ఢిల్లీలోని 12 స్థానాల్లో ఈ వర్గం ప్రభావం
మొత్తం ఓటర్లలో 7–8శాతం వాటా
చాలా చోట్ల 8 నుంచి 28 శాతం వరకు జనాభా
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే సామర్థ్యం
వీరిపైనే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆశలు
సాక్షి, న్యూఢిల్లీ: జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ రాసిన లేఖతో హస్తినలో ఈ సామాజిక వర్గం పేరుమీద రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ రాజకీయాల్లో జాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సుమారు 12 ప్రాంతాల్లో 8 నుంచి 28 శాతం వరకు జాట్లున్నారు. ఢిల్లీకి హరియాణా రాష్ట్రంతో సరిహద్దు ఉంది. సుమారు 225 సరిహద్దు గ్రామాల్లో బలమైన సంఖ్యలో జాట్లున్నారు.
ఫలితంగా, చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో వీరి ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం ఓటర్లలో 7నుంచి 8 శాతం వాటా వీరిదే. వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. ఇటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, అటు బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల అనుగ్రహంపైనే ఆశలు పెట్టుకున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
ఢిల్లీలోని 12 అంసెబ్లీ నియోజకవర్గాల్లో జాట్ల ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 8నుంచి 28 శాతం జాట్ల జనాభా ఉందంటున్నాయి. ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో 28 శాతం, నజఫ్‌గఢ్‌లో 25, నరేలా, బిజ్వాసన్‌లలో 23, బవానా, నాంగ్‌లోయి జాట్‌లలో 20, మటియాలా, మెహ్రోలిల్లో 16, ఉత్తమ్‌నగర్‌లో 15, వికాస్‌పురిలో 10, ఛత్తర్‌పూర్‌లో 9, కిరాడిలో 8శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
కైలాశ్‌ను జాట్ నేతగా ప్రమోట్ చేసిన ఆప్
ఒకప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. అయితే, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ చేసిన 8 మంది జాట్ ఎమ్మెల్యేలు, 2020లో 9 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతాలపై ఆప్ మంచి పట్టు సాధించింది. జాట్ నేతగా కైలాశ్ గెహ్లాట్‌ను ప్రమోట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే, ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.
కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలం
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి ఆధిక్యం కనబరిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న వార్డుల్లో బీజేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాట్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే న్యూఢిల్లీ స్థానం నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న పర్వేశ్ వర్మ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. పర్వేశ్‌కు టికెట్ ఇచ్చి జాట్ల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ.
Comments
Please login to add a commentAdd a comment