పట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికలను బహిష్కరించాలనే డిమాండ్‌తో ఓ బీజేపీ నేత ఇంటిని నక్సల్స్ పేల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని దుమారియా గ్రామంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ సింగ్ నివాసంపై నక్సల్స్ దాడికి తెగబడ్డారు. డైనమైట్ సాయంతో ఇంటిని కూల్చివేశారు. ఈ దాడిలో అనుజ్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ దాడి అనంతరం నక్సల్స్ ఆ ప్రాంతంలో కొన్ని పోస్టర్‌లను విడిచి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా వారు అందులో పేర్కొనానరు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం గయాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిని ఎదుర్కొవడం భద్రతా బలగాలకు సవాలుగా మరింది. ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రాంతంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment