
కర్ణాటక: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కాడదేనహళ్లిలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా అరసీకెరె తాలూకా గండసి ఫిర్కా కుడుకుంది గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె కేఎన్ రశ్మి(24)కి మాలూరు తాలూకా సొసగెరె గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని కాడదేనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ గౌడతో 14 నెలల క్రితం వివాహం చేశారు.
వివాహం అనంతరం దినేష్ గౌడ ఇంట్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వరకట్నం తీసుకు రావాలని రశ్మిపై ఒత్తిడి చేసేవారు. దీంతో విసుగు చెందిన రశ్మి పైఅంతస్తులో ఉన్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రశ్మి తండ్రి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాలూరు ఎస్‌ఐ వసంతకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని రశ్మి భర్త దినేష్‌గౌడ, మామ అప్పాజిగౌడ, రత్నమ్మ, సరోజమ్మలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.