దేశ వ్యాప్తంగా వివాదాన్ని రాజేసిన వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
పరీక్షకు ముందు నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలపై బిహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌కు చెందిన రాజ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. పంకజ్‌ను పాట్నాలో, రాజ్‌ను జంషెడ్‌పూర్‌లో పట్టుకున్నారు.
అప్పటికే పేపర్ లీక్ మాఫియాలో హస్తమున్న పంకజ్ కుమార్.. బిహార్‌లోని హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్రంక్ నుంచి నీట్ యూజీ పేపర్‌ను దొంగిలించగా, ఇతనికి పేపర్‌ను సర్క్యూలేట్ చేయడంలో రాజ్ సింగ్ సాయం చేసినట్లు సీబీఐ పేర్కొంది. పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య 2017లో ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లు తేలింది.
కాగా నీట్ పేపర్ లీక్ కేసుపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌తో సహా మరో 13 మంది నిందితులను జూలై 12న బీహార్‌లో కస్టడీలోకి తీసుకుంది.
నీట్-యూజీ పేపర్ లీక్‌కు హజారీబాగే మూల ప్రదేశమని సీబీఐ గతంలోనే తెలిపింది. హజారీ బాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో పేపర్ లీక్ అయిందని, అక్కడకు చేరిన రెండు సెట్ల పేపర్ల సీలు ఊడిపోయిందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా పాఠశాల సిబ్బంది మౌనం వహించారని సీబీఐ విచారణలో తేలింది.
ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి
Comments
Please login to add a commentAdd a comment