బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: బీజేపీ నేతలంతా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవటంతోపాటు, పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా బీహార్ మంత్రి, బీజేపీ నేత వినోద్ కుమార్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి పాకిస్థానీలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్టీ నిర్వహించిన సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో సహనం కోల్పోయిన ఆయన ఈ కామెంట్లు చేశారు.
జేడీ(యూ) ప్రభుత్వంలో ఈ మధ్యే బీజేపీ కోటా కింద ఈయనకు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కాయి. ఆయన ప్రసంగిస్తూ ఒక్కసారిగా భారత్ మాతా కీ జై అంటూ నినందించారు. అయితే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో అసహనానికి గురైన ఆయన మీరు పాకిస్థాన్ మాతాకి మద్దతుదారులేనంటూ ఆగ్రహాం వెళ్లగక్కారు.
ఆయన కామెంట్లపై ఒకరిద్దరు విలేకరులు నిరసన వ్యక్తం చేయగా, మిగతా వారెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ మసీదుల్లో ఆజాన్, చర్చిల్లో గంటల శబ్ధాలకు బదులు భారత్ మాతాకీ జై నినాదాన్ని వినిపించాలంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే కాసేపటికే తాను అలా చెప్పలేదని పేర్కొనటం విశేషం. ఇక వీటిపై జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పందిస్తూ అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ అని తెలిపారు. గతంలో బీజేపీ చీఫ్‌గా ఉన్న అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు పాకిస్థాన్ ను బిహార్ రాజకీయాలకు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.