
దళితుడికి ఢిల్లీ ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలి
పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకోండి
కేజ్రీవాల్‌కు స్వాతి మలివాల్ లేఖాస్త్రం
చెప్పులో రాయి, చెవిలో జోరిగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటిలోని తగువు.. సామెత మనకందరికీ తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి.. అధికారాన్ని కోల్పోయిన ‘మఫ్లర్ మేన్’కు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ఒకప్పుడు అండగా నిలబడిన నాయకులే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే అధినాయకుడిపై విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal).. కేజ్రీవాల్‌కు కంట్లో నలుసులా మారారు.
తనపై కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగిందని గతేడాది మే నెలలో స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడలేదన్న అక్కసుతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లేఖాస్త్రం సంధించి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మిగిలింది. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి దళితుడికి ఇవ్వాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేజ్రీవాల్‌కు ఆమె లేఖ రాశారు.
మీకు ఇదే మంచి అవకాశం
‘ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. మీరు(కేజ్రీవాల్) మాట నిబడేందుకు ఇది మీకు మంచి అవకాశం. విపక్ష నేతగా దళిత ఎమ్మెల్యేను నియమించండి. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం కోసం బలమైన ముందడుగు అవుతుంద’ని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తానని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా అగ్రనేతలు ఓటమి పాలయిన సంగతి తెలిసింది. మాజీ సీఎం ఆతిశీ మాత్రం ఒడ్డున పడ్డారు.
బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మలివాల్
ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీసీఎంలు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వచ్చినట్టు ఎక్కడా కనబడలేదు. అయితే ‘ఆప్’ ఎంపీ స్వాతి మలివాల్ మాత్రం ప్రమాణ స్వీకారం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ఆసక్తిగా ముచ్చటిస్తూ ఆమె కనిపించారు. రేఖా గుప్తాతో కరచాలనం చేసి స్వయంగా అభినందలు కూడా తెలిపారామె.
చదవండి: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటా
కాగా, కేజ్రీవాల్‌తో విభేదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలపై స్వాతి మలివాల్ స్పందించారు. ఈ విషయంపై ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని. ఈ పార్టీలోనే కొనసాగుతాను. ప్రశ్నలను సంధించినందుకు నన్ను రాజీనామా చేయంటున్నారు. నేనేం తప్పులేదు. రాజీనామా ఎందుకు చేయాల’ని ఆమె ఎదురు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment