Panyala jagannathadasu
-
దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు
♦ ధ్రువతారలు మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్య్రానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న ఆయన ‘భారత దేశానికొక జాతీయ జెండా’ పేరిట ఇంగ్లిష్‌లో ఒక పుస్తకాన్ని 1916 లోనే రాశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ‘యూనియన్ జాక్’ జెండా ఉన్నప్పటికీ నాటి బ్రిటిష్ పాలకులు సైతం తమ అధీనంలోని ‘భారత సామ్య్రాజ్యానికి’ ఒక జెండా ఉంటే బాగుందని భావించి, జెండా రూపకల్పన కోసం నానా ప్రయత్నాలు చేశారు. అదేకాలంలో మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా యావద్దేశానికి జాతీయ జెండా ఒకటి ఉండాలని గట్టిగా సంకల్పించారు. చాలా ప్రయత్నాల తర్వాత పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను 1947 జూలై 21న కాంగ్రెస్ ఆమోదించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎర్రకోటపై ఈ జెండానే రెపరెపలాడింది. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ. తండ్రి హనుమంతరాయుడు దివి తాలూకా యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉండేవారు. వెంకయ్య మాతామహులు అడవి వెంకటాచలం చల్లపల్లి సంస్థానానికి ఠాణేదారు. ఆయనకు పెద్దకళ్లేపల్లికి బదిలీ కావడంతో వెంకయ్య ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తర్వాత మచిలీపట్నం ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే వెంకయ్య చురుకైన విద్యార్థి. సాహస ప్రవృత్తి ఆయనను సైన్యం వైపు నడిపింది. పంతొమ్మిదో ఏట బొంబాయి వెళ్లి సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలోనే ఆయన తొలిసారిగా మహాత్మాగాంధీని కలుసుకున్నారు. అప్పటి నుంచే వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. యుద్ధం ముగిసి స్వదేశానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో అరేబియా, అఫ్ఘానిస్తాన్‌లను చూసి వచ్చారు. అప్పట్లో ప్లేగు మహమ్మారి ప్రపంచాన్నే వణికించేది. సైన్యం నుంచి తిరిగి వచ్చాక పింగళి వెంకయ్య మద్రాసు వెళ్లి ప్లేగు ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందారు. అక్కడ శిక్షణ పూర్తయ్యాక బళ్లారిలో కొంతకాలం ప్లేగు ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉద్యోగం ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. సీనియర్ కేంబ్రిడ్జి కోర్సు చేయడానికి కొలంబో వెళ్లారు. అక్కడి సిటీ కాలేజీలో చేరి, పొలిటికల్ ఎకనామిక్స్ ప్రధానాంశంగా సీనియర్ కేంబ్రిడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత కొంతకాలం రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్‌లోని డీఏవీ కాలేజీలో చేరారు. లాహోర్‌లో చదువుకుంటున్న కాలంలో ఆయన సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషలలో ప్రావీణ్యం సాధించారు. జపాన్‌లో అనర్గళంగా మాట్లాడేవారు. దాంతో ఆయనను సన్నిహితులంతా ‘జపాన్ వెంకయ్య’ అని పిలిచేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీని కలుసుకున్నప్పటి నుంచే వెంకయ్యలో జాతీయ పతాకం ఆలోచన మొదలైంది. ఇక అప్పటి నుంచి అదే ఆయన అభిమాన విషయమైంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సభల్లోనూ వెంకయ్య పాల్గొనేవారు. కాంగ్రెస్ నాయకులతో జాతీయ పతాకం రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరిపేవారు. అప్పట్లో బ్రిటిష్ ‘యూనియన్ జాక్’ ఉన్నా, దేశంలోని చిన్న చిన్న సంస్థానాలకు వేర్వేరు జెండాలు ఉండేవి. అందుకే బ్రిటిష్ పాలకులు సైతం తమ అధీనంలోని ‘భారత సామ్రాజ్యానికి’ ప్రత్యేక పతాకం ఉండాలని భావించేవారు. అదే కాలంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా మనకంటూ ఒక స్వతంత్ర పతాకం ఉండటం అవసరమని భావించేవారు. నిజానికి 1857 సిపాయిల తిరుబాటు నాటి నుంచి బ్రిటిష్ పాలకులు తమ అధీనంలోని భారత సామ్రాజ్యానికి ప్రత్యేక పతాకం అవసరమని భావించారు. ఏడో ఎడ్వర్డ్ పట్టాభిషేకం తర్వాత పతాక రూపకల్పన కోసం బ్రిటిష్ పాలకులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో వినాయకుడు, కాళీమాత, గోమాత చిహ్నాలకు జనాదరణ ఉండేది. పతాకంలో బ్రిటిష్ ‘యూనియన్ జాక్’ చిహ్నంతో పాటే ఈ చిహ్నాల్లో దేనినైనా వాడవచ్చనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇవి హిందువులకు మాత్రమే సంకేతంగా ఉంటున్నాయనే కారణంతో వీటిని తోసిపుచ్చారు. దేశంలోని సర్వమతాలకు ప్రాతినిధ్యం ఉండేలా పతకాన్ని తీర్చిదిద్దాలుకున్నారు. వందేమాతర నినాదంతో పతాకం 1905లో బెంగాల్ విభజన తర్వాత కులమత ప్రాంతాలకు అతీతంగా పతాకాన్ని రూపుదిద్దాలనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘వందేమాతరం’ జెండా. బ్రిటిష్ ఆకుపచ్చ రంగుపై ఎనిమిది తెల్లకలువలు (అప్పట్లో దేశంలో ఉన్న ఎనిమిది ప్రావిన్సులకు ప్రతీకగా, మధ్యన పసుపు రంగులో ‘వందేమాతరం’ నినాదం, దిగువన ఎరుపు రంగుపై ముస్లింలకు ప్రతీకగా ఎడమవైపు నెలవంక, హిందువులకు ప్రతీకగా సూర్యుడి చిహ్నాలతో రూపొందించారు. స్వదేశీ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో రూపొందించిన ఈ పతాకానికి జనాదరణ లభించలేదు. కలకత్తాలో ఈ పతాకాన్ని ఆవిష్కరించినా, అప్పటి పత్రికలేవీ దాదాపు ఆ పతాకావిష్కరణ సంఘటనను పట్టించుకోలేదు. తర్వాత సోదరి నివేదిత మరో పతాకాన్ని ప్రతిపాదించారు. ఇందులోనూ వందేమాతర నినాదం ఉంటుంది. పతాకం మధ్యలో మెరుపుతీగ, నూట ఎనిమిది దీపపు ప్రమిదలతో రూపొందించిన ఈ పతాకాన్ని 1906 కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టినా, ఆమోదం పొందలేదు. ఆ తర్వాత కూడా చాలామంది రకరకాల ప్రతిపాదనలతో రకరకాల పతాక నమూనాలను ముందుకు తెచ్చినా, అవేవీ ఆకట్టుకోలేకపోయాయి. బాల గంగాధర్ తిలక్, అనీబిసెంట్ కూడా ఒక జాతీయ పతాకాన్ని ప్రతిపాదించారు. పతాకం పైభాగంలో ఎడమవైపు యూనియన్ జాక్, కుడి వైపు నెలవంక నక్షత్రం, దిగువభాగంలో కుడివైపు ఏడు నక్షత్రాలు ఉండి, జెండా నేపథ్యంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ చారలు ఉంటాయి. ఈ పతాకాన్ని అప్పట్లో కోయంబత్తూరు మేజిస్ట్రేట్ నిషేధించాడు. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాలు కూడా జరిగాయి. వెంకయ్య రూపొందించిన జెండాను 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో తొలిసారిగా ఎగురవేశారు. జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని జలంధర్‌కు చెందిన నాయకుడు లాలా హన్స్‌రాజ్ 1919లో చేసిన సూచనను గాంధీజీ అంగీకరించారు. బెజవాడలో 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ వెంకయ్యను పిలిపించుకుని, పైన కాషాయం, దిగువన ఆకుపచ్చ రంగులున్న జెండా మధ్యలో రాట్నం చిహ్నం ఉండేలా రూపొందించమని కోరారు. వెంకయ్య అదే తీరులో జెండాను రూపొందించారు. జెండా మధ్యలో శాంతికి చిహ్నంగా తెలుపు రంగు ఉంటుందనే ఆలోచన వచ్చింది గాంధీజీకి. ఆయన మధ్యలో తెలుపు రంగు కూడా ఉంటే బాగుంటుందని వెంకయ్యకు చెప్పడంతో ఆయన ఈసారి మధ్యలో తెలుపు రంగును చేర్చి, తెలుపు రంగుపై రాట్నం చిహ్నం వచ్చేలా రూపొందించారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 21న వెంకయ్య రూపొందించిన జెండా నమూనాను ఆమోదిస్తూ, ఇందులో చిన్న మార్పు తెచ్చింది. రాట్నం స్థానంలో మన ప్రాచీన ధర్మ చిహ్నమైన అశోకచక్రాన్ని ఇముడ్చుతూ జాతీయ పతాకాన్ని ఆమోదించినట్లు జూలై 22న జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. నిష్కళంక దేశభక్తుడైన పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 మధ్య కాలంలో భారత జాతీయోద్యమంలోని కీలక ఘట్టాల్లో పాల్గొన్నారు. ‘వందేమాతరం’ ఉద్యమం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఉద్యమాల్లో ఆయన తన వంతు పాత్ర పోషించారు. సైన్యంలోను, రైల్వేలోను ఉద్యోగాలను వదిలేసి ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత వెంకయ్య కొంతకాలం బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్ర పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనక శిక్షణ ఇచ్చేవారు. అంతులేని జ్ఞానతృష్ణతో ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరమై శాస్త్ర పరిశోధనలపై దృష్టి సారించారు. మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు సాగించి డిప్లొమా తీసుకున్నారు. తర్వాత 1924 లో నెల్లూరు చేరుకుని, అక్కడ అభ్రకం గురించి విశేషమైన పరిశోధనలు సాగించారు. వజ్రకరూరు, హంపి ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి నేలల్లో దొరికే వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు చేసి, అప్పటి వరకు ప్రపంచానికి వెల్లడికాని అనేక విశేషాలను వివరిస్తూ ‘వజ్రపుతల్లి రాయి’ అనే గ్రంథాన్ని 1955లో ప్రచురించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయనను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆయన ఆ పదవిలో 1960 వరకు కొనసాగారు. అప్పటికే ఆయన వయసు 82 ఏళ్లు నిండాయి. ఖనిజ పరిశోధక శాఖలో పదవీకాలం పూర్తయ్యాక వెంకయ్య విజయవాడ చేరుకున్నారు. సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం ఆయనకు విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో కొద్దిపాటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో గుడిసె వేసుకుని, అందులో శేషజీవితాన్ని గడపాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో దుర్భరమైన ఆర్థిక కష్టాలు ఆయనను చుట్టుముట్టాయి. జాతీయ పతాక రూపకర్తలను ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు అమితంగా గౌరవిస్తాయి. మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం దారుణం. అవసాన కాలంలో పింగళి వెంకయ్య తిండికి కూడా మొహంవాచిన పరిస్థితుల్లో నానా అగచాట్లు పడ్డారని ‘త్రివేణి’ సంపాదకుడు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. ఆయన కష్టాలను గమనించిన కొందరు పెద్దలు ఆయనకు ఏదో రూపంలో కొంత నిధిని సమకూర్చి అందించాలని సంకల్పించారు. డాక్టర్ కె.ఎల్.రావు, డాక్టర్ టీవీఎస్ చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటి పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సన్మానించి, కొంత నిధిని అందించారు. సన్మానం జరిగిన ఆరునెలలకే– 1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు. చివరి దశలో ఆయన ‘నాకు అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత నా భౌతికకాయం మీద త్రివర్ణ పతాకాన్ని కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకాన్ని తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి’ అని తుది కోరికను కోరారు. -
తెల్లదొరలను వణికించిన తెలుగు పాట
స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య్ర సమర యోధులపై బ్రిటిష్ పాలకుల దమనకాండ దారుణంగా కొనసాగుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఒక సామాన్యమైన తెలుగు కవి తెల్లదొరల అరాచకాలను తెగనాడుతూ గొంతెత్తాడు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట– ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట– ఒకే ఒక్క తెలుగు పాట తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించింది. ఆ పాట తెలుగునాట నలుచెరగులా మార్మోగింది. ‘‘మాకొద్దీ తెల్లదొరతనము.. దేవా.. మా కొద్దీ తెల్లదొరతనము..’’ అనే పాట రాసిన ఆ కవి గరిమెళ్ల సత్యనారాయణ. ‘‘పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి... ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి...’’ అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు. జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు. ‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అనే జాషువా మాట గరిమెళ్ల సత్యనారాయణకు అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. చిరకాలం ప్రజల నాల్కల మీద నర్తించే పాటను రాసిన గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం. స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. బీఏ పూర్తి చేశాక కొంతకాలం గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగాను, మరికొంతకాలం విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను పని చేశారు. చిన్నవయసులోనే ఆయనకు మేనమామ కూతురితో వివాహం జరిగింది. స్వేచ్ఛాప్రియుడైన గరిమెళ్ల ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కలకత్తాలో 1920లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. ఆ స్ఫూర్తితోనే గరిమెళ్ల వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఏ స్థాయిలో జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు. ఆయన జైలు పాలైనా, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ టోపీలు ధరించి ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అని పాడుకుంటూ ఊరూరా కవాతులు సాగించేవారు. శిక్ష పూర్తయ్యాక విడుదలైన గరిమెళ్ల మళ్లీ జనం మధ్యకు వచ్చి, ఎలుగెత్తి పాడటం మొదలు పెట్టారు. మళ్లీ ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ గుమిగూడి, ఆయనతో పాటే గొంతు కలిపి పాడసాగారు. సముద్రఘోషలాంటి ఆ పాట తెల్లదొరల గుండెల్లో సునామీలు సృష్టించింది. గరిమెళ్ల బయట ఉండటం ప్రభుత్వానికి క్షేమం కాదని తలచి మళ్లీ ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మెజిస్ట్రేటు ముందు హాజరుపరచారు. ఈసారి మెజిస్ట్రేటు ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. గరిమెళ్ల జైలులో ఉండగా, 1923లో ఆయన తండ్రి మరణించారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన ముందుకు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమిటంటే– క్షమాపణ చెప్పి, బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ పాట పాడకుండా ఉండే వెంటనే విడుదల చేసేస్తామన్నారు. గరిమెళ్ల అందుకు అంగీకరించక శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు జైలులో ఉండటానికే సిద్ధపడ్డారు. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. అయితే, కొద్ది రోజులకే ఆయన భార్య మరణించింది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వాళ్ల ఆలనాపాలన కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సరైన ఉద్యోగం ఎక్కడా లేకపోవడంతో అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చడానికి ఆస్తులను అమ్ముకున్నారు. కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశారు. శ్రీ శారదా గ్రంథమాలను స్థాపించి, పద్దెనిమిది పుస్తకాలను అచ్చు వేయించారు. ఉద్యమకాలంలో ఆయన తరచు విజయనగరం, రాజమండ్రి, మద్రాసులకు తిరుగుతూ ఉండటంతో అచ్చు వేయించిన పుస్తకాలను అమ్ముకోవడంపై శ్రద్ధ పెట్టలేదు. చాలా పుస్తకాలు ఇంట్లోనే గుట్టలు గుట్టలుగా మిగిలిపోయాయి. వాటికి చెదలు పట్టి నాశనం కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. గరిమెళ్ల తొలి పుస్తకం ‘స్వరాజ్య గీతాలు’ 1921లో అచ్చయింది. తర్వాత 1923లో ‘హరిజన గీతాలు’, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు వంటి రచనలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న కాలంలో తమిళ, కన్నడ భాషలను నేర్చుకున్న గరిమెళ్ల, కొన్ని తమిళ, కన్నడ పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఇంగ్లిష్‌లో రాసిన ‘ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇవేవీ ఆయనకు ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడలేదు. జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ‘గృహలక్ష్మి’ పత్రికకు సంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. అక్కడ మానేసిన తర్వాత ఆచార్య రంగా నిర్వహించే ‘వాహిని’ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. కొన్నాళ్లకు ‘ఆంధ్రప్రభ’లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం ‘ఆనందవాణి’ సంపాదకుడిగా చేశారు. ఉద్యోగాల్లో స్థిరంగా కొనసాగలేకపోవడం వల్ల కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు. గరిమెళ్ల ఆర్థికంగా ఇక్కట్లు పడుతున్న కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రలు ఆయనను ఆర్థికంగా కొంత ఆదుకున్నారు. ఒకవైపు పత్రికలకు, మరోవైపు ఆలిండియా రేడియోకు రచనలు చేస్తూ వస్తున్నా, ఆ ఆదాయం ఆయన కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా కుంగదీశాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన పాలకుల వల్ల ఆయనకు ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 1952 డిసెంబరు 18న తుదిశ్వాస విడిచారు. ఇరుగు పొరుగుల సహాయంతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన మరణం తర్వాత మేలుకొన్న మన ఘనత వహించిన పాలకులు శ్రీకాకుళంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి దేశభక్తిని చాటుకున్నారు. - పన్యాల జగన్నాథదాసు -
మందు చేద్దామనుకుంటే మందుగుండు
జరామరణాలను దూరం చేయగల అద్భుతమైన మందును కనుగొనేందుకు చైనా రసవేత్తలు తొమ్మిదో శతాబ్దంలో విస్తృతంగా ప్రయోగాలు సాగించాడు. రకరకాల పదార్థాలను సేకరించి, నానా రకాల సమ్మేళనాలను తయారు చేసి పరీక్షలు జరిపారు. ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా, ఓర్పు కోల్పోని ఆ పరిశోధకులు మరిన్ని యత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో జరామరణాలను దూరం చేయగల నవయవ్వన ఔషధమేదీ తయారు కాలేదు గానీ, కూతవేటు దూరంలో ఉన్న ప్రాణాలను సైతం గాల్లో కలిపేయగల గన్‌పౌడర్ పుట్టింది. నవయవ్వన ఔషధం కోసం చైనా రసవేత్తలు చేసిన విఫలయత్నం ఫలితంగా మానవాళికి ఈ పేలుడు పదార్థం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఆ తర్వాత యుద్ధాల తీరుతెన్నులే మారిపోయాయి. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
