నిర్భీకతకు నిదర్శనమైన కలంయోధుడు
- హైదరాబాదీ -షోయబుల్లా ఖాన్
నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగిన వాడతడు. నిర్భీకతకు నిదర్శనంగా నిలిచిన కలంయోధుడతడు. నమ్మిన ఆదర్శాల కోసం చివరకు ప్రాణాలనే పణం పెట్టిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. హైదరాబాద్‌లో 1920లో పుట్టి పెరిగిన షోయబ్, ఉస్మానియా వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. షోయబ్ తండ్రి నిజాం సర్కారులో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్.
నిజాం కొలువులో తేలికగా ఉద్యోగం పొందే అర్హతలన్నీ ఉన్నా, నమ్మిన ఆదర్శాల కోసం ప్రభుత్వోద్యోగం చేసేదే లేదని నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వోద్యోగంతో పోల్చితే, చాలీచాలని జీతం దొరికే పాత్రికేయ వృత్తిని ఏరికోరి ఎంచుకున్నాడు. మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడే ‘రయ్యత్’ దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. ‘రయ్యత్’తో పాటే ‘ఉర్దూ తాజ్’ వారపత్రికకూ పనిచేసేవాడు. ‘రయ్యత్’లో ఉద్యోగంలో చేరినప్పుడు షోయబ్ జీతం నెలకు రూ.50 మాత్రమే.
నిబద్ధతతో పనిచేసి, ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకోవడంతో సంతృప్తి చెందిన సంపాదకుడు అనతికాలంలోనే అతడి జీతాన్ని రూ.75కు పెంచారు. నిజాం పాలనను ఎండగట్టే సంపాదకీయలతో వెలువడే ‘రయ్యత్’ పత్రిక కొద్దికాలానికే నిషేధానికి గురైంది. ‘రయ్యత్’పై నిషేధాజ్ఞలు వెలువడటంతో విపరీతంగా వ్యాకులపడ్డ షోయబ్ కంటతడి పెట్టుకుంటే, సంపాదకుడు నరసింగరావు అతడిని ఓదార్చారు. ఎలాగైనా ప్రజల్లోకి జాతీయ భావాలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరో పత్రిక ప్రారంభించాలని సంకల్పించాడు.
నిజాం సర్కారును గడగడలాడించిన ‘ఇమ్రోజ్’
‘ఇమ్రోజ్’ దినపత్రికను నరసింగరావు ఆశీస్సులతో ప్రారంభించాడు. నరసింగరావు సహా అప్పటి జాతీయవాదులంతా ‘ఇమ్రోజ్’కు అండగా నిలిచారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే, 1947 నవంబర్ 15న ‘ఇమ్రోజ్’ తొలి సంచిక వెలువడింది. బూర్గల రామకృష్ణారావు దీనికి ఆర్థిక సహాయం చేశారు. కొద్దికాలానికే ‘ఇమ్రోజ్’కు పాఠకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దీంతో ‘ఇమ్రోజ్’ కార్యాలయాన్ని బూర్గుల వారి నివాసానికి తరలించారు. ‘పగటి ప్రభుత్వం.. రాత్రి ప్రభుత్వం’ శీర్షికన రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ 1948 జనవరి 29న షోయబ్ రాసిన సంపాదకీయం కలకలం రేపింది. షోయబ్ రాతలు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ కన్నెర్రకు కారణమయ్యాయి. ఉక్రోషం ఆపుకోలేని రజ్వీ ఒక బహిరంగ సభలో ‘ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీల్లేదు.. ముస్లింల సమైక్యతకు వ్యతిరేకంగా పైకి లేచిన చేతులను నరికివేయాలి’ అంటూ తన అనుచరులను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశాడు.
రజాకార్ల ఘాతుకం
బూర్గుల వారి నివాసంలోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని షోయబ్, అతడి బావమరిది, ఇమ్రోజ్’ మేనేజర్ మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇంటికి బయలుదేరుతుండగా, రజాకార్లు ఘాతుకానికి తెగబడ్డారు. బూర్గుల వారి నివాసానికి కూతవేటు దూరంలోని చెప్పల్ బజార్ చౌరస్తా వద్ద షోయబ్‌ను కొందరు అడ్డగించి, మాటల్లో పెట్టారు. ఈలోగా వెనుక నుంచి ఒకడు కాల్పులు జరిపాడు. షోయబ్ నేలకొరిగిన తర్వాత దుండగులు అతడి కుడిచేతిని నరికేశారు. అతడి బావమరిది ఇస్మాయిల్ ఎడమచేతిని నరికేశారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా, షోయబ్ ప్రాణాలు దక్కలేదు.
- పన్యాల జగన్నాథదాసు