరించారు. అప్పుడు అమ్మి నన్ను తన శిష్యురాలిగా చేసుకున్నారు. అప్పటికప్పుడే ఆమె నాకు గండా బంద్ (దారం కట్టే) ఉత్సవాన్ని జరిపించారు. అప్పటి వరకు గండా బంద్ అంటే మగ విద్యార్థులకే పరిమితమైన లాంఛనం. కానీ, ఆ రోజున ఆ సంప్రదాయాన్ని అమ్మి ఛేదించారు. ఆమె తన కాలానికి చాలా ముందున్న సంస్కర్త. తన శిష్యులను పైకి తీసుకురావడం అఖ్తర్‌కు చాలా ఇష్టం. ఆమె లౌకికవాది. జాతీయవాది కూడా. ఆమెకు పద్మశ్రీ లభించడంతో ప్రభుత్వం వద్ద ఆమెకు కొంత పలుకుబడి ఉంటుందని భావించిన కొందరు మౌల్వీలు ఆమె వద్దకు వచ్చారు. బారాబంకీలో తమ మసీదును హిందువులు ఆక్రమించుకున్నారని, దానిలో పూజలు చేస్తున్నారని, దానిని విడిపించడంలో తమకు ఆమె సహాయం చేయాలని విన్నవించుకున్నారు. అమ్మి వారి మీద కేకలు వేయడం, వారు ఆమెను క్షమాపణ కోరడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘‘వాళ్లు అక్కడ చేస్తున్నవి కూడా ప్రార్థనలే కదా, ఇంక తగాదా ఏమిటి?’’ అని మందలించారు. ఆమె రేడియోలో జాతీయ గీతం వినబడేటప్పుడు విధిగా లేచి నిలబడే దేశభక్తురాలు కూడా. కచ్చేరీ వేదిక మీద మీరు మరింత అందంగా కనబడతారు. ఇది ఎలా జరుగుతోంది.. అని ఒకసారి ఆమెను అడిగాను. ‘పాడేటప్పుడు నేను భగవంతుణ్ణి చూస్తూ ఉంటాను’’ అని ఆమె నాకు జవాబిచ్చారు. ఆమె నిజమైన సూఫీ. – రీటా గంగూలీ, రంగస్థల నటి, గాయని, బేగం అఖ్తర్ శిష్యురాలు (చదవండి: 1997/2022 మల్టీప్లెక్స్ మయసభలు) -
శాస్త్రీయ సంగీత దిగ్గజం కన్నుమూత
న్యూయార్క్ : ప్రముఖ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో అమెరికన్ నగరం న్యూయార్క్‌లో జస్రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన తన సుదీర్ఘ కెరీర్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్‌లో 1930 జనవరి 28న జన్మించారు. తన తండ్రి పండిట్ మోతీరామ్ తన తొలి గురువు కావడంతో జస్రాజ్ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా పండిట్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్తో పాటు సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్‌ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ ప్రకటించారు. కాగా, పండిట్ జస్రాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ప్రముఖ సీనియర్ గాయని మృతి -
భూలే బిస్రే మన్నా డే
ఆవో ట్విస్ట్ కరే... గా ఉఠా మౌసమ్ ఆవో ట్విస్ట్ కరే... జిందగీ హై యహీ... వొంకలు తిరగాలి. గిరికీలు కొట్టాలి. వానపాములా కదులుతున్న జీవితాన్ని కిక్కొట్టి దౌడు తీయించాలి. జర్రున జారి పడేలా చేయాలి. అంతెందుకు. ఒక మన్నా డే పాట అందుకోవాలి.దిల్ కా హల్ సునే దిల్వాలాసీధిసీ బాత్ నా మిర్చి మసాలాకెహెకె రహేగా కెహెనే వాలా దిల్ కా హల్ సునే దిల్వాలా సీధిసీ బాత్ నా మిర్చి మసాలా కెహెకె రహేగా కెహెనే వాలాదిల్ కా హల్ సునే దిల్వాలా... చుట్టూ నలుగురు ఉండాలి. మంది పోగై ఉండాలి. మన పేరు నారాయణ అయ్యి నలుగురిలో సదా ఉండటాన్ని ఉత్సవం చేసుకోగలగాలి. ఒక్కడినే ఒక్కడిలా ఉంచే ఫోన్‌ని పక్కన పెట్టు. ఫేస్‌బుక్‌ను బుట్టలో పెట్టు. వాట్సప్‌ను పొయ్యిన పెట్టు. పాట ఒకటి పెట్టుకో తోడు. మన్నా డే పాట ఒకటి పెట్టుకోవోయ్ తోడు. ఎంత రుచిగా ఉంటుందో చూడు.ఆజా సనమ్ మధుర్ చాంద్నీ హమ్ తుమ్ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్ ఆజా సనమ్ మధుర్ చాంద్నీ హమ్ తుమ్ మిలేతో విరానే మే భి ఆజాయే గీ బహార్ఝూమ్ నే లగేగా ఆస్మాన్... మన్నా డే ఎంతకాలం జీవించాడో తెలుసా? 94 ఏళ్లు. నూరేళ్లలో ఆరు మైనస్ కొట్టినందుకు కచ్చితంగా బాధపడి ఉంటాడు. ఎందుకు? జీవితం అంటే ఎంతో విలువైనది కదా. మధురమైనది కదా. దానిని సౌందర్యవంతం చేసుకోవడానికి నీకు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నది కదా. రక్తమూ కండలు ఇచ్చింది... నమిలి మింగడానికి దవడలు ఇచ్చింది... గట్టిగా నిలబడ్డానికి గుండెనిచ్చింది... తాకి మీదుగా వీచడానికి తెమ్మెరనిచ్చింది... పాడుకోవడానికి పాటనిచ్చింది... మనకు రాకపోతే వినమని మన్నా డేని ఇచ్చింది. కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే పాయల్ కి ఝన్కార్ లియే... మందపాటి కళ్లద్దాలు పెట్టుకొని, దాపరికం లేని బట్టతల పెట్టుకుని పాతతరం మనిషిలా కనిపించే ఈ మన్నా డే చిన్నప్పుడు కుస్తీ పోటీలు ఆడాడు. జీవించినంత కాలం రుచికరమైన ఆహారాన్ని వండి, వండించుకొని తిన్నాడు. ఏ మాత్రం సమయం దొరికినా వ్యాయామం చేశాడు. తంబూరా ముందు కూచుంటే డాక్టర్ ముందు కూచోవాల్సిన అవసరం లేదని గ్రహించాడు. పాట ఆయువు. ఎదుట కూచున్నవారికి? పాట సంజీవని. జుర్రుకున్న వారికి జుర్రుకున్నంత. తూ ప్యార్ కా సాగర్ హై తేరె హర్ బూంద్ కే ప్యాసే హమ్ తూ ప్యార్ కా సాగర్ హై... కోలకతా గంగ నీరు తాగి, అక్కడి రవీంద్ర సంగీతంలో మునకలేసి, ముసల్మాను గురువుగారి బీబీ వంటగదిలో పులావు వండుతుంటే ముందు గదిలో అంతకంటే ఆస్వాదన కలిగిన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటూ సొంత బాబాయ్, అప్పటి సంగీతకారుడు కె.సి.డేతో కలిసి ముంబైకి వచ్చాడు– గాయకుడు అవుదామని కాదు– సంగీత దర్శకుడు అవుదామని. కాని తాను ఒకటి తలిస్తే పాట ఒకటి తలిచింది. ఆటుపోట్ల అరేబియా సముద్రం ఈ కొత్త గాయకుడి పాట విని ఒక లిప్త నెమ్మదించింది. మరో లిప్త తెరిపిన పడింది. ఈ ఒడ్డునే ఇది స్థిరపడాలని కెరటాలెత్తి దీవించింది. నీ కోసమేనోయ్ ఇంతవరకు తపించింది అని అది అనే ఉంటుంది. తూ ఛుపీ హై కహా మై తడప్ తా యహా తెరె బిన్ ఫీకా ఫీకా హై దిల్ కా జహాన్ తూ ఛుపీ హై కహా... గురూ...నువ్వు వజ్రంలా మారాలంటే ముందు బొగ్గులా మారాలి. కష్టం చుర్రుమని బొబ్బలెక్కించాక సుఖమనే పచ్చని తాటాకు నెత్తి మీదకు వచ్చి చేతిలో చల్లటి కల్లుముంత పెడుతుంది. మన్నా డేను ఇరవై ఇరవై రెండేళ్ల వయసులోనే ‘ముసలి’ గాయకుణ్ణి చేసింది ముంబై. సినిమాలో ముసలివాడు ఉంటే, వాడు పాడాలంటే మన్నా డేని పిలిచేవాళ్లు. అరె.. యంగ్ హీరోలకు రఫీ, తలత్, ముకేశ్ వంటి వాళ్లు పాడుతుంటే తాను మాత్రం ముసలివాళ్లకు పాడాలా? బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ పాడాలా? పాడాడు. ‘ఊపర్ గగన్ విశాల్’... ‘మషాల్’ సినిమాలో పెద్ద హిట్. ‘ధర్తీ కహే పుకార్ కే బీంజ్ బిఛాలే ప్యార్ కే’... ‘దొ భిగా జమీన్’లో ఇంకా పెద్ద హిట్. ‘కాబూలి వాలా’ ‘అయ్ మేరే ప్యారే వతన్’ ఎవరు మర్చిపోగలరు. ‘బసంత్ బహార్’ సినిమాలో ‘సుర్ నా సజే క్యా గావూ మై’ పాట ఇంకా పెద్ద హిట్. కాని ఇంకా పైకి రావాల్సి ఉంది. రాజ్‌కపూర్, శంకర్–ౖజెకిషన్లలోని శంకర్ ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్స్‌లో పాడే ఛాన్స్ ఇచ్చారు. కాని అసలైన బ్రేక్ ‘శ్రీ 420’లో వచ్చింది. ఆ సినిమాలో ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రిలో ఒక వాన వచ్చింది. ఆ వానలో రాజ్‌కపూర్–నర్గీస్ అనే జంట వచ్చింది. ఆ జంటతో పాటు మన్నా డే–లతాల పాట ఒకటి వచ్చింది. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్ తా హై దిల్... ఆ సినిమాలోనే మన్నా డే ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాడి జనం మన్నా డే వైపు తిరిగి తిరిగి చూసేలా చేసుకున్నాడు. అయితే రాజ్ కపూర్‌కు ముకేష్ కాకుండా మన్నా డే కూడా సరిపోతాడా? సరిపోతాడు అని ఆ తర్వాత వచ్చిన ‘చోరి చోరి’లోని మధురమైన ఈ పాట నిరూపించింది. ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే ఓ చాంద్ ప్యారా ప్యారా... ఇప్పుడు మన్నా డే స్టార్ అయ్యాడు. దిలీప్‌కు రఫీ ఉండొచ్చు. రాజ్‌కపూర్‌కు ముకేష్ ఉండొచ్చు. దేవ్ఆనంద్కు హేమంత్ ఉండొచ్చు. కాని తాను అందరికీ ఉంటాడు. తను అందరి గాయకుడు. ఏం... దేవ్ ఆనంద్‌కు తాను అద్దిరే డ్యూయెట్ ఇవ్వలేడా? ఆశా భోంస్లే కొంచెం తోడు రా. సాంర్ ఢలీ దిల్ కి లగీ థక్ చలీ పుకార్ కేఆజా ఆజా ఆభీ జా... ఎన్టీఆర్ పెద్ద యాక్టర్ అని తెలియాలంటే పదేళ్ల వయసు చాలు. కాని బల్రాజ్ సహానీ చాలా పెద్ద యాక్టర్ అని తెలియాలంటే నలభై ఏళ్లు రావాలి. ఈ బల్రాజ్ సహానీకి మన్నా డే సూపర్ హిట్స్ చాలా ఇచ్చాడు. వాటిలో ఈ రెండు మీరు కారులో వెళుతూ వివి«ద్భారతి పెట్టిన అనేకసార్లు వినపడుతూనే ఉంటాయి. తుజే సూరజ్ కహూ యా చందా తుజే దీప్ కహూ యా తారా మేరా నామ్ కరేగా రోషన్ జగ్ మే మేరా రాజ్ దులారా...అయ్ మేరే జొహర్ జబీ తుజే మాలూమ్ నహీ తూ అభీతక్ హై హసీ ఔర్ మై జవాన్... మన్నా డే ఎన్నో హిట్లు పాడాడు. మన్నా డే పాడటం వల్ల అంతవరకూ విలన్‌గా ఉన్న ప్రాణ్ ‘ఉప్కార్’లోని ‘కస్మే వాదే ప్యార్ వఫా’ పాటతో తన చెడునంతా జనంలో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడికే మన్నా డే ‘జంజీర్’లో ‘యారీ హై ఈమాన్ మేరీ’ పాడి ఉత్తమ స్నేహితుడిగా మార్చాడు. గొంతులో సత్తా ఉంటే సక్సెస్ కూడా కొంచెం తటపటాయిస్తుంది. అందుకే కంటి చూపుతో శాసించే స్థితిలో ఉన్నప్పటికీ రాజేష్ ఖన్నా ‘ఆనంద్’ లో తనకు మన్నా డేతో పాడిస్తానని సంగీత దర్శకుడు సలీల్ చౌధురి అంటే ఊహూ కిశోర్ చేతే పాడించండి అనకుండా తల ఊపాడు. ఆ పాట వింటే ఇప్పటికీ పరవశంతో శ్రోత తల ఊపుతూనే ఉంటాడు. జిందగీ కైసి హై పహేలీ హాయేకభితో హసాయే... కభితొ రులాయే... బెంగాల్లో పుట్టి మహారాష్ట్రలో జీవితాన్ని పొందిన మన్నా డే మన దక్షణాది సాంగత్యంతో పరిపూర్ణుడు అయ్యాడంటే నమ్ముతారా? ఆయన వివాహం చేసుకున్నది కేరళ వనితని. సినిమాలో బ్రేక్ సాధించింది మన హైదరాబాదీ అయిన ‘శంకర్ (జైకిషన్)’ వల్ల. చివరి దశాబ్దాలు స్థిరపడింది బెంగళూరులో. క్లాసికల్ మ్యూజిక్‌ను సినిమాకు అప్లై చేయడం తెలిసిన ఈ లెజెండ్ పాడిన ‘లాగా చునరీ మే దాగ్’, ‘ఏక్ చతురనార్ కర్ కే సింగార్’, ‘ఝనక్ ఝనక్ తొలి బాజె పాయలియా’ వంటి పాటలు లేకుండా నేటికీ ఏ సంగీత పోటీ పరిసమాప్తి కాని విధంగా స్థిరపడి ఉన్నాడు. వేయి మంది గాయకులు రావచ్చు. మరో వేయి రకాలుగా పాటలు పరివ్యాప్తి కావచ్చు. ఈ ఊపులో మనం కొన్ని ఘడియల సేపు మన్నా డేను భూలే బిస్రేగా మర్చిపోనూ వచ్చు. కాని ఏ సాయం సమయాలలోనో, ఏ భోజనానంతర వ్యాహ్యాళిలోనో, ప్రియురాలి అలుకలో ఏ దిక్కు తోచని సందర్భాలోనో, చినుకు రాలినప్పుడో, వెన్నెల అసంభాషణగా కురుస్తున్నప్పుడో టక్కున గుర్తుకు వస్తాడు. గొంతు తట్టి లేపుతాడు. తను ఆవహించి మన చేత మరి నాలుగు అడుగులు ముందుకు వేయిస్తాడు. పాట అలాంటిది అతడిది. మన్నాడే.. ఉంటాం నీ తోడే. ఏ దోస్తీ హమ నహీ తోడెంగె తోడెంగె దమ్ మగర్ తేర సాథ్నా ఛోడెంగె... ఖదీర్ -
ఆరోగ్యగీతం
‘నాదమే నిధి... తాళం పెన్నిధి... రాగం సన్నిధి... గాత్రం దివ్యౌషధం. మ్యూజిక్ థెరపీకి మూలం సంగీతమే... మాధ్యమమూ సంగీతమే. వెస్టర్న్ సొసైటీ ఈ వైద్యాన్ని శాస్త్రబద్ధం చేసుకుంది. గాత్రాన్ని... రాగాన్ని పేటెంట్‌తో చట్టబద్ధమూ చేసుకుంది. యూనివర్సిటీల్లో పాఠాలను బోధిస్తోంది. మరి... మన నాదాన్ని మనం కాపాడుకోకపోతే ఎలా? మన సంగీత నిధి మీద పేటెంట్ భరతమాతకే ఉండాలి. ఈ శేష జీవితం మన శాస్త్రీయ సంగీత వైద్యం కోసమే’ అంటున్నారు కర్ణాటకకు చెందిన డాక్టర్ మీనాక్షీ రవి. ‘నాదమయం’ అనే అక్షరాల వెంటే పాదముద్రలున్నాయి. ఆ పాదాలు ఆ సంగీత నిలయంలోకి దారి తీస్తున్నాయి. లోపల అరవై దాటిన ఓ సంగీత సరస్వతి కర్ణాటక సంగీతం గానం చేస్తున్నారు. ఆమెతోపాటు ఓ పదేళ్ల పిల్లవాడు సాధన చేస్తున్నాడు. ‘తల పై కెత్తి నా చేతిని చూడు నాన్నా’ అంటూ ఆగారామె. ఆ పిల్లవాడు తదేకంగా గాల్లోకి లేచిన ఆ చేతినే చూస్తూ ఆమె పలికినట్లు పలుకుతున్నాడు. ‘తాళం మర్చిపోతున్నావు’ అని ఆమె గుర్తు చేయగానే తాళం వేస్తూ పాట అందుకున్నాడా పిల్లాడు. ఆ దృశ్యాన్ని ఫొటో తీయబోతే ఆమె రాగం తీస్తూనే మరో చేత్తో ఫొటో తీయవద్దన్నట్టు వారించారు. పక్కనే ఉన్న పిల్లవాడి తల్లి కూడా ఫొటో వద్దని సంజ్ఞ చేసింది. కొన్ని క్షణాలకు గానం ఆపి... ‘‘పిల్లవాడిని ఫొటో తీయకండి’’ అన్నారామె. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆమె ‘‘ఈ అబ్బాయి స్పెషల్ కిడ్. మ్యూజిక్ థెరపీతో నాలుగైదేళ్లలో నార్మల్ కిడ్ అయిపోతాడు. ఇప్పుడు మీరు పేపర్లో ఫొటో వేస్తే రేపటి నుంచే స్కూల్లో మిగిలిన పిల్లలు అతడిని ఏడిపిస్తారు. ఇప్పుడు ఫొటో చూసి గుర్తు పెట్టుకున్న వాళ్లు ఈ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ‘ఆ పిల్లాడే కదూ, ఆ అమ్మాయే కదూ’ అని ఈ పిల్లల్ని గుర్తు చేసుకుంటారు. వీళ్లు జీవితం మొత్తం ఒకప్పుడు వీళ్లు ‘స్పెషల్ కిడ్’ అనే ముద్రను మోయాల్సి వస్తుంది. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అన్నారామె. ఆమె భావం అర్థం కాగానే పిల్లల పట్ల ఆమెకున్న బాధ్యతకు ఎనలేని గౌరవం కలిగింది. సంగీతంతో పరిపూర్ణత్వం ఆ సంగీత సరస్వతి పేరు విదుషి మీనాక్షీరవి. మీనాక్షి ఆమె పేరు, విదుషి సంగీతంలో ఆమె సాధించిన గౌరవం. పుట్టింది కర్ణాటక రాష్ట్రం, మాండ్యాలో. తాత శంకర శాస్త్రి సంగీతం మాస్టారు. మీనాక్షి తొలి గురువు కూడా ఆయనే. ఆమె డబుల్ ఎం.ఎ. (సోషల్ వర్క్, కర్నాటిక్ మ్యూజిక్) చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి మహిళా శిశు సంక్షేమ శాఖలో తహసీల్దార్ కేడర్ ఉద్యోగంలో చేరారు. కరడుగట్టిన అవినీతి మధ్య ఇమడలేక ఏడాదికే ఆ ఉద్యోగాన్ని వదిలేశారామె. అప్పటి నుంచి సంగీతాన్నే జీవితంగా మలుచుకున్నారు. సంగీతం కోసమే జీవించడం మొదలుపెట్టారు. మనిషికి పరిపూర్ణత్వం సిద్ధింపచేసే గొప్ప లక్షణం సంగీతంలో ఉందన్నారామె. నాదవైద్యం ‘‘శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం, సామాజిక పరివర్తన, ఆధ్యాత్మిక మార్గంలో జీవించే పరిణతి... ఈ నాలుగు కోణాల్లో మనిషిని పరిపూర్ణం చేసేది సంగీతమే. అందుకే మనిషికి ఎదురయ్యే శారీరక, మానసిక, సామాజిక సమస్యల నుంచి విముక్తి కోసం సంగీతాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్నాను. నేను ప్రయోగాత్మకంగా చేసిన మ్యూజిక్ థెరపీ మంచి ఫలితాలనిస్తోంది. దీని మీద నా రీసెర్చ్‌ని కొనసాగిస్తున్నాను. ఇందుకోసం నాలాగ ఆలోచించే మరికొందరం కలిసి ‘ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)’ను స్థాపించాం. నేను జనరల్ సెక్రటరీని. ఈ వేదిక నుంచి ప్రతి నాలుగు నెలలకోసారి ఒక వర్క్‌షాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. బెంగళూరులో స్థాపించిన ‘మీరా సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీ, హైదరాబాద్‌లోని నాద సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీలు ఐఎమ్టీఏతో కలిసి పని చేస్తున్నాయి. మ్యూజిక్ కాన్సర్ట్లలో పాడటం వల్ల స్పెషల్ కిడ్స్‌కి స్టేజ్ ఫియర్ పోతుంది. స్పెషల్ కిడ్స్‌తో కలిసి కాన్సర్ట్ చేయడంతో నార్మల్ కిడ్స్‌లో పరస్పరం సహకరించుకోవాలనే తత్వం అలవడుతుంది. ఇలా పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కోర్సు డిజైన్ చేశాను. ‘నాద మంథన’ పుస్తకంలో సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు సంగీతం ఎలా ప్రభావం చూపుతుందో రాశాను. ఇప్పుడు ‘కర్నాటిక్ మ్యూజిక్ థెరాపుటిక్ పర్స్పెక్టివ్’ అని మరో పుస్తకం రాస్తున్నాను. వీటిలో మ్యూజిక్ థెరపీ గురించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ కూడా సంగీతానికి ఆరోగ్యాన్ని చేకూర్చే లక్షణం ఉందని రాశారు. ప్రపంచ యుద్ధాల సమయంలో సైనికుల పునరావాస కేంద్రాల్లో సంగీతంతో సాంత్వన కలిగించిన ఉదాహరణలున్నాయి. అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ 1944లో మ్యూజిక్ థెరపీలో గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రవేశపెట్టింది, 1950లో మ్యూజిక్ థెరపీ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించారు. వందల ఏళ్ల వెస్టర్న్ మ్యూజిక్‌ని వాళ్లు అంతగా శాస్త్ర బద్ధం చేసుకుంటున్నారు. మనదేశంలో వేల సంవత్సరాల నుంచి అపారమైన సంగీత నిధి ఉంది. మనం పట్టించుకోకపోతే మన సంగీతాన్ని కూడా పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు చేసి వాళ్లు పేటెంట్ తీసుకుంటారు. ఇప్పటికే భారతీయ సంప్రదాయ సంపద తరలిపోతోంది కూడా. అందుకే మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధంగా నిరూపించడానికి పరిశోధన చేస్తున్నాను. మ్యూజిక్ థెరపీతో స్వస్థత పొందిన ప్రతి స్టూడెంట్ డెవలప్‌మెంట్‌నీ నోట్స్ రాస్తున్నాను. మందులు వాడాల్సిన అవసరం లేకుండా మ్యూజిక్ థెరపీతో జీవిస్తున్న కేస్ స్టడీలను రికార్డు చేస్తున్నాను. శాస్త్రీయ పరీక్షకు నిలిచేటట్లు ప్రతిదీ గ్రంథస్థం చేస్తున్నాను. మన సంపదకు పేటెంట్ మనదేశంలోనే ఉండాలనేది నా ఆశయం’’ అన్నారు మీనాక్షి. దిగులు కరిగింది ప్రభుత్వ ఉద్యోగం మానేసిన తర్వాత మీనాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. కర్ణాటకలో తొలి ఫ్యామిలీ కౌన్సెలర్ ఆమె. వైవాహిక జీవితంలో మహిళలు ఎదుర్కొనే దైన్య స్థితిని వర్ణించడానికి మాటలు చాలవు. వాటిని దిగమింగి బతుకీడుస్తూ క్రమంగా మానసికంగా ఒడిదొడుకులకు గురవుతుంటారు. అలాంటి వాళ్లకు మాటలతో ఓదార్చి, ధైర్యం చెప్పడంతో సరిపోవడం లేదని గ్రహించారు మీనాక్షి. మ్యూజిక్ థెరపీతో ఓ ప్రయత్నం చేశారు. అది విజయవంతమైంది. పురంధర దాసు కీర్తనల్లో కుటుంబ బంధాల కీర్తనలు మహిళల్లో గూడుకట్టుకుని ఉన్న దిగులును కన్నీటి రూపంలో కరిగించేశాయి. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా మూడు వేల మంది మ్యూజిక్ థెరపీతో మనసు తేలిక పరుచుకుని వైవాహిక బంధాలను చక్కబరుచుకున్నారు. మ్యూజిక్ థెరపీ కోసం కౌన్సెలింగ్ కీర్తనలతో ఎనిమిది సీడీలు విడుదల చేశారామె. ఇప్పుడు స్పెషల్ కిడ్స్‌కి మ్యూజిక్ థెరపీ ఇస్తూ ఈ అంశం మీద విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. నేను గానం.. ఆయన తాళం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నా రోల్‌మోడల్. అయితే భగవంతుడు నన్ను కీర్తనల ఆలాపనకు పరిమితం చేయకుండా మ్యూజిక్ థెరపిస్టుగా మార్చాడు. ఈ స్పెషల్ వైద్యం నాతో ముగిసిపోకుండా తర్వాత తరానికి కొనసాగడం కోసం శిక్షకులను తయారు చేయడం నా బాధ్యత. నా భర్త ఎన్.జి. రవి మృదంగ విద్వాంసులు. స్పెషల్ కిడ్స్‌కి రిథమ్ థెరపీ ఇస్తారాయన. మా పిల్లలిద్దరూ జీవితాల్లో సెటిలయ్యారు. మా శేష జీవితం సంగీతవైద్య పరిశోధనకే అంకితం. – విదుషి డా. మీనాక్షీరవి, ఫ్యామిలీ కౌన్సెలర్, మ్యూజిక్ థెరపిస్ట్ మనసు బాగోలేకపోతే సంగీతం వింటాం. మనసు కోలుకుంటుంది. తనువు బాగుండకపోయినా సంగీతం ఔషధంలా పనిచేస్తుంది... అంటున్నారు విదుషి డాక్టర్ మీనాక్షీరవి ఈ నెల 24వ తేదీ, ఆదివారం హైదరాబాద్, హైటెక్ సిటీ ఫీనిక్స్ఎరీనాలో నాదమయ సంగీత సభ, త్యాగరాజ, పురందర దాస ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. అందులో స్పెషల్ కిడ్స్ సంగీతాలాపన చేస్తారు. – వాకా మంజులారెడ్డి -
ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం
పాత గుంటూరు: గాయత్రీ మహిళా çసంగీత సన్మండలి ఆధ్వర్యంలో బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠపాలిట ఓంకార క్షేత్రంలో ఆదివారం శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ ఎ.వి.దక్షిణామూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్ బండ్లమూడి సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూజివీడుకు చెందిన బి.విద్యాసాగర్ గాత్రం చేయగా విజయవాడ హేమాద్రి చంద్రకాంత్ వయోలిన్, గుంటూరుకు చెందిన బి.సురేష్‌బాబు మృదంగంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని కె.ఆర్.ఎస్.ఆర్.కృష్ణ నిర్వహించారు. -
శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అనంతపురం కల్చరల్ : శాస్త్రీయ సంగీతానికి, నాట్యానికీ ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. మారుతున్న కాలానికనుగుణంగా సినిమా వస్తువులోనూ మార్పు వస్తోందని కళాతపస్వి కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో ఓ సంగీతోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శాస్త్రీయ సంగీతం, నేటి సినిమాలు తదితర విషయాలపై ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : శంకరాభరణం లాంటి సినిమాలను మళ్లీ మీ నుంచి ఆశించొచ్చా? విశ్వనాథ్ : ఎప్పుడేమవుతుందో చెప్పలేం. శంకరాభరణమే కాదు సాగర సంగమం, సిరివెన్నెల ప్రతీది దేని ప్రత్యేకత దానిది. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. సాక్షి : ఇప్పుడొస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికేమిటి పరిష్కారం ? విశ్వనాథ్ : సినిమాలే కాదు..నిత్యం వస్తున్న టీవీ సీరియళ్లు ఆడవారిని విలన్లుగా చూపుతున్నాయి. మంచి విషయాన్ని చూడాలంటేనే కనిపించడం లేదు. టీవీకి ఇంటిల్లిపాది బానిసగా మారిపోతున్నారు. చాలా వరకు నేటి యువతలో బాగా అసహనం పెరిగిపోయింది. సాక్షి : యువతను మంచి సినిమాలు మార్చలేవా ? విశ్వనాథ్ : పూర్వం చాలా సినిమాలు చూసి మారిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ సందేశాత్మకంగా తీయాలంటే నిర్మాతలు భయపడాల్సివస్తోంది. తల్లిదండ్రుల అతి ప్రేమ పిల్లల్లో మార్పుకు ప్రధాన కారణంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి విషయాలపట్ల వారి మనసు మళ్లించాలి. సాక్షి : నేటి సినిమాలు పూర్తీగా కమర్షియల్‌గా మారిపోతున్నాయన్న విమర్శకు మీరేమంటారు? విశ్వనాథ్ : సినిమా అంటేనే వ్యాపారం. అయితే దురదృష్టవశాత్తు వ్యాపారమే సినిమాగా మారిపోతోంది. అందుకు అనేక కారణాలుండొచ్చు. మంచి విషయాలను చెప్పే నిర్మాతలు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించాలి. సాక్షి : పూర్వం శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఈనాడు గట్టిగా నెలరోజులు ఆడడం లేదు. మళ్లీ అలాంటి రోజులెలా వస్తాయి ? విశ్వనాథ్ : మా రోజుల్లో సినిమాను తపస్సుగా భావించేవాళ్లం. ఇప్పుడంతా వ్యాపార దృక్పథమే. మొదటిరోజే రెండు వందల నుండి నాల్గు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ ధోరణి సినిమాను ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా చేయడం లేదు. దానికి తోడు పైరసీ భూతం మంచి సినిమాను తినేస్తోంది. సాక్షి : సినిమాల్లో మంచి మార్పునకు దోహదపడిన మీరు.. టీవీల ద్వారా కూడా మార్పు తెచ్చే అవకాశముందా ? విశ్వనాథ్ : మన చేతుల్లో లేదు. మంచి జరగాలనుకుంటే భగవంతుడు నా ద్వారా చేయిస్తాడేమో. అయినా నేటి టీవీ సీరియళ్లకు రేటింగే ముఖ్యం. నేను చేస్తే రేటింగ్ ఉండదేమో. సాక్షి : వృద్ధాప్యం హాయిగా సాగాలంటే మీరిచ్చే సలహాలేంటి ? విశ్వనాథ్ : వార్థక్యం భయంకరమైనదేమీ కాదు. కాకపోతే అతిగా ఉండే అటాచ్మెంట్ వల్ల టెన్షన్స్ ఎక్కువవుతున్నాయి. వయసుపెరిగే కొద్దీ కొంతైనా అటాచ్మెంట్ తగ్గించుకుని ఆధ్యాత్మిక భావనలు పెరిగితే ఏ స్థితైనా హాయిగానే ఉంటుంది. -
నాదమే నాడులకు దివ్యౌషధం..
రాగాలతో రోగాలు నయమవుతాయని మనవాళ్లు చాలాకాలంగానే చెబుతూ వస్తున్నారు. తాజాగా, నాదమే నాడులకు దివ్యౌషధమని పరిశోధకులు కూడా సెలవిస్తున్నారు. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ కోసం చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడమే సరైన మార్గమని వారు చెబుతున్నారు. ఆహ్లాదభరితమైన శాస్త్రీయ సంగీతాన్ని వినడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే నాడీ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు వస్తాయని అంటున్నారు. సంగీతాన్ని వినడం వల్ల మానసిక స్థితి నిలకడగా మారుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, చక్కని సంగీతం నాడీ వ్యవస్థ క్షీణతను అరికడుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని రోట్మన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఇర్మా జార్వెలా వెల్లడించారు. -
సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్
- శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య స్వరాల మేళవింపు - సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయోగం - పేద పిల్లలకు ప్రత్యేక శిక్షణ శ్రావ్యమైన సంగీతం చెవిన పడితే అక్కడే ఆగిపోతాడు. చేస్తున్న పని కూడా మరిచిపోయేవాడు. ఆ కుర్రాడు స్వరాలే జీవితం అనుకున్నాడు. సరిగమలతోనే సావాసం చేయాలని తలచాడు. అయితే, పరిస్థితులు అనుకూలించక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. తొమ్మిదేళ్లు అదే ఉద్యోగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్నా సంతృప్తి లేదు. చివరికి చిన్ననాటి సంగీతాన్నే సాధన చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు. తనలాగే సరిగమలను ఆస్వాదించేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ పేరు ‘సౌండ్ క్రాఫ్ట్’. ఆ సాధకుడు బికాస్థ్.్ర ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులను సంగీత గాంధర్వులుగా తీర్చిదిద్దుతున్నాడు. సాక్షి, సిటీబ్యూరో ఎయిర్ ఇండియాలో పనిచేసిన తండ్రి రాజు కిసారథ్ ప్రోత్సాహం.. టీచరైన అమ్మ మమతారథ్ చేయూతతో చిన్నప్పటి నుంచి సంగీతంపై ఇష్టం పెంచుకున్నారు భువనేశ్వర్‌కు చెందిన బికాస్థ్.్ర అప్పట్లో సంగీతమే ప్రొఫెషన్‌గా ఎంచుకునేందుకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చిన బికాస్ 2009లో జాబ్‌కు బైబై చెప్పారు. పండిట్ గోవింద్ రాజ్ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని సాధన చేసి, భార్య ప్రసీదా నాయిర్ రథ్ తోడ్పాటుతో మాదాపూర్‌లో ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థని ప్రారంభించారు. శాస్త్రీయ-పాశ్చాత్య స్వర మేళవింపు.. శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నారు బికాస్థ్.్ర ఉద్యోగులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఇదొక మంచి మార్గమమనుకున్నారు. అఖిల భారతీయ గాంధర్వ మహా విద్యాలయ నుంచి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్‌ను వంటబట్టించుకున్నారు. అనంతరం ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థను ఏర్పాటు చేసి పలువురిని తీర్చిదిద్దుతున్నారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, జూబ్లిహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ శాఖల్లో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్‌తో పాటు ఫ్లూట్, తబలా, హార్మోనియం, వీణ, హిందూస్థానీ గాత్ర సంగీతంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఏదైనా వాద్య సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ను ఎవరికివారే తీసుకెళ్లాలి. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సౌండ్ క్రాఫ్ట్ అకాడమీనే ఇన్స్ట్రుమెంట్స్ను అందిస్తుంది. ఐదేళ్లు పైబడిన వయసు వారు ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సౌండ్ క్రాఫ్ట్‌లో సంగీతం నేర్చుకున్నవారు మ్యూజిక్ టీచర్లుగా సెటిల్ అయినవారున్నారు. కొంత మంది విద్యార్థులు గ్రూప్‌గా మ్యూజిక్ బ్యాండ్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలిస్తున్నారు. సంగీతమే జీవితం అనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు బికాస్థ్. కొత్తగా రేడియో జాకింగ్, డిస్క్ జాకింగ్, వీడియో జాకింగ్, ఫొటోగ్రఫీలోనూ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ‘సౌండ్ క్రాఫ్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ మ్యుజీషియన్ నమ్మించి ఆర్థిక నష్టాల్లోకి నెట్టారు. దీంతో మాదాపూర్‌లోని సౌండ్ క్రాఫ్ట్ కొన్నాళ్లు మూతబడింది. నా భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంక్‌లో కుదువ పెట్టి మళ్లీ సంస్థ ప్రారంభించేందుకు సహకరించింది’ అని వివరిచారు బికాస్థ్. పిల్లలతో స్వర సంగమం.. సంపాదన కోసం సౌండ్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేయలేదని, మురికివాడల్లోని పిల్లల్లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని చెబుతున్నారు బికాస్. తన కెరీర్లో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందంటారు. వాళ్లలో కొందరినైనా ఫ్రొఫెషనల్ మ్యుజిషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు బికాస్థ్.్ర తన వద్ద శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు అల్బమ్స్ కూడా రూపొందించారని సంతోషం వెలుబుచ్చారు. నేపాల్ భూకంప బాధితుల కోసం ఇటీవల హైటెక్‌సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించి వచ్చిన మొత్తాన్ని నేపాల్ బాధితులు అందజేసి మానవతవాదాన్ని చాటుకున్నారు బికాస్. ‘సంగీతమంటే సరదాగా నేర్చుకొని వదిలేయడం కాదు. ఈ రోజుల్లో మ్యూజిక్‌నే జీవితంగా ఎంచుకునేవారు ఉన్నారు. ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు బికాస్థ్ ్రభార్య ప్రసీదా నాయర్ రథ్. ఎంత ఒత్తిడిలో ఉన్న సంగీతం వింటుంటే కలిగే ఆనందమే వేరని చెబుతున్నారు. స్పెషల్ సమ్మర్ శిక్షణ నాలుగు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వెస్ట్రన్ డాన్స్, యోగా క్లాసులు నేర్పిస్తోంది సౌండ్ క్రాఫ్ట్. చేరాలనుకునేవారు 8885093930 నంబర్లో సంప్రదించవచ్చు. -
శంకర్‌ఆభరణం
హైదరాబాదీ శంకర్‌సింగ్ రఘువంశీ భారత్‌లో సినీరంగం వేళ్లూనుకుంటున్న తొలినాళ్లలో ఎక్కువగా శాస్త్రీయ సంగీతం వినిపించేది. సందర్భం ఎలాంటిదైనా అప్పటి సినిమా పాటలు చాలా నిదానంగా ఉండేవి. నేపథ్యంలో వినిపించే వాద్యాలు కూడా తబలా, సారంగి, హార్మోనియం వంటి సంప్రదాయ పరికరాలే. అలాంటి సమయంలో జోడు గుర్రాల్లా దూసుకొచ్చిన ఇద్దరు సంగీత దర్శకులు జట్టుకట్టి బాలీవుడ్ సంగీతాన్ని పరుగులు పెట్టించారు. ఉల్లాసభరితమైన సన్నివేశాలకు తగినట్లుగా తమ బాణీలతో, పాటలతో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. భారతీయ రాగాలను జాజ్బాణీలతో మేళవించారు. పాశ్చాత్య వాద్య పరికరాలను సినీసంగీతంలోకి విరివిగా వాడుకలోకి తెచ్చారు. శంకర్-జైకిషన్ జంట దాదాపు రెండు దశాబ్దాల కాలం బాలీవుడ్ సంగీతాన్ని శాసించారు. ఈ జంటలో ఒకరైన శంకర్ అసలు పేరు శంకర్‌సింగ్ రఘువంశీ. ఉత్తరభారతీయ కుటుంబానికి చెందిన శంకర్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆయన సరిగమలు నేర్చుకున్నదీ ఇక్కడే. బాబా నాసిర్‌ఖాన్ వద్ద, ఆ తర్వాత ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ వద్ద సంగీతం నేర్చుకున్న శంకర్, తొలినాళ్లలో తబలా వాయించేవాడు. ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ ఆర్కెస్ట్రా బృందంలో కొన్నేళ్లు పనిచేశాక, సత్యనారాయణ్, హేమావతిల రంగస్థల బృందంలో చేరాడు. తబలా వాయించడంతో పాటు నాటకాల్లో చిన్న చిన్న వేషాలూ వేసేవాడు. కొన్నాళ్లకు బాంబే చేరుకుని, పృథ్వీరాజ్ కపూర్ నిర్వహించే పృథ్వీ థియేటర్ బృందంలో చేరాడు. సంగీత దర్శకులు హుస్న్‌లాల్-భగత్రామ్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. జైకిషన్తో జోడీ సినీ అవకాశాల కోసం గుజరాతీ దర్శకుడు చంద్రవదన్ భట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న కాలంలో శంకర్‌కు జైకిషన్ పరిచయమయ్యాడు. జైకిషన్ అప్పట్లో హార్మోనియం వాయించేవాడు. అవకాశాల వేటలో ఉన్న ఇద్దరికీ క్రమంగా దోస్తీ కుదిరింది. పృథ్వీరాజ్ కపూర్‌తో మాటమాత్రమైనా చెప్పకుండానే, పృథ్వీ థియేటర్లో ఉద్యోగం ఇప్పిస్తానని జైకిషన్కు మాట ఇచ్చేశాడు. శంకర్ మాటను మన్నించిన పృథ్వీరాజ్ తన ఆస్థానంలో జైకిషన్కూ చోటు ఇచ్చారు. పృథ్వీరాజ్ కపూర్ పెద్దకొడుకు రాజ్‌కపూర్ 1948లో రూపొందించిన తొలిచిత్రం ‘ఆగ్’కు సంగీత దర్శకుడు రామ్ గంగూలీ వద్ద శంకర్-జైకిషన్ అసిస్టెంట్లుగా చేశారు. ‘బర్సాత్’ చిత్రం షూటింగ్ కొనసాగుతుండగా, రామ్ గంగూలీతో రాజ్ కపూర్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ చిత్రానికి శంకర్-జైకిషన్లను సంగీత దర్శకులుగా పెట్టుకున్నాడు. ‘బర్సాత్’ పాటలు సూపర్‌హిట్ కావడంతో రాజ్ కపూర్ చిత్రాలకు శంకర్-జైకిషన్ ఆస్థాన సంగీత దర్శకులుగా మారారు. రాజ్‌కపూర్ సినిమాల్లో వారి బాణీలు దేశవ్యాప్తంగా మార్మోగాయి. షమ్మీ కపూర్, దేవానంద్, రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, మనోజ్‌కుమార్, ధర్మేంద్ర వంటి ఇతర హీరోల చిత్రాలకూ శంకర్-జైకిషన్ సంగీతాన్ని సమకూర్చారు. ఉత్తమ సంగీత దర్శకులుగా తొమ్మిదిసార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. హిందీ పాటల్లో తెలుగు పలుకులు ‘శ్రీ420’లో ‘రామయ్యా వస్తావయ్యా’, ‘షత్రంజ్’లో ‘బతకమ్మ బతకమ్మ ఎక్కడ బోతారా’ వంటి పాటల్లో తెలుగు పలుకులు హైదరాబాదీ అయిన శంకర్ ప్రయోగాలే. రాజ్‌కపూర్ ‘ఆహ్’ సినిమాను ‘ప్రేమలేఖలు’ పేరుతో డబ్ చేసినప్పుడు వారి బాణీలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. ‘పందిట్లో పెళ్లవుతున్నాది..’ ఈ చిత్రంలోనిదే. ఎన్టీఆర్ నటించిన ‘జీవిత చక్రం’ సినిమాకు కూడా వీరు సంగీతం సమకూర్చారు. అయితే, శంకర్ 1987లో మరణించినప్పుడు సినీరంగం నుంచి స్పందించిన వారు దాదాపు లేరనే చెప్పాలి. తర్వాత కొన్నాళ్లకు రాజ్‌కపూర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ‘ఘన’నివాళులర్పించాడు. - పన్యాల జగన్నాథదాసు -
నాట్యామృతం
నాంపల్లి: వినసొంపైన శాస్త్రీయ సంగీతం... చూడ చక్కని హావభావాలు...అభినయం... ప్రేక్షకుల మదిని దోచేశాయి. ఆనందప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా మందిరంలో గీతా గణేషన్ శిష్య బృందం ‘శ్రీ కృష్ణ లీలామృతం’ రూపకాన్ని ప్రదర్శించింది. గీతా గణేషన్ శిష్యురాళ్లు వి.కె.రిషిక, అమృత ముంగికర్, డి.ఎస్.అదితి, అమూల్య మంజా, శివాని, భువనేశ్వరి, శ్రీవేణి, శ్రావ్య, శాంభవి, రసజ్ఞ కలిసి ‘శ్రీ కృష్ణ లీలామృతం’ భరతనాట్య ప్రదర్శనను ఆద్యంతం రక్తికట్టించారు. తొలుత అమృత వర్షిణి రాగంలో వినాయక స్తుతి... ‘గజవాదన బిడువెను గౌరీ తనయా’ అనే కీర్తనతో ప్రదర్శన ప్రారంభమైంది. రెండోఅంశంగా రాజీ నారాయణ్ రచించిన ‘వర్ణం’ కల్యాణి రాగంలో సాగింది. ‘గోకుల బాల... గోపియ లోల..’ అనే కీర్తనలో శ్రీకృష్ణ జననం, పూతన సంహారం, గోవర్ధనగిరి ధారణం, కాళింది మర్దనం, ద్రౌపదీ మాన సంరక్షణ, గీతోపదేశం తదితర అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం సురేష్ భట్ భావగీతాలపనలో భాగంగా ప్రదర్శించిన గోపికా కృష్ణుల క్రీడలు కళాకారుల ప్రతిభకు దర్పణం పట్టాయి. సారంగ రాగంలో మాధురి ఎన్.కృష్ణన్ స్వరపరిచిన గీతాన్ని చివరి అంశంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు మృదంగంతో రామకృష్ణ, శ్రీకాంత్(తబలా), కోలంకన్ అనిల్ కుమార్(వయొలిన్) వాద్య సహకారం అందించారు. నాట్య గురువులు యశోద ఠాగూర్, డాక్టర్ హేమమాలిని, ప్రియదర్శిని గోవింద్‌లు కళాకారులను అభినందించారు. అంతకు ముందు జరిగిన సభలో గీతా గణేషన్ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆనందప్రియ ఫౌండేషన్ పని చేస్తున్నట్లు వివరించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి భారతీయ కళల్లో ఎంతో మందికి శిక్షణనిస్తున్నట్టు చెప్పారు. -
అమెరికాలో తెలుగు పాట
ఆకునూరి శారద.. శాస్త్రీయ సంగీతంలో ఘనాపాటి కాదు గానీ ఓనమాలు నేర్చుకున్నారు. సాధనతో స్వరం మీద పట్టు తెచ్చుకున్నారు. అమెరికాలోని తెలుగు కల్చరల్ అసోసియేషన్ మెంబర్‌గా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకూ కృషి చేస్తున్నారు. హ్యూస్టన్‌లో తెలుగు రేడియోలో ఆర్జేగా తన కమ్మని కంఠంతో పలకరిస్తున్నారు! హైదరాబాద్ వచ్చిన ఈ ఎన్ఆర్ఐతో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు... పాడడమంటే ఇష్టం. మూడేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. సినీ, లలితగీతాలు ఎప్పుడూ వినేదాన్ని. అలా వింటూ ప్రాక్టీస్ చేసిన పాటే నా జీవితంలో భాగమైపోయింది. అందుకే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఎన్నాళ్లో కంటిన్యూ చేయలేదు. అమెరికా వెళ్లిన కొత్తల్లోనే తెలుగు కల్చరల్ అసోసియేషన్‌లో చేరా. అసోసియేషన్‌కు వరుసగా రెండుసార్లు ప్రెసిడెంట్‌గా ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. ఇళయరాజా దగ్గర్నుంచి దేవీశ్రీప్రసాద్ వరకు అందరి పాటలూ పాడాను. తెలుగే కాదు.. తమిళం, కన్నడ, హిందీ పాటలూ పాడుతా. రామకృష్ణ నుంచి శ్రీకృష్ణ వరకు, జానకమ్మ మొదలు సునీత వరకు అందరితోనూ కలిసి వేదిక పంచుకున్నా. ఆగస్ట్ 2న చెన్నైలో ఎమ్మెస్ విశ్వనాథన్ మ్యూజికల్ నైట్‌లోనూ పాలుపంచుకోబోతున్నా. సిటీ దిశానిర్దేశం... నేను పుట్టింది కాకినాడ.. పెరిగింది బాపట్ల. హయ్యర్ ఎడ్యుకేషన్ తిరుపతిలో. అయినా నాకు హైదరాబాద్‌తోనే అనుబంధం ఎక్కువ. నాకు దిశానిర్దేశం చేసింది ఈ సిటీనే. ఇక్కడి ఏఎమ్ఎస్ కాలేజ్‌లో కంప్యూటర్ ప్రోగామర్‌గా చేస్తూ పార్ట్‌టైమ్‌గా సిటీకేబుల్‌లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ చదివేదాన్ని. అప్పుడే స్టార్ట్ అయిన ఈటీవీ ‘సరిగమలు’, జెమినీ ‘నవరాగం’ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా. ఆల్ ఇండియా రేడియో ‘యువవాణి’లో లలితగీతాలు పాడేదాన్ని. కొన్ని రేడియో నాటికల్లోనూ పార్టిసిపేట్ చేశా. అలా ఏడాదిన్నర గడిచిందో లేదో... 1997లో పెళ్లవడంతో హ్యూస్టన్‌లో పనిచేస్తున్న మా వారు శ్రీనివాస్‌తో కలిసి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఇక నా పాటల కచేరీలకు హ్యూస్టన్ వేదికైంది. రేడియో జాకీగా... హ్యూస్టన్‌లోని తెలుగు రేడియోలో ఆర్జేగా చేయడం ఎంతో ఇష్టం. అమెరికాలో రేడియోకు శ్రోతలు దొరకడం విచిత్రమే. అక్కడ తెలుగువాళ్లకు పని తప్ప ఇతర వ్యాపకాలుండవు. శ్రోతల భాగస్వామ్యం కోసం రేడియోలో పిల్లలకు మూడు దశలు పాటల పోటీలు ప్రారంభించా. పిల్లల పాట విన్నాక వాళ్ల పేరెంట్స్ శ్రోతలను ఓటింగ్ అడిగేలా ప్లాన్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సామెతలు, నుడికారాలు చెప్పడం.. అడగడం లాంటవీ ప్లాన్ చేశా. నాకు ఇద్దరు పిల్లలు. బాబు చక్కగా పాడతాడు. పియానో వాయిస్తాడు. పాప కూడా బాగా పాడుతుంది. - సరస్వతి రమ -
ఇక్కడ అందరూ ఆత్మీయులే..
ఆమె గొంతు కోకిలలనే సవాలు చేస్తుంది. ఆమె పాట స్వర‘చిత్ర’ విన్యాసంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. మూడు దశాబ్దాలుగా పాటలు పాడుతున్నా, తరగని మాధుర్యం ఆమె సంగీతానిది. ఆబాల గోపాలాన్ని తన గాత్రంతో మైమరపిస్తున్న గాయని చిత్ర శనివారం పుట్టినరోజు జరుపుకున్నారు. రవీంద్ర భారతిలో ఆదివారం ఓ భక్తి ఆల్బమ్ ఆవిష్కరించిన ఆమె ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ముచ్చటించారు. విశేషాలు ఆమె మాటల్లోనే.. కేరళ రాజధాని తిరువనంతపురంలో 1963 జూలై 27న పుట్టాను. అక్కడే పెరిగాను. ఈసారి పుట్టినరోజున తిరువనంతపురాన్ని మిస్ అవుతున్నా, ఇక్కడ హైదరాబాద్‌లో నా ఆత్మీయులైన సునీతా బాలాజీ, రావు బాలసరస్వతీదేవి, జానకమ్మల మధ్య జరుపుకొంటున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌తో నాది విడదీయలేని బంధం. ఇక్కడకొస్తున్నానంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడి గాయనీ గాయకులందరూ నాకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల్లాంటి వాళ్లు. వాళ్ల ఆప్యాయతానురాగాలు వెలకట్టలేనివి. అందుకే తరచు వస్తుంటాను. ఇక్కడి వాతావరణం, తెలుగుదనం నన్ను కట్టిపడేస్తుంటాయి. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మంచిది... నా కెరీర్ తొలినాళ్లకు ఇప్పటికీ చాలా తేడాలొచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ మహిమే. అది ఈ తరం గాయనీ గాయకులకు పాడటాన్ని సులభతరం చేస్తుంది. ఇది మంచి పరిణామమే. అయితే, పాటలో లిరిక్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేస్తోంది. దీనివల్ల వాయిస్ ప్రాధాన్యం తగ్గుతోంది. చాలామంది డెరైక్టర్స్ చెబుతుంటే విన్నా... కొత్తతరంలో డెడికేషన్ లేదని. ఏ పనికైనా కమిట్మెంట్, డెడికేషన్ ముఖ్యం. అవి ఉంటేనే రాణిస్తాం. పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఎవరైనా కొత్త గాయనీగాయకులు పాడినప్పుడు ఏవైనా తప్పులుంటే, వెంటనే కరెక్షన్స్ చెబుతాను. లేట్‌నైట్ ప్రోగ్రామ్స్‌కి, దూరప్రయాణాలకు దూరంగా ఉంటేనే మంచిదని నా సూచన. ఇక సింగర్స్ కావాలనుకునే వాళ్లు ముందుగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మంచిదని నా అభిప్రాయం. స్టేజ్ షోస్‌లో కంఫర్ట్‌గా ఫీలవను... స్టేజ్ షోస్ అంటే అంత కంఫర్ట్‌గా ఫీలవను. స్టేజ్ అంటే డెరైక్ట్‌గా శ్రోతలను చూస్తూ పాడాలి. సాధారణంగా కొన్ని సౌండ్స్ టెన్షన్ కలిగిస్తాయి. అందుకే నేను స్టేజ్ మీద పాడుతుంటే కొంత అనీజీగా అనిపిస్తుంది. ఇక సహ గాయనీ గాయకులతో పాడటం అరుదనే చెప్పాలి. ఎప్పుడో ఇలా షోల్లో కలుసుకోవడం, సీడీ రిలీజ్ కార్యక్రమాల్లో పాడటమే. అయితే, ఇది అటు నా ముందు తరం వారితో పాడే అవకాశాన్ని, ఇటు నా తర్వాతి తరం వారితో గొంతు కలిపే అవకాశం ఇస్తోంది. దీనివల్ల నాకు రెండు తరాల వారితోనూ ఫ్రెండ్షిప్ ఏర్పడుతోంది. కోన సుధాకర్ రెడ్డి -
అలరించిన అంకరాజు అలేఖ్య అరంగేట్రం
గతవారం ఇండియానా పొలిస్ లో చి.సౌ అంకరాజు అలేఖ్య కర్ణాటక శాస్త్రీయసంగీత రంగప్రవేశం దిగ్విజయంగా జరిగింది. దీనికి గాను మృదంగ విద్వాన్ త్రివేండ్రం బాలాజీ, వాయులీన విదూషి కుమారి రంజనీ రామకృష్ణలు వాయిద్య సహకారమందించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న అలేఖ్య, నాలుగుసంవత్సరాల చిరుప్రాయంలొనే తన తల్లిగారివద్ద శాస్త్రీయసంగీతంలో తొలిపాఠాలు నేర్చుకుంది. శ్రీమతి వసంత శ్రీనివాసన్, శ్రీమతి లక్ష్మివారణాసిల వద్ద శిష్యరికంచేసి, గతనాలుగుసంవత్సరాలుగా కళారత్న శ్రీ డి శేషాచారి(హైదరాబాద్ బ్రదర్స్) గారి వద్ద స్కైప్ (అంతర్జాల దృశ్యశ్రవణ) మాధ్యమం ద్వారా శిక్షణ తీసుకుంటోంది. గాత్రంలోనే కాక, కర్నాటక మరియు పశ్చిమ శాస్త్రీయ సాంప్రదాయపద్ధతుల్లో వాయులీనవాద్యమందుకూడా సుశిక్షితురాలు. కచేరినందు, శృతి శుద్ధమైన గాత్రం, సాధికారికమైన ఉఛ్చారణ, భావగాంభీర్యత తనప్రత్యేకతలని వివిధ రాగమాలికాలాపనలద్వారా ప్రకటితముచేయడములో సఫలీకృతురాలయ్యింది శ్రీమతి లలిత, శ్రీ కృష్ణ అంకరాజుల జ్యేష్ట పుత్రికయైన అలేఖ్య. రాగతాళరీతులందు తన ప్రావీణ్యత, మనోధర్మానుసార రాగవిస్తారణాకౌశలము, జతిగతిగమన నియంత్రణాపటిమలను సభాసదులు సదృశముగా తిలకించి, సకర్ణముగా ఆలకించారు. సంగీత సాధనతోపాటూ, విద్యాభ్యాసన, సేవా సంబంధిత వ్యాసంగములందేగాక, జాతీయస్థాయి స్పెల్లింగ్ బీ పోటీలందుకూడా జయకేతనమెగురవేస్తున్న చిన్నారిని ఆహుతులందరూ ప్రశంసించారు. తన సాధన వెనుక వెన్నుదన్నుగానిల్చిన తల్లిదండ్రులను, గురువులను, శ్రేయొభిలాషులను వినమ్రశీలియైన అలేఖ్య సభాముఖముగా ప్రస్తుతించడం, రసజ్ఞుల హృదయాలను ఆర్ద్రపరచింది. విద్వాన్ కచేరి అనంతరం కమ్మని విందుభోజనముతో సంపూర్ణనందభరితులైన అతిధులందరూ చిన్నారిని మరెన్నో ఉన్నత శిఖరాలనధిరోహించాలని ఆశీర్వదించడముతో రంగప్రవేశమహోత్సవము పరిసమాప్తియైనది. -
సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!
ప్రతిభకు కొలమానం లేదు అన్న మాట విశ్వ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడు పాట రాస్తాడు, కంపోజ్ చేస్తాడు, పాడతాడు... పాటకు సంబంధించిన ప్రతి అంశం మీద తన ముద్ర వేయాలని తపిస్తాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా... గీత రచయితగా అతడిదో ప్రత్యేక శైలి. వెస్టర్న్ సాంగ్‌కి సైతం తెలుగు సువాసనని అద్దే అతడిది ఓ వైవిధ్యభరితమైన దారి. పాటల పూబాటలో తన పయనం గురించి విశ్వ చెబుతోన్న విశేషాలు... మణిశర్మగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు ఓ సినిమాలో టైటిల్సాంగ్ రాసి, పాడే చాన్సిచ్చారాయన. నా పర్ఫార్మెన్స్ నచ్చి... ‘నీలో మంచి గాయకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు’ అన్నారు. నేను పాట రాస్తాను, కంపోజ్ చేస్తాను, పాడతాను, కీబోర్డ్ వాయిస్తాను, రికార్డ్ చేస్తాను, మిక్సింగ్ కూడా చేస్తాను. ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కంపోజ్ చేశారు, ఎన్ని పాడారు? ‘రేసుగుర్రం’లో రాసిన ‘డౌన్ డౌన్’ పాటతో నూట యాభై పూర్తయ్యాయి. హైదరాబాద్ నవాబ్స్, మంగళ, నేను నా రాక్షసి, పోలీస్ పోలీస్, క్షత్రియ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. చాలా పాటలు పాడాను. ‘సంతోషం’లో మెహబూబా మెహబూబా, ‘అతడు’ టైటిల్సాంగ్, ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో మొదలైనవి పేరు తెచ్చాయి. అయితే రచయితగానే ఎక్కువ సక్సెస్ అయ్యాను. అసలు సంగీత, సాహిత్యాల మీద ఇంత ప్రీతి ఎలా ఏర్పడింది? నాన్న హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. ఆయనకు సాహిత్యమంటే చాలా మక్కువ. అమ్మకు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉంది. వాళ్లిద్దరి అభిరుచులూ కలిపి నాకు వచ్చాయి. బీహెచ్ఈఎల్లో ‘శ్రీకళా నిలయం’ అనే ఆర్ట్ అసోసియేషన్ ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నేను వాటిలో పాల్గొనేవాడిని. నెమలికంటి రాధాకృష్ణమూర్తిగారని యద్దనపూడి సులోచనారాణిగారి సోదరుడు... ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటనే పలు నాటకాల్లో నటించాను. ఏడో యేటనే ఆంధ్ర నాటక కళా పరిషత్తు అవార్డును అందుకున్నాను. ఆ అనుభవం నాకు సంగీత, సాహిత్యాల పట్ల మక్కువను పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికి ఆ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇటు వచ్చేశాను. మరి మీ టాలెంట్‌కి తగిన సక్సెస్ వచ్చిందంటారా? నేనెప్పుడూ సక్సెస్‌ని ప్రామాణికంగా తీసుకోను. చేతి నిండా అవకాశాలు ఉంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది! మీరు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకుంటారట... నిజమేనా? నిజమే. పాటకి ఓ స్థాయి ఉండాలనుకుంటాను. దిగజారి రాయలేను. అలా చేయలేక పెద్ద పెద్ద సంగీత దర్శకులిచ్చిన అవకాశాలు వదిలేసుకున్నాను. వారి దగ్గర పొగరుబోతుననిపించుకున్నాను. అంటే... దిగజారి రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? కచ్చితంగా ఉన్నాయి. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’ అంటూ రాసిన వేటూరికే ‘ఆకు చాటు పిందె తడిసె’ అంటూ రాయాల్సి వచ్చింది. తన స్థాయికి తగని పాటలు రాయాల్సి వచ్చినందుకు వేటూరి గారు కూడా ఎన్నోసార్లు బాధపడటం మనం చూశాం కదా! అలా ఎందుకు జరుగుతోందంటారు? కొందరు సంగీత దర్శకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండదు. అయినా జోక్యం చేసుకుంటారు. కొన్ని పదాలు తీసేస్తారు. తమకు నచ్చినవి చేర్చేస్తారు. రచయితలకి స్వాతంత్య్రం లేదు. వారి అభిరుచికి విలువా లేదు. ఇది పాటకి శ్రేయస్కరం కూడా కాదు. మరి ఈ పరిస్థితి మారేదెలా? అది నేను చెప్పలేను. కానీ పాటకి నావంతు న్యాయం నేను చేస్తానని మాత్రం చెప్తాను. అందుకే నా పాటల్లో అశ్లీలత, అసభ్యత లేకుండా చూసుకుంటాను. మోడర్న్ సాంగ్స్ రాసినా కూడా అచ్చ తెలుగు పదాలనే వాడుతుంటాను. మంచి పాటను గుర్తించగలిగే విజ్ఞత ఉన్న శ్రోతలు... మంచి అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకులు కూడా మనకింకా ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు. మీరూ ప్రయోగాలు చేస్తారుగా? అవును. కానీ ఆ ప్రయోగం ప్రయోజనకరంగానే ఉండేలా చూసుకుంటాను. ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటలు రాస్తుంటే ఏఎన్నార్ వచ్చారు. ‘‘కొత్త పంథాలో పాటలు బాగానే రాస్తున్నావు’’ అంటూ కాళిదాసు శ్లోకం ఒకటి చెప్పారు. దాని భావమేమిటంటే... ‘‘కొత్త ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే కొత్తవన్నీ గొప్పవని కాదు, పాతవన్నీ తీసి పారేసేవీ కాదు. తెలివైన రచయిత పాతదనంలోని మంచిని తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల పేరిట వింత పోకడలు పోకూడదు.’’ ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా భాషను పాడు చేయను. ఎప్పటికీ ఈ మాట మీదే నిలబడతారా? కచ్చితంగా. దిగజారి రాయాల్సి వచ్చిన రోజున పాట రాయడం మానుకుంటాను. పాచిపని చేసుకుని అయినా బతుకుతాను గానీ కళకు ద్రోహం చేయను. - సమీర నేలపూడి -
కేరళ పట్టు... ఈ కలరిపయట్టు!
భారతీయ అతి ప్రాచీన యుద్ధ కళ... కరాటే, కుంగ్‌ఫూ, సమురాయ్ అంటూ గొప్పగా చెప్పుకునే విదేశీయులంతా మన దేశంలోని సామాన్య సైనికుని ముందు తలవంచేలా నిలబెట్టిన కళ... యుద్ధ చాతుర్యం గల శక్తిని ప్రసాదించగలిగిన కళ.... ‘కలరిపయట్టు.’ ‘కలరి’ అంటే పాఠశాల,‘పయట్టు’ అంటే యుద్ధం. ప్రపంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్‌గా ఈ కళకు గుర్తింపు ఉంది. అయితే శాస్త్రీయ సంగీతానికి, పాప్ సంగీతానికి ఎంత తేడా ఉంటుందో కలరిపయట్టుకు- ఇతర మార్షల్ ఆర్ట్సకు అంత వ్యత్యాసం ఉంటుంది. ఆద్యుడు పరశురాముడు పరశురాముడిని ఈ విద్యకు ఆద్యునిగా భావిస్తారు. ఆ విధంగా కేరళీయుల యుద్ధక్రీడగా కలరియపట్టు పేర్గాంచింది. క్రీస్తుపూర్వం 15-16 శతాబ్దాలలో యోధుల మధ్య గొడవలను సద్దుమణిగేలా చేయడానికి ఈ యుద్ధ విద్యను అనుసరించేవారట. చోళరాజ్య సైనిక గురువు ఇలంకులం పిళ్లై కాలంలో ఈ విద్య పాఠశాలల్లో కలారిగా నేర్పబడేది. అప్పటి సైన్యాధ్యక్షతను, రాజ్యాధికారాన్ని కూడా ఈ విద్యే నిర్ణయించేది. పరీక్ష పద్ధతుల ద్వారా ఉత్తమ విద్యార్థులను ఎంచి రాజ్యసంరక్షణకు అవకాశం కల్పించేవారు. హిందూధర్మం ప్రకారం సమర్థుడు విద్యార్థిగా వస్తే విద్యను నేర్పించాలి. అలా బౌద్ధ సన్యాసులు ఈ విద్యను నేర్చారు. వారివల్ల పొరుగు దేశాలైన శ్రీలంక, మలేసియన్లకు ఈ కళ పరిచయం అయ్యింది. అటు విదేశాలకూ ఈ కళ గొప్పతనం తెలిసింది. యోగవిద్య ప్రముఖ పాత్ర... ఈ విద్యను నేర్పే గురువులను నాయర్ లేదా ఇలావార్ అంటారు. ‘కలారి పనికర్’ అనే తెగవారు ఈ విద్యను నేర్పుతారు. దీంట్లో మల్లయుద్ధం, కత్తి యుద్ధం, గదా యుద్ధం, ఉరుమి, కర్రసాము.. ముఖ్యమైనవి. ఆయుధాలు లేకుండాను, కత్తి-డాలుతోను, పరిగ లాంటి బరువైన వస్తువులతోనూ, కొరడా లాంటి లోహపదార్థ ఆయుధంతోనూ, కర్రలతోనూ శిక్షణ పొందుతారు. వీరి తర్ఫీదు లో యోగవిద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. వాస్తుశాస్త్రం... కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలనేది గురువుల మాట. మంత్ర, తంత్ర, మర్మ శాస్త్రాలను కలరిలో శక్తులను బ్యాలెన్స్ చేయడానికి ఆశ్రయిస్తారు. ఈ కళ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇందులోని శరీర కదలికలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇతర శిక్షకులెందరో ఇప్పుడు కలరిపయట్టు పట్ల ఉత్సాహం చూపుతున్నారు. అయితే శాస్త్రీయ సంగీతానికి కఠోర సాధన ఎంత అవసరమో కలరిపయట్టు ఒంటపట్టడానికి అంత సాధనా అవసరం.