ప్రజాధనంతో విలాసవంతమైన శీష్‌ మహల్‌! | BJP Releases Video Of Kejriwal House Calls Him Delhi ka Millionaire | Sakshi
Sakshi News home page

బీజేపీ చేతికి ‘అద్దాల మేడ’ అస్త్రం

Published Wed, Dec 11 2024 12:58 PM | Last Updated on Wed, Dec 11 2024 1:18 PM

BJP Releases Video Of Kejriwal House Calls Him Delhi ka Millionaire

కేజ్రీవాల్‌ హయాంలో నిర్మించిన అధికార నివాసంపై ఆరోపణలు

వీడియో విడుదల చేసిన కాషాయ దళం

ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకేనంటూ ఆప్‌ ఎదురుదాడి

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్, బీజేపీ తమ కత్తులకు పదునుపెడుతున్నాయి. మూ డో విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ శాంతి భద్రతల పరిస్థితి దారుణమంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బదులుగా అన్నట్లు, సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్‌ 6 ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్డులోని అధికార నివాసానికి రూ.42 కోట్లు వెచ్చించిన అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజాధనంతో విలాసవంతమైన శీష్‌ మహల్‌(అద్దాల మేడ), ‘7 స్టార్‌ రిసార్ట్‌’ను కట్టుకున్నారంటూ ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ విడుదల చేశారు.

కేజ్రీవాల్‌ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే..
‘సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్‌ నిర్మించిన అద్దాల మేడ ఇదే. దీన్ని గురించిన వాస్తవాలను మీ ముందుంచబోతున్నాను’ అని పేర్కొంటూ సచ్‌దేవ్‌.. ‘ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రతను తీసుకోనని చెప్పిన ఈయన, ఇప్పుడు వైభవోపేతమైన 7 స్టార్‌ రిసార్ట్‌ నిర్మించుకున్నాడు’అని పేర్కొ న్నారు. ‘రూ.1.9 కోట్ల విలువైన మార్బుల్‌ గ్రానైట్‌ లైటింగ్, రూ.1.5 కోట్లతో ఇన్‌స్టాలేషన్, సివిల్‌ వర్క్, రూ.35 లక్షల విలువైన జిమ్, స్పా పరికరాలు కలిపి మొత్తంగా వీటికే రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు. కేజ్రీవాల్‌ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే’ అని విమర్శించారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని ఇచ్చిన హామీని కేజ్రీవాల్‌ ఉల్లంఘించారన్నారు. ఈ డబ్బుతో నిరుపేదలకు 34 ఇళ్ల ఫ్లాట్లు, లేదా 326 ఈ–రిక్షాలను అందజేయవచ్చన్నారు. బీజేపీ ఎంపీ ప్రవీణ ఖండేల్వాల్‌ స్పందిస్తూ, కేజ్రీవాల్‌ చెప్పిన ‘ఆమ్‌ ఆద్మీ’కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.

తిప్పికొట్టిన ఆప్‌
ఈ విమర్శలను ఆప్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తిప్పికొట్టారు. ‘హరియాణా, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల నిధుల దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులుగా, వారు కేజ్రీవాల్‌ నివసించిన అధికారిక నివాసంపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే, బీజేపీ నేతలు సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారు’అని ఎదురుదాడికి దిగారు.

చ‌ద‌వండి: ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్‌

రానున్న ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, ఈ అంశం రాజకీయంగా ఆప్‌ను ఇరుకున పెట్టేదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయిన మొత్తం వ్యయం రూ.52.71 కోట్లని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ 2023లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది.  

రూ.10 లక్షల బీమా, కుమార్తెల పెళ్లికి సాయం
ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్‌ ఎన్నికల హామీ
ఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు ప్రచారంలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఆటో డ్రైవర్లకు పలు హామీలను ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్‌ కొండ్లిలో ఆటో డ్రైవర్‌ నవనీత్‌ కుటుంబంతో మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తున్నాను. అవి.. రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుమార్తెల వివాహానికి రూ.1 లక్ష సాయం,  పోటీ పరీక్షలకు హాజరయ్యే వీరి పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తాం’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement