న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు మహారాష్ట్ర స్కూల్ టీచర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు టీచర్లను సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గుర్తించింది.
వీరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచింగ్ చేసేవారని, లాతూర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లను కూడా నడుపుతున్నట్లు తేలింది. అనేక గంటలు విచారణ అనంతరం జలీల్ ఉమర్‌ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నారు.
వీరి ఫోన్లలో పలువురు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్‌లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన గంగాధర్... విద్యార్ధులు సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌లను సంప్రదించడానికి సహాయం చేసినట్లు తేలింది.
మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో గంగాధర్, నాందేడ్‌లోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఈరన్న కొంగళ్వార్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేశారు.
విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. డార్క్ నెట్‌లో పేపర్లు లీక్ కావడం, విక్రయించడం వంటి అక్రమాలపై కూడా ఇది విచారణ చేస్తోంది.
అదే విధంగా పోటీ పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమలు చేసింది. నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు విధిస్తుంది. కాగా నీట్ యూజీ పరీక్షకు ఒక రాత్రి ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురిని బీహార్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారిస్తున్నారు..
Comments
Please login to add a commentAdd a comment