న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్ విసిరింది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీ 9వ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.
వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. గతాన్ని వదిలేయాలని.. భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీ తమదేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. హింసకు పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ రోజు ఘటనలు క్షమించరానిదని పేర్కొన్నారు. అయితే హింసాత్మకమైనా కానీ రైతుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విధ్వంసానికి కారణం ఏ పార్టీ అయినా, ఏ నేతయినా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల ట్రాక్టర్ల ఆందోళనలతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగలేదని పేర్కొన్నారు. రైతులకు అందరం కలిసి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment