బీజేపీకి బీహార్ షాక్
ఈ ఏడాది ఆఖరుకు జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. మొన్నటి వరకూ జనతా పరివార్‌లోని వివిధ పార్టీలు రకరకాల విన్యాసాలు చేశాయి. విలీనం కాబోతున్నామని ఎంతో ఉత్సాహంగా ప్రకటించి... అందుకోసం కొన్ని ప్రయత్నాలు చేసి కూలబడ్డాయి. చివరకు ఇది సాధ్యమయ్యేలా లేదని తేలాక ప్రధాన పక్షాలైన జేడీ(యూ)-ఆర్జేడీలు సర్దుబాట్లతో సరిపెట్టుకుందామని నిర్ణయించుకున్నాయి.
ఈ వ్యవహారంవల్ల జనంలో పలచనయ్యామని గ్రహించి తమ సీఎం అభ్యర్థి ప్రస్తుత సీఎం నితీష్ కుమారేనని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. వారితో అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీ కూడా జత కలిసే అవకాశాలున్నాయి. అక్కడితో జనతా పరివార్ అంకం ముగిసింది. ఇప్పుడు ఎన్డీయే పక్షాల వంతు వచ్చింది. కేంద్రంలో ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ బలంగా ఉన్నందువల్లా, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి పట్టు ఉన్నందువల్ల బీహార్‌లోని ఎన్డీయే పక్షాలు బీజేపీ మాట జవదాటబోవని అందరూ అంచనావేశారు.
కానీ గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బీజేపీకి ఉన్న తలనొప్పులు కూడా తక్కువేమీ కాదని అర్థమవుతోంది. సీఎం అభ్యర్థిగా ప్రకటించి బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నేత సీపీ ఠాకూర్ ప్రకటించగా...ఆ పదవికి పోటీలో తానున్నానని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ముందుకొచ్చారు.
అంతేకాదు...తన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ మేరకు తీర్మానం కూడా చేయించారు. ఎన్డీయేకు చెందిన మరో భాగస్వామ్యపక్షమైన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)... సీఎం పీఠం బీజేపీదేనని ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకటనతో హుషారుగా ఉన్న బీజేపీకి ఠాకూర్, కుష్వాహాలు ఒక్కసారి షాకిచ్చారు. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ మోదీవైపే బీజేపీ మొగ్గుచూపుతున్నది.
ఇంతలో హఠాత్తుగా ఠాకూర్ రంగ ప్రవేశం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కుష్వాహా పార్టీకి బీజేపీ మూడు సీట్లిచ్చింది. కేంద్రంలో ఆయనకు జూనియర్ మంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయానికి తమ సామాజిక వర్గం తోడ్పడిందని కుష్వాహా నమ్ముతున్నారు. అందువల్లే రాబోయే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 67 స్థానాలు కేటాయించాలని కూడా కోరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తన వాటా సీట్ల కోసం బేరమాడటం కోసమే కుష్వాహా ఈ మాదిరి ప్రకటన చేశారని బీజేపీ నేతలు అర్థంచేసుకున్నా... ఇలాంటి బహిరంగ బేరసారాలపై వారికి అభ్యంతరం ఉంది.
బీజేపీ అగ్రనేతలకు బీహార్ ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి. నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ 22 స్థానాలు గెల్చుకోగా దాని మిత్రపక్షాలైన ఎల్‌జేపీకి 6, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 3 సీట్లు వచ్చాయి. అటు ఆర్జేడీ 4, అధికార జేడీ(యూ), కాంగ్రెస్‌లు రెండేసి స్థానాలూ గెల్చుకున్నాయి. ఓట్ల పరంగా చూస్తే బీజేపీకి 30 శాతం, దాని మిత్రపక్షం ఎల్‌జేపీకి 6శాతం లభించాయి. అటుపక్క జేడీ(యూ)కు 16 శాతం, ఆర్జేడీకి 20శాతం, కాంగ్రెస్‌కు 9 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, మిత్రపక్షాల ఓట్ల శాతం 36 అయినా... ప్రత్యర్థిపక్షాల అనైక్యత వల్ల 80 శాతం సీట్లు కైవసం చేసుకోగలిగాయి. వివిధ పార్టీలకు లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లే వస్తాయని లెక్కేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సమష్టిగా 45 శాతం ఓట్లు తెచ్చుకుంటాయి.
అటు బీజేపీ, ఎల్‌జేపీల ఓట్ల శాతం 36 దగ్గరే ఆగుతుంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ప్రత్యర్థులందరినీ ఊపిరాడకుండా చేశారు. ఆయన జనాకర్షణ ముందు వేరెవరూ నిలవలేకపోయారు. ఇప్పుడా పరిస్థితి ఉన్నదని చెప్పలేం. ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చునని వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. వ్యవసాయ పనులు సరిగాలేక జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, భూసేకరణ బిల్లు విషయంలో కేంద్రం పట్టుదలగా ఆర్డినెన్స్‌లు జారీచేయడం బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ బీజేపీకి కూడా తెలుసు. అందువల్లే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన దూకుడును ఇక్కడ ప్రదర్శించడంలేదు.
ఆచితూచి అడుగులు వేస్తున్నది. జేడీ(యూ), ఆర్జేడీ వగైరాలు అధికార కోసం వెంపర్లాడుతున్నాయని... అందుకోసం పరస్పరం కలహించుకుంటున్నాయని చూపించి, తమ కూటమి మాత్రం సమష్టిగా ముందడుగు వేస్తున్నదన్న అభిప్రాయం కలగజేద్దామనుకుంటే ఠాకూర్, కుష్వాహాలు దానిపై చన్నీళ్లు చల్లారు. బీజేపీతో రాంవిలాస్ పాశ్వాన్‌ను గట్టి బంధమే ఉన్నా...ఇటీవలదాకా సీఎంగా పనిచేసిన జీతన్‌రాం మంఝీకి చెందిన హిందూస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్‌ఏఎమ్) విషయంలో అభ్యంతరాలున్నాయి. ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలకు టిక్కెట్లివ్వొద్దని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరో అయిదారు నెలల్లో రాబోయే ఎన్నికలకు తమ కూటమి ఇంకా సంసిద్ధంగా లేకపోవడం బీజేపీని సహజంగానే కలవరపరుస్తున్నది.
అసెంబ్లీలో ఉన్న 243 స్థానాల్లో కనీసం 150 స్థానాలకు పోటీచేయాలని ఆ పార్టీ అనుకుంటుండగా మిత్రపక్షాలు అడుగుతున్న స్థానాలే 140 దాటిపోయాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో మిత్రపక్షాలుగా ఉన్నవారిని కాదనుకుని కూడా ముందుకు దూసుకెళ్లి విజయం సాధించిన బీజేపీకి బీహార్‌లో అలాంటి అవకాశాలు కనబడటం లేదన్నది వాస్తవం. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంద్వారా మొత్తం పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవచ్చునన్న ఆశలు బీజేపీకి ఉన్నాయి. మొత్తానికి బీహార్ ఎన్నికలు ప్రత్యర్థులకంటే బీజేపీకే పెద్ద పరీక్షగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.