పుష్కర గోదావరి
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద పడమటి కనుమలలోని బ్రహ్మగిరి కొండల నుంచి సన్నని ధారగా పుట్టి పాపికొండలను చీల్చుకుని పరవళ్లు తొక్కుతూ, తెలుగునేలను పునీతం చేస్తున్న పవిత్ర గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. పవిత్ర గంగానది తర్వాత 1465 కిలోమీటర్ల పొడవున ప్రవహించే గోదావరి మన దేశంలోనే రెండవ పెద్ద నది. భారతదేశంలో గంగానది అతిపెద్దదే కావచ్చు కానీ, గోదావరి అత్యంత పురాతనమైనది. భగీరథ ప్రయత్నం వల్ల భూమిపైకి చేరిన గంగానది త్రేతాయుగం నాటిదైతే, గోదావరి కృతయుగం నాటిదని ప్రతీతి. గంగా, గోదావరి నదులు రెండూ పవిత్రతలో సమానమైనవే అయినా, గోదావరిలో స్నానం చేసిన తర్వాతే గంగానదిలో స్నానం చేయాలనేది తరతరాల ఆచారం. గంగానదిలో స్నానం చేసినా, చేయకపోయినా, గోదావరిలో స్నానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని, గోదావరిలో స్నానం చేయకుండా గంగానదిలో స్నానం చేసినా ఫలితం దక్కదని స్మృతులు చెబుతున్నాయి. ఇంతటి ప్రశస్తి కలిగిన గోదావరి జననం గురించి పురాణాలు చెప్పిన గాథ.. గోదావరి జననం గంగను వలచిన శివుడు ఆమెను తలపైకి ఎత్తుకున్నందుకు శివాని అయిన పార్వతి కోపించింది. గంగను ఎలాగైనా తన భర్త నుంచి దూరం చేయాలని తలచి, ఆ పని నెరవేర్చేందుకు వినాయకుడిని నియోగించింది. వినాయకుడు అందుకు తగిన అదను కోసం నిరీక్షించసాగాడు. అదే కాలంలో గౌతముడనే రుషి బ్రహ్మగిరిపై ఆశ్రమం ఏర్పరచుకుని నివసించేవాడు. తపోధనుడైన గౌతముడు శివునికి అత్యంత ప్రియభక్తుడు. ఒకసారి గౌతముని ఆశ్రమ పరిసరాలలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. దుర్భిక్ష నివారణ కోసం గౌతముడు ప్రార్థించగా, శివుడు అతడికి ఒక వరం ఇచ్చాడు. పరమేశ్వరుడి వర ప్రభావం వల్ల గౌతముడు ఎంతటి బంజరు భూమిపై అయినా విత్తనాలు చల్లడమే తడవుగా, కొద్ది నిమిషాల వ్యవధిలోనే పంటలు పండేవి. కరువు కాటకాలు ఉన్నప్పటికీ ఈశ్వర కటాక్షం పొందిన గౌతముడు నిరంతర ధాన్యసమృద్ధితో తులతూగుతూ అతిథి అభ్యాగతులకు నిత్యాన్న సంతర్పణలు చేసేవాడు. ఇది కనిపెట్టిన వినాయకుడు అక్కడకు చేరుకున్నాడు. ఒకనాడు గౌతముడు యథాప్రకారం తన క్షేత్రంలో విత్తనాలు చల్లి, జపం చేసుకునేందుకు అడవికి వెళ్లిపోయాడు. గౌతముడు చల్లిన విత్తనాలు చూస్తుండగానే పచ్చని పైరుగా ఎదిగాయి. ఇదే అదనుగా భావించిన వినాయకుడు ఒక మాయగోవును సృష్టించి, దానిని ఆ పైరు మీదకు వదిలాడు. ఆ మాయగోవు యథేచ్ఛగా మేయసాగింది. జపం ముగించుకుని వచ్చిన గౌతమునికి తన పైరును మేసేస్తున్న గోవు కనిపించింది. అక్కడే పడి ఉన్న ఒక ఎండు కట్టెను ఆ గోవుపైకి విసిరాడు. కట్టె తాకినంతనే ఆ మాయగోవు గొప్ప బాధతో ఆర్తనాదాలు చేస్తూ, ఆ ప్రాంతమంతా గిలగిలలాడుతూ తిరిగింది. అక్కడి నుంచి అది తూర్పు దిశగా సాగింది. పశువు వేదన అనుభవించిన ఆ ప్రాంతమే ఆ తర్వాత ‘పశువేద’ అనే గ్రామంగా పరిణమించిందని ప్రతీతి. తాను విసిరిన కట్టె తాకడమే తడవుగా మాయగోవు ఆక్రందనలు చేయడంతో గౌతముడు కలవరపడ్డాడు. ఆవు ఆర్తనాదాలు విని ఆశ్రమంలోని మునిజనులందరూ పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. తూర్పు దిశగా సాగిన ఆవును వెంబడించారు. కొంతదూరం సాగిన తర్వాత ఆ ఆవు నేలపై పడి కళ్లు తేలవేసింది. ఆచార పరాయణులైన మునిజనులందరూ గౌతముడు గోహత్యకు పాల్పడ్డాడంటూ నిందించారు. తమ యజ్ఞయాగాదికాల నుంచి అతడిని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. సాటి మునుల నిర్ణయానికి గౌతముడు ఖిన్నుడయ్యాడు. జరిగిన దానికి పరిహారంగా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పమని వారిని వేడుకున్నాడు. శివుని జటాఝూటంలోని గంగను తెచ్చి, గోకళేబరం మీదుగా ప్రవహింపజేయడమే తగిన ప్రాయశ్చిత్తమని వారు చెప్పారు. మునిజనుల సూచన మేరకు గౌతముడు శివుడి కోసం తీవ్ర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు కైలాసం నుంచి కదిలివచ్చాడు. వరమేమి కావాలో కోరుకోమన్నాడు. తన పాప ప్రక్షాళనార్థం గంగను విడువమన్నాడు గౌతముడు. భక్తజన సులభుడైన సదాశివుడు అతడి కోరికను మన్నించాడు. తన జటాఝూటం నుంచి ఒక పాయను నేలపైకి విడిచాడు. అది నదిగా అవతరించింది. గౌతముని వలన నేలకు దిగినందున ‘గౌతమి’గా ప్రసిద్ధి పొందింది. నదీమాత కోరిక మేరకు గోముఖాకృతి నుంచి వెలువడేలా శివుడు అనుగ్రహించాడు. ‘గౌతమి’ జన్మ స్థానమైన నాసిక్ వద్ద త్రయం బకేశ్వరుడిగా అవతరించాడు. శివుని ప్రసాదంగా వెలువడిన పావన ధార తన వెంట రాగా, గౌతముడు దానిని గో కళేబరం మీదుగా ప్రవహింపజేసి, పాప విముక్తుడయ్యాడు. గోవుకు సద్గతి కలిగించిన గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యం దక్కుతుంది. ఇది సాక్షాత్తు పరమశివుని వరం అని, గోదావరి స్నాన సంకల్పంతో బయలుదేరి, మార్గ మధ్యంలో మృతులైన వారు సైతం మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. పుష్కర గాథ సమస్త జీవులు మహానదులలో తమ పాపాలను ప్రక్షాళనం చేసుకుంటుంటే, ఆ నదులన్నీ పాపపంకిలమైపోవూ! జీవుల పాపాలతో నిండిన నదులు తిరిగి పవిత్రతను ఎలా పొందగలవు? అనే సందేహం తలెత్తింది పుష్కరుడనే బ్రాహ్మణుడికి. జీవుల పాపాలతో నిండిన నదులను పునఃపావనం చేసేందుకు ఏదైనా చేయాలనుకుని, శివుడి కోసం తపస్సు చేశాడు. పుష్కరుడి భక్తికి సంతసించి ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. వరం కోరుకోమన్నాడు. నదులను పునఃపావనం చేసేందుకు తనకు జలత్వసిద్ధి ప్రసాదించాలని వేడుకున్నాడు పుష్కరుడు. సరేనని వరం ఇచ్చాడు శివుడు. పుష్కరుడు జలత్వసిద్ధి పొందినట్లు తెలుసుకున్న బ్రహ్మదేవుడు, వెంటనే శివుడిని ప్రార్థించి, పుష్కర తత్వాన్ని తన కమండలంలో భద్రపరచుకున్నాడు. ఇదిలా ఉంటే, గౌతముడి భార్య అహల్యను వాంఛిస్తాడు దేవేంద్రుడు. అహల్య పొందు కోరి, తన మాయతో గౌతముడు అకాలంలో నదీస్నానానికి వెళ్లేలా చేస్తాడు. గౌతముడు ఇల్లు విడిచిన తర్వాత, తాను అతడి రూపం ధరించి, అహల్యను చేరుతాడు. నదికి బయలుదేరిన గౌతముడు, మార్గమధ్యంలో నింగిలోని నక్షత్రాలను చూసి, అది రాక్షస ముహూర్తంగా గ్రహించి, తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. తన రూపంలో అహల్యతో ఉన్న ఇంద్రుని చూసి ఆగ్రహించి, ఇద్దరినీ శపిస్తాడు. గౌతముడి శాపఫలితంగా ఇంద్రుడి శరీరమంతా స్త్రీలింగాలు ఏర్పడతాయి. అహల్య రాయిగా మారుతుంది. తన వికృతరూపాన్ని భరించలేని ఇంద్రుడు తరుణోపాయం కోసం దేవగురువు అయిన బృహస్పతిని ఆశ్రయిస్తాడు. బృహస్పతి అతడిని వెంటపెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్లి ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మందాకిని వద్ద ఒక సరోవరాన్ని నిర్మించి, తన కమండలంలోని జలాన్ని ప్రోక్షిస్తాడు. అందులో స్నానం చేసిన ఇంద్రుడు తన పూర్వ సుందర రూపాన్ని పొందుతాడు. పుష్కరజల మహిమకు బృహస్పతి, దేవేంద్రుడు చకితులయ్యారు. దేవేంద్రుడి వికృతరూపాన్ని మటుమాయం చేసిన పుష్కర మహిమ ముల్లోకాలకూ పాకింది. ఆకాశగంగ కంటే మహిమాన్వితమైన పుష్కర సంగమం కోసం నదులన్నీ ఉవ్విళ్లూరాయి. మహానదులన్నీ బ్రహ్మ వద్దకు వెళ్లి, తమకు పుష్కర సంగమాన్ని కల్పించాలని ప్రార్థిస్తాయి. పుష్కర మహిమను తిలకించిన దేవగురువు బృహస్పతి సైతం తనకూ పుష్కరత్వాన్ని కల్పించాలని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకు గురుడు ఒక్కో రాశిలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు, ఆ రాశిని విడిచే ముందు పన్నెండు రోజులు చొప్పున పన్నెండు నదులలో ఉండేందుకు అంగీకరించాడు పుష్కరుడు. మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరాలని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలని అంటారు. అయితే, గోదావరి మినహా మిగిలిన నదులకు అంత్య పుష్కరాలు జరగవు. గురుడు ఒక్కో రాశిలో ఏడాదికాలం సంచరిస్తాడు. అందువల్ల ఒక్కో నదికి తిరిగి పుష్కరాలు ఏర్పడేందుకు పన్నెండేళ్లు పడుతుంది. ఆ క్రమంలో గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. ఈ ఏడాది గురుడు అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నాడు, అంటే 2015 జూలై 14న ఉదయం 6.26 గంటలకు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. అందువల్ల జూలై 14వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు ఆది పుష్కరాలు జరుగుతాయి. వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 11 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి.పుష్కరకాలంలో గోదావరి స్నానం, ఆ నదీతీరాన జరిపే జప హోమాదులు, పితృతర్పణలు, దాన ధర్మాలు సహస్రాధికంగా ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. - పన్యాల జగన్నాథదాసు -
కన్నీటి ఆర్తి
కొన్ని కన్నీళ్లు అందంగా ఉంటాయి. కొన్ని వికృతంగా. కొన్ని దయగా ఉంటాయి. కొన్ని కర్కశంగా. కొన్ని బాధను పంచుకుంటాయి. కొన్ని బాధనిస్తాయి. కొన్ని హర్షాన్నిస్తాయి. కొన్ని దుఃఖాన్ని వర్షిస్తాయి. ఆర్తి కళ్లు అనేకసార్లు సుడులు తిరిగుంటాయి. కొన్ని గ్లిజరిన్‌కు. కొన్ని నిజంగా. గొప్ప నటన. నాటకీయ పతనం. గొప్ప సౌందర్యం... కనపడని గాయం. గొప్ప భవిష్యత్... హఠాత్ మరణం. కన్నీళ్లకు కదిలించే శక్తి ఉంటుందంటారు. ఇప్పుడు అవి ఆర్తిని కదిలిస్తే ఎంత బాగుండు! అగ్రహీరోలందరితో... పదిహేనేళ్ల కెరీర్లో ఆమె నటించినవి మహా అయితే ఓ పాతిక సినిమాల వరకు ఉంటాయి. అయితేనేం? వెండితెర మీద నిండుగా ప్రేక్షకులకు కనువిందు చేసిందామె! తెలుగులోని పెద్ద పెద్ద హీరోలందరి సరసనా నటించింది. అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఆమె, అనుకోకుండా సినీరంగంలోకి వచ్చింది. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి తొలిసారిగా ఆమె ప్రతిభను గుర్తించాడు. ఫిలడెల్ఫియాలో సునీల్‌శెట్టి పాల్గొన్న కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్ డ్యాన్స్ చేసింది. అప్పటికి ఆమె వయసు పట్టుమని పద్నాలుగేళ్లే! సినీరంగంలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని, బాలీవుడ్‌కు పంపమని ఆర్తీ తండ్రి శశాంక్‌కు సూచించాడు. సునీల్‌శెట్టి ప్రోత్సాహంతో ఆర్తీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తొలిచిత్రం ‘పాగల్పన్’ 2001లో విడుదలైంది. బాలీవుడ్ నిర్మాత రాకేశ్నాథ్ కొడుకు కరణ్‌నాథ్ సరసన నటించిన ఆ చిత్రం పరాజయం పాలైంది. టాలీవుడ్ గోల్డెన్‌లెగ్.. అదే ఏడాది ఆర్తీ టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. వెంకటేశ్ సరసన ఆమె నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ హిట్టవడంతో, టాలీవుడ్‌నే తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతోను, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు, రవితేజ, ప్రభాస్, తరుణ్, ఉదయకిరణ్ వంటి యువ హీరోలతోను వరుసగా సినిమాలు చేసింది. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత తొలి నాలుగేళ్లూ ఆర్తీకి స్వర్ణయుగంలానే గడిచింది. వరుస సినిమాలు.. వరుస విజయాలు.. తొలి ఏడాదిలోనే తరుణ్‌తో ‘నువ్వులేక నేను లేను’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’ సినిమాలతో తన సత్తా చాటుకుంది. వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ‘ఇంద్ర’లో అవకాశం దొరికింది. అందులో ఆమె స్నేహలతారెడ్డి పాత్రలో చిరంజీవికి దీటైన నటన కనపరచి అభిమానులే కాదు, విమర్శకుల మెప్పు కూడా పొందింది. ‘నీ స్నేహం’లో యువహీరో ఉదయ్ కిరణ్ సరసన, ‘బాబీ’లో మహేశ్ బాబు సరసన తళుక్కుమని ఆకట్టుకుంది. ఆ వెంటనే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’లో బాలకృష్ణ వంటి అగ్రహీరో సరసన మరో భారీ అవకాశం. వెంకటేశ్‌తో ‘వసంతం’, రవితేజతో ‘వీడే’, నాగార్జునతో ‘నేనున్నాను’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’.. వరుస హిట్లు.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్గా ఆర్తీ పేరు మార్మోగింది. ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నరసింహుడు’లలో ఐటెమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది. వివాదాల సుడిగుండం.. అగ్ర కథానాయికల్లో ఒకరిగా తన స్థానం ఇక పదిలం అనుకుంటుండగానే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. హీరో తరుణ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వదంతులు రావడంతో మనస్తాపం చెంది, 2005 మార్చి 23న వేకువ జామున బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడంతో అదేరోజు మధ్యాహ్నానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అదే ఏడాది తరుణ్‌తో నటించిన ‘సోగ్గాడు’ విడుదలైంది. వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతి’లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. తమిళంలో ‘బంబర కన్నలె’లో నటించినా, తమిళ రంగం నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆత్మహత్యా యత్నం నుంచి బయటపడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె గురించి వార్తలు కూడా బాగా తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో 2006 ఫిబ్రవరి 15న రాత్రి భోజనం తర్వాత అపార్ట్మెంట్లో మెట్ల మీంచి జారిపడటంతో తీవ్రంగా గాయపడింది. ఆమె తండ్రి అప్పటికి పెయిన్ కిల్లర్ మాత్రలు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్‌ను పిలిచారు. వెంటనే ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సూచించడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ సంఘటనపైనా రకరకాల ఊహాగానాలు.. రకరకాల వదంతులు.. కాస్త కోలుకున్నాక ఆన్లైన్లో పరిచయమైన ఎన్ఆర్ఐ ఉజ్వల్‌ను 2007 నవంబర్ 21న ఆర్య సమాజ్‌లో పెళ్లాడింది. జార్ఖండ్‌కు చెందిన ఉజ్వల్ అమెరికాలోని బ్యాంకు ఉద్యోగి. పెళ్లి తర్వాత ఆర్తీ.. టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కమేడియన్ సునీల్ సరసన ‘అందాలరాముడు’లో నటించింది. ఆ చిత్రం హిట్ కావడంతో ఆర్తీ కెరీర్ తిరిగి గాడిలో పడుతోందనే అనుకున్నారు అభిమానులు. సినిమాల్లో తిరిగి తన సత్తా నిరూపించుకోవాలనే అనుకుందామె. అయితే, అమెరికాలో ఉన్న భర్త మాత్రం సినిమాలు వదిలేసి, తన వద్దకు వచ్చేయమన్నాడు. భిన్న ధ్రువాలుగా మారడంతో ఇద్దరి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. రెండేళ్లు గడిచేలోగానే విడాకులు తీసుకున్నారు. కాపురంలో కలతలు కొనసాగుతున్న కాలంలోనే ‘గోరింటాకు’, ‘దీపావళి’ వంటి సినిమాల్లో నటించింది. అవి కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. పోసాని కృష్ణమురళితో ‘జెంటిల్‌మేన్’లో నటించింది. తర్వాత దాదాపు కనుమరుగైంది. ఆర్తీ నటించిన ‘రణం-2’ శుక్రవారమే విడుదలైంది. మరో చిత్రం ‘నీలవేణి’ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈలోగానే అనుకోని విషాదం. ఒక అందమైన నటి రాలిపోయింది. - పన్యాల జగన్నాథదాసు మరో యువ ఆత్మ నింగికి ఎగిరింది. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ, ఆర్తి ఆత్మ శాంతికోసం ప్రార్థిస్తున్నాను. - మంచు లక్ష్మి గుండెలు పిండివేసే వార్త ఇది. ఆర్తి అగర్వాల్ ఆత్మకు శాంతి లభించాలి. - మంచు మనోజ్ దిగ్భ్రాంతికరమైన వార్త... ఆర్తి ఇక లేదు... జీవితం నిజంగా ఎంత బుద్భుదం... చాలా విచారకరం - నాని ఆర్తి ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోవడం నిజంగా దురదృష్టకరం! - సందీప్ కిషన్ నా ‘వీడే’ కథానాయిక ఇక లేదని తెలుసుకోగానే నాకు గుండె బద్దలయినంత పనయింది. ఇది చాలా దిగ్భ్రాంతికరం. ఆమె ఆత్మ శాంతి పొందుగాక! - కోన వెంకట్ నేను విన్నది నిజమేనా? ఆర్తి అగర్వాల్ ఇక లేదా? ఆఖరి క్షణం వరకు ఆమె జీవితంతో పోరాడుతూనే ఉంది! - లక్ష్మీ రాయ్ హారి భగవంతుడా! ఇంత చిన్న వయసులోనే ఆర్తిని తీసుకెళ్లావెందుకు... - విమలా రామన్ ఇంత చిన్న వయసులోనే... ఆర్తి... నిజంగా ఇది గుండెలు బద్దలయే వార్త. ఆర్తికి ఆత్మశాంతి కలగాలి. - సమంత రూత్ ప్రభు -
చేతివాటం మారాజు..
రాచరికంలో దోపిడీ అంతా పరోక్షంగానే సాగేది. రాజాధి రాజులు, మహా మహా చక్రవర్తులు యథాశక్తి ప్రజలపై పన్నులు వడ్డిస్తూ ఆ విధంగా ముందుకుపోయేవారు. అలాగని వారు నేరుగా ఏనాడూ జేబులు కత్తిరించిన పాపాన పోలేదు. ఈజిప్టును పరిపాలించిన చిట్టచివరి రాజు ఫరూక్ మిగిలిన రాజుల కంటే భిన్నమైన పిచ్చిమారాజు. ఇతగాడు ఏకంగా జేబులు కత్తిరించే రకం. కంటికి నదరుగా కనిపించిన వస్తువు ఎంత చిన్నదైనా, పనికిమాలినదైనా కొట్టేయకుంటే అతగాడికి నిద్రపట్టేది కాదు. ఇదోరకం జబ్బు. దీనినే ‘క్లెప్టోమానియా’ అంటారు మానసిక వైద్యులు. అది సరే! జేబులు కొట్టేసిన వాడికి అవసరమైన సమయాల్లో పిక్కబలం చూపి పరుగెత్తే సత్తా ఉండాలి. ఫరూక్ మహారాజా వారికి అలాంటిదేమీ లేదు. సుష్టుగా ముప్పూటలా భోంచేసి పెంచిన 136 కిలోల భారీ శరీరంతో గజగమనుడై అలరారేవాడు. అడుగుతీసి అడుగు వేయడమే గగనంగా ఉండేది. ఇంతటి మహాకాయుడైన మహారాజా ఫరూక్వారు ఒకసారి ఏకంగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ చేతిగడియారాన్నే కొట్టేసి చరిత్రలో నిలిచిపోయాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
మానవుడు... మరణాన్ని జయిస్తాడా?
కవర్ స్టోరీ నిండు నూరేళ్లు బతకాలనే ఆకాంక్షతో ‘శతాయుష్మాన్ భవ’ అంటూ పెద్దలు ఆశీస్సులు పలకడం మన ఆనవాయితీ. పిన్నల పట్ల ప్రేమాభిమానాలు అతిశయించినప్పుడు ‘చిరంజీవ.. చిరంజీవ’ అని కూడా ఆశీర్వదిస్తారు. ప్రపంచంలో శతాయుష్కులు అక్కడక్కడా ఉన్నా, చిరంజీవులు మాత్రం పురాణాలకే పరిమితం. క్రికెట్ పరుగుల్లో సెంచరీ కొట్టడం కంటే, బతుకు పరుగులో సెంచరీ కొట్టడమే సిసలైన ఘనత. అందుకే, సెంచరీ దాటిన వయోధికులు వార్తలకెక్కుతుంటారు. క్రికెట్లో సెంచరీ వీరుల సంఖ్య పెరుగుతున్నట్లే, ప్రపంచంలో సెంచరీ దాటిన వయోధికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. మానవుల ఆయుర్దాయ ప్రమాణంలో ఇదొక ఆశావహమైన మార్పు. అరవైకి మించి బతకడమే ఎక్కువ. ఆ తర్వాత బాల్చీ తన్నేసినా మరేం ఫరవాలేదనే నిరాశావాదుల సంఖ్య లోకంలో తక్కువేమీ కాకపోయినా, శాస్త్ర పరిశోధనల పురోగతిని గమనిస్తే, అలాంటి నిరాశావాదులను లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. అంతులేని జీవనలాలస కలిగిన శాస్త్రవేత్తలు శతాయుష్షుతో సంతృప్తి చెందడం లేదు. మానవుల ఆయుర్దాయాన్ని బహు శతాధికంగా పొడిగించడమే కాదు, చివరకు జరామరణాలను జయించగల మార్గాలను కనుగొనే పరిశోధనలను ముమ్మరం చేస్తున్నారు. ‘గూగుల్’ వంటి దిగ్గజ సంస్థలు ఇలాంటి పరిశోధనలకు భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఆ పరిశోధనలు, ఇప్పటి వరకు వాటి ఫలితాలు, వాటిపై భావి ఆశలు, అంచనాలపై ఒక వీక్షణం.. మానవాళి చిరకాల స్వప్నం.. జరామరణాలను జయించాలనేది మానవాళి చిరకాల స్వప్నం. అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు చిరంజీవులు. ఈ ఏడుగురే కాకుండా, మార్కండేయుడిని కూడా కొందరు పురాణకారులు చిరంజీవుల జాబితాలో చేర్చారు. పురాణాల్లో మరికొందరు చిరంజీవులూ ఉన్నారు. పురాణాల సంగతి సరే, శాస్త్ర సాంకేతిక అధునాతన వైద్య పరిజ్ఞానం విచ్చలవిడిగా విస్తరిల్లుతున్న కాలంలో చిరంజీవులెవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వస్తుంది. ఆధునిక యుగంలో కొత్తకొత్త జబ్బులొచ్చాయి, కొత్తకొత్త మందులు, చికిత్సా పద్ధతులూ వచ్చాయి. మానవాళిని మహమ్మారిలా మట్టుపెట్టగల ప్రాణాంతక వ్యాధులను జయించిన ప్రతి సందర్భమూ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచింది. ఇదివరకటితో పోలిస్తే, చాలా రకాల క్యాన్సర్లను వైద్యులు నయం చేయగలుగుతున్నారు. అయినప్పటికీ, చాలామందిని క్యాన్సర్ ఇంకా కబళిస్తూనే ఉంది. క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించిన శాస్త్రవేత్తలు ఆశాజనకమైన ఫలితాలతో ముందంజ వేస్తున్నారు. రక్తపింజర విషంతో ఎయిడ్స్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ప్రతి ప్రాణాంతక వ్యాధినీ జయించే దిశగా నిర్విరామంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, మనుషులు వ్యాధులు, వైపరీత్యాల వల్ల మాత్రమే మరణిస్తారా..? వైపరీత్యాల బారిన పడకుండా, జీవితకాలంలో ఏ వ్యాధి సోకకుండా బతికినా, ముదిమి మీరినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు గుటుక్కుమంటూనే ఉన్నారు కదా! అందుకే శాస్త్రవేత్తలు ముదిమిని జయించడమే తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ముదిమిని జయిస్తే, ఏదో ఒకరోజు మరణాన్ని జయించడం అసాధ్యమేమీ కాదనేదే వారి అభిమతం. జరామరణాలపై గత పోరాటాలు.. జరామరణాలపై మానవుల పోరాటం ఈనాటిది కాదు. అమృతం తాగిన వాళ్లకు మరణం ఉండదని నమ్మేవాళ్లు. అమృతం తాగినందునే దేవతలు అమరులయ్యారని పురాణాలు చెబుతాయి. పురాణాల ప్రభావంతో జరా మరణాలను జయించే దివ్యౌషధం కనిపెట్టే దిశగా శతాబ్దాల కిందట చాలా ప్రయత్నాలే జరిగాయి. ఆధునిక యుగానికి ముందు కూడా దీర్ఘాయువు కోసం చాలా ప్రయోగాలే జరిగాయి. దీర్ఘయవ్వనం కోసం మన దేశంలో వాజీకరణ ఔషధాల వాడుక శతాబ్దాల కిందటి నుంచే ఉంది. తాబేలు వృషణాలతో తయారు చేసిన సూప్ తాగితే దీర్ఘాయువు కలుగుతుందని జమైకన్లు నమ్మేవారు. లేడీ డ్రాకులాగా పేరుమోసిన ట్రాన్సిల్వేనియా రాణి ఎలిజబెత్ బ్యాతొరీ మరణాన్ని జయించేందుకు మరింత క్రూరమైన ప్రయోగమే చేసేది. మరణాన్ని జయించవచ్చనే వెర్రి నమ్మకంతో ఆమె ఏకంగా పడచు యువతుల రక్తంతో జలకాలాడేది. అయినా, ఆమె మరణాన్ని జయించలేకపోయింది. దీర్ఘాయువు కోసం చైనా చక్రవర్తులు జేడ్ అనే రత్నం, బంగారం వంటి విలువైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాలే కాకుండా, అప్పటి వైద్యుల మాటలు నమ్మి నానా ఔషధాలు, మూలికా రసాయనాలు మింగేవారు. ఒక్కోసారి అలాంటి ఔషధాలు వికటించేవి కూడా. అయినా, జరామరణాలను జయించే ప్రయత్నాలను మానవులు ఏనాడూ విరమించుకోలేదు. అయితే ఆ ప్రయత్నాల ఫలితంగా మానవుల సగటు ఆయుర్దాయ ప్రమాణాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అచిరకాలంలోనే పంచశతాయుష్కులు..! మానవులందరికీ అమరత్వ సిద్ధి అచిరకాలంలోనే సాధ్యం కాకపోవచ్చు గానీ, సమీప భవితవ్యంలో పుట్టబోయే మనుషులు ఐదువందల ఏళ్లు నిక్షేపంగా బతుకుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటగా 150 ఏళ్ల లక్ష్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. క్రమంగా మరికొంత కాలానికి అమరత్వాన్ని కూడా సాధించవచ్చని అంటున్నారు. వార్ధక్యాన్ని ఇప్పటి వరకు వైద్యులు సహజ లక్షణంగానే గుర్తిస్తూ వస్తున్నారు. అయితే, అమరత్వ సాధన కోసం తపన పడుతున్న అధునాతన పరిశోధకులు మాత్రం వార్ధక్యాన్ని వ్యాధిగానే గుర్తించాలనే వాదన వినిపిస్తున్నారు. మిగిలిన వ్యాధుల మాదిరిగానే వార్ధక్యాన్ని కూడా చికిత్సతో నయం చేయవచ్చని చెబుతున్నారు. వార్ధక్యాన్ని నయం చేస్తే, మరణాన్ని జయించడం పెద్ద సమస్య ఏమీ కాదని అంటున్నారు. రానున్న రెండు, మూడు దశాబ్దాల్లోనే ఈ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు. వార్ధక్యాన్ని పూర్తిగా నయం చేయగలిగితే, మరణాన్ని జయించినట్లేనని చెబుతున్నారు. వార్ధక్యమే లేకపోతే... వార్ధక్యం లేని మనుషులకు ‘సహజ’మరణం ఉండదు. అలాంటప్పుడు ప్రమాదాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా హత్యల వంటి నేరాల వల్ల తప్ప మనుషులు మరణించే అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటి సందర్భాల్లో మనుషులు భౌతికంగా మరణించినా, వారికి అమరత్వం కల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా భౌతికంగా మరణించినా, వారి మేధస్సును కంప్యూటర్లోకి అప్లోడ్ చేయడం ద్వారా వారిని చిరాయువులుగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డీఎన్ఏ క్షీణత, మైటోకాండ్రియా సహా శరీర కణాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ భాగాల్లో సంభవించే విపరిణామాల ఫలితంగానే వార్ధక్యం కలుగుతోందని బ్రిటిష్ పరిశోధకుడు గ్రే చెబుతున్నారు. ఈ విపరిణామాలను నివారించడం ద్వారా వార్ధక్యం రాకుండా చేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా జీవకణంలోని డీఎన్ఏను అంటిపెట్టుకుని ఉండే ‘టెలోమెర్స్’ అనే న్యూక్లియోటైడ్స్ పొడవు కుంచించుకుపోవడమే వార్ధక్యానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మూలకణ చికిత్స ద్వారా టెలోమెర్స్ పొడవు కుంచించుకుపోకుండా నివారించగలమని వారు భావిస్తున్నారు. మరోవైపు, మూలకణాలతో అవయవ మార్పిడి చికిత్సలను సులభతరం చేసే ప్రక్రియలపైనా పరిశోధనలు సాగిస్తున్నారు. అమరత్వ సిద్ధిపై అపర కుబేరుల ఆసక్తి.. అమరత్వ సాధన కోసం జరుగుతున్న ప్రయోగాలపై ప్రపంచంలోని అపర కుబేరులు అపరిమితమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిశోధనల కోసం ఎలాంటి ప్రచారం లేకుండా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సహా పలువురు కార్పొరేట్ రారాజులు దీర్ఘాయువు కోసం జరుగుతున్న పరిశోధనలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఉదారంగా సమకూరుస్తున్నారు. మరణాన్ని జయించే రోజు కచ్చితంగా వస్తుందని సెర్గీ బ్రిన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మరణాన్ని ఒక అనివార్య పరిణామంగా స్వీకరించినంత కాలం మానవ జీవితం అసమగ్రంగానే ఉంటుందని ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్న మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ల్యారీ ఎలిసన్ అంటున్నారు. జన్యు విపరిణామాలను నివారించడం ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పటికే సూక్ష్మజీవులు, ఎలుకల ఆయుర్దాయ ప్రమాణాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమయ్యారు. ఇంటర్నెట్ పేమెంట్ సేవల సంస్థ ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ కూడా ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్నారు. వార్ధక్యం అనివార్యమనే ఆలోచననే విరమించుకోవాలని బ్రిటిష్ పరిశోధకుడు ఆబ్రే డి గ్రే గట్టిగా చెబుతున్నారు. నాణేనికి మరోవైపు... అనివార్యమైన జరామరణాలను జయించడం అసాధ్యమని, ఇలాంటి విషయాలపై పరిశోధనలు సాగించడం పూర్తిగా వెర్రితనం అని విమర్శలు గుప్పించే పరిశోధకులూ లేకపోలేదు. అసాధ్యమైన అంశాలపై సాగించే పరిశోధనల కోసం నిధులు తగలేసే కంటే, ఉపయోగపడే అంశాలపై పరిశోధనలకు ఆ నిధులను మళ్లిస్తే సముచితంగా ఉంటుందని బ్రిటిష్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ కోలిన్ బ్లేక్మోర్ అంటున్నారు. శాస్త్ర పరిశోధనల ఫలితంగా మహా అయితే, మానవుల సగటు ఆయుర్దాయాన్ని 120 ఏళ్ల వరకు పెంచవచ్చని, అంతకు మించి పెంచడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆశలు కలిగిస్తున్న ఫలితాలు.. ఎలాంటి పరిశోధనలకైనా విమర్శలు తప్పవు. దీర్ఘాయుర్దాయంపై జరుగుతున్న పరిశోధనలు సైతం విమర్శలకు అతీతమైనవేవీ కాదు. కొన్ని వర్గాల శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పిస్తున్నా, దీర్ఘాయుర్దాయంపై తదేక దీక్షతో పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు మాత్రం ఆశాజనకమైన ఫలితాలనే సాగిస్తున్నారు. గూగుల్ ఆర్థిక సహాయంతో కాలిఫోర్నియా లైఫ్ కంపెనీ శాస్త్రవేత్తలు ఏలికపాములను నమూనాగా తీసుకుని నిర్వహించిన ప్రయోగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. జన్యుపరివర్తనం ద్వారా వారు ఏలికపాముల ఆయుర్దాయాన్ని ఏకంగా పదిరెట్లు పెంచగలిగారు. ఇదే పద్ధతిలో మానవుల ఆయుర్దాయాన్ని కూడా గణనీయంగా పెంచడం సాధ్యమేనని కాలిఫోర్నియా లైఫ్ కంపెనీ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న సింథియా కెన్యాన్ చెబుతున్నారు. ఆఫ్రికాలో కనిపించే ఎలుక జాతికి చెందిన ‘నేకెడ్ మోల్ ర్యాట్’పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. శరీరంపై రోమాలు లేని ఈ ఎలుకకు క్యాన్సర్ సోకదు. మిగిలిన ఎలుకల కంటే దీని ఆయుర్దాయం పదిరెట్లు ఎక్కువ. మామూలు ఎలుకలు సగటు ఆయుర్దాయం మూడేళ్లు అయితే, ‘నేకెడ్ మోల్ ర్యాట్’ ఏకంగా ముప్పయ్యేళ్లకు పైగానే బతుకుతుంది. క్యాన్సర్‌ను సోకనివ్వని లక్షణమేదో ఈ ఎలుక జన్యువుల్లో ఉంటుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు, ఆ రహస్యాన్ని ఛేదించే దిశగా ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల నేపథ్యంలో మానవుడు మరణాన్ని జయించే రోజు వస్తుందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం గానీ, సమీప భవితవ్యంలోనే మానవుల ఆయుర్దాయ ప్రమాణం ద్విగుణం, బహుగుణం కాగలదని మాత్రం చెప్పవచ్చు. - పన్యాల జగన్నాథదాసు -
ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్
కవర్ స్టోరీ ఒక్కడు.. ఒకే ఒక్కడు.. సాదా సీదా సామాన్యుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల చరిత్రనే తిరగ రాశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘చీపురు’ పట్టిన సామాన్యుడు ప్రచారార్భాటాల చెత్తనంతా చెడామడా చిమ్మేసి, విజయ దుందుభి మోగించాడు. ‘చీపురు’ ధాటికి దేశ రాజధానిలో చిరపరిచిత ‘కర’ ‘కమలాలు’ చిరునామా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ‘చీపురు’ విజయగాథపై మీడియాలో ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు హోరెత్తాయి. రాజకీయ విశ్లేషణలు సరే, ‘చీపురు’నే పతాక చిహ్నంగా ధరించి, ఎన్నికల బరిలో అ‘ద్వితీయ’ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన క్రమం, ఈ క్రమంలో ఆయనకు సహకరించిన శక్తులు, వ్యక్తులు, గెలుపు బాటలో ఆయనకు కలసి వచ్చిన అంశాలపై ఒక సింహావలోకనం... నేపథ్యం సామాన్యం అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీ జిల్లా శివానీ గ్రామంలో పుట్టారు. గోవింద్రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతులకు అరవింద్ తొలి సంతానం. అరవింద్ తండ్రి గోవింద్రామ్ కూడా ఇంజనీరే. మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. తండ్రి ఉద్యోగం కారణంగా అరవింద్ బాల్యం పలుచోట్ల సాగింది. సోనేపట్, హిస్సార్, ఘజియాబాద్‌లలో ఆయన పాఠశాల చదువు సాగింది. కేజ్రీవాల్ తండ్రికి, తాతకు ఆయనను మెడిసిన్ చదివించాలని బాగా కోరికగా ఉండేది. అయితే, అరవింద్ మాత్రం ఇంజనీరింగ్ వైపే మొగ్గారు. పన్నెండో తరగతి పూర్తవుతూనే ఐఐటీ ఎంట్రన్స్ రాసి, మొదటి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో సీటు పొందారు. బీటెక్ పూర్తయిన వెంటనే 1989లో జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు చదవడం ప్రారంభించారు. ఆ కాలంలోనే కోల్‌కతాలో మదర్ థెరిసాను కలుసుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఈశాన్య రాష్ట్రాల్లో రామకృష్ణ మిషన్, నెహ్రూ యువక్ కేంద్ర వంటి సంస్థలు చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బహుశ అప్పటి అనుభవాలే ఆయన ఉద్యోగ, ఉద్యమ, రాజకీయ జీవితాలకు పునాది వేశాయి. ఉద్యోగపర్వం తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి, 1995లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో (ఐఆర్ఎస్) ఉద్యోగం సాధించారు. ముస్సోరిలో శిక్షణ పొందుతున్న కాలంలోనే తన బ్యాచ్‌మేట్ సునీతతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అవినీతికి ఆలవాలమైన ఆదాయపు పన్ను శాఖలో వివిధ హోదాల్లో పనిచేసినా, కేజ్రీవాల్‌పై అవినీతి మరకలేవీ లేవు. అయితే, ప్రభుత్వంతో కొన్ని వివాదాలు మాత్రం ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా కొనసాగుతున్న కాలంలో ఉన్నత విద్య కోసమంటూ 2000 సంవత్సరంలో రెండేళ్ల దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. తిరిగి చేరిన తర్వాత కనీసం మూడేళ్లు పూర్తయ్యేంత వరకు ఉద్యోగానికి రాజీనామా చేయరాదనే షరతుపై ప్రభుత్వం ఆయనకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. సెలవు ముగిశాక 2002 నవంబర్‌లో తిరిగి చేరిన కేజ్రీవాల్‌కు ఎలాంటి పోస్టూ మంజూరు చేయలేదు. ఆయనను ఖాళీగానే ఉంచి, 18 నెలలు జీత భత్యాలు ఇచ్చారు. ఈ పరిస్థితికి విసుగెత్తిన కేజ్రీవాల్, మరో 18 నెలలు వేతనం లేని సెలవు కోరుకున్నారు. ఆ సెలవు ముగిసిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసే నాటికి ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో ఉండేవారు. వేతనంతో కూడిన సెలవు తర్వాత కనీసం మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగాలన్న షరతును కేజ్రీవాల్ ఉల్లంఘించారని ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఏడాదిన్నర కాలం తనకు ఎలాంటి పోస్టింగ్ మంజూరు చేయలేదని, అందువల్ల వేతనం చెల్లించని సెలవులో మరో ఏడాదిన్నర గడిపానని, మొత్తం మూడేళ్లు పూర్తయిన తర్వాతనే తాను రాజీనామా చేశానని కేజ్రీవాల్ వాదన. ఈ వివాదం 2011 వరకు కొనసాగింది. కేజ్రీవాల్ రూ. 9,27,787 ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. ఉద్యమపర్వం ఉద్యోగపర్వం కొనసాగుతుండగా, కేజ్రీవాల్ తన ఉద్యమపర్వానికి నాంది పలికారు. తాను పనిచేసే ఆదాయపు పన్ను శాఖ సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో వేళ్లూనుకున్న అవినీతిపై పోరాడేందుకు మనీష్ సిసోడియా వంటి మిత్రులతో కలసి 1999లోనే ‘పరివర్తన్’ పేరిట ప్రజా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. ఆదాయపు పన్ను శాఖ లావాదేవీలలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం కూడా చేశారు. తర్వాత 2005లో మిత్రులతో కలసి ‘కబీర్’ పేరిట రిజిస్టర్డ్ ఎన్జీవోను ప్రారంభించారు. ‘పరివర్తన్’, ‘కబీర్’ సంస్థల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమం చేశారు. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం 2001లో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులోకి తెచ్చేందుకు అన్నా హజారే, అరుణా రాయ్, శేఖర్ సింగ్ తదితరులతో కలసి కేజ్రీవాల్ పోరాటం సాగించారు. కేజ్రీవాల్ నాయకత్వ పటిమకు గుర్తింపుగా 2006లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది. అవార్డు కింద లభించిన డబ్బునే మూలధనంగా పెట్టి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అసలు మలుపు కేజ్రీవాల్ సాగించిన ఉద్యమాలు, పోరాటాలు ఢిల్లీకే పరిమితమై ఉండేవి. సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినా, కేజ్రీవాల్‌కు అప్పట్లో లభించిన ప్రాచుర్యం అంతంత మాత్రమే. అయితే, అన్నా హజారే 2011లో జన లోక్‌పాల్ బిల్లు కోసం ప్రారంభించిన ఉద్యమంతో కేజ్రీవాల్ జీవితం అసలు మలుపు తిరిగింది. హజారేకు అనుంగు అంతేవాసిగా కేజ్రీవాల్ పేరు కూడా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో మార్మోగింది. హజారే చేపట్టిన ఉద్యమంలో కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా కీలక పాత్ర పోషించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అన్నా హజారే నిరాహార దీక్షకు దిగడంతో పరిస్థితి దిగజారి, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలకు దిగి వచ్చింది. అయితే, కట్టుదిట్టమైన జన లోక్‌పాల్ బిల్లు అమలుపై ప్రభుత్వం వాగ్దాన భంగానికి పాల్పడటంతో 2012 జనవరిలో కేజ్రీవాల్, ఆయన సహచరులు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించారు. 2012 పూర్వార్ధం పూర్తయ్యే నాటికి హజారే స్థానంలో కేజ్రీవాల్ ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఉద్యమకారులు మార్గనిర్దేశనం చేయజాలరనే విమర్శలు రావడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే మార్గమని కేజ్రీవాల్, ఆయన సహచరులు భావించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను హజారే వ్యతిరేకించినా, కేజ్రీవాల్ 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని (ఆప్) ప్రారంభించారు. మరుసటి ఏడాదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే మొత్తం 70 స్థానాలకు 28 స్థానాలను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు వచ్చాయి. అయితే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక జనతాదళ్ ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతును కూడదీసుకుని 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘ఆప్’ ఆవిర్భావాన్ని తొలుత వ్యతిరేకించిన హజారే కూడా కాస్త మెత్తబడి, శిష్యుడికి ఆశీస్సులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో జన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడంలో విఫలమైన కేజ్రీవాల్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 49 రోజులకే రాజీనామా చేశారు. రాజీనామా నిర్ణయంపై తర్వాత ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు మరోసారి అవకాశం లభిస్తే, రాజీనామా చేసి ప్రజల ఆశలను వమ్ము చేయబోనని మాట ఇచ్చారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని తొలుత ప్రకటించినా, సన్నిహితులు ఒప్పించడంతో వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీచేసి ఓడిపోయారు. బీజేపీకి పూర్తి ఆధిక్యత లభించడంతో మోదీ ప్రధాని పదవి చేపట్టారు. అయితే, ఏడు నెలల్లోనే మోదీ ప్రభ మసకబారింది. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టమైన తీర్పునిచ్చి, కేజ్రీవాల్‌కు పట్టం కట్టారు. 70 స్థానాలకుగానూ అనూహ్యంగా 67 సీట్లలో గెలిపించి, ‘ఆప్’ను భారతీయ ఎన్నికల ‘చరిత్ర’ పుటల్లోకి ఎక్కించారు. - పన్యాల జగన్నాథదాసు విజయం వెనుక... కేజ్రీవాల్ అ‘ద్వితీయ’ విజయం వెనుక ఆయన జీవిత భాగస్వామి సునీత పాత్ర అమోఘమైనది. ఆమె లేకుండా తానొక్కడినే ఇంతటి విజయాన్ని సాధించగలిగే వాడిని కాదని ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ బహిరంగంగా చెప్పారు. విజయోత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం బయట కేరింతలు కొడుతున్న అభిమానులకు ఆమెను పరిచయం చేశారు. ముస్సోరీలో ఐఆర్ఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో తన బ్యాచ్‌మేట్‌గా ఉన్న సునీతతో ప్రేమలో పడ్డ అరవింద్, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ప్రజా ఉద్యమాల కోసం అరవింద్ ఉద్యోగానికి రాజీనామా చేసినా, ఆమె ఇంకా ఐఆర్ఎస్ అధికారిగానే కొనసాగుతున్నారు. ఫలితాలు వెలువడక ముందు ఇదివరకు ఎన్నడూ ఆమె పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టలేదు. ఉద్యోగ జీవితంలో సునీతా కేజ్రీవాల్‌ది మచ్చలేని చరిత్ర. అందువల్లే ఆదాయపు పన్ను శాఖ ఆమెకు ఎంతో కీలకమైన ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ వంటి బాధ్యతలను అప్పగించింది. ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ హోదాలో ఆమెకు దక్కిన ప్రభుత్వ క్వార్టర్‌లోనే ప్రస్తుతం కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉంటోంది. కేజ్రీవాల్‌కు మధుమేహం ఉండటంతో ఆయన ప్రచారం కోసం బయటకు వెళ్లినా, వేళకు ఇంటి భోజనం అందే ఏర్పాటు చేయడాన్ని సునీత ఎప్పుడూ మరచిపోరు. తరచు జలుబు, దగ్గుతో బాధపడే కేజ్రీవాల్‌కు శీతల పానీయాలంటే తగని ఇష్టం. వాటిని కాస్త తగ్గించుకోవాలని సునీత తన భర్తకు తరచు సలహా ఇస్తుంటారు. ఆమె రాజకీయ అభిప్రాయాలకు కేజ్రీవాల్ చాలా విలువ ఇస్తారని, ఆమె అభిప్రాయాన్ని ఆయన పార్టీలకు అతీతమైన స్వతంత్ర ప్రతిపత్తి గల పౌరుల అభిప్రాయంగా పరిగణిస్తారని ‘ఆప్’ నేతలు చెబుతుంటారు. అ‘సామాన్యుడు’ సామాన్యుడిగా ఉండే లక్షణమే రాజకీయ యవనికపై ఆయనను అసామాన్యుడిగా నిలిపింది. ఎన్నికల బరిలో ‘చీపురు’ ఝుళిపించడమే తడవుగా ఓట్ల వర్షం కురిపించింది. ఘన విజయం సాధించి, త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.. చదువుకునే రోజుల్లో చురుకైన విద్యార్థిగా ఉండే అరవింద్‌ను డాక్టరుగా చూడాలని ఆయన తండ్రి గోవింద్రామ్ బలంగా కోరుకున్నారు. అరవింద్ డాక్టర్‌గా చదువు పూర్తి చేసుకుంటే, ఆస్పత్రి కోసం పనికొస్తుందనే ఉద్దేశంతో హర్యానాలోని స్వస్థలమైన హిస్సార్‌లో ముందుగానే స్థలాన్ని కూడా కొని సిద్ధం చేశారు. అయితే, అరవింద్ ఐఐటీ వైపు మొగ్గారు. తండ్రి కోరికకు విరుద్ధంగా ఐఐటీలో చేరేందుకు ఇంట్లో వాళ్లతో దాదాపు పోరాటమే చేశారు. తొలి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సాధించారు. ఐఐటీ రోజుల్లో మిగిలిన విద్యార్థుల మాదిరిగా మందు పార్టీలు, పేకాట కాలక్షేపాల జోలికి పోకుండా నాటకాలు, సినిమాలతో కాలక్షేపం చేసేవారు. కేజ్రీవాల్‌కు అప్పట్లో అకడమిక్ విషయాల కంటే, నటనపైన, రంగస్థలంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు. బాలీవుడ్ సినిమాలను తెగ చూసే కేజ్రీవాల్‌కు ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్ నటన అంటే చాలా ఇష్టం. ఆమిర్ సినిమాలను ఆయన మిస్సవకుండా చూస్తారు. ఆమిర్ నటించిన సందేశాత్మకమైన సీరియస్ సినిమాలనే కాదు, హాస్య చిత్రాలనూ ఆస్వాదిస్తారు. ఐఐటీలో చదువు పూర్తయిన వెంటనే 1989లో టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. సివిల్స్ కోసం ప్రిపేరవుతున్న కాలంలోనే ఆయన కొన్నాళ్లు కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్‌లో గడిపారు. అదే కాలంలో మదర్ థెరీసాను కలుసుకొని, కొన్నాళ్లు ఆమెతో కలసి పని చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వేడుకలకు, సంబరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. తన పుట్టిన రోజునే కాదు, కనీసం తన పిల్లల పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకొనే అలవాటు లేదాయనకు. ఐఆర్ఎస్లో చేరిన తర్వాత ప్రభుత్వాధికారిగా ప్యూన్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉన్నా, దానిని వదులుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా కొనసాగినంత కాలం కార్యాలయంలో తన డెస్క్‌ను తానే శుభ్రం చేసుకునేవారు. పూర్తిగా శాకాహారి అయిన కేజ్రీవాల్‌కు రోజూ ధ్యానం చేసే అలవాటు ఉంది. చాలాకాలంగా ఆయన విపాసన ధ్యాన సాధన కొనసాగిస్తున్నారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. ధ్యానం చేసే అలవాటు వల్లనే కాబోలు నిర్విరామంగా ఎన్ని గంటలు పనిచేసినా ఆయన ముఖంలో అలసట కనిపించదు. ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా ఉండగా, 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ‘పరివర్తన్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అదే ఏడాది మనీష్ సిసోడియా, అభినందన్ సేక్రీ వంటి సహచరులతో కలసి స్థానిక స్వయం పరిపాలన, సమాచార హక్కులపై ప్రచారం చేసేందుకు ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. ‘ఆప్’కా టీమ్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంటే తెరపై కనిపించేది కేజ్రీవాల్ మాత్రమే అయినా, ఆయన వెనుక గల సలహా బృందానికి కూడా ఈ ఘనవిజయంలో గణనీయమైన పాత్ర ఉంది. కేజ్రీవాల్‌కు సన్నిహితులైన సలహాదారుల్లో ముఖ్యులు వీరే.. మనీష్ సిసోడియా: ‘ఆప్’ బృందంలో కేజ్రీవాల్ తర్వాత అంతటి ప్రాధాన్యం గల నాయకుడు. ‘ఆప్’ ఆవిర్భావానికి ముందు నుంచే కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ తొలిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విద్య, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు. గోపాల్ రాయ్: మాజీ విద్యార్థి నాయకుడు. ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్‌లో కీలక పాత్ర పోషించేవారు. ‘ఛాత్ర యువ సంఘర్ష్ సమితి’ ద్వారా విద్యార్థుల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో గణనీయమైన కృషి చేశారు. ఆసిమ్ అహ్మద్ ఖాన్: ‘ఆప్’ మైనారిటీ విభాగం నాయకుడు. ఢిల్లీలోని మాతియా మహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ఆ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనతాదళ్ (యు) అభ్యర్థి షోయబ్ ఇక్బాల్‌ను మట్టికరిపించారు. మైనారిటీ వర్గాల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో అహ్మద్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. సత్యేంద్ర జైన్: సీపీడబ్ల్యూడీ మాజీ ఉద్యోగి. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి పనిచేసిన జైన్... అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో తెరపైకి వచ్చారు. తర్వాత ‘ఆప్’లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జితేందర్ తోమర్: కేజ్రీవాల్ బృందంలో కాస్త వివాదాస్పదుడు ఈయనే. నామినేషన్ పత్రాలతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు బీజేపీ ఆరోపణలు చేయడంతో వార్తలకెక్కారు. అయితే, నేరచరిత్ర లేకపోవడంతో ఆరోపణలు, విమర్శలు ఆయనపై ప్రభావం చూపలేకపోయాయి. సందీప్ కుమార్: వృత్తిరీత్యా న్యాయవాది. సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి 60 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు సగం ఓట్లను రాబట్టుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల కోసం వెనుకబడిన వర్గాల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. -
నిర్భీకతకు నిదర్శనమైన కలంయోధుడు
హైదరాబాదీ -షోయబుల్లా ఖాన్ నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగిన వాడతడు. నిర్భీకతకు నిదర్శనంగా నిలిచిన కలంయోధుడతడు. నమ్మిన ఆదర్శాల కోసం చివరకు ప్రాణాలనే పణం పెట్టిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. హైదరాబాద్‌లో 1920లో పుట్టి పెరిగిన షోయబ్, ఉస్మానియా వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. షోయబ్ తండ్రి నిజాం సర్కారులో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. నిజాం కొలువులో తేలికగా ఉద్యోగం పొందే అర్హతలన్నీ ఉన్నా, నమ్మిన ఆదర్శాల కోసం ప్రభుత్వోద్యోగం చేసేదే లేదని నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వోద్యోగంతో పోల్చితే, చాలీచాలని జీతం దొరికే పాత్రికేయ వృత్తిని ఏరికోరి ఎంచుకున్నాడు. మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడే ‘రయ్యత్’ దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. ‘రయ్యత్’తో పాటే ‘ఉర్దూ తాజ్’ వారపత్రికకూ పనిచేసేవాడు. ‘రయ్యత్’లో ఉద్యోగంలో చేరినప్పుడు షోయబ్ జీతం నెలకు రూ.50 మాత్రమే. నిబద్ధతతో పనిచేసి, ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకోవడంతో సంతృప్తి చెందిన సంపాదకుడు అనతికాలంలోనే అతడి జీతాన్ని రూ.75కు పెంచారు. నిజాం పాలనను ఎండగట్టే సంపాదకీయలతో వెలువడే ‘రయ్యత్’ పత్రిక కొద్దికాలానికే నిషేధానికి గురైంది. ‘రయ్యత్’పై నిషేధాజ్ఞలు వెలువడటంతో విపరీతంగా వ్యాకులపడ్డ షోయబ్ కంటతడి పెట్టుకుంటే, సంపాదకుడు నరసింగరావు అతడిని ఓదార్చారు. ఎలాగైనా ప్రజల్లోకి జాతీయ భావాలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరో పత్రిక ప్రారంభించాలని సంకల్పించాడు. నిజాం సర్కారును గడగడలాడించిన ‘ఇమ్రోజ్’ ‘ఇమ్రోజ్’ దినపత్రికను నరసింగరావు ఆశీస్సులతో ప్రారంభించాడు. నరసింగరావు సహా అప్పటి జాతీయవాదులంతా ‘ఇమ్రోజ్’కు అండగా నిలిచారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే, 1947 నవంబర్ 15న ‘ఇమ్రోజ్’ తొలి సంచిక వెలువడింది. బూర్గల రామకృష్ణారావు దీనికి ఆర్థిక సహాయం చేశారు. కొద్దికాలానికే ‘ఇమ్రోజ్’కు పాఠకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దీంతో ‘ఇమ్రోజ్’ కార్యాలయాన్ని బూర్గుల వారి నివాసానికి తరలించారు. ‘పగటి ప్రభుత్వం.. రాత్రి ప్రభుత్వం’ శీర్షికన రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ 1948 జనవరి 29న షోయబ్ రాసిన సంపాదకీయం కలకలం రేపింది. షోయబ్ రాతలు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ కన్నెర్రకు కారణమయ్యాయి. ఉక్రోషం ఆపుకోలేని రజ్వీ ఒక బహిరంగ సభలో ‘ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీల్లేదు.. ముస్లింల సమైక్యతకు వ్యతిరేకంగా పైకి లేచిన చేతులను నరికివేయాలి’ అంటూ తన అనుచరులను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశాడు. రజాకార్ల ఘాతుకం బూర్గుల వారి నివాసంలోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని షోయబ్, అతడి బావమరిది, ఇమ్రోజ్’ మేనేజర్ మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇంటికి బయలుదేరుతుండగా, రజాకార్లు ఘాతుకానికి తెగబడ్డారు. బూర్గుల వారి నివాసానికి కూతవేటు దూరంలోని చెప్పల్ బజార్ చౌరస్తా వద్ద షోయబ్‌ను కొందరు అడ్డగించి, మాటల్లో పెట్టారు. ఈలోగా వెనుక నుంచి ఒకడు కాల్పులు జరిపాడు. షోయబ్ నేలకొరిగిన తర్వాత దుండగులు అతడి కుడిచేతిని నరికేశారు. అతడి బావమరిది ఇస్మాయిల్ ఎడమచేతిని నరికేశారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా, షోయబ్ ప్రాణాలు దక్కలేదు. - పన్యాల జగన్నాథదాసు -
శంకర్‌ఆభరణం
హైదరాబాదీ శంకర్‌సింగ్ రఘువంశీ భారత్‌లో సినీరంగం వేళ్లూనుకుంటున్న తొలినాళ్లలో ఎక్కువగా శాస్త్రీయ సంగీతం వినిపించేది. సందర్భం ఎలాంటిదైనా అప్పటి సినిమా పాటలు చాలా నిదానంగా ఉండేవి. నేపథ్యంలో వినిపించే వాద్యాలు కూడా తబలా, సారంగి, హార్మోనియం వంటి సంప్రదాయ పరికరాలే. అలాంటి సమయంలో జోడు గుర్రాల్లా దూసుకొచ్చిన ఇద్దరు సంగీత దర్శకులు జట్టుకట్టి బాలీవుడ్ సంగీతాన్ని పరుగులు పెట్టించారు. ఉల్లాసభరితమైన సన్నివేశాలకు తగినట్లుగా తమ బాణీలతో, పాటలతో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. భారతీయ రాగాలను జాజ్బాణీలతో మేళవించారు. పాశ్చాత్య వాద్య పరికరాలను సినీసంగీతంలోకి విరివిగా వాడుకలోకి తెచ్చారు. శంకర్-జైకిషన్ జంట దాదాపు రెండు దశాబ్దాల కాలం బాలీవుడ్ సంగీతాన్ని శాసించారు. ఈ జంటలో ఒకరైన శంకర్ అసలు పేరు శంకర్‌సింగ్ రఘువంశీ. ఉత్తరభారతీయ కుటుంబానికి చెందిన శంకర్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆయన సరిగమలు నేర్చుకున్నదీ ఇక్కడే. బాబా నాసిర్‌ఖాన్ వద్ద, ఆ తర్వాత ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ వద్ద సంగీతం నేర్చుకున్న శంకర్, తొలినాళ్లలో తబలా వాయించేవాడు. ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ ఆర్కెస్ట్రా బృందంలో కొన్నేళ్లు పనిచేశాక, సత్యనారాయణ్, హేమావతిల రంగస్థల బృందంలో చేరాడు. తబలా వాయించడంతో పాటు నాటకాల్లో చిన్న చిన్న వేషాలూ వేసేవాడు. కొన్నాళ్లకు బాంబే చేరుకుని, పృథ్వీరాజ్ కపూర్ నిర్వహించే పృథ్వీ థియేటర్ బృందంలో చేరాడు. సంగీత దర్శకులు హుస్న్‌లాల్-భగత్రామ్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. జైకిషన్తో జోడీ సినీ అవకాశాల కోసం గుజరాతీ దర్శకుడు చంద్రవదన్ భట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న కాలంలో శంకర్‌కు జైకిషన్ పరిచయమయ్యాడు. జైకిషన్ అప్పట్లో హార్మోనియం వాయించేవాడు. అవకాశాల వేటలో ఉన్న ఇద్దరికీ క్రమంగా దోస్తీ కుదిరింది. పృథ్వీరాజ్ కపూర్‌తో మాటమాత్రమైనా చెప్పకుండానే, పృథ్వీ థియేటర్లో ఉద్యోగం ఇప్పిస్తానని జైకిషన్కు మాట ఇచ్చేశాడు. శంకర్ మాటను మన్నించిన పృథ్వీరాజ్ తన ఆస్థానంలో జైకిషన్కూ చోటు ఇచ్చారు. పృథ్వీరాజ్ కపూర్ పెద్దకొడుకు రాజ్‌కపూర్ 1948లో రూపొందించిన తొలిచిత్రం ‘ఆగ్’కు సంగీత దర్శకుడు రామ్ గంగూలీ వద్ద శంకర్-జైకిషన్ అసిస్టెంట్లుగా చేశారు. ‘బర్సాత్’ చిత్రం షూటింగ్ కొనసాగుతుండగా, రామ్ గంగూలీతో రాజ్ కపూర్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ చిత్రానికి శంకర్-జైకిషన్లను సంగీత దర్శకులుగా పెట్టుకున్నాడు. ‘బర్సాత్’ పాటలు సూపర్‌హిట్ కావడంతో రాజ్ కపూర్ చిత్రాలకు శంకర్-జైకిషన్ ఆస్థాన సంగీత దర్శకులుగా మారారు. రాజ్‌కపూర్ సినిమాల్లో వారి బాణీలు దేశవ్యాప్తంగా మార్మోగాయి. షమ్మీ కపూర్, దేవానంద్, రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, మనోజ్‌కుమార్, ధర్మేంద్ర వంటి ఇతర హీరోల చిత్రాలకూ శంకర్-జైకిషన్ సంగీతాన్ని సమకూర్చారు. ఉత్తమ సంగీత దర్శకులుగా తొమ్మిదిసార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. హిందీ పాటల్లో తెలుగు పలుకులు ‘శ్రీ420’లో ‘రామయ్యా వస్తావయ్యా’, ‘షత్రంజ్’లో ‘బతకమ్మ బతకమ్మ ఎక్కడ బోతారా’ వంటి పాటల్లో తెలుగు పలుకులు హైదరాబాదీ అయిన శంకర్ ప్రయోగాలే. రాజ్‌కపూర్ ‘ఆహ్’ సినిమాను ‘ప్రేమలేఖలు’ పేరుతో డబ్ చేసినప్పుడు వారి బాణీలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. ‘పందిట్లో పెళ్లవుతున్నాది..’ ఈ చిత్రంలోనిదే. ఎన్టీఆర్ నటించిన ‘జీవిత చక్రం’ సినిమాకు కూడా వీరు సంగీతం సమకూర్చారు. అయితే, శంకర్ 1987లో మరణించినప్పుడు సినీరంగం నుంచి స్పందించిన వారు దాదాపు లేరనే చెప్పాలి. తర్వాత కొన్నాళ్లకు రాజ్‌కపూర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ‘ఘన’నివాళులర్పించాడు. - పన్యాల జగన్నాథదాసు