ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపణ
ఆ సామాజికవర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్
ఓటరు జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర అని మండిపాటు
జాట్లు ఇప్పుడు గుర్తొచ్చారా? అంటూ కేజ్రీపై పర్వేశ్ వర్మ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. తాజాగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ ‘జాట్’అ్రస్తాన్ని ప్రయోగించారు. ఆ సామాజికవర్గాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గురువారం కేజ్రీవాల్ లేఖ రాశారు.
ఢిల్లీలోని జాట్‌లకు ద్రోహం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించారు. బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్లు గుర్తుకొచ్చారా? అంటూ పర్వేశ్ వర్మ విరుచుకుపడ్డారు.
ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గం వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రెండు పేజీల లేఖలో జాట్లకు సంబం«ధించి పలు అంశాలను ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని జాట్‌లకు మీరు ద్రోహం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో జాట్ వర్గాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తోంది. 2015 మార్చి 26న జాట్ నాయకులను ఇంటికి పిలిచి ఢిల్లీలోని జాట్‌లను ఓబీసీ జాబితాలో చేర్చుతామని మీరు హామీ ఇచ్చారు.
2019 ఫిబ్రవరి 8న హోం మంత్రి అమిత్ షా కూడా జాట్‌లను కేంద్ర ఓబీసీ జాబితాలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని జాట్ కమ్యూనిటీ విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ, ఢిల్లీలోని జాట్‌లకు రిజర్వేషన్లు ఎందుకు లభించడంలేదు? ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది పిల్లలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందలేకపోతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఓబీసీ జాబితాలో వారు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాట్‌లు ప్రయోజనాలు పొందేందుకు మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో ఢిల్లీలోని జాట్‌లతోపాటు. మరో ఐదు సామాజికివర్గాలకు చెందిన వారు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఓబీసీ జాబితాలో మార్పులు చేసి ఓబీసీ హోదా ఉన్న ఆయా వర్గాలకు న్యాయం చేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా’అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఆప్ ఫిర్యాదు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఢిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్‌లతో కలిసి కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కలిసి రెండు పేజీల ఫిర్యాదును అందజేశారు.
హర్ ఘర్ నౌకరీ (ఇంటికో ఉద్యోగం) పేరుతో ఓట్లు అడుగుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న పర్వేశ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వర్మ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని సీఎం ఆతిశీ మరో ఫిర్యాదు చేశారు. ‘నేను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత 15 రోజుల్లోనే కొత్తగా 13 వేల మంది ఓటర్లు చేరారు.
అదేవిధంగా, ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని 5,500 దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇదో భారీ కుట్ర’అని అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. పరేŠవ్‌శ్ వర్మ ఇంటిపై తక్షణమే ఎన్నికల నిఘా అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. పర్వేశ్ వర్మ మహిళలకు రూ.1,100 బహిరంగంగానే పంచుతున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవలకు పాల్పడుతున్న స్థానిక ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఆప్ సర్కారు పడిపోవాలని వారు కోరుకుంటున్నారు: పర్వేశ్ వర్మ
ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్‌లు గుర్తుకువచ్చారా? అంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మండిపడ్డారు. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌పై ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ఈసారి ఢిల్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. జాట్‌ల కోసం కేజ్రీవాల్ ఏమైనా చేసి ఉంటే.. ఎన్నికలకు 25 రోజుల ముందు జాట్‌లు గుర్తుకువచ్చేవారు కాదు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో జాట్‌లు మాత్రమే కాదు.. గుజ్జర్లు, యాదవులు, త్యాగులు, రాజ్‌పుత్‌లు కూడా ఉన్నారు. వీరంతా కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు’అని పర్వేశ్ వర్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment