Delhi Politics
-
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్‌ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
జాట్లు తలరాతలు మార్చేస్తారు..!
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు. ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్గఢ్లో 25, నరేలా, బిజ్వాసన్లలో 23, బవానా, నాంగ్లోయి జాట్లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్‌నగర్‌లో 15, వికాస్పురిలో 10, ఛత్తర్‌పూర్‌లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కైలాశ్‌ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్ ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్‌ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్‌కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. -
జాట్లకు మీరు ద్రోహం చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. తాజాగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ ‘జాట్’అ్రస్తాన్ని ప్రయోగించారు. ఆ సామాజికవర్గాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గురువారం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలోని జాట్లకు ద్రోహం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించారు. బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్లు గుర్తుకొచ్చారా? అంటూ పర్వేశ్ వర్మ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గం వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రెండు పేజీల లేఖలో జాట్లకు సంబం«ధించి పలు అంశాలను ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని జాట్లకు మీరు ద్రోహం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో జాట్ వర్గాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తోంది. 2015 మార్చి 26న జాట్ నాయకులను ఇంటికి పిలిచి ఢిల్లీలోని జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చుతామని మీరు హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 8న హోం మంత్రి అమిత్ షా కూడా జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని జాట్ కమ్యూనిటీ విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ, ఢిల్లీలోని జాట్లకు రిజర్వేషన్లు ఎందుకు లభించడంలేదు? ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది పిల్లలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందలేకపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఓబీసీ జాబితాలో వారు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాట్లు ప్రయోజనాలు పొందేందుకు మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో ఢిల్లీలోని జాట్లతోపాటు. మరో ఐదు సామాజికివర్గాలకు చెందిన వారు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఓబీసీ జాబితాలో మార్పులు చేసి ఓబీసీ హోదా ఉన్న ఆయా వర్గాలకు న్యాయం చేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా’అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఆప్ ఫిర్యాదు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఢిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్‌లతో కలిసి కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కలిసి రెండు పేజీల ఫిర్యాదును అందజేశారు. హర్ ఘర్ నౌకరీ (ఇంటికో ఉద్యోగం) పేరుతో ఓట్లు అడుగుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న పర్వేశ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వర్మ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని సీఎం ఆతిశీ మరో ఫిర్యాదు చేశారు. ‘నేను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత 15 రోజుల్లోనే కొత్తగా 13 వేల మంది ఓటర్లు చేరారు. అదేవిధంగా, ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని 5,500 దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇదో భారీ కుట్ర’అని అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. పరేŠవ్శ్ వర్మ ఇంటిపై తక్షణమే ఎన్నికల నిఘా అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. పర్వేశ్ వర్మ మహిళలకు రూ.1,100 బహిరంగంగానే పంచుతున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవలకు పాల్పడుతున్న స్థానిక ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.ఆప్ సర్కారు పడిపోవాలని వారు కోరుకుంటున్నారు: పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్లు గుర్తుకువచ్చారా? అంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మండిపడ్డారు. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌పై ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ఈసారి ఢిల్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. జాట్ల కోసం కేజ్రీవాల్ ఏమైనా చేసి ఉంటే.. ఎన్నికలకు 25 రోజుల ముందు జాట్లు గుర్తుకువచ్చేవారు కాదు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో జాట్లు మాత్రమే కాదు.. గుజ్జర్లు, యాదవులు, త్యాగులు, రాజ్‌పుత్‌లు కూడా ఉన్నారు. వీరంతా కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు’అని పర్వేశ్ వర్మ అన్నారు. -
ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్, బీజేపీ తమ కత్తులకు పదునుపెడుతున్నాయి. మూ డో విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ శాంతి భద్రతల పరిస్థితి దారుణమంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బదులుగా అన్నట్లు, సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికార నివాసానికి రూ.42 కోట్లు వెచ్చించిన అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్(అద్దాల మేడ), ‘7 స్టార్ రిసార్ట్’ను కట్టుకున్నారంటూ ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ విడుదల చేశారు.కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే..‘సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ఇదే. దీన్ని గురించిన వాస్తవాలను మీ ముందుంచబోతున్నాను’ అని పేర్కొంటూ సచ్దేవ్.. ‘ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రతను తీసుకోనని చెప్పిన ఈయన, ఇప్పుడు వైభవోపేతమైన 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నాడు’అని పేర్కొ న్నారు. ‘రూ.1.9 కోట్ల విలువైన మార్బుల్ గ్రానైట్ లైటింగ్, రూ.1.5 కోట్లతో ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్, రూ.35 లక్షల విలువైన జిమ్, స్పా పరికరాలు కలిపి మొత్తంగా వీటికే రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే’ అని విమర్శించారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ ఉల్లంఘించారన్నారు. ఈ డబ్బుతో నిరుపేదలకు 34 ఇళ్ల ఫ్లాట్లు, లేదా 326 ఈ–రిక్షాలను అందజేయవచ్చన్నారు. బీజేపీ ఎంపీ ప్రవీణ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేజ్రీవాల్ చెప్పిన ‘ఆమ్ ఆద్మీ’కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.తిప్పికొట్టిన ఆప్ఈ విమర్శలను ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిప్పికొట్టారు. ‘హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల నిధుల దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులుగా, వారు కేజ్రీవాల్ నివసించిన అధికారిక నివాసంపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే, బీజేపీ నేతలు సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారు’అని ఎదురుదాడికి దిగారు.చదవండి: ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్రానున్న ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, ఈ అంశం రాజకీయంగా ఆప్‌ను ఇరుకున పెట్టేదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయిన మొత్తం వ్యయం రూ.52.71 కోట్లని విజిలెన్స్ డైరెక్టరేట్ 2023లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. రూ.10 లక్షల బీమా, కుమార్తెల పెళ్లికి సాయంఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ ఎన్నికల హామీఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు ప్రచారంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు పలు హామీలను ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్ కొండ్లిలో ఆటో డ్రైవర్ నవనీత్ కుటుంబంతో మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తున్నాను. అవి.. రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుమార్తెల వివాహానికి రూ.1 లక్ష సాయం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వీరి పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తాం’ అని తెలిపారు. -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్‌లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
బీజేపీతో ఆప్ ఢీ.. అందుకే సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ అంటే భయంతోనే.. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అవుతారని బీజేపీ భయపడుతోంద’ని మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. సీబీఐ అరెస్ట్ చేయొచ్చు తనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సిసోడియా వెల్లడించారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. అసలు సూత్రధారి అరవింద్: ఠాకూర్ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి మౌనం దాల్చిన మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీకి కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి కాదని కొట్టిపారేశారు. 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు ఢిల్లీలోని సిసోడియా ఇంటితో పాటు, ఏడు రాష్ట్రాల్లోని మరో 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 11 పేజీల నేరాభియోగ పత్రంలో అవినీతి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపారు. (క్లిక్: కేంద్రం, ఆప్ కుస్తీ) -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సెహ్వాగ్ సోదరి..
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆమె శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో కీలక నేతల సమక్షంలో ఆమె ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో హిందీ టీచర్‌గా పని చేసిన అంజు.. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ్‌పురి వార్డ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆమె.. తాజాగా ఆ పార్టీకి షాకిచ్చి ఆప్‌లో చేరారు. కాగా, 2012 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన సోదరి(అంజూ) తరఫున ప్రచారం చేశారు. Delhi: Anju Sehwag, sister of former cricketer Virender Sehwag, joins Aam Aadmi Party (AAP) pic.twitter.com/pyypeNGrwe — ANI (@ANI) December 31, 2021 చదవండి: మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు కరోనా.. -
ఎన్నికలపై అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్ విసిరింది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీ 9వ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. గతాన్ని వదిలేయాలని.. భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీ తమదేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. హింసకు పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రోజు ఘటనలు క్షమించరానిదని పేర్కొన్నారు. అయితే హింసాత్మకమైనా కానీ రైతుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విధ్వంసానికి కారణం ఏ పార్టీ అయినా, ఏ నేతయినా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల ట్రాక్టర్ల ఆందోళనలతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగలేదని పేర్కొన్నారు. రైతులకు అందరం కలిసి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. -
అధికార విపక్షాల మధ్య డీ‘ఢీ’సీఏ
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోషియేషన్( డీడీసీఏ) అవినీతి వివాదంపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ విషయంలో జైట్లీకి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆరోపణలనుంచి ఆర్థిక మంత్రి పులుకడిగిన ముత్యంలా బయటపడతారని ప్రధాని మోదీ అన్నారు. అయితే.. జైట్లీకి మద్దతుగా నిలవటంతోపాటు, తన ఆఫీసుపై దాడికి బాధ్యత వహిస్తూ.. ప్రధాని రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మరోవైపు, జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో సమాధానం ఇవ్వాలంటూ కేజ్రీతో సహా ఆరుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనికి ప్రతిగా ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీ డీడీసీఏ వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించింది. అద్వానీలాగే జైట్లీ..: డీడీసీఏ వివాదంపై ప్రధాని ఎట్టకేలకు స్పందించారు. జైట్లీ ఈ కేసులో నిర్దోషిగా బయటపడతారన్నారు. ప్రభుత్వంపై నిందలు మోపటం ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలనుంచి తప్పించుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమన్నారు. హవాలా కేసులో అద్వానీకి క్లీన్చిట్ లభించినట్లు జైట్లీ కూడా నిర్దోషిగానే బయటకొస్తారని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. అద్వానీ కేసులో నాడు ఆధారాల్లేక చతికిలబడ్డ కాంగ్రెస్‌కు ఇప్పుడూ ఎదురుదెబ్బ తప్పదన్నారు. జైట్లీ నీతి నిజాయితీలకు మారుపేరని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. కాగా, జైట్లీపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ భేటీకి హాజరు కాలేదు. ఆజాద్‌ను సస్పెండ్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాని రాజీనామా చేయాలి ..: జైట్లీని వెనకేసుకొసుకు రావటంతోపాటు తన కార్యాలయంపై సీబీఐ దాడులకు పురమాయించిన ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. డీడీసీఏ అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ అసెంబ్లీని సమావేశపరిచిన సీఎం.. కేసు విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీడీసీఏ పత్రాలను స్వాధీనం చేసుకునేందుకే.. తన ఆఫీసుపై సీబీఐ దాడులు జరిగాయని పునరుద్ఘాటించారు. ‘ప్రధాని తన గౌరవం కాపాడుకునేందుకు జైట్లీని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కానీ.. నా ఆఫీసుపై సీబీఐ దాడులు జరిపించినందుకు ప్రధాని ముందు రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ చర్చను విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షిస్తున్న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్‌ను చూపిస్తూ.. ‘మీలాంటి అధికారి దొరకటం మాకు గర్వకారణం’ అని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రశంసించారు. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జైట్లీ పరువునష్టం దావాలో కేజ్రీవాల్‌తో సహా ఆరుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. సమాధానం ఇచ్చేందుకు కేజ్రీ,అశుతోశ్ తప్ప మిగిలిన నలుగురు కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యారు. జైట్లీ వేసిన రూ.10కోట్ల దావాకు 3 వారాల్లో సమాధానం చెప్పాలంది. దీంతోపాటు ఆరోపణల పత్రాలను వారం రోజుల్లో కోర్టుకు అందించాలని తెలుపుతూ.. తదుపరి విచారణను 2016, ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదే వేసింది. -
'ఎల్జీ' నచ్చకుంటే సామ్ సంగ్ ఉందిగా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) హస్తిన సీఎం, ఎల్జీ మధ్య 'పవర్ పోరు' రోజురోజుకు ముదురుతోంది. 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా' తరహాలో సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ 'అధికారాల' యుద్ధం చేస్తున్నారు. నాది పైచేయి అంటే నాదే పైచేయి అనుకుంటూ కత్తులు నూరుకుంటున్నారు. నాకు ఎక్కువ అధికారం ఉందని సీఎం అంటే, నీకంటే నాకే అధికారం ఉందని ఎల్జీ వాదిస్తున్నారు. దీంతో 'పంచాయతి' దేశప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్లింది. కూర్చుని మాట్లాడుకునే దానికి కారాలు-మిరియాలు నూరడం ఎందుకని కేంద్ర సర్కారు సన్నాయి నొక్కులు నొక్కింది. 'ఎల్జీ' బ్రాండ్ 'లైఫ్ ఈజ్ గుడ్'గా పాపులర్. కాని పాపం కేజ్రీవాల్ కు 'ఎల్జీ' అంటే లైఫ్ ఈజ్ బ్యాడ్ గా అయిపోయింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను జంగ్ నియమించటంతో ఆధిపత్య పోరుకు అంకురార్పణ జరిగింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా ముద్రపడిన గామ్లిన్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడాన్ని 'ఆప్' సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె బాధ్యతలు చేపట్టడంతో కేజ్రీవాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ ఆదేశాలపై గామ్లిన్ నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరిందమ్ మజుందార్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన ఆఫీసుకు తాళం వేసి సాగనంపారు. 'గామ్లిన్' వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు. ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారని 'సామాన్య' సీఎం ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ పని తమను చేసుకోనివ్వాలని, జంగ్ ను అడ్డం పెట్టుకుని ఆప్ సర్కారుకు 'జర్క్' ఇవ్వొద్దని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆధిపత్య పోరుతో అధికారులు తల్లడిల్లుతున్నారు. హస్తినలో పనిచేయాలంటే హడలిపోతున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖకు మొరపెట్టుకుంటున్నారు. ఎంతకాలం ఈ బాధ మహాప్రభో అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందు అధికారులు వాపోయారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులను ఉపముఖ్యమంత్రి ఊరడించారు. కేజ్రీవాల్, జంగ్ పోరు ఎంతవరకు వెళుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ కు 'ఎల్జీ'తో ఇబ్బంది ఉంటే ఏ 'సామ్ సంగ్'నో, 'సోని'నో చూసుకోవచ్చు కదా అనే కామెంట్ ఇంటర్నెట్ లో బాగా పాపులర్ అయింది. -
బీజేపీ ఢిల్లీ ఎత్తులు!
ఎన్నికల రుతువులో ఎంతో అప్రమత్తంగా ఉండి ఎత్తులు-పెయైత్తులు వేయడం రాజకీయ పక్షాలకు అలవాటే. ఫలానా నేతకు ప్రజాదరణ ఉన్నదని, వారివల్ల పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని అనుకుంటే పార్టీలోకి ఆహ్వానించడం అందులో భాగమే. ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీలో మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని కూడా ఇలాగే అర్ధం చేసుకుని ఊరుకోవడం... ఆ పార్టీ సీనియర్ నేతల సంగతలా ఉంచి బయటివారికి కూడా కష్టమే. కిరణ్ బేడీ నేపథ్యం చూసినా... బీజేపీ అధినేతలు చేసే ప్రకటనలు గమనించినా ఈ చేరిక అందరినీ ఆశ్చర్యపరిచిందన్నది వాస్తవం. అయితే అంతకన్నా ఎక్కువగా దిగ్భ్రాంతిపరిచిన విషయం వచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పార్టీకి ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థికావడం. సరిగ్గా వారం రోజులక్రితం ఢిల్లీ ఎన్నికల నగారా మోగిన సమయానికి బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరూ లేరు. అలా ఉండే సమస్యేలేదని ఈ వారంరోజులుగా ఆ పార్టీ నాయకులు సమర్థించుకుంటూ వస్తున్నారు. తమకు సమష్టి నాయకత్వంలోనే విశ్వాసం ఉన్నదని వారు చెబుతున్నారు. ‘మహారాష్ట్రలో ఏమైంది... హర్యానాలో ఏం జరిగింది... జార్ఖండ్‌లో ఏం చేశాం-కాస్తయినా గుర్తుండొద్దా’ అని మీడియాపై విసుక్కున్నారు. నిజమే...ఆ రాష్ట్రాలన్నిటా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల బరిలో నిలిచింది. విజయం సాధించింది. ఇది ఆ పార్టీ బలహీనతేనని ఎన్నికల ప్రచారసభల్లో విపక్షాలు విమర్శించినా లెక్కచేయలేదు. ఎన్నికయ్యే తమ శాసనసభ్యులే ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుణ్ణి ఎన్నుకుంటారని బీజేపీ నేతలు చెప్పారు. ఈ వారంరోజులుగా... ఇంకా చెప్పాలంటే సోమవారం రాత్రి వరకూ వారంతా ఆ మాటమీదే ఉన్నారు. కానీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అంతా మారిపోయింది. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందే నిజానికి ఢిల్లీలో సమరం మొదలైపోయింది. యుద్ధం మధ్యలో సేనానిని ప్రకటించడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. గెలుపుపై అంత ధీమా లేకపోవడంవల్లే బీజేపీ కిరణ్ బేడీని చేర్చుకోవడమే కాక ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల మాటెలా ఉన్నా సర్వేలన్నీ వచ్చే నెల 7న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందనే చెప్పాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాన్ని వరసగా పదిహేనేళ్లపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా దివాలా తీసివుంది. అప్పట్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన ఆప్‌పై చాలా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. సీఎం పదవికి కేజ్రీవాల్ సరైనవారని ఎక్కువమంది అభిప్రాయపడినా ఆయన పార్టీకి గతంలోకంటే అదనంగా సీట్లు లభించే అవకాశం లేదని సర్వేలు తెలిపాయి. అదే సమయంలో బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఆ సర్వేలు జోస్యం చెప్పాయి. 2013 ఎన్నికల్లో 31 స్థానాలు గెల్చుకున్న బీజేపీకి ఈసారి 40కి మించవచ్చునని అంచనా వేశాయి. ఢిల్లీ బీజేపీకి నాయకత్వ కొరత లేదు. ఆ పార్టీలో హర్షవర్ధన్, విజయ్ గోయెల్, జగదీష్ ముఖీ, సతీష్ ఉపాధ్యాయవంటి ఉద్దండులున్నారు. వీరంతా సీఎం పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలున్నవారే. ప్రాథమిక స్థాయినుంచి పార్టీలో ఎన్నో బాధ్యతలు మోసి, తమ నాయకత్వ పటిమను నిరూపించుకుని పైకొచ్చినవారే. ఒకవేళ వీరెవరూ సరిపోరనుకుంటే పార్టీకి మెరికల్లాంటి నాయకులను అందించడానికి సంఘ్ పరివార్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇన్నివున్నా కిరణ్ బేడీయే అవసరమని బీజేపీ అధినాయకత్వం ఎందుకు భావించిందన్నదే అంతుబట్టని విషయం. కిరణ్ బేడీ చేరికవల్ల బీజేపీకి అదనంగా వచ్చే లాభమూ...ఆప్‌కు కలిగే నష్టమూ ఏమిటన్న చర్చ ఎలాగూ ఉంటుంది. అయితే ఇది లాభనష్టాల సమస్య కాదు. అటు బీజేపీగానీ, ఇటు కిరణ్బేడీగానీ ఇన్నాళ్లనుంచీ చెప్పుకుంటూ వస్తున్న విలువల సంగతేమిటన్నదే ప్రధాన ప్రశ్న. అన్నా హజారే న్యూఢిల్లీలో ఆమరణ నిరశనకు దిగినప్పుడు కిరణ్ బేడీ ప్రధాన పాత్ర పోషించారు. వేదికంతా తానే అయి తిరుగుతూ ఆమె రాజకీయ పక్షాలపైనా, నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీల ప్రమేయంలేకుండా అందరినీ ఎగతాళి చేశారు. అందుకు దాదాపు అన్ని పక్షాల ఎంపీలూ ఆమెపై ఆగ్రహించి స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించినప్పుడు ఆయనపై సైతం బేడీ విమర్శలు చేశారు. ఇన్నాళ్లూ ఎవరివల్ల దేశం నాశనమవుతున్నదని చెబుతున్నామో వారిలో భాగం కావాలని తహతహలాడుతున్నారని కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఇలాంటివాటికి దూరంగా ఉండి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తానని బేడీ అప్పట్లో చెప్పారు. ఆమె జీవితాంతం ఆ అభిప్రాయాలతోనే ఉండాలని, రాజకీయాలవైపు చూడకూడదని ఎవరూ అనరు. అయితే, ఆ పని చేసే ముందు గతంలో తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలను మార్చుకోవడానికి దోహదపడిన అంశాలేమిటో చెప్పాల్సిన కనీస బాధ్యత ఆమెపై ఉంటుంది. అలాగే, నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన అన్నా బృందంవల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని గతంలో తాము చేసిన విమర్శలు ఎటుపోయాయో బీజేపీ చెప్పాల్సి ఉంటుంది. నరేంద్ర మోదీయే ఎన్నికల్లో తమకు సారథి అని, ఈ ఏడునెలల కాలంలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలే తమకు ఢిల్లీలో సైతం గెలుపును సాధించిపెడతాయని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇన్నాళ్లూ చెప్పి ఇప్పుడు హఠాత్తుగా తన వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో కూడా ఆ పార్టీ వివరించాలి. మొత్తానికి ఏడాదిన్నర క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మహిళల భద్రత, పెరుగుతున్న నేరాలు, ఎడతెగని ట్రాఫిక్ జాంలు వంటి సమస్యలు చర్చకు రాగా... ప్రస్తుత ఎన్నికలు వ్యక్తుల చుట్టూ తిరిగేలా కనబడుతున్నాయి. ఈ ధోరణి ఏమేరకు తగ్గితే ఆ మేరకు ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. -
బీజేపీకి అవకాశం ఇవ్వొద్దు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ఇవ్వవని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి బీజేపీ అవకాశాలు లేవని చెప్పారు. బీజేపీ అవకాశం ఇస్తే రాజకీయ బేరసారాలకు, పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించామన్నారు. -
కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాం: కేజ్రీవాల్
ఘజియాబాద్: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆచితూచి అడుగేస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నామని 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 'అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నాం. అడ్డదారుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు వినోద్ కుమార్ బిన్నీ, షోయబ్ ఇక్బాల్, రంబీర్ షకీన్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని కేజ్రీవాల్ తెలిపారు. షకీన్ స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, ఇక్బాల్ జేడీ(యు) ఎమ్మెల్యే. బిన్నీ 'ఆప్' తరపున గెలిచినప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. -
దూకుడు తగ్గాలి.. వివేచన పెరగాలి!
ప్రజా పోరాటాలతో వెలుగులోకి వచ్చి ఆనతికాలంలోనే హస్తిన సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభ నానాటికి కొడిగడుతోంది. తొందరపాటుతో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న ఆయన ఇప్పుడు ఇంటా, బయటా విమర్శల పాలవుతున్నారు. సీఎం సీటు వదులుకుని తప్పుచేశానని ఒప్పుకున్నప్పటికీ సొంత పార్టీ నాయకులు ఆయనను క్షమించడం లేదు. రోజుకొకరు అన్నట్టుగా ఆయనపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ తాజాగా కేజ్రీవాల్ వైఖరిని తప్పుబట్టారు. రాజకీయాల్లో రాణించే లక్షణాలు కేజ్రీవాల్ లేవని తేల్చేశారు. పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. తానొక్కడినే పార్టీని నడిపించాలన్న తలంపుతో ఉన్నట్టు కనబడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీలో మళ్లీ పాగా వేసేందుకు ఆప్ సమాయత్తమవుతున్న సమయంలో శాంతిభూషణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పడేశాయి. కేజ్రీవాల్ పై విమర్శలు కొత్త కాదు. కాని పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ న్యాయవాది ఆయనపై విమర్శలు చేశారంటే ఆలోచించాల్సిన విషయమే. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోకపోవడంతో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఢిల్లీ ప్రజల తీర్పును అవమానించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడం కూడా పార్టీకి నష్టం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమైతే ఫలితాలు తమకు మరింత అనుకూలంగా వచ్చేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆది నుంచి దూకుడుగా వ్యవహరించిన కేజ్రీవాల్ మున్ముందు బాగా ఆలోంచి నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారని కూడా సలహాయిస్తున్నారు. ఆచితూచి అడుగేస్తేనే పాలిటిక్స్ లో మనగలుగుతారని సూచిస్తున్నారు.