సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. దానిని పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి నుంచి తప్పుకుంటున్నట్లు అశుతోష్ బుధవారం ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన అశుతోష్.. ప్రస్తుతం పబ్లిక్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆశుతోష్.. అనూహ్య నిర్ణయంతో కేజ్రీవాల్ షాక్ తిన్నారు. వెంటనే ఆయన రాజీనామాను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ‘మీ రాజీనామాను ఎలా ఆమోదిస్తామని అనుకున్నారు? నా జీవితకాలంలో అది సాధ్యం కాదు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సర్, మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటూ మరో ఆప్ సీనియర్ నేత గోపాల్‌రాయ్ ట్వీట్ చేశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని, ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే చర్చించుకుందామని పార్టీ నేతలు అశుతోష్‌కు నచ్చజెప్తున్నట్టు తెలుస్తోంది.
అశుతోష్ గత ఎన్నికల్లో ఢిల్లీలోని చాందిని చౌక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారంటూ వార్తలు వచ్చినా కేజ్రీవాల్ ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆప్‌తో తన ప్రయాణం ఇక ముగిసిందని, తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులందరికీ ధన్యావాదాలంటూ అశుతోష్ అంతకుముందు ట్విటర్‌లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అశుతోష్ రాజీనామా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకునేలా చూడాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment