అమిత్ షా - కిరణ్ బేడీ
ఎన్నికల రుతువులో ఎంతో అప్రమత్తంగా ఉండి ఎత్తులు-పెయైత్తులు వేయడం రాజకీయ పక్షాలకు అలవాటే. ఫలానా నేతకు ప్రజాదరణ ఉన్నదని, వారివల్ల పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని అనుకుంటే పార్టీలోకి ఆహ్వానించడం అందులో భాగమే. ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీలో మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని కూడా ఇలాగే అర్ధం చేసుకుని ఊరుకోవడం... ఆ పార్టీ సీనియర్ నేతల సంగతలా ఉంచి బయటివారికి కూడా కష్టమే. కిరణ్ బేడీ నేపథ్యం చూసినా... బీజేపీ అధినేతలు చేసే ప్రకటనలు గమనించినా ఈ చేరిక అందరినీ ఆశ్చర్యపరిచిందన్నది వాస్తవం. అయితే అంతకన్నా ఎక్కువగా దిగ్భ్రాంతిపరిచిన విషయం వచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పార్టీకి ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థికావడం. సరిగ్గా వారం రోజులక్రితం ఢిల్లీ ఎన్నికల నగారా మోగిన సమయానికి బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరూ లేరు. అలా ఉండే సమస్యేలేదని ఈ వారంరోజులుగా ఆ పార్టీ నాయకులు సమర్థించుకుంటూ వస్తున్నారు. తమకు సమష్టి నాయకత్వంలోనే విశ్వాసం ఉన్నదని వారు చెబుతున్నారు. ‘మహారాష్ట్రలో ఏమైంది... హర్యానాలో ఏం జరిగింది... జార్ఖండ్‌లో ఏం చేశాం-కాస్తయినా గుర్తుండొద్దా’ అని మీడియాపై విసుక్కున్నారు. నిజమే...ఆ రాష్ట్రాలన్నిటా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల బరిలో నిలిచింది. విజయం సాధించింది. ఇది ఆ పార్టీ బలహీనతేనని ఎన్నికల ప్రచారసభల్లో విపక్షాలు విమర్శించినా లెక్కచేయలేదు. ఎన్నికయ్యే తమ శాసనసభ్యులే ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుణ్ణి ఎన్నుకుంటారని బీజేపీ నేతలు చెప్పారు. ఈ వారంరోజులుగా... ఇంకా చెప్పాలంటే సోమవారం రాత్రి వరకూ వారంతా ఆ మాటమీదే ఉన్నారు. కానీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అంతా మారిపోయింది. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందే నిజానికి ఢిల్లీలో సమరం మొదలైపోయింది. యుద్ధం మధ్యలో సేనానిని ప్రకటించడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది.
గెలుపుపై అంత ధీమా లేకపోవడంవల్లే బీజేపీ కిరణ్ బేడీని చేర్చుకోవడమే కాక ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల మాటెలా ఉన్నా సర్వేలన్నీ వచ్చే నెల 7న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందనే చెప్పాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాన్ని వరసగా పదిహేనేళ్లపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా దివాలా తీసివుంది. అప్పట్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన ఆప్‌పై చాలా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. సీఎం పదవికి కేజ్రీవాల్ సరైనవారని ఎక్కువమంది అభిప్రాయపడినా ఆయన పార్టీకి గతంలోకంటే అదనంగా సీట్లు లభించే అవకాశం లేదని సర్వేలు తెలిపాయి. అదే సమయంలో బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఆ సర్వేలు జోస్యం చెప్పాయి. 2013 ఎన్నికల్లో 31 స్థానాలు గెల్చుకున్న బీజేపీకి ఈసారి 40కి మించవచ్చునని అంచనా వేశాయి. ఢిల్లీ బీజేపీకి నాయకత్వ కొరత లేదు. ఆ పార్టీలో హర్షవర్ధన్, విజయ్ గోయెల్, జగదీష్ ముఖీ, సతీష్ ఉపాధ్యాయవంటి ఉద్దండులున్నారు. వీరంతా సీఎం పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలున్నవారే. ప్రాథమిక స్థాయినుంచి పార్టీలో ఎన్నో బాధ్యతలు మోసి, తమ నాయకత్వ పటిమను నిరూపించుకుని పైకొచ్చినవారే. ఒకవేళ వీరెవరూ సరిపోరనుకుంటే పార్టీకి మెరికల్లాంటి నాయకులను అందించడానికి సంఘ్ పరివార్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇన్నివున్నా కిరణ్ బేడీయే అవసరమని బీజేపీ అధినాయకత్వం ఎందుకు భావించిందన్నదే అంతుబట్టని విషయం.
కిరణ్ బేడీ చేరికవల్ల బీజేపీకి అదనంగా వచ్చే లాభమూ...ఆప్‌కు కలిగే నష్టమూ ఏమిటన్న చర్చ ఎలాగూ ఉంటుంది. అయితే ఇది లాభనష్టాల సమస్య కాదు. అటు బీజేపీగానీ, ఇటు కిరణ్‌బేడీగానీ ఇన్నాళ్లనుంచీ చెప్పుకుంటూ వస్తున్న విలువల సంగతేమిటన్నదే ప్రధాన ప్రశ్న. అన్నా హజారే న్యూఢిల్లీలో ఆమరణ నిరశనకు దిగినప్పుడు కిరణ్ బేడీ ప్రధాన పాత్ర పోషించారు. వేదికంతా తానే అయి తిరుగుతూ ఆమె రాజకీయ పక్షాలపైనా, నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీల ప్రమేయంలేకుండా అందరినీ ఎగతాళి చేశారు. అందుకు దాదాపు అన్ని పక్షాల ఎంపీలూ ఆమెపై ఆగ్రహించి స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించినప్పుడు ఆయనపై సైతం బేడీ విమర్శలు చేశారు. ఇన్నాళ్లూ ఎవరివల్ల దేశం నాశనమవుతున్నదని చెబుతున్నామో వారిలో భాగం కావాలని తహతహలాడుతున్నారని కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. తాను మాత్రం ఇలాంటివాటికి దూరంగా ఉండి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తానని బేడీ అప్పట్లో చెప్పారు.
ఆమె జీవితాంతం ఆ అభిప్రాయాలతోనే ఉండాలని, రాజకీయాలవైపు చూడకూడదని ఎవరూ అనరు. అయితే, ఆ పని చేసే ముందు గతంలో తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలను మార్చుకోవడానికి దోహదపడిన అంశాలేమిటో చెప్పాల్సిన కనీస బాధ్యత ఆమెపై ఉంటుంది. అలాగే, నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన అన్నా బృందంవల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని గతంలో తాము చేసిన విమర్శలు ఎటుపోయాయో బీజేపీ చెప్పాల్సి ఉంటుంది. నరేంద్ర మోదీయే ఎన్నికల్లో తమకు సారథి అని, ఈ ఏడునెలల కాలంలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలే తమకు ఢిల్లీలో సైతం గెలుపును సాధించిపెడతాయని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇన్నాళ్లూ చెప్పి ఇప్పుడు హఠాత్తుగా తన వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో కూడా ఆ పార్టీ వివరించాలి. మొత్తానికి ఏడాదిన్నర క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మహిళల భద్రత, పెరుగుతున్న నేరాలు, ఎడతెగని ట్రాఫిక్ జాంలు వంటి సమస్యలు చర్చకు రాగా... ప్రస్తుత ఎన్నికలు వ్యక్తుల చుట్టూ తిరిగేలా కనబడుతున్నాయి. ఈ ధోరణి ఏమేరకు తగ్గితే ఆ మేరకు ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.