ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.
అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు.
ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు.
తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment