సామాన్యుల గుండెల్లో కేజ్రీయే హీరో!!
పదవీ బాధ్యతలు నిర్వహించలేక.. సమస్యల నుంచి తప్పించుకోడానికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. కానీ.. ఎవరేమనుకున్నా ఇప్పటికీ సామాన్యుల గుండెల్లో మాత్రం ఆయనే హీరో. ఢిల్లీలోని సామాన్యులు ఇప్పటికీ ఆయననే బలపరుస్తున్నారు. ఒకవేళ గనక ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి పూర్తిమెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించే అవకాశాలు కూడా లేకపోలేవు. సరిగ్గా 50 రోజులు పాలన కూడా పూర్తి చేసుకోకముందే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు కేజ్రీవాల్. తాను ఎంతగానో కలలుగన్న జన లోక్పాల్ బిల్లును కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడటాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. బిల్లు విషయంలో కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటిగా నిలిచి అడ్డుకోవడం కూడా ఆయన కలతకు కారణమైంది.
కేజ్రీవాల్ రాజీనామా చేసినంత మాత్రాన ఏమీ కాలేదని, చీపురు పట్టుకుని ఆయన ఢిల్లీలోని అవినీతిని తుడిచేయగలరన్న మాట రుజువైందని ఢిల్లీ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. జన లోక్పాల్ బిల్లు ఆమోదం పొందితే తామంతా జైళ్లలో ఉండాల్సి వస్తుందన్న భయంతోనే ఇతర పార్టీల నాయకులు ఈ బిల్లుకు మద్దతు పలకలేదని విమర్శిస్తున్నారు.
ఆయన రాజీనామా చేసినా తామంతా ఆయనతోనే ఉన్నామని, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని.. అలా చేస్తే ఆయనకు 50 స్థానాలకు పైగా వచ్చి, ఎవరి మద్దతు లేకపోయినా బిల్లు ఆమోదం పొందుతుందని ఢిల్లీ నివాసి వినోద్ సక్సేనా వ్యాఖ్యానించారు. ఆయన కచ్చితంగా అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజారిటీ సాధించడం ఖాయమని ప్రేమ్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ కూడా వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఆయన రాజీనామా మాత్రం తమకు బాధ కలిగించిందని పలువురు అంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన రోజని, తమలాంటి సామాన్యుల గోడు పట్టించుకునేవాళ్లు ఎవరుంటారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముఖేష్ అంబానీతో తలపడినందుకే ఆయన పదవి పోయిందని, అంతలా ఢీకొనాలంటే చాలా ధైర్యం ఉండాలని, అది కేజ్రీకి మాత్రమే సొంతమని దక్షిణ ఢిల్లీలో ఉండే భువన అనే మహిళ అన్నారు.