ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్ | AK 67 Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్

Published Sun, Feb 22 2015 12:26 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్ - Sakshi

ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్

కవర్ స్టోరీ
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. సాదా సీదా సామాన్యుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల చరిత్రనే తిరగ రాశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘చీపురు’ పట్టిన సామాన్యుడు ప్రచారార్భాటాల చెత్తనంతా చెడామడా చిమ్మేసి, విజయ దుందుభి మోగించాడు. ‘చీపురు’ ధాటికి దేశ రాజధానిలో చిరపరిచిత ‘కర’ ‘కమలాలు’ చిరునామా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ‘చీపురు’ విజయగాథపై మీడియాలో ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు హోరెత్తాయి.

రాజకీయ విశ్లేషణలు సరే, ‘చీపురు’నే పతాక చిహ్నంగా ధరించి, ఎన్నికల బరిలో అ‘ద్వితీయ’ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన క్రమం, ఈ క్రమంలో ఆయనకు సహకరించిన శక్తులు, వ్యక్తులు, గెలుపు బాటలో ఆయనకు కలసి వచ్చిన అంశాలపై ఒక సింహావలోకనం...

 
నేపథ్యం సామాన్యం

అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీ జిల్లా శివానీ గ్రామంలో పుట్టారు. గోవింద్‌రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతులకు అరవింద్ తొలి సంతానం. అరవింద్ తండ్రి గోవింద్‌రామ్ కూడా ఇంజనీరే. మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. తండ్రి ఉద్యోగం కారణంగా అరవింద్ బాల్యం పలుచోట్ల సాగింది. సోనేపట్, హిస్సార్, ఘజియాబాద్‌లలో ఆయన పాఠశాల చదువు సాగింది. కేజ్రీవాల్ తండ్రికి, తాతకు ఆయనను మెడిసిన్ చదివించాలని బాగా కోరికగా ఉండేది. అయితే, అరవింద్ మాత్రం ఇంజనీరింగ్ వైపే మొగ్గారు.

పన్నెండో తరగతి పూర్తవుతూనే ఐఐటీ ఎంట్రన్స్ రాసి, మొదటి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో సీటు పొందారు. బీటెక్ పూర్తయిన వెంటనే 1989లో జెమ్షెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ కంపెనీలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు చదవడం ప్రారంభించారు. ఆ కాలంలోనే కోల్‌కతాలో మదర్ థెరిసాను కలుసుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఈశాన్య రాష్ట్రాల్లో రామకృష్ణ మిషన్, నెహ్రూ యువక్ కేంద్ర వంటి సంస్థలు చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బహుశ అప్పటి అనుభవాలే ఆయన ఉద్యోగ, ఉద్యమ, రాజకీయ జీవితాలకు పునాది వేశాయి.
 
ఉద్యోగపర్వం

తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి, 1995లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో (ఐఆర్‌ఎస్) ఉద్యోగం సాధించారు. ముస్సోరిలో శిక్షణ పొందుతున్న కాలంలోనే తన బ్యాచ్‌మేట్ సునీతతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అవినీతికి ఆలవాలమైన ఆదాయపు పన్ను శాఖలో వివిధ హోదాల్లో పనిచేసినా, కేజ్రీవాల్‌పై అవినీతి మరకలేవీ లేవు. అయితే, ప్రభుత్వంతో కొన్ని వివాదాలు మాత్రం ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా కొనసాగుతున్న కాలంలో ఉన్నత విద్య కోసమంటూ 2000 సంవత్సరంలో రెండేళ్ల దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. తిరిగి చేరిన తర్వాత కనీసం మూడేళ్లు పూర్తయ్యేంత వరకు ఉద్యోగానికి రాజీనామా చేయరాదనే షరతుపై ప్రభుత్వం ఆయనకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. సెలవు ముగిశాక 2002 నవంబర్‌లో తిరిగి చేరిన కేజ్రీవాల్‌కు ఎలాంటి పోస్టూ మంజూరు చేయలేదు.

ఆయనను ఖాళీగానే ఉంచి, 18 నెలలు జీత భత్యాలు ఇచ్చారు. ఈ పరిస్థితికి విసుగెత్తిన కేజ్రీవాల్, మరో 18 నెలలు వేతనం లేని సెలవు కోరుకున్నారు. ఆ సెలవు ముగిసిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసే నాటికి ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో ఉండేవారు. వేతనంతో కూడిన సెలవు తర్వాత కనీసం మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగాలన్న షరతును కేజ్రీవాల్ ఉల్లంఘించారని ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఏడాదిన్నర కాలం తనకు ఎలాంటి పోస్టింగ్ మంజూరు చేయలేదని, అందువల్ల వేతనం చెల్లించని సెలవులో మరో ఏడాదిన్నర గడిపానని, మొత్తం మూడేళ్లు పూర్తయిన తర్వాతనే తాను రాజీనామా చేశానని కేజ్రీవాల్ వాదన. ఈ వివాదం 2011 వరకు కొనసాగింది. కేజ్రీవాల్ రూ. 9,27,787 ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది.
 
ఉద్యమపర్వం

ఉద్యోగపర్వం కొనసాగుతుండగా, కేజ్రీవాల్ తన ఉద్యమపర్వానికి నాంది పలికారు. తాను పనిచేసే ఆదాయపు పన్ను శాఖ సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో వేళ్లూనుకున్న అవినీతిపై పోరాడేందుకు మనీష్ సిసోడియా వంటి మిత్రులతో కలసి 1999లోనే ‘పరివర్తన్’ పేరిట ప్రజా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. ఆదాయపు పన్ను శాఖ లావాదేవీలలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం కూడా చేశారు. తర్వాత 2005లో మిత్రులతో కలసి ‘కబీర్’ పేరిట రిజిస్టర్డ్ ఎన్జీవోను ప్రారంభించారు.

‘పరివర్తన్’, ‘కబీర్’ సంస్థల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమం చేశారు. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం 2001లో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులోకి తెచ్చేందుకు అన్నా హజారే, అరుణా రాయ్, శేఖర్ సింగ్ తదితరులతో కలసి కేజ్రీవాల్ పోరాటం సాగించారు. కేజ్రీవాల్ నాయకత్వ పటిమకు గుర్తింపుగా 2006లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది. అవార్డు కింద లభించిన డబ్బునే మూలధనంగా పెట్టి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.
 
అసలు మలుపు

కేజ్రీవాల్ సాగించిన ఉద్యమాలు, పోరాటాలు ఢిల్లీకే పరిమితమై ఉండేవి. సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినా, కేజ్రీవాల్‌కు అప్పట్లో లభించిన ప్రాచుర్యం అంతంత మాత్రమే. అయితే, అన్నా హజారే 2011లో జన లోక్‌పాల్ బిల్లు కోసం ప్రారంభించిన ఉద్యమంతో కేజ్రీవాల్ జీవితం అసలు మలుపు తిరిగింది. హజారేకు అనుంగు అంతేవాసిగా కేజ్రీవాల్ పేరు కూడా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో మార్మోగింది. హజారే చేపట్టిన ఉద్యమంలో కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా కీలక పాత్ర పోషించారు.

ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అన్నా హజారే నిరాహార దీక్షకు దిగడంతో పరిస్థితి దిగజారి, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలకు దిగి వచ్చింది. అయితే, కట్టుదిట్టమైన జన లోక్‌పాల్ బిల్లు అమలుపై ప్రభుత్వం వాగ్దాన భంగానికి పాల్పడటంతో 2012 జనవరిలో కేజ్రీవాల్, ఆయన సహచరులు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించారు. 2012 పూర్వార్ధం పూర్తయ్యే నాటికి హజారే స్థానంలో కేజ్రీవాల్ ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఉద్యమకారులు మార్గనిర్దేశనం చేయజాలరనే విమర్శలు రావడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే మార్గమని కేజ్రీవాల్, ఆయన సహచరులు భావించారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను హజారే వ్యతిరేకించినా, కేజ్రీవాల్ 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని (ఆప్) ప్రారంభించారు. మరుసటి ఏడాదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే మొత్తం 70 స్థానాలకు 28 స్థానాలను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు వచ్చాయి. అయితే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక జనతాదళ్ ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతును కూడదీసుకుని 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘ఆప్’ ఆవిర్భావాన్ని తొలుత వ్యతిరేకించిన హజారే కూడా కాస్త మెత్తబడి, శిష్యుడికి ఆశీస్సులు తెలిపారు.

ఢిల్లీ అసెంబ్లీలో జన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడంలో విఫలమైన కేజ్రీవాల్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 49 రోజులకే రాజీనామా చేశారు. రాజీనామా నిర్ణయంపై తర్వాత ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు మరోసారి అవకాశం లభిస్తే, రాజీనామా చేసి ప్రజల ఆశలను వమ్ము చేయబోనని మాట ఇచ్చారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని తొలుత ప్రకటించినా, సన్నిహితులు ఒప్పించడంతో వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీచేసి ఓడిపోయారు.

బీజేపీకి పూర్తి ఆధిక్యత లభించడంతో మోదీ ప్రధాని పదవి చేపట్టారు. అయితే, ఏడు నెలల్లోనే మోదీ ప్రభ మసకబారింది. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టమైన తీర్పునిచ్చి, కేజ్రీవాల్‌కు పట్టం కట్టారు. 70 స్థానాలకుగానూ అనూహ్యంగా 67 సీట్లలో గెలిపించి, ‘ఆప్’ను భారతీయ ఎన్నికల ‘చరిత్ర’ పుటల్లోకి ఎక్కించారు.
- పన్యాల జగన్నాథదాసు

విజయం వెనుక...
కేజ్రీవాల్ అ‘ద్వితీయ’ విజయం వెనుక ఆయన జీవిత భాగస్వామి సునీత పాత్ర అమోఘమైనది. ఆమె లేకుండా తానొక్కడినే ఇంతటి విజయాన్ని సాధించగలిగే వాడిని కాదని ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ బహిరంగంగా చెప్పారు. విజయోత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం బయట కేరింతలు కొడుతున్న అభిమానులకు ఆమెను పరిచయం చేశారు. ముస్సోరీలో ఐఆర్‌ఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో తన బ్యాచ్‌మేట్‌గా ఉన్న సునీతతో ప్రేమలో పడ్డ అరవింద్, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.

ప్రజా ఉద్యమాల కోసం అరవింద్ ఉద్యోగానికి రాజీనామా చేసినా, ఆమె ఇంకా ఐఆర్‌ఎస్ అధికారిగానే కొనసాగుతున్నారు. ఫలితాలు వెలువడక ముందు ఇదివరకు ఎన్నడూ ఆమె పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టలేదు. ఉద్యోగ జీవితంలో సునీతా కేజ్రీవాల్‌ది మచ్చలేని చరిత్ర. అందువల్లే ఆదాయపు పన్ను శాఖ ఆమెకు ఎంతో కీలకమైన ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ వంటి బాధ్యతలను అప్పగించింది. ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ హోదాలో ఆమెకు దక్కిన ప్రభుత్వ క్వార్టర్‌లోనే ప్రస్తుతం కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉంటోంది.

కేజ్రీవాల్‌కు మధుమేహం ఉండటంతో ఆయన ప్రచారం కోసం బయటకు వెళ్లినా, వేళకు ఇంటి భోజనం అందే ఏర్పాటు చేయడాన్ని సునీత ఎప్పుడూ మరచిపోరు. తరచు జలుబు, దగ్గుతో బాధపడే కేజ్రీవాల్‌కు శీతల పానీయాలంటే తగని ఇష్టం. వాటిని కాస్త తగ్గించుకోవాలని సునీత తన భర్తకు తరచు సలహా ఇస్తుంటారు. ఆమె రాజకీయ అభిప్రాయాలకు కేజ్రీవాల్ చాలా విలువ ఇస్తారని, ఆమె అభిప్రాయాన్ని ఆయన పార్టీలకు అతీతమైన స్వతంత్ర ప్రతిపత్తి గల పౌరుల అభిప్రాయంగా పరిగణిస్తారని ‘ఆప్’ నేతలు చెబుతుంటారు.

అ‘సామాన్యుడు’
సామాన్యుడిగా ఉండే లక్షణమే రాజకీయ యవనికపై ఆయనను అసామాన్యుడిగా నిలిపింది. ఎన్నికల బరిలో ‘చీపురు’ ఝుళిపించడమే తడవుగా ఓట్ల వర్షం కురిపించింది. ఘన విజయం సాధించి, త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
 
చదువుకునే రోజుల్లో చురుకైన విద్యార్థిగా ఉండే అరవింద్‌ను డాక్టరుగా చూడాలని ఆయన తండ్రి గోవింద్‌రామ్ బలంగా కోరుకున్నారు. అరవింద్ డాక్టర్‌గా చదువు పూర్తి చేసుకుంటే, ఆస్పత్రి కోసం పనికొస్తుందనే ఉద్దేశంతో హర్యానాలోని స్వస్థలమైన హిస్సార్‌లో ముందుగానే స్థలాన్ని కూడా కొని సిద్ధం చేశారు. అయితే, అరవింద్ ఐఐటీ వైపు మొగ్గారు. తండ్రి కోరికకు విరుద్ధంగా ఐఐటీలో చేరేందుకు ఇంట్లో వాళ్లతో దాదాపు పోరాటమే చేశారు. తొలి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సాధించారు.
 
ఐఐటీ రోజుల్లో మిగిలిన విద్యార్థుల మాదిరిగా మందు పార్టీలు, పేకాట కాలక్షేపాల జోలికి పోకుండా నాటకాలు, సినిమాలతో కాలక్షేపం చేసేవారు. కేజ్రీవాల్‌కు అప్పట్లో అకడమిక్ విషయాల కంటే, నటనపైన, రంగస్థలంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు.
 
బాలీవుడ్ సినిమాలను తెగ చూసే కేజ్రీవాల్‌కు ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్ నటన అంటే చాలా ఇష్టం. ఆమిర్ సినిమాలను ఆయన మిస్సవకుండా చూస్తారు. ఆమిర్ నటించిన సందేశాత్మకమైన సీరియస్ సినిమాలనే కాదు, హాస్య చిత్రాలనూ ఆస్వాదిస్తారు.
 
ఐఐటీలో చదువు పూర్తయిన వెంటనే 1989లో టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్ సాధించారు. సివిల్స్ కోసం ప్రిపేరవుతున్న కాలంలోనే ఆయన కొన్నాళ్లు కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్‌లో గడిపారు. అదే కాలంలో మదర్ థెరీసాను కలుసుకొని, కొన్నాళ్లు ఆమెతో కలసి పని చేశారు.
 
అరవింద్ కేజ్రీవాల్ వేడుకలకు, సంబరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. తన పుట్టిన రోజునే కాదు, కనీసం తన పిల్లల పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకొనే అలవాటు లేదాయనకు. ఐఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ప్రభుత్వాధికారిగా ప్యూన్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉన్నా, దానిని వదులుకున్నారు. ఐఆర్‌ఎస్ అధికారిగా కొనసాగినంత కాలం కార్యాలయంలో తన డెస్క్‌ను తానే శుభ్రం చేసుకునేవారు.
 
పూర్తిగా శాకాహారి అయిన కేజ్రీవాల్‌కు రోజూ ధ్యానం చేసే అలవాటు ఉంది. చాలాకాలంగా ఆయన విపాసన ధ్యాన సాధన కొనసాగిస్తున్నారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. ధ్యానం చేసే అలవాటు వల్లనే కాబోలు నిర్విరామంగా ఎన్ని గంటలు పనిచేసినా ఆయన ముఖంలో అలసట కనిపించదు.
 
ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా ఉండగా, 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ‘పరివర్తన్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అదే ఏడాది మనీష్ సిసోడియా, అభినందన్ సేక్రీ వంటి సహచరులతో కలసి స్థానిక స్వయం పరిపాలన, సమాచార హక్కులపై ప్రచారం చేసేందుకు ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ప్రారంభించారు.
 
‘ఆప్’కా టీమ్..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంటే తెరపై కనిపించేది కేజ్రీవాల్ మాత్రమే అయినా, ఆయన వెనుక గల సలహా బృందానికి కూడా ఈ ఘనవిజయంలో గణనీయమైన పాత్ర ఉంది. కేజ్రీవాల్‌కు సన్నిహితులైన సలహాదారుల్లో ముఖ్యులు వీరే..
 
మనీష్ సిసోడియా: ‘ఆప్’ బృందంలో కేజ్రీవాల్ తర్వాత అంతటి ప్రాధాన్యం గల నాయకుడు. ‘ఆప్’ ఆవిర్భావానికి ముందు నుంచే కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ తొలిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విద్య, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు.

గోపాల్ రాయ్: మాజీ విద్యార్థి నాయకుడు. ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్‌లో కీలక పాత్ర పోషించేవారు. ‘ఛాత్ర యువ సంఘర్ష్ సమితి’ ద్వారా విద్యార్థుల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో గణనీయమైన కృషి చేశారు.
 
ఆసిమ్ అహ్మద్ ఖాన్: ‘ఆప్’ మైనారిటీ విభాగం నాయకుడు. ఢిల్లీలోని మాతియా మహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ఆ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనతాదళ్ (యు) అభ్యర్థి షోయబ్ ఇక్బాల్‌ను మట్టికరిపించారు. మైనారిటీ వర్గాల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో అహ్మద్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.
 
సత్యేంద్ర జైన్:
సీపీడబ్ల్యూడీ మాజీ ఉద్యోగి. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి పనిచేసిన జైన్... అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో తెరపైకి వచ్చారు. తర్వాత ‘ఆప్’లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
 
జితేందర్ తోమర్: కేజ్రీవాల్ బృందంలో కాస్త వివాదాస్పదుడు ఈయనే. నామినేషన్ పత్రాలతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు బీజేపీ ఆరోపణలు చేయడంతో వార్తలకెక్కారు. అయితే, నేరచరిత్ర లేకపోవడంతో ఆరోపణలు, విమర్శలు ఆయనపై ప్రభావం చూపలేకపోయాయి.
 
సందీప్ కుమార్: వృత్తిరీత్యా న్యాయవాది. సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి 60 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు సగం ఓట్లను రాబట్టుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల కోసం వెనుకబడిన వర్గాల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement