ముంబై: కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అన్నారు. ఆమె ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్ రాజ్య సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రఫూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్ మినిస్టర్‌గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన సహాయ మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment