'ఎల్జీ' నచ్చకుంటే సామ్ సంగ్ ఉందిగా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
హస్తిన సీఎం, ఎల్జీ మధ్య 'పవర్ పోరు' రోజురోజుకు ముదురుతోంది. 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా' తరహాలో సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ 'అధికారాల' యుద్ధం చేస్తున్నారు. నాది పైచేయి అంటే నాదే పైచేయి అనుకుంటూ కత్తులు నూరుకుంటున్నారు. నాకు ఎక్కువ అధికారం ఉందని సీఎం అంటే, నీకంటే నాకే అధికారం ఉందని ఎల్జీ వాదిస్తున్నారు. దీంతో 'పంచాయతి' దేశప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్లింది. కూర్చుని మాట్లాడుకునే దానికి కారాలు-మిరియాలు నూరడం ఎందుకని కేంద్ర సర్కారు సన్నాయి నొక్కులు నొక్కింది. 'ఎల్జీ' బ్రాండ్ 'లైఫ్ ఈజ్ గుడ్'గా పాపులర్. కాని పాపం కేజ్రీవాల్ కు 'ఎల్జీ' అంటే లైఫ్ ఈజ్ బ్యాడ్ గా అయిపోయింది.
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను జంగ్ నియమించటంతో ఆధిపత్య పోరుకు అంకురార్పణ జరిగింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా ముద్రపడిన గామ్లిన్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడాన్ని 'ఆప్' సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె బాధ్యతలు చేపట్టడంతో కేజ్రీవాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ ఆదేశాలపై గామ్లిన్ నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరిందమ్ మజుందార్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన ఆఫీసుకు తాళం వేసి సాగనంపారు.
'గామ్లిన్' వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు. ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్‌జీ వ్యవహరిస్తున్నారని 'సామాన్య' సీఎం ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ పని తమను చేసుకోనివ్వాలని, జంగ్ ను అడ్డం పెట్టుకుని ఆప్ సర్కారుకు 'జర్క్' ఇవ్వొద్దని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది.
ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆధిపత్య పోరుతో అధికారులు తల్లడిల్లుతున్నారు. హస్తినలో పనిచేయాలంటే హడలిపోతున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖకు మొరపెట్టుకుంటున్నారు. ఎంతకాలం ఈ బాధ మహాప్రభో అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందు అధికారులు వాపోయారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులను ఉపముఖ్యమంత్రి ఊరడించారు. కేజ్రీవాల్, జంగ్ పోరు ఎంతవరకు వెళుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వివాదంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ కు 'ఎల్జీ'తో ఇబ్బంది ఉంటే ఏ 'సామ్ సంగ్'నో, 'సోని'నో చూసుకోవచ్చు కదా అనే కామెంట్ ఇంటర్నెట్ లో బాగా పాపులర్ అయింది.