శంకర్‌ఆభరణం | singer Sankarsing Raghuvanshi | Sakshi
Sakshi News home page

శంకర్‌ఆభరణం

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

శంకర్‌ఆభరణం

శంకర్‌ఆభరణం

హైదరాబాదీ
శంకర్‌సింగ్ రఘువంశీ
భారత్‌లో సినీరంగం వేళ్లూనుకుంటున్న తొలినాళ్లలో ఎక్కువగా శాస్త్రీయ సంగీతం వినిపించేది. సందర్భం ఎలాంటిదైనా అప్పటి సినిమా పాటలు చాలా నిదానంగా ఉండేవి. నేపథ్యంలో వినిపించే వాద్యాలు కూడా తబలా, సారంగి, హార్మోనియం వంటి సంప్రదాయ పరికరాలే. అలాంటి సమయంలో జోడు గుర్రాల్లా దూసుకొచ్చిన ఇద్దరు సంగీత దర్శకులు జట్టుకట్టి బాలీవుడ్ సంగీతాన్ని పరుగులు పెట్టించారు. ఉల్లాసభరితమైన సన్నివేశాలకు తగినట్లుగా తమ బాణీలతో, పాటలతో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. భారతీయ రాగాలను జాజ్‌బాణీలతో మేళవించారు. పాశ్చాత్య వాద్య పరికరాలను సినీసంగీతంలోకి విరివిగా వాడుకలోకి తెచ్చారు.

శంకర్-జైకిషన్ జంట దాదాపు రెండు దశాబ్దాల కాలం బాలీవుడ్ సంగీతాన్ని శాసించారు. ఈ జంటలో ఒకరైన శంకర్ అసలు పేరు శంకర్‌సింగ్ రఘువంశీ. ఉత్తరభారతీయ కుటుంబానికి చెందిన శంకర్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆయన సరిగమలు నేర్చుకున్నదీ ఇక్కడే. బాబా నాసిర్‌ఖాన్ వద్ద, ఆ తర్వాత ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ వద్ద సంగీతం నేర్చుకున్న శంకర్, తొలినాళ్లలో తబలా వాయించేవాడు. ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ ఆర్కెస్ట్రా బృందంలో కొన్నేళ్లు పనిచేశాక, సత్యనారాయణ్, హేమావతిల రంగస్థల బృందంలో చేరాడు. తబలా వాయించడంతో పాటు నాటకాల్లో చిన్న చిన్న వేషాలూ వేసేవాడు. కొన్నాళ్లకు బాంబే చేరుకుని, పృథ్వీరాజ్ కపూర్ నిర్వహించే పృథ్వీ థియేటర్ బృందంలో చేరాడు. సంగీత దర్శకులు హుస్న్‌లాల్-భగత్‌రామ్‌ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు.
 
జైకిషన్‌తో జోడీ
సినీ అవకాశాల కోసం గుజరాతీ దర్శకుడు చంద్రవదన్ భట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న కాలంలో శంకర్‌కు జైకిషన్ పరిచయమయ్యాడు. జైకిషన్ అప్పట్లో హార్మోనియం వాయించేవాడు. అవకాశాల వేటలో ఉన్న ఇద్దరికీ క్రమంగా దోస్తీ కుదిరింది. పృథ్వీరాజ్ కపూర్‌తో మాటమాత్రమైనా చెప్పకుండానే, పృథ్వీ థియేటర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని జైకిషన్‌కు మాట ఇచ్చేశాడు. శంకర్ మాటను మన్నించిన పృథ్వీరాజ్ తన ఆస్థానంలో జైకిషన్‌కూ చోటు ఇచ్చారు. పృథ్వీరాజ్ కపూర్ పెద్దకొడుకు రాజ్‌కపూర్ 1948లో రూపొందించిన తొలిచిత్రం ‘ఆగ్’కు సంగీత దర్శకుడు రామ్ గంగూలీ వద్ద శంకర్-జైకిషన్ అసిస్టెంట్లుగా చేశారు.

‘బర్సాత్’ చిత్రం షూటింగ్ కొనసాగుతుండగా, రామ్ గంగూలీతో రాజ్ కపూర్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ చిత్రానికి శంకర్-జైకిషన్‌లను సంగీత దర్శకులుగా పెట్టుకున్నాడు. ‘బర్సాత్’ పాటలు సూపర్‌హిట్ కావడంతో రాజ్ కపూర్ చిత్రాలకు శంకర్-జైకిషన్ ఆస్థాన సంగీత దర్శకులుగా మారారు. రాజ్‌కపూర్ సినిమాల్లో వారి బాణీలు దేశవ్యాప్తంగా మార్మోగాయి. షమ్మీ కపూర్, దేవానంద్, రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, మనోజ్‌కుమార్, ధర్మేంద్ర వంటి ఇతర హీరోల చిత్రాలకూ శంకర్-జైకిషన్ సంగీతాన్ని సమకూర్చారు. ఉత్తమ సంగీత దర్శకులుగా తొమ్మిదిసార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందారు.
 
హిందీ పాటల్లో తెలుగు పలుకులు
‘శ్రీ420’లో ‘రామయ్యా వస్తావయ్యా’, ‘షత్రంజ్’లో ‘బతకమ్మ బతకమ్మ ఎక్కడ బోతారా’ వంటి పాటల్లో తెలుగు పలుకులు హైదరాబాదీ అయిన శంకర్ ప్రయోగాలే. రాజ్‌కపూర్ ‘ఆహ్’ సినిమాను ‘ప్రేమలేఖలు’ పేరుతో డబ్ చేసినప్పుడు వారి బాణీలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. ‘పందిట్లో పెళ్లవుతున్నాది..’
 
ఈ చిత్రంలోనిదే. ఎన్టీఆర్ నటించిన ‘జీవిత చక్రం’ సినిమాకు కూడా వీరు సంగీతం సమకూర్చారు. అయితే, శంకర్ 1987లో మరణించినప్పుడు సినీరంగం నుంచి స్పందించిన వారు దాదాపు లేరనే చెప్పాలి. తర్వాత కొన్నాళ్లకు
 రాజ్‌కపూర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ‘ఘన’నివాళులర్పించాడు.
- పన్యాల జగన్నాథదాసు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement