అధికార విపక్షాల మధ్య డీ‘ఢీ’సీఏ
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోషియేషన్( డీడీసీఏ) అవినీతి వివాదంపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ విషయంలో జైట్లీకి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆరోపణలనుంచి ఆర్థిక మంత్రి పులుకడిగిన ముత్యంలా బయటపడతారని ప్రధాని మోదీ అన్నారు. అయితే.. జైట్లీకి మద్దతుగా నిలవటంతోపాటు, తన ఆఫీసుపై దాడికి బాధ్యత వహిస్తూ.. ప్రధాని రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
మరోవైపు, జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో సమాధానం ఇవ్వాలంటూ కేజ్రీతో సహా ఆరుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనికి ప్రతిగా ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీ డీడీసీఏ వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించింది.
అద్వానీలాగే జైట్లీ..: డీడీసీఏ వివాదంపై ప్రధాని ఎట్టకేలకు స్పందించారు. జైట్లీ ఈ కేసులో నిర్దోషిగా బయటపడతారన్నారు. ప్రభుత్వంపై నిందలు మోపటం ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలనుంచి తప్పించుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమన్నారు. హవాలా కేసులో అద్వానీకి క్లీన్‌చిట్ లభించినట్లు జైట్లీ కూడా నిర్దోషిగానే బయటకొస్తారని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు.
అద్వానీ కేసులో నాడు ఆధారాల్లేక చతికిలబడ్డ కాంగ్రెస్‌కు ఇప్పుడూ ఎదురుదెబ్బ తప్పదన్నారు. జైట్లీ నీతి నిజాయితీలకు మారుపేరని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. కాగా, జైట్లీపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ భేటీకి హాజరు కాలేదు. ఆజాద్‌ను సస్పెండ్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రధాని రాజీనామా చేయాలి ..: జైట్లీని వెనకేసుకొసుకు రావటంతోపాటు తన కార్యాలయంపై సీబీఐ దాడులకు పురమాయించిన ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. డీడీసీఏ అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ అసెంబ్లీని సమావేశపరిచిన సీఎం.. కేసు విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీడీసీఏ పత్రాలను స్వాధీనం చేసుకునేందుకే.. తన ఆఫీసుపై సీబీఐ దాడులు జరిగాయని పునరుద్ఘాటించారు.
‘ప్రధాని తన గౌరవం కాపాడుకునేందుకు జైట్లీని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కానీ.. నా ఆఫీసుపై సీబీఐ దాడులు జరిపించినందుకు ప్రధాని ముందు రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ చర్చను విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షిస్తున్న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్‌ను చూపిస్తూ.. ‘మీలాంటి అధికారి దొరకటం మాకు గర్వకారణం’ అని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రశంసించారు.
ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
జైట్లీ పరువునష్టం దావాలో కేజ్రీవాల్‌తో సహా ఆరుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. సమాధానం ఇచ్చేందుకు కేజ్రీ,అశుతోశ్ తప్ప మిగిలిన నలుగురు కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యారు. జైట్లీ వేసిన రూ.10కోట్ల దావాకు 3 వారాల్లో సమాధానం చెప్పాలంది. దీంతోపాటు ఆరోపణల పత్రాలను వారం రోజుల్లో కోర్టుకు అందించాలని తెలుపుతూ.. తదుపరి విచారణను 2016, ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదే వేసింది.