సాక్షి, ముంబై : బిహార్ వలస కూలీల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సురేశ్ దాస్‌పై సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సురేశ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే బిహారీ సోదరులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్ దాస్ మాట్లాడుతూ.. ‘ బిహార్ నుంచి ఎంతో మంది వ్యక్తులు మహారాష్ట్రకు వలస వచ్చి ఇక్కడ బతుకుతుంటారు. వారి భార్యలేమో బిహార్‌లో బిడ్డలకు జన్మనిస్తారు. అయితే ఇందుకు ప్రతిగా ఈ వలసవాదులు మహారాష్ట్రలో మిఠాయిలు పంచుకుంటుంటారు’ అని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని వర్గాల నుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటెడ్) కూడా సురేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ... ‘ ఆయన (సురేశ్ దాస్) వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఇది కోట్లాది మంది బిహారీలకు అవమానకరం. మా ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారు. ఆయన మెదడు సరిగ్గా పనిచేయడం లేదేమో’ అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, దాని మిత్రపక్షం సిద్ధాంతాలకు ఇటువంటి నాయకుల నీచమైన వ్యాఖ్యలే నిదర్శనమంటూ ప్రతిపక్ష ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్)విరుచుకుపడింది.
Comments
Please login to add a commentAdd a comment