దూకుడు తగ్గాలి.. వివేచన పెరగాలి!
ప్రజా పోరాటాలతో వెలుగులోకి వచ్చి ఆనతికాలంలోనే హస్తిన సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభ నానాటికి కొడిగడుతోంది. తొందరపాటుతో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న ఆయన ఇప్పుడు ఇంటా, బయటా విమర్శల పాలవుతున్నారు. సీఎం సీటు వదులుకుని తప్పుచేశానని ఒప్పుకున్నప్పటికీ సొంత పార్టీ నాయకులు ఆయనను క్షమించడం లేదు. రోజుకొకరు అన్నట్టుగా ఆయనపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ తాజాగా కేజ్రీవాల్ వైఖరిని తప్పుబట్టారు. రాజకీయాల్లో రాణించే లక్షణాలు కేజ్రీవాల్ లేవని తేల్చేశారు. పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. తానొక్కడినే పార్టీని నడిపించాలన్న తలంపుతో ఉన్నట్టు కనబడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీలో మళ్లీ పాగా వేసేందుకు ఆప్ సమాయత్తమవుతున్న సమయంలో శాంతిభూషణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పడేశాయి.
కేజ్రీవాల్ పై విమర్శలు కొత్త కాదు. కాని పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ న్యాయవాది ఆయనపై విమర్శలు చేశారంటే ఆలోచించాల్సిన విషయమే. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోకపోవడంతో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఢిల్లీ ప్రజల తీర్పును అవమానించారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండానే లోక్సభ ఎన్నికలకు వెళ్లడం కూడా పార్టీకి నష్టం కలిగించింది. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమైతే ఫలితాలు తమకు మరింత అనుకూలంగా వచ్చేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆది నుంచి దూకుడుగా వ్యవహరించిన కేజ్రీవాల్ మున్ముందు బాగా ఆలోంచి నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారని కూడా సలహాయిస్తున్నారు. ఆచితూచి అడుగేస్తేనే పాలిటిక్స్ లో మనగలుగుతారని సూచిస్తున్నారు